దెయ్యాల బండి - సిహెచ్. వి.యస్.యస్. పుల్లం రాజు

Deyyala bandi

రైలు బండి పరుగులు తీస్తోంది.

సమయం రాత్రి రెండు గంటలవుతోంది. సాధారణ బోగీ, ప్రయాణికులతో కిటకిటలాడిపోతోంది.అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు. అతను దిగ వలసిన స్టేషన్ వచ్చే సమయం ఆసన్నమైంది. చాలా చిన్న స్టేషన్ కాబట్టి ఒక్క నిమిషం మాత్రమే అగుతుంది. అందుకే అతడు గబగబా తలుపు దగ్గరకు చేరుకున్నాడు. రైలు ఆగింది. పదిలంగా సూట్ కేసు పట్టుకుని దెయ్యాల బండి లోంచి దిగాడు. రైలు వేగం పుంజుకుంటూ సాగింది . స్టేషన్ అంతా చిమ్మ చీకటి అలుముకొంది. చుట్టూ పరికించి చూసాడు. బ్రిటిష్ కాలం నాటి స్టేషన్ భవనం, పద్మాసనంలో మౌన ముద్రలో ఆశీనుడైన తథాగతుడి భంగిమను గుర్తుకు తెచ్చింది. శీతాకాల చలిగాలులు వణికిస్తున్నాయి. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామానికి వెళ్ళాలి. ఈ సమయంలో వాహనాలు వుండవు. రైలు ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళవచ్చు. సుమారు మూడు కిలోమీటర్ల వుండచ్చు. కొంచెం కష్టమైనా,సాహసం చేయగలిగితే, ఇల్లు చేరి విశ్రాంతి తీసుకోవచ్చు.

ఆలోచనలతో ఉన్నందున కాబోలు వినబడలేదు కానీ, ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. నిర్ణీత వ్యవధిలో టప్ టప్.. టప్ అంటూ చిత్రమైన శబ్దం. బిగ్గరగా ఆగి ఆగి వస్తోంది. టప్… టప్...టప్..ఆ నిశీధిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వస్తున్న ఆ ధ్వనికి గుండె బరువెక్కు తోంది. ఇంతలో సిమెంట్ బెంచి క్రింద పడుక్కొన్న కుక్క అరుపులు. అక్కడ వుండడం క్షేమం కాదనిపించి అతడు విసవిసా నడవ సాగాడు ప్లాటుఫామ్ మీద. పది అడుగులు వేసేసరికి, అనుమానం వచ్చి అక్కడే నిలబడ్డాడు. చీకటి లోను అస్పష్టంగా కనబడింది. రెండు అడుగుల దూరంలో ఏదో కదలిక కొద్ది క్షణాలు పాటు. అది దుప్పటి ముసుగులో దాగివున్న మానవ శరీరం కావచ్చు. చూసి ఉండక పొతే, ఆ మనిషిని కాలుతో తొక్కి, తూలి క్రింద పడేవాడు. ప్లాట్ ఫామ్ చివరికి చేరుకున్నాడు. అక్కడి నుండే రైల్ ట్రాక్ మీద నడవాలి. అడుగు ముందుకు పడింది. ఎవరో విసురుగా తన్నినట్టు తూలి ముందుకు పడ్డాడు. చేతిలో సూట్ కేసు ఎక్కడో పడింది.గుండె జారి పోయింది.

లేచి, ధైర్యాన్ని మూట కట్టుకుని చుట్టూ పరిశీలించాడు. ఆ చీకట్లో ఎక్కడా ఒక మనిషి జాడ కానీ జంతువుల జాడ కానీ లేదు. మరి ఎలా పడినట్టు? గబ గబా సూట్ కేసు కోసం వెదికాడు. దొరికింది రైలుపట్టా మీద. నల్లటి తారు రాళ్ల మీద నడక సాగుతోంది. కాళ్ళ క్రింద రాళ్ళు జారుతున్న శబ్దం. మోకాలి నొప్పి తెలుస్తోంది. బాధ గురించి ఆలోచించే వ్యవధి లేదు. రేపు తల్లికి ఆపరేషన్. సూట్ కేసులో మూడు లక్షలు వుంది. అందరూ తన రాకకై ఎదురు చూస్తొంటారు. కర్తవ్యం ముందుకు నడిపిస్తోంది. ప్లాట్ ఫారం చివరిలో రైల్ ట్రాక్ ని కలుపుతూ ఏటవాలుగా ఉండే రాంప్ పగిలి పోయి పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఆ విషయం తెల్సిందే కానీ తనే మరచిపోయాడు. పడి పోవడానికి కారణం అర్ధమయ్యింది..చలిగాలి రివ్వున వీస్తోంది. చేతులు చల్ల బడుతున్నాయి.కురుస్తున్న మంచుకి ఒంటి మీద మీద బట్టలు తడిసి,చలి తీవ్రత ఎక్కువయ్యింది. ట్రాక్ ని ఆనుకొని దట్ఠమైన పొదల్లో నుంచి పసరు వాసన. కీచురాళ్ల అరుపులు. సర్రున కాళ్ల మధ్య నుంచి పెద్ద పాము ఒకటి పాకుతూ పోయి నట్టనిపించింది. ఒక్క క్షణం రాయిలా బిగిసి పోయాడు.వెన్నులో పుట్టిన భయానికి శరీరంలోని ఆణువణువు కంపించింది. నడక మందగించింది. ఒంటి కన్ను రాక్షసుడి కన్నులా ఎర్ర రంగు సిగ్నల్ లైట్ . నడక మందగించింది. తల పైకెత్తి ముందుకు చూడాలన్నా, ప్రక్కకు చూడాలన్నా భయమే. తల దించుకొని అడుగులో అడుగు వేస్తున్నాడు. రైలుఇంజిన్ పెద్ద కాంతిపుంజంతో తన మీదకు దూసుకువస్తోంది. కళ్ళు మసకబారి పోయాయి. తప్పించుకునేందుకు దారి లేదు..ఇదే తన జీవితంలో ఆఖరి క్షణాలు కావచ్చు. ఇంత ఘోరంగా తన చావు వుంటుందని వూహించలేదు. అంతలోనే ఆశ్చర్యంగా వుంది. ఆ కాంతిపుంజం మాయ మయ్యింది. ఒక వేళ రైలుఇంజన్ ఐతే పెద్ద గా శబ్దాలు రావాలి. కానీ నిశ్శబ్దంగా ఆ కాంతి తనని దాటి ముందుకు పోయి మాయమయ్యింది. మళ్లీ చీకటిని చీల్చే శబ్దాలు చేస్తూ నడవ సాగాడు. ట్రాక్ అక్కడ మలుపు తిరిగింది. పరిస్థితులు విషమంగా వున్నా ఏదో మొండి వైఖరి అతన్ని నడిపిస్తోంది.

కురుస్తున్న మంచుకి తల స్నానం చేసినట్లుగా వుంది. గొంతులో అసౌకర్యంగా కూడా వుంది. దూరంగా పెద్ద చెట్టు, నల్లని జుట్టు విరబోసుకొని తలాడిస్తూ, రమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది. సాధారణంగా దెయ్యాలు, పిశాచాలు చింత చెట్టు మీదే రాత్రిళ్లు కొలువు తీరుతాయని విన్నాడు. సూట్ కేసు బరువుగా వుందనిపించి ఎడమ చేతికి మార్చుకుని, నడిచాడు. ఆ చెట్టుని సమీపిస్తున్నాడు. అనుమానం లేదు, స్పష్టంగా కనిపిస్తోంది అది చింతచెట్టే. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తల వంచుకొని ఒక ముందుకేసాడు. పెద్దగా నోరు తెరిచి వికృతంగా వికటాట్టహాసంతో స్ర్రీ ట్రాక్ కి అడ్డంగా నిలబడింది. పూర్తి నగ్నంగా వుంది. ఐతే చేతులు కాళ్లు లేవు. చింత నిప్పులా భగభగా మండుతున్న కళ్లతో ఒళ్లు జలదరింప చేస్తోంది. ఆ రూపాన్ని ఊహిస్తేనే నవ నాడులు బిగిసుకొంటాయి. అతను కొయ్య బారి పోయాడు. అంతలోనే అది గాలి లోకి లేస్తూ కళ్ల ముందే మాయ మయ్యింది. కొద్ది నిమిషాలకి తేరుకొని కొంచెం దూరం సాగాడు. ఎవరో పెద్దగా గుండెలు పగిలేలా రోదిస్తున్న ధ్వనులకి చెవులు దద్దరిల్లిపోతుంటే అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసాడు. నల్లని కాటుక కొండలా వున్న పెద్ద చెట్టు మీద తెల్లటి మానవ ముఖాలు. చిన్న, పెద్ద ముఖాలు. ముఖాల్లో విషాదం గోచరిస్తోంది. భయంతో వెంటనే తల తిప్పేసాడు. అడుగు ముందుకు వేసాడో లేదో మరో చెట్టు మీద మళ్ళీ అదే దృశ్యం. కానీ ఆ ముఖాల్లో వినోదం తాండవిస్తోంది. తల దించుకొని పరుగు లాంటి నడకతో శబ్దాలు చేసుకొంటూ కొంత దూరం నడిచాడు. అతని గుండె చప్పుడు అతనికి వినబడుతోంది. కాస్త వేగం తగ్గించి, సూట్ కేసుని మరో చేతిలోకి మార్చుకుని పది అడుగులు వేసాడు అడుగడుగుకి భయపడుతూ. అంతలో కొంచెం దూరంలో రైలుపట్టా మీద ఎవరో ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కూర్చోన్నట్టు కనిపించింది.ఒక నిమిషం వరకు తాను చూస్తున్నది నిజమేనా అని ప్రశ్నించుకొన్నాడు. కొంచెం ముందుకు నడిచి వాళ్ళ ని తేరిపారా చూసాడు. ఎవరో యువజంట. తేనె రంగు చొక్కా వేసుకుని నలుపు రంగు జీన్స్ పాంట్ లో వున్నాడతడు. గులాబీ రంగు స్కర్ట్ మీద తెలుపు రంగు టాప్ వేసుకున్న ఆమె అతన్ని పెనవేసుకొని కూర్చొంది. ముఖాలు స్పష్టంగా కనిపించడంలేదు. ఒకింత ఆశ్చర్యం, వాళ్లు ఎవరో తెలుసుకోవాలన్న ఆరాటంతో వడివడిగా వారి వైపు నడవసాగాడు. నడుస్తోనే వున్నాడు. నడుస్తున్నాడు,రొప్పుతూ నడుస్తున్నాడు. కానీ వాళ్లని చేరుకోలేక పోతున్నాడు. అప్పుడే. బుర్రలో మెరుపులా మెరిసింది. సుమారు వారం రోజుల క్రితం జరిగిన సంఘటన. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదన్న బాధతో, రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న యువ జంట. వాళ్లు తన వూరి వాళ్ళే. ఆలోచన భంగం చేస్తూ, ఎవరో వెనుక నుంచి భుజం మీద తట్టినట్టనిపించింది.

అనుమానం లేదు. ఎవరో తడుతున్నారు.చేతి వేళ్ళ స్పర్శ స్పష్టంగా తెలుస్తోంది. గట్టిగా కేక పెట్టాలనుకొన్నాడు., భయంతో నోరు పెగలడం లేదు .భుజం మీద చేయి అలాగే తడుతోంది. తన వెనుకే ఎవరో వున్నట్లు, తనని వెంబడిస్తున్నట్లు, నడుస్తున్న చప్పుడు వినబడుతోంది. సూట్ కేసు కింద పెట్టి వెనక్కి తిరిగి గట్టిగా పిడి గుద్దులు కురిపించాలానుకొన్నాడు. చూస్తే చేతిలో సూట్ కేసు లేదు. "ఒరే గోపాలం ! ఒరే గోపాలం! " ఏదో ఆడ గొంతు తననే పిలుస్తోంది. తనకి బాగా పరిచయం వున్న స్వరమది. ఈ సమయంలో తనని పేరుతో పిలిచేవారెవరు? తనలో తాను తర్కించుకొంటూ ధైర్యంగా వెనక్కి తిరిగాడు. " ఈ దరిద్రపు పెట్టె మోయలేక ఛస్తున్నా, శనిగాడా! ముందు చూపే గాని వెనుక చూసి ఛావవా, గుడ్డి వెధవా?" సోదెమ్మ అత్త తిడుతూ సూట్ కేసుని దబ్బున పడేసింది. సూట్ కేసు పైకి తీసుకొని చూస్తే, ఎవ్వరూ లేరు. ఏడాది క్రితం సోదెమ్మ చనిపోయింది. ఇప్పుడు ఎలా కనబడింది? ఎలా మాట్లాడింది?. మనసు మంచిదే కాని, ఆమెకు చాలా నోటి దురుసు. చిన్నా పెద్దాని తేడా లేకుండా కోపం వస్తే బూతులు తిట్టేది. అందుకు కట్టుకొన్న మొగుడుకి కుడా మినహాయింపు వుండేది కాదు. చిత్రం ఏమంటే ఆవిడ చనిపోయిన నాడే ఆవిడ భర్త కోమాలోకి వెళ్లి పోయి, మూడో రోజున ఆయన కూడా శరీరం త్యాగం చేసాడు. అతనికి మనసులో ఆ జ్ఞాపకాలు మెదిలాయి. ఆశ్చర్యంతో కూడిన భయానికి ఒళ్ళు గగుర్పాటు పొందింది. విద్యుత్ షాక్ తిన్న కాకిలా అక్కడే దబ్బున కుప్పకూలిపోయాడు.

💐💐💐

"నాన్నా! లే..లే..అమ్మకి కోపం వచ్చింది. ఇంత ఆలస్యంగా లేస్తారా? లే నాన్నా! …హోటల్కి వెళ్లదామని చెప్పావు. గుర్తుందా.." నిద్ర లేపు తున్నారు ఆతని సంతానం. కనులు నులుపుకొంటూ భార్యని, పిల్లలని మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నాడు. " ఒంటరి పిశాచిలా, అర్ధరాత్రి వరకు దెయ్యాల సినిమాలు చూస్తారు. వద్దన్నా వినరు. ఏం అలాంటి దెయ్యాల కల వచ్చిందా ఏమిటి? ఆలా చూస్తున్నారు?" భార్య విరుచుకుపడుతోంది.

తల విదిలించి, పెద్దగా ఆవలిస్తూ, ఒళ్లు విరుచుకొంటూ, మంచం మీద నుంచి లేచాడు గోపాలకృష్ణ. స్నానాల గదిలోకి దూరి కెవ్వుమని కేక వేసాడు. "యురేకా..యురేకా.."అని గట్టిగా అరిచాడు. వంటింట్లో లోంచి అతని భార్య పరుగున స్నానాల గదికి వెళ్లి చూసింది. కుళాయి లోంచి టప్.. టప్.. టప్ శబ్దంతో నీటి బిందువులు నేల మీద పడుతున్నాయి. గోపాలం కళ్లు మూసుకుని తదేకంగా ఆ శబ్దాన్ని వింటున్నాడు. "ఈ శబ్దానికేనా రాత్రి రైల్వే స్టేషన్లో భయపడింది." అంటూ భార్య కేసి చూసి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. సంగతి గ్రహించిన అతని భార్య కూడా ముసి ముసి నవ్వులు నవ్వుతూ, "యురేకా...తమరు చుట్టుకొన్న తువ్వాలు జారి క్రింద పడింది. చూసుకోండి" అంటూ పొయ్యి మీద మాడి పోతున్న కూర వాసనకి చేతిలోనే వున్న గరిటెతో వంటింట్లోకి నవ్వుతూ పరుగు పెట్టింది.

.. 💐💐💐💐

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు