జింక కథ - సరికొండ శ్రీనివాసరాజు

Jinka katha

ఆ అడవిలో ఒక జింక ఒంటరిగా ఉంటూ ఎవ్వరితో కలవకపోయేది. ఎవరితో స్నేహం చేసేది కాదు. ఎవరు పలకరించినా ముభావంగా ఉండేది. అలాంటి జింక ఉన్నట్లుండి అందరినీ పలకరించడం మొదలు పెట్టింది. నవ్వుతూ నవ్వించడం మొదలు పెట్టింది. ఒకరోజు ఒక కుందేలు పిల్ల ఏడుస్తూ కనిపించింది. కారణం అడిగింది జింక. అమ్మ కొట్టిందని చెప్పింది కుందేలు పిల్ల. "కొట్టింది మీ అమ్మే కదా! దానికి ఏడుస్తూ ఉంటారా? నవ్వాలి. నవ్వమ్మా! మా బంగారు కొండ కదా!" అన్నది జింక. కుందేలు నవ్వలేదు. జింక చమత్కారంతో కుందేలు పిల్లను నవ్వించింది. మరొక రోజు చిలకమ్మ చాలా విచారంగా ఉంది. "ఎందుకు అలా విచారంగా ఉన్నావు?" అని అడిగింది జింక. తన నేస్తం నెమలి మూడు రోజులుగా మాట్లాడటం లేదని చెప్పింది. "నీకు నేను ఉన్నానుగా నెమలి కంటే బాగా నిన్ను చూసుకుంటాను. ఆ నెమలి ఏమనుకుంటుందో ఏమో! ఇంత ముద్దుల చిలకమ్మ స్నేహం వదులుకోవడం దాని దురదృష్టం." అన్నది జింక. అసలు వాటి గొడవకు కారణం తెలుసుకుంది. రెండూ నెమలి వద్దకు వెళ్ళాయి. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది జింక. చివరగా ఒక మాట అంది. "చూడండి నేస్తాలు! మనం బతికేది ఎంత కాలమో మనకే తెలియదు. అడవిలో శత్రువుల దాడిలో ఏ క్షణంలో ఎవరి ప్రాణం పోతుందో ఎవరికీ తెలియదు. మనం బ్రతికే ఈ కొన్నాళ్ళు అయినా సంతోషంగా బతుకుదాం." అన్నది హరిణం. ఆ మాట అంటున్నప్పుడు దాని కళ్ళలో కన్నీళ్ళు ధారగా వచ్చాయి. "అయ్యో! అందరినీ నవ్వించే నువ్వు కంటతడి పెట్టడమా! మేం కలిసిపోతాములే." అంది నెమలి. జింక బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరొకసారి రెండు అడవి జీవులు బీభత్సమైన యుద్ధం చేస్తున్నాయి. జింక అక్కడికి వెళ్ళి, యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసుకొని శాంతి కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. "మన అడవి జంతువులన్నీ ఐకమత్యంగా ఉండాలి. శత్రువుల కానీ, వేటగాళ్ళు కానీ దాడి చేస్తే సమష్టిగా ఎదుర్కొని, వాళ్ళను మట్టు పెట్టాలి. మనలో మనమే పోట్లాడుకుంటే శత్రువుల చేతిలో మనమంతా చావడం ఖాయం. కాబట్టి ఈ గొడవలన్నీ మానండి." అన్నది. గొడవ సద్దుమణిగింది. ఇలా యథాశక్తి జింక అడవి జీవులలో ఐకమత్యం పెంచడానికి కృషి చేస్తుంది. ఒకరోజు ఒక వేటగాడు అడవిలో ప్రవేశించి ఏకంగా అడవికి రాజైన సింహం మీద విష బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇది చూసిన జింక వెనుక నుంచి అతి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, వేటగాణ్ణి బలంగా ఢీ కొట్టింది. వేటగాడు కుప్ప కూల్చాడు. చెట్లపై నుంచి కోతుల గుంపు వేటగానిపై దూకి తీవ్రంగా గాయపరచాయి. ఒక కోతి ఏకంగా వేటగాని విషపు బాణం తీసుకుని, వేటగాని డొక్కలొ పొడిచింది. ఇదంతా గమనించిన సింహం వాటి వద్దకు వచ్చి వాటిని అభినందించింది. జింకను ప్రత్యేకంగా అభినందించి, హఠాత్తుగా అడవి జీవులపై జింకకు ప్రేమ కలగడానికి కారణం అడిగింది. అక్కడే ఉన్న జింక ప్రాణ నేస్తం అయిన ఏనుగు ఇలా అంది. "ఈ జింకకు గతంలో ఇద్దరు బిడ్డలు ఉండేవాళ్ళు. ఎంతో అల్లారుముద్దుగా వాటిని పెంచింది. ఆ చిన్నారి జింకలకు తల్లి అంటే ప్రాణం. ఆ తల్లికీ పిల్లలు అంటే ఎంతో ప్రాణం. వాటిని శ్రద్ధతో పెంచుతూ, నైతిక విలువలు నేర్పుతూ చాలా జాగ్రత్తలు చెప్పేది. ఒకరోజు జింక ఆహార అన్వేషణకై వెళ్ళి ఇల్లు చేరగా తన బిడ్డలు కనిపించలేదు. తన స్నేహితులకు చెప్పి, ఎంత వెతికించినా లాభం లేకపోయింది. చాలా రోజులు శోక భారంతో ఎవరిలోనూ కలవలేదు. తన పిల్లలను వేటగాడు అయినా బలి తీసుకోవచ్చు. లేదా క్రూర మృగాలు అయినా వేటాడవచ్చు. తన పిల్లలకు పట్టిన దుర్గతి ఏ పిల్లలకూ పట్టవద్దని, దుఃఖాన్ని దిగ మింగుకొని అన్ని జీవులనూ యథాశక్తి నవ్విస్తుంది. అడవి జీవుల ఐకమత్యానికి యథాశక్తి కృషి చేస్తుంది." అని. సింహం జింకను వేనోళ్ళ పొగిడింది. తనకు మంత్రిగా నియమించుకుంది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు