మిత్ర ద్రోహం - కందర్ప మూర్తి

Mitra droham

సుందర వనం అడవిలోకి దారి తప్పి ఒక ఖడ్గమృగం ప్రవేసించింది. ఆ పరిసరాలు వాతావరణం అంతా కొత్తగా కనిపిస్తోంది. అలాగే ఒక గార్దభం అడవికి దగ్గరున్న గ్రామం నుంచి తిండి కోసం వెతుకుతు దారి మరిచి సుందర వనం అడవిలోకి చేరింది. దానికి కూడా అడవి అంతా కొత్తగా అనిపిస్తోంది. ఇలా రెండు జంతువులు భయంకరమైన అడవిలో దారులు తప్పి ఎటు పోవాలో తెలియక తిరుగుతు ఒకదాని కొకటి ఎదురు పడ్డాయి. పెద్ద శరీరం మొహం ముందు పదునైన కొమ్ముతో భారీ పాదాలతో చిన్న కళ్లతో ఉన్న ఖడ్గ మృగాన్ని చూసి ఆశ్చర్యంతో 'ఎవరు నువ్వని' 'అడుగుతు ఓండ్ర పెట్టింది గార్దభం. గార్దభ అరుపు విన్న ఖడ్గ మృగం దాని అర్థం తెలియక తలూపుతు 'నువ్వెవరు?' అని గట్టిగా సకిలించింది. ఇలా ఒకదానితో ఒకటి గార్దభ ఖడ్గమృగం అరుపులతో అడవి దద్దరిల్లుతోంది. ఏమైందోనని అడవిలోని పెద్ద చిన్న జంతువులు భయపడి పోతున్నాయి. విషయం తెలుసుకున్న మృగరాజు సింహం , తన సలహాదారు నక్కను ఏమి జరుగుతోందో చూసి రమ్మని పంపేడు. రంగ ప్రవేశం చేసిన నక్క గార్దభం-ఖడ్గమృగం ఉన్న ప్రాంతానికి వచ్చింది. అక్కడున్న రెండు జంతువుల్నీ చూసి ఆశ్చర్య పోయింది. ఏనుగులా పెద్ద బానశరీరం ముఖం మీద పెద్ద కొమ్ముతో ఖడ్గ మృగాన్ని , పెద్ద చేట మొహం గార పళ్లతో గుండ్రని గిట్ట కాళ్లతో గార్దభాన్ని అడవిలో ఎప్పుడూ చూడలేదు. వాటి అరుపులు కూడా కొత్తగా వినిపిస్తున్నాయి. దైర్యంగా వాటి దగ్గరకెళ్లి ముందు గార్దభాన్ని దాని కాళ్లను పరిశీలనగా చూస్తూ వెనక్కి వెళ్లింది. గాడిద తన అలవాటు ప్రకారం వెనక రెండు కాళ్లు సాచి బలంగా తాపు తన్నింది. సలహాల నక్క మూతి పళ్లు ఊడి వెళ్లి ఖడ్గమృగం ముందు కాళ్ల దగ్గర పడింది. కొత్త ప్రదేశం ఎప్పుడూ చూడని జంతువు కనబడగానే భయ వల్ల కొమ్ముతో దూరంగా విసిరేసింది. గాడిద తాపుకు మూతి పళ్లు ఊడి ఖడ్గమృగం కొమ్ము విసరడంతో నడుం విరిగిన నక్క కుంటుకుంటు మృగరాజు గృహకు చేరింది. దారిలో మృగరాజు సలహాదారు నక్క రక్త సిక్తమైన శరీరంతో కుంటుకుంటు వెళ్లడం చూసిన అడవి జంతువులన్నీ ఏం జరిగిందోనని ఆందోళన చెందసాగాయి. చావు బతుకుల మద్య గుహకు చేరిన నక్క "మృగరాజా, మన సుందరవనం అడవుల్లోకి ఏవో రెండు భయంకర జంతువులు వచ్చాయి. వాటి శక్తి చాలా బలంగా ఉంది. నన్ను వెనక నుంచి తన్ని ముందు నుంచి పొడిచి ఈస్థితికి తెచ్చాయి. మీరు ప్రాణాలతో ఉండాలంటే ఈ అడవి వదిలి పారిపొండి "అని చెప్పి ప్రాణాలొదిలింది. అడవిలో ఏ మూల ఎటువంటి సంఘటన జరిగినా తన చెవిన వేసే సలహాదారు నక్క దుర్మరణం చూసిన మృగరాజుకు కూడా భయం పట్టుకుని ఎవరికంట పడకుండా అడవి వదిలి పారిపోయాడు. మృగరాజు సింహం కొత్త జంతువులకు భయపడి పారిపోయాడన్న విషయం కార్చిచ్చులా వనం అంతా తెలిసింది. ఎవరైన ఎదురిస్తే ప్రాణాలు ఉండవనే భయం అడవి జంతువుల్లో మొదలైంది. ఒకరి విషయా లొకరు తెలుసుకున్న ఖడ్గమృగం-గాడిద అడవిలో ఉన్న పచ్చని ఫలాలు పచ్చగడ్డి బురదగుంటలు లేత ఆకుల చెట్లు చూసి ఇక్కడ తిండికి కొదవ లేదనే నమ్మకంతో స్థిర నివాసం చేసుకోవాలను కున్నాయి. రెండు జంతువులు స్నేహితులుగా మారి అడవిలో పర్యటనకు వెళ్లాయి. మిగిలిన జంతువులన్నీ బిక్కుబిక్కు మంటు భయంగా దాగి చూస్తున్నాయి. షికారుకి బయలు దేరిన రెండు కొత్త జంతువులకు అడుగడుగున స్వాగతం లభించింది. గాడిద , ఖడ్గమృగం మృగరాజు నివాశముండే గుహ వద్దకు చేరి అడవి జంతువు లన్నిటిని సమావేశ పరిచి శాకాహారులను మాంసాహారులను వేరు వేరుగా నిలబెట్టి " మీరు భయపడకండి. మేము శాకాహారులం , అడవి జంతువుల కేమి ప్రాణభయం లేదు. నిశ్చింతగా బతకండి. మాకు అన్ని వసతులు కల్పించండి. అనవుసరంగా ఎవరు ఎవరిని హింసించినా ఊరుకోము.అందరు సఖ్యతగా కలిసి మెలిసి బతకండి.ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకు రండి. మాకు ఒక సహాయకుడు అవుసరం కనుక అడవిలో ఉండే వృద్ధ హనుమ (ఎర్రమూతి కోతి)ను సమాచారుడిగా సహాయకుడిగా నియమిస్తున్నాము. ఏ సందేశమైనా ఈ వానర సేవకుడి ద్వారా తెలియచేస్తాము." అని దైర్యం చెప్పి పంపేసాయి. ఇలా ఖరము, ఖడ్గమృగం సుందర వనం అడవిలో పాగా వేసి వానర సహాయకుడి ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూ తమకు కావల్సిన ఆహారం కాళ్ల దగ్గరకు తెప్పించుకుంటున్నాయి. ఆంతరంగిక వ్యవహారాలు మాట్లాడే టప్పుడు వృద్ధ వానరాన్ని దూరం ఉంచుతున్నాయి. సమయానుకూలంగా జంతువుల్ని సమావేశ పరిచి తమ ఉనికిని చాటుకుంటున్నాయి రెండు జంతువులు. మృగరాజు సింహం మాంసాహారి కాబట్టి అడవి జంతువులకు ప్రాణభయం ఉండేది. ఇప్పుడు చిన్న పెద్ద జంతువులన్నీ నిశ్చింతగా బతుకుతున్నాయి. ఈ అడవి రాజరికంలో గాడిద, ఖడ్గమృగం కావల్సినవి సుష్టుగా తింటు బలిసాయి. ఖడ్గమృగం అడవి జంతువులతో నెమ్మదిగా ఉంటే గాడిద దురుసుగా ప్రవర్తించేది. ఇలా రోజులు గడుస్తుండగా గాడిదకు ఖడ్గమృగం మీద ఈర్ష్య ప్రారంభమైంది. అడవికి తను ప్రధానాధికారిగా, తనను ఉప ప్రధానిగా ఖడ్గమృగం ప్రకటించి అధికారం చెలాయిస్తోంది.అందువల్ల జంతువులు దానికే ఎక్కువ ప్రాధాన్య మిచ్చి గౌరవిస్తున్నాయి. అదీగాక మృగరాజు సింహం ఉండే అధికార నివాసం గుహలో తానుంటు, తనకు గుహ బయట చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసింది. చలికి వర్షానికి బాధ తప్పడం లేదు. అలవాటు ప్రకారం తను ఓండ్ర పెట్టి సంగీత సాధన చేసుకుంటుంటే అడవిజంతువులు ఆ కంఠ ఘోష వినలేక నవ్వుకుంటున్నాయి. ఈ మద్య అడవిలో జంతువుల చర్మాల కోసం వేటగాళ్లు రావడం కందకాలు తవ్వడం , వలలు పరిచి జంతువుల్ని బంధించి తీసుకు పోతున్నట్టు సమాచార సేవకుడు వృద్ధ వానరం ద్వారా తెల్సింది. ఇదే మంచి సమయమని భావించిన గాడిద ఎలాగైనా ఖడ్గమృగాన్ని వేటగాళ్ల కందకంలో పడేలా చేస్తే దాన్ని బంధించి తీసుకుపోతారు. పీడ విరగడౌతుంది. ఇంక తనేరాజు తనే మంత్రిగా గుహలో నివాసం ఏర్పాటు చేసుకుని అధికారం చెలాయించ వచ్చనుకుంది మనసులో. ఎటువైపు వేటగాళ్లు కందకం తవ్వింది కోతి ద్వారా తెలుసుకున్న గార్దభం ప్లాను ప్రకారం ఖడ్గమృగాన్ని తన వెంట వాహ్యాళికి తీసుకెళ్లింది. పైన కొమ్మలు ఆకులతో కప్పిన కందకంగొయ్య మీద నుంచి ఖడ్గమృగాన్ని నడిచేలా చేసి తను దూరంగా ఉండటంతో భారీ శరీరమున్న ఖడ్గమృగం దబ్బున గొయ్యలో పడింది. తన పాచికపారి అధికార శత్రువు పీడ వదులు తున్నందుకు సంతోషంగా ఓండ్ర పెట్టింది గాడిద. అటుగా వెల్తున్న వేటగాళ్లు గాడిద అరుపు విని కందకం వైపు వచ్చి పెద్ద జంతువు ఖడ్గమృగాన్ని చూసి ఆనందించి వెంటనే వారు తెచ్చిన వాహన బందిఖానాలో ఉంచారు. గాడిద చేసిన మోసం తెలుసుకున్న ఖడ్గమృగం ఎంతో మదన పడింది. మనుషుల మద్య సంచరించే గాడిద ఇక్కడికెలా వచ్చిందని ఆశ్చర్య పోతూ వేటగాళ్లు తమ బరువులు మొయ్యడానికి పనికొస్తుందని తలిచి తాళ్లతో కట్టి తోలుకుపోయారు. ఖడ్గమృగాన్ని వదిలించుకుని అడవిలో తనే అధికారం చెలాయించ వచ్చన్న ప్లాను బెడిసికొట్టిందని తెలిసి మిత్రద్రోహానికి తగిన శాస్తి జరిగిందని బాధ పడింది గాడిద. * * *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు