మహరాజు మకరందుడు ఉత్కళ రాజ్యాన్ని మహామంత్రి సుమంతుడి ఆలోచనలు యుద్ధ తంత్రలతో ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. మహరాజు దైవభక్తుడైనందున రాజ్యం నలుదిశలా దేవాలయాలు, ఆధ్యాత్మిక స్థావరాలు ఏర్పరచి జనులను దైవచింతనలో ఉంచి దేశభక్తిని పెంచాడు. యోగులు పండితులు విధ్వాంసుల ప్రవచనాల ద్వారా సత్ప్రవర్తన కలిగించాడు. దేశం అంతటా ఫల పుష్ప వనాలను పెంచడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో శస్యస్యామలంగా ఉంటోంది. ప్రజలు కష్టించి పనిచేస్తు అరాచకాలు దౌర్జన్యాలు లేకుండా సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారు. ఇలా రోజులు గడుస్తుండగా మహరాజు మకరందుడి ఏకైక పుత్రుడు ఇరువది వత్సరాల సునందుడు అకస్మాత్తుగా కనబడకుండా పోయాడు. తన తదనంతరం ఉత్కళ రాజ్యానికి యువరాజును చేద్దామని ఎంతో ఆశతో కుమారుడికి రాజ్యపాలనకు కావల్సిన యుద్ధ తంత్ర విద్యలు , కత్తి యుద్ధం , గుర్రపు స్వారి, అస్త్ర శస్త్ర విద్యలు నేర్పమని సేనాపతి దురంధరుడికి అప్పగించారు. పగలంతా సేనాని దగ్గర యుద్ధ విద్యలు అబ్యసించి రాత్రి సమయంలో తండ్రి గారితో తను నేర్చుకున్న విద్యలు ముచ్చటించేవాడు యువరాజు. ఒకరోజు సూర్యస్తమయ వేళ అకస్మాత్తుగా సేనాపతి దురంధరుడు పరుగున మహరాజు వద్దకు వచ్చి అరణ్య సమీపంలో యువరాజుకు విల్లంబుల నైపుణ్య విద్య నేర్పిస్తుండగా కొంతమంది అడవి మనుషులు యువరాజును బంధించి తీసుకు పోయారని, చీకటి ముసిరి నందున మన సైనికులు ఎంత ప్రయత్నించినా యువరాజును రక్షించ లేక పోయారని ఆందోళన వెలిబుచ్చాడు. ఆ వార్త విన్న మహరాజు మకరందుడు నిర్ఘాంత పోయాడు. యువరాజు అంతర్ధాన విషయం తెలిసి మహామంత్రి సుమంతుడు కూడా అయోమయంలో పడ్డారు. ఇంత జనరంజకంగా రాజ్యాన్ని పాలన సాగిస్తున్న మహరాజుకు శత్రువులు ఎవరు ఉంటారు.యువరాజును ఎవరు అపహరించి ఉంటారని తర్జభర్జన పడసాగాడు. సూర్యాస్తమయ సమయమైనందున అంధకారంలో అడవిలోకి సైనికులను పంపినా ప్రయోజనముండదని మహరాజుకు దైర్యం చెబుతూ సూర్యోదయకాలం వరకు వేచి ఉండటం తప్ప మరో మార్గం లేకపోయింది మహామంత్రికి. మహామంత్రి సుమంతుడికి ఎందుకో సైన్యాధిపతి దురంధరుడి మీద అనుమానం కలుగుతోంది. ఇదివరకు వేగుల ద్వారా సేనాపతి అనుమాస్పద చర్యలు గోచరించాయి. అందువల్ల సూర్యోదయ మయాక సైనికులతో పాటు తన నమ్మక వేగులను పంపి యువరాజు ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవాలను కున్నాడు.మహరాజుకు రాణికి దైర్యం చెబుతు రాత్రి గడిపాడు. వాస్తవానికి సేనాపతి దురంధరుడు పొరుగున కళింగ రాజ్యాధీసుడు శూరసేనుడితో చేతులు కలిపి అదును చూసు కుని మహరాజును మహామంత్రిని బంధించి యువరాజును పావుగా వాడి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే దుర్భుద్దితో అడవిలో కోయరాజుకు సంపద ఆశ చూపి పధకం ప్రకారం యువరాజును బంధించి అడవిలోకి తీసుకెళ్లడమైంది. అడవిలో యువరాజును బంధించి తీసుకెళ్లిన కోయరాజు ఒక గుహలో ఉంచాడు. మహరాజుకు విధేయుడైన కోయరాజు కొడుకు తిప్పడు, తండ్రి దుశ్చర్యల్ని సహించలేకపోయాడు. యువరాజును బంధించిన గుహను తెలుసుకుని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకుపోయాడు. మర్నాడు సూర్యోదయ మవగానే మహామంత్రి చాతుర్యంగా ముందు వేగులను తర్వాత సైనికులను యువరాజును వెతకడం కోసం అడవికి పంపేడు. వేగులు అడ్డదారుల్లో ముందుగా అడవిలో ప్రవేసించి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. సేనాపతి దురంధరుడు కోయరాజుతో చేతులు కలిపి యువరాజును బంధించినట్టు అతడిని పొరుగు రాజ్యానికి పంపే ప్రయత్నంలో ఉండగా కోయరాజు కొడుకు తిప్పడి ద్వారా అసలు విషయం తెలుసు కుని యువరాజును సురక్షితంగా రహస్య మార్గం ద్వారా రాజధానికి చేర్చారు. వెంటనే మహామంత్రి విషయం మహరాజు మకరందుడికి తెలియ చేసి సేనాపతి దురంధరుడిని బంధించడానికి ప్రయత్నించగా ఆ పెనుగులాటలో ప్రాణాలు కోల్పోయాడు సేనాపతి . మహామంత్రి చాకచక్యం వల్ల , కోయరాజు కొడుకు తిప్పడి రాజభక్తి కారణంగా యువరాజు సురక్షితంగా తమ వద్దకు వచ్చి నందుకు రాజదంపతులు ఆనందించి రాజ్యంలో దేవుళ్లకు పూజలు పండగలు జరిపించారు. అడవిలోని కోయరాజును రాజద్రోహం కింద శిక్షించి తిప్పడికి మంచి కొలువు ఇప్పించారు మహామంత్రి సుమంతుడు * * *