శ్రీపురం ఉన్నత పాఠశాలలో చాలామంది విద్యార్థులకు ఒక అలవాటు ఉంది. తాము ప్రతిరోజూ ఏమైనా తినుబండారాలు ఇంట్లో చేయించి కానీ, బయట కొనుక్కొని వచ్చి కానీ పంచుకొని తినే అలవాటు ఉంది. ఈ అలవాటు వాళ్ళ మధ్య స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసింది. 10వ తరగతి చదువుతున్న సువర్ణ ధనవంతుల అమ్మాయి. ప్రతిరోజూ ఖరీదైన తినుబండారాలను తెచ్చి అందరికీ పంచి ఇచ్చేది. ఆ విధంగా సువర్ణకు ఎక్కువ మంది స్నేహితులు అయినారు. సువర్ణ ఆ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థిని. ఆ తరగతిలో దేవయాని అనే అమ్మాయి కొత్తగా ప్రవేశించింది. సువర్ణ దేవయానిని పరిచయం చేసుకుని ఇలా అన్నది. "చూడు దేవయానీ! మన పాఠశాల విద్యార్థులకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిరోజూ ఆరోగ్యాన్ని పెంచే తినుబండారాలను తీసుకు వచ్చి పంచుకొని తినాలి. నువ్వు తప్పనిసరిగా రోజు ఏవో కొన్ని తీసుకు వచ్చి పంచుకొని తినాలి." అని. దేవయాని మౌనంగా ఉంది. తోటి వాళ్ళు తినుబండారాలు ఇవ్వబోగా తిరస్కరించింది. మరునాటి నుంచి దేవయాని ఏ విధమైన తినుబండారాలను తీసుకు రావడం లేదు. తోటి విద్యార్థులు ఇచ్చినవి తీసుకోవడం లేదు. దాంతో సువర్ణ దేవయానికి పిసినారి అనే పేరు పెట్టింది. తోటి విద్యార్థులు హేళన చేయసాగారు. కొన్ని రోజులు గడిచాయి. దేవయాని చదువులో వెనుకబడిన విద్యార్థినులను గమనించి, వారితోనే స్నేహం చేయసాగింది. చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. సువర్ణ తెలివైన విద్యార్థులతోనే స్నేహం చేస్తుంది. చదువులో వెనుకబడిన వారంటే సువర్ణకు చులకన భావం. "దేవయాని చాలా తెలివైనది. చదువులో మొద్దులను మనిషన్న వారు ఎవరూ పట్టించుకోరు కదా! వారితో స్నేహం చేస్తే చాలు. వాళ్ళు ఆ మాత్రం దానికే చాలా సంతోషిస్తారు. వారికి ఏమీ కొనివ్వక్కరలేదు." అని దేవయాని వినేలా అని పగలబడి నవ్వింది. తోటి విద్యార్థులు నవ్వారు. దేవయాని పట్టించుకోలేదు. రాను రాను దేవయానికి చదువులో వెనుకబడిన వారితోనూ, సగటు విద్యార్థులతోనూ స్నేహం ఎక్కువైంది. వాళ్ళకూ దేవయాని అంటే ప్రాణం అయింది. క్రమంగా వాళ్ళను దేవయాని చధువుకునేలా ప్రోత్సాహించింది. వారితో కలిసి చదువుతూ వాళ్ళ సందేహాలను నివృత్తి చేస్తూ వాళ్ళను తెలివైన వారిలా తీర్చి దిద్దేలా శత సహస్ర విధాలుగా ప్రయత్నం చేసింది. దేవయాని ప్రోత్సాహం వల్ల చాలామందికి చదువుపై ఆసక్తి పెరిగింది. కొద్ది రోజుల్లోనే అందరూ చదువులో చాలా ప్రగతిని సాధించారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో దేవయాని మిత్రులంతా చాలా గొప్ప మార్కులు సాధించారు. ఆ తర్వాత పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. చాలామంది విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఎన్నడూ ఉపన్యాసం ఇవ్వని విద్యార్థులు కూడా ఆరోజు మాట్లాడారు. చదువులో వెనుకబడిన తమను తెలివైన వారిగా తీర్చి దిద్దిన దేవయానిని వేనోళ్ళా పొగిడారు. వీడ్కోలు సమావేశం తర్వాత సువర్ణ తన మిత్రురాలు ప్రవళికతో ఇలా అంది. "పిసినారి దేవయానికి ఎంత ఫాలోయింగ్ ఉందో చూశావా. తెలివి తక్కువ మొద్దులంతా ఆమెకు భజన చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా దానం చేయని పిసినారికి ఇన్ని పొగడ్తలా? నేను నా స్నేహితులకు చేసిన సహాయంలో ఈమె లక్షవ వంతు కూడా చేయలేదు." అని. అక్కడే ఉన్న శ్రావణి టీచర్ సువర్ణతో "అసలు నిన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఇన్నాళ్ళు నీ స్నేహితులను మేపడానికి పెట్టిన ఖర్చు అంచనా వేసుకో. అంతకు లక్ష రెట్లు తన స్నేహితులకు మేలు చేసింది దేవయాని. నువ్వు ఇన్నాళ్ళు నీ స్నేహితులకు నెట్టిన తిండి భవిష్యత్తులో వారు మరచిపోవచ్చు. కానీ దేవయాని తన స్నేహితులకు చేసిన విద్యా దానం వల్ల వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి, చాలా సంపాదిస్తారు. వాళ్ళు జీవితాంతం సంపాదించిన డబ్బు అంతా దేవయాని పుణ్యమే. నీకూ చదువు బాగా వచ్చు కదా! నువ్వు ఎంతమందికి విద్యా దానం చేసినావు చెప్పు?" అని అడిగింది. సువర్ణ నీళ్ళు నమిలింది. మళ్ళీ శ్రావణి టీచర్ ఇలా అంది. "దేవయాని వాళ్ళ తల్లిదండ్రులు నిరుపేదలు. కూలి సరిగా దొరకడం లేదని దశాబ్దాలుగా నివాసం ఉన్ప ఊరును వదులుకొని తమ బంధువులు ఉన్న ఈ ఊరికి వచ్చారు. దేవయాని 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా చదువుకున్న రామాపురంలో ఎప్పుడూ దేవయానే ఫస్ట్. చదువులో వెనుకబడిన విద్యార్థులను అందరినీ తెలివైన విద్యార్థులుగా తీర్చిదిద్దింది. ఆమె మూలంగా ఎంతోమంది భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తారు. ఆ పుణ్యం అంతా దేవయానిదే. దేవయాని తమకు బంగారం లాంటిదని భావించి అందరూ ఆమెను బంగారం, బంగారు అక్క అని పిలిచేవారు. వాళ్ళ అమ్మా నాన్నలతో శ్రీపురం వెళ్ళేటప్పుడు దేవయాని స్నేహితులు అందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఒక నిరుపేద విద్యార్థి వల్ల ఎంతోమంది ఉజ్జ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు ఏర్పడ్డాయి. నీ పేరు సువర్ణ అయినా ఎవ్వరికీ బంగారం కాలేక పోయావు. దేవయాని ఎంతోమందకి బంగారం అయింది. అలాంటి బంగారం విలువ తెలుసుకోలేక ఆమెతో అనుచితంగా ప్రవర్తించావు. నీ చదువుతో పది మందికీ సాయం చెయ్యి. ఎవరినీ చులకన చేయకు." అని. సువర్ణ దేవయానిని కలిసి తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ వేడుకుంది. ఆమెను ఆలింగనం చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. దేవయాని సువర్ణ కన్నీళ్ళు తుడిచి ఈరోజు నుంచి మనం ప్రాణ స్నేహితులం అన్నది. సువర్ణ కూడా వెనుకబడిన విద్యార్థినులను ప్రోత్సహించడం ప్రారంభించింది.