ఆ పాఠశాలలో 9వ తరగతిలో హరనాథ అనే విద్యార్థి కొత్తగా ప్రవేశించాడు. మిగతా విద్యార్థులు పరిచయం చేసుకున్నా వారితో ఎక్కువగా కలిసిపోలేదు. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుండేవాడు. ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నప్పుడు చాలా పరధ్యానంగా ఉంటున్నాడు. ఉపాధ్యాయులు ఏమైనా ప్రశ్నలు అడిగితే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమీ సమాధానం చెప్పేవాడు కాదు. తోటి విద్యార్థులు హరనాథ వింత ప్రవర్తనకు వెనుక నుంచి నవ్వేవారు. హేళన చేసేవారు. ఒకరోజు తెలుగు ఉపాధ్యాయులు "తెనాలి రామలింగడు - బంగారు మామిడిపండ్లు" కథ చెబుతున్నాడు. కథ మొత్తం చెప్పి "హరనాథా! కథ చెబుతుంటే అస్సలు నవ్వవేమిటిరా?" అని అడిగాడు. మిగతా విద్యార్థులు పగలబడి నవ్వారు. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు హరనాథ ఆ పాఠశాల విద్యార్థులు అందరికీ తలా పది సపోటా పళ్ళను పంచి పెట్టాడు. అతనికి సహాయంగా అతని మిత్రుడు శ్రీనాథ కూడా వచ్చాడు. ఇదంతా ఎందుకు? అని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నించారు? "హరనాథకు రాజు అనే తమ్ముడు ఉండేవాడు. రాజు హరనాథ బాబాయి కుమారుడు. హరనాథ కంటే రాజు 6 నెలలు చిన్న. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. రాజు చాలా మంచివాడే. కానీ కొన్ని విషయాల్లో హరనాథ మాటలు వినకపోయేవాడు. రాజు హరనాథ వద్దని చెప్పినా వినకుండా తోటి స్నేహితుల సహాయంతో చిన్న వయసులోనే బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితుల బైక్ నడుపుతూ ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రాణ స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక ఎప్పుడూ కుమిలిపోతూ ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడు. చదువులో తెలివైన తన కుమారుడు ఏమై పోతాడో అన్న భయంతో తల్లిదండ్రులు ఈ పాఠశాలకు మార్చినారు. వాళ్ళ తెలుగు ఉపాధ్యాయులు చెప్పిన "తెనాలి రామలింగడు - బంగారు మామిడిపండ్లు" కథ విన్నాడు. తన మిత్రుడు రాజుకు సపోటా పళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు తన మిత్రుని పుట్టినరోజు సందర్భంగా అందరికీ సపోటా పళ్ళను పంచి పెడుతున్నాడు." అని చెప్పాడు శ్రీనాథ. తెలుగు ఉపాధ్యాయులు హరనాథను దగ్గరకు తీసుకొని కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్న అతనిని ఓదార్చాడు. ఆభినందించాడు. తోటి విద్యార్థులు అతణ్ణి క్షమించమని వేడుకున్నారు. తమతో స్నేహం చేయమన్నారు. 18 సంవత్సరాలు నిండే వరకు డ్రైవింగ్ జోలికి పోమని తన మీద ఒట్టేసి చెప్పే వాళ్ళతోనే స్నేహం చేస్తానని చెప్పాడు. అలాగే చేశారు తోటి విద్యార్థులు. చిన్న వయసులోనే డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలను ప్రతీ తరగతిలో వివరించారు తెలుగు ఉపాధ్యాయులు.