కడివెడు పాలలో ఒక ఉప్పుగల్లు - చెన్నూరి సుదర్శన్

Kadivedu Paalalo Oka Vuppugallu

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందాను. నాకు అత్యంత ప్రీతి పాత్రమైన రచనా వ్యాసాంగాన్ని వ్యాపకంగా పెట్టుకున్నాను. పాఠకులు నారచనలు చదివి వాట్సాప్ ద్వారా చేరువ కావడం.. వారు శుభోదయ సందేశాలు పంపడం.. మర్యాదపూర్వకంగా తిరిగి నేను సందేశం పంపడం.. అలవడింది.

ఆరోజు నాదినచర్యలో భాగంగా శుభోదయం, సందేశాన్ని మాఊరి స్నేహితుల సమూహంలో పోస్ట్ చేశాను. అందులో ఒక ప్రత్యేకత ఉంది. సుద్దముక్కను తెలుగుతల్లిగా తొలచి రంగులతో తీర్చిదిద్దిన అందమైన శిల్పమది. శుభోదయసూక్తితో బాటు ‘నా గురుతుల్యులు, మహామేధావి అయిన శ్రీరామకృష్ణయ్య ఉపాధ్యాయులుగారి నుండి నేర్చుకున్న కళ’ అని రాశాను.

మరుక్షణమే.. “అతని పేరు ఉచ్ఛరించడమే మహాపాపం సర్” అంటూ నాశిష్యుడు వేణుగోపాల్ నాకు ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. నేను నిర్ఘాంత పోయాను.

“అదేంటి వేణూ.. నాకు సార్ బాగా తెలుసు. అతని ఆశయాలూ తెలుసు. అలా అంటావేమిటి?” అంటూ నేను తిరిగి మెసేజ్ పంపాను.

“సర్.. నీతి సూక్తులు అందరూ వల్లిస్తారు. కాని మీలా కొందరు మాత్రమే ఆచరిస్తారు. మీరంటే నాకే కాదు మన ఊరి వారందరికీ ఎనలేని అభిమానం. ఇప్పుడు నేను రైల్లో హైదరాబాదు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక సార్ గురించి చెబుతాను. అతనిలో రామతత్వం లేదు సర్.. అంతా కృష్ణమాయ” అంటూ వేణు పోస్ట్ చేశాడు.

నాకు ఆశ్చర్యమేసింది. నమ్మశక్యం కావడం లేదు. అనాలోచితంగా కుర్చీలో అలాగే వాలి పోయాను. నా మనసు రామకృష్ణయ్య మాష్టారు గురించి గతం లోకి లాక్కువెళ్లింది..

***

నేను కాకతీయ పి.జి. సెంటర్ హన్మకొండలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజులవి. పద్మాక్ష్మమ్మ గుడికి వెళ్ళే దారిలో ‘రాధాస్వామి సత్సంఘ్’ ఉంది. అందులో పదిహేను గదులున్నాయి. అవి కేవలం విద్యార్థులకు మాత్రమే అద్దెకిస్తారు. మిత్రులతో కలిసి ఒక గదిలో ఉండే వాణ్ణి. సెలవు దినాలలో ఇంటికి రావడం పరిపాటి. నేను వచ్చానని తెలియగానే విద్యార్థులు మా ఇంటికి వచ్చే వారు. గణితశాస్త్రంలో వారి సందేహాలను నివృత్తి చేసుకునే వారు. మా ఊళ్లోనే గాకుండా.. ప్రక్క ఊళ్లలో గూడా పైచదువులు చదువుతున్న స్థానికులెవరూ లేరు. అందుకే నాగురించి మాఊరి ప్రజలు గర్వంగా చెప్పుకునే వారు. ఉపాధ్యాయులంతా స్నేహితులుగా మెదిలేవారు.

ఆసంవత్సరం పాఠశాల వార్షికోత్సవం నాడు రామకృష్ణయ్య చేసిన కృషి మరువలేనిది. పాఠశాల చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోతుందనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఆనాటి సాయంత్రం ఒక ఎడ్ల బండిలో వెదురు కర్రముక్కలు, అట్టముక్కలు, రంగుకాగితాలతో తయారు చేసిన ప్రపంచగోళాన్ని ఒక ఆసనం మీద నెమ్మదిగా తిరిగేలా చట్రానికి అమర్చాడు. దానికి ఇరువైపులా.. జై జవాన్, జై కిసాన్ నినాదాల కింద వానికి అనుగుణంగా ఇద్దరు విద్యార్థులు వేషధారణలతో నిల్చున్నారు. కిసాన్ విద్యార్థి చేతిలో కంకి కొడవలి, జవాన్ విద్యార్థి చేతిలో బొమ్మ తుపాకి.

ఎడ్లబండి వెనుకాల విద్యార్థినీ, విద్యార్థులు రెండు వరుసలలో రామకృష్ణ రచించిన దేశభక్తి గేయాలు చదువుతూ నడుస్తున్నారు. ఎడ్లబండి ముందు భాజాభజంత్రీలు లయబద్దంగా రామకృష్ణయ్య తర్ఫీదు ఇచ్చిన విద్యార్థులు వాయిస్తున్నారు. విద్యార్థుల ప్రక్కన ఉపాధ్యాయులు.. అందరినీ ఉత్సాహపరుస్తూ.. రామకృష్ణయ్య మధ్య, మధ్యలో రాత్రికి పాఠశాల ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు ప్రకటిస్తున్నారు. అలా ఊరంతా తిరిగిన దృశ్యాలు చూసి తరించాల్సిందే గాని చెప్పనలవి గాదు.

ఆరాత్రి అత్యంత సుందరంగా అలంకరించబడిన పాఠశాల వేదిక మీద రామకృష్ణయ్య రచించి.. దర్శకత్వం వహించిన ‘ఎత్తుకు పైఎత్తు’ అనే నాటికను ప్రదర్శించారు. ప్రజల హర్ష ధ్వనుల మధ్య కార్యక్రమాలు ముగిసే సరికి దాదాపు అర్థరాత్రి దాటింది.

నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా! రామకృష్ణయ్య ఇంటికి వెళ్లి ఎప్పుడు అభినందనలు తెలుపుదామా! అని తహతహలాడ సాగాను.

తెల, తెలవారుతూనే.. గబా, గబా తయారై రామకృష్ణయ్య ఇంటికి పరుగు తీశాను. ఉద్వేగంతో తలుపు తట్టాను. తలుపు తెరుచుకుంది. ఎదురుగా తెల్లని లాల్చీ, పైజామా ధరించిన నిరాడంబరమూర్తి కనబడగానే మాష్టారు పాదాలను తాకాను. ఊహించని రామకృష్ణయ్య చటుక్కున నన్ను లేపి హృదయానికి హత్తుకున్నాడు. నా కళ్ళు చెమర్చాయి. అవి ఆనందభాష్పాలు. నాభుజంమ్మీద చెయ్యి వేసి సాదరంగా లోనికి ఆహ్వానించాడు.

“సర్.. మీరు నిర్వహించిన మన పాఠశాల వార్షికోత్సవం మాఊరు చరిత్రలో సువర్ణాక్షరాలై నిలుస్తాయి. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు మాటలు రావడం లేదు. మీరు మాకు మార్గదర్శకులు” అంటూ ఉద్వేగంగా అన్నాను.. మాష్టారు చూపించిన కుర్చీలో కూర్చుంటూ.. “సార్.. మీలో మంచి రచయిత, కవి ఉన్నాడు. మీరు ఆశు కవిత్వం గూడా చెబుతారని తెలిసింది” అంటున్న నాకు.. “టీ తీసుకో బాబూ..” అంటూ వినబడింది. వెంటనే.. “నా అర్థాంగి” అంటూ పరిచయం చేశాడు రామకృష్ణయ్య. “నమస్కారం అమ్మా..” అని అభివాదము చేసి టీకప్పు అందుకున్నాను. పంతులమ్మ వెనుకాల దోబూచులాడుతున్న అబ్బాయిని చూపిస్తూ.. “ఒరేయ్.. సరిగ్గా నిలబడు.. బయటికిరా..” అంటూ లాలనగా పిలిచాడు.

“వీడు మా పెద్దబ్బాయి.. క్రాంతికుమార్” అన్నాడు రామకృష్ణయ్య. “రవి అన్నయ్యకు శుభోదయం చెప్పు”

క్రాంతి వచ్చీ రాని మాటలతో నాకు అభివాదము చేస్తుంటే.. “ఈ బాబు పేరు రవీ..!” అంటూ పంతులమ్మ రామకృష్ణయ్య వంక చూసింది.

“అవును.. నీకు తెలియదు కదూ.. రవి మొదటి సారిగా మనింటికి వచ్చాడు. నేను మరిచే పోయాను పరిచయం చేయడం..” అన్నట్టు మోములో తన తప్పిదాన్ని వ్యక్తపరుస్తూ.. “రవి హన్మకొండలో ఎమ్మేస్సీ మ్యాథ్స్ ఫైనలియర్ చదువుతున్నాడు.. ప్రతిభావంతుడు” అంటుంటే నేను అడ్డుకున్నాను.

“సార్.. ప్రతిభావంతులు అంటే మీరు. నేనింకా విద్యార్థి దశలోనే ఉన్నాను. మీలాంటి వారి పరిచయాలతో నేను ఎంతగానో నేర్చుకోవాల్సి ఉంది” అంటూ ఖాళీ అయిన టీకప్పును టీపాయ్ మీద పెట్టాను.

“రా రవీ.. నా మరో లోకం చూద్దువు గానీ..” అంటూ నన్ను ఒక పెద్ద హాల్లోకి తీసుకు వెళ్ళాడు.

హాల్లోకి అడుగు పెట్టగానే.. అద్భుతమైన మరోప్రపంచం లోకి ప్రవేశించినట్టు అనుభూతికి లోనయ్యాను.

హాల్లో చుట్టూ.. దాదాపు పది ఆల్మరాలున్నాయి. వాటి నిండా.. వివిధ భాషల ప్రాచీన గ్రంథాలు, అధునాతన గ్రంథాలున్నాయి. అతివాద గ్రంథాలు ఎక్కువగా కనబడ్డాయి. వాటిని నేను నిశితంగా పరిశీలిస్తుంటే..

“నేను వీలున్నప్పుడు నాచరిత్ర సాంతం వినిపిస్తాను” అన్నాడు రామకృష్ణయ్య.

మన దేశంలోనే తొలిసారిగా ప్రచురితమైన ‘ఆంధ్రపత్రిక’ తెలుగు దినపత్రిక ఉంది. ప్రపంచంలోని కొన్ని వింతలు, విశేషాల సేకరణ నన్ను అబ్బుర పర్చింది.

నాఅభిరుచి మేరకు మాష్టారు గీచిన పెయింటింగ్స్ మీద వాలింది. రామకృష్ణయ్య తన రచనలకు తనే బొమ్మలు గీసుకున్నాడు. ఒక మూలకు గుండ్రని స్టూల్ మీద అమర్చిన శిల్పం ఆకర్శించింది. వడి, వడిగా వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకో బోయాను.

“జాగ్రత్త రవీ.. సుద్దముక్కను భారతమాతగా చెక్కి పరీక్షనాళికలో అమర్చాను” అంటూ.. దాని పనితనాన్ని వివరించాడు.

“సర్.. మీరు వీలు చేసుకొని ఒక రోజు మాఇంటికి రండి. నాకళ్ళ ముందు సుద్దముక్కను తొలచి చూపించండి” ప్రాధేయపూర్వకంగా అడిగాను.

“సరే రవీ .. వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తాను” అని మాట ఇచ్చాడు. నేను సంతోషంగా.. “సర్.. ఆ రోజు భోజనమూ మా ఇంట్లోనే.. ” అంటూ మాష్టారు వద్ద సెలవు తీసుకున్నాను.

రామకృష్ణయ్య ఒక వ్యక్తి కాదు.. మహా శక్తి. తెలుగు, ఆంగ్ల భాషలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎం.యిడి. చేశాడు. రచయిత, కవి.. ఆశుకవిత్వం గూడా చెబుతాడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఇలాంటి వారు మాఊరి బడిలో మాష్టారుగా పనిచేయడం మాఊరి విద్యార్థుల అదృష్టం. అని నామనసు శ్లాఘించింది.

రామకృష్ణయ్య ‘మాట మీద నిలబడే మనిషి’. ఆదివారం మా ఇంటికి వచ్చాడు. ‘అమ్మా..’ అని మా అమ్మను ఆప్యాయంగా పిలుస్తుంటే నాకు దేవుడిచ్చిన అన్నయ్య లాగా కనబడ్డాడు. భోజనాలయ్యాక సుద్దముక్కను శిల్పంగా చెక్కడం.. పరీక్షనాళికలో అమర్చడం చూపించాడు. దాదాపు రెండు గంటల సమయం పట్టింది. నేను నిశితంగా పరిశీలించాను.

రామకృష్ణయ్య వెళ్లి పోయాక నేను సుద్దముక్కను మరింత నైపుణ్యంగా.. రెండు చేతులతో పుష్పగుచ్చం పట్టుకున్న పల్లె పడుచుగా చెక్కాను. ఆమె ధరించిన లంగా, హోనీ మడతలు.. నడుము మీద వాలుజడ అల్లికను తొలిచాను. రంగులు వేసి రామకృష్ణయ్య ఇంటికి పరుగులాంటి నడకతో వెళ్లాను. రామకృష్ణయ్య అప్పుడే వారి ఇంటి తలుపు తట్టుతున్నాడు. నన్ను, నాచేతిలోని శిల్పాన్ని చూసి ఆశ్చర్య పోయాడు.

“రవీ.. నువ్వు పెద్ద దొంగవురా.. నాకళను తస్కరించావు. నేను ఎందరికో చెక్కి చూపించాను కాని ఎవ్వరూ మళ్ళీ ఇలా చెక్కి చూపించ లేదు. నాపాఠం నాకు తిరిగి అప్ప జెప్పినట్టు ఎంత చక్కగా చెక్కావురా.. నువ్వు సామాన్యుడివి కావు” అంటూ నన్ను ప్రశంసలతో ముంచెత్తాడు. అది నాజీవితంలో మర్చిపోలేని మెప్పుకోలు..

సెలవుల అనంతరం హన్మకొండకు వచ్చాను. కాలేజీకి వెళ్లి వచ్చి ఆవిషయాన్ని చెబుతూ.. నాసంతోషాన్ని మిత్రులతో పంచుకుంటూండగా రామకృష్ణయ్య రాధాస్వామి సత్సంఘ్ రావడం అంతా ఆశ్చర్య పోయాము.

“సర్ రండి.. రండి. మీకు నిండు నూరేండ్ల ఆయుస్సు. మీ గురుంచి నా మిత్రులకు చెబుతున్నాను” అంటూ రామకృష్ణయ్యకు రెండు చేతులా నమస్కరించాను. నా స్నేహితులను పరిచయం చేసాను. రామకృష్ణయ్య మోముపై

ఎప్పుడూ చిరునవ్వు తొణకిసలాడుతుంది. ఇప్పుడూ అలాగే దాన్ని కొనసాగిస్తూ..

“రవీ.. అంత ఆయుస్సు మాకు రాసి పెట్టలేదు. అర్థాంతరంగా మాజీవన జ్యోతిని ఆర్పేయడమే లక్ష్యంగా పెట్టుకుందీ అవలక్షణాల ప్రభుత్వం” అంటూ పెదవి విరిచాడు. మేము మ్రాన్పడి పోయాము.

“రవీ ఆరోజు నాచరిత్ర చెబుతానన్నాను. గుర్తుందా..!”

“అవును సర్.. గుర్తుంది. ఒక్క నిముషం సర్.. మీకోసం వంట చేస్తాను. తరువాత మాట్లాడుకుందాం” అంటూ నేను కదిలేసరికి నన్ను ఆపాడు రామకృష్ణయ్య.

“రవీ.. నేను రాత్రుళ్లు భోజనం చేయను. నాకు ఒక కొబ్బరికాయ తెచ్చి పెట్టు” అంటూ జేబులో నుండి డబ్బులు తీస్తుంటే.. నేను తెస్తాను సర్.. డబ్బులు వద్దన్నా.. వినలేదు. బలవంతంగా నా చేతిలో పెట్టాడు. వెళ్లి కొబ్బరికాయ కొనుక్కు వచ్చాను. రామకృష్ణయ్య కొబ్బరికాయ పగులకొట్టి గ్లాసులో నీళ్ళు పట్టాడు. కొబ్బరిముక్కలు సాంతం తిని నీళ్ళు తాగాడు. మేమంతా విస్తుపోయి చూడసాగాం.

రాత్రి దాదాపు పది కావస్తోంది. రామకృష్ణయ్య తన జీవిత పుస్తకం తెరిచాడు. అందులోని పాత్రలు, ప్రాంతాలు, సన్నివేశాలు వివరిస్తుంటే మాఒళ్ళు గగుర్పాటుకు లోనయ్యింది. రామకృష్ణయ్య కుటుంబ నేపథ్యం ధనిక వర్గ దోపిడీకి వ్యతిరేక పోరాటం.. అందులో తన అన్నయ్యను నది వీధిలో గూండాలు నరికి చంపిన వైనం అత్యంత పాశవికం. మాకు కన్నీళ్లు తెప్పించాయి. మనం సంఘంలోనే ఉంటున్నామా? లేక అటవిక సామ్రాజ్యంలోనా? అనే ఏవగింపు మాకంటి మీద రెప్ప వాలనివ్వ లేదు.. పూర్తిగా తెల్లవారింది. నాజీవితంలో కునుకు తీయని రాత్రి అది. మేము శోక సముద్రంలో మునిగి ఉండగానే వీడ్కోలు తీసుకుని.. మా ఊరికి వెళ్లి పోయాడు రామకృష్ణ.

అలా అంకిత భావంతో బడికి వెళ్ళిన రామకృష్ణయ్యలాంటి మహానుభావుణ్ణి.. నావిద్యార్థి వేణు ఇలా నిందించడం నా మనసు అంగీకరించ లేక పోతోంది.

***

వేణు నుండి ఎప్పుడు ఫోన్ వస్తుందా! అని ఎదురి చూసి.. చూసి.. ఉండబట్ట లేక రెండు రోజులకు నేనే ఫోన్ చేశాను.

“సర్.. ఇప్పుడే ఇంటికి వచ్చాను. మరో పది నిముషాలలో.. ఫోన్ చేస్తాను. మీరు అప్పుడే పడుకోరు కదా..!” అన్నాడు. అప్పుడు సమయం రాత్రి పది దాటింది.

“పడుకోవడమా..! నీ నుండి రామకృష్ణయ్య గురించి నిజాలు తెలుసుకోకుండా నాకెలా నిద్ర పడ్తుంది” అన్నాను.

మరో పది నిముషాలకు వేణు ఫోన్ చేశాడు.

“నేను సార్ మీద కల్పించి చెప్పడం లేదు. నిజాలు చెబుతున్నాను సర్. వారి అబ్బాయి క్రాంతి నేను మంచి స్నేహితులం అనే కంటే అన్నదమ్ముల్లా మసలుకున్నాం. పంతులమ్మను నామాతృమూర్తిగా భావించాను. వారి దుర్భరజీవితం చూడ లేక మాస్నేహితులమంతా కలిసి మాకు చేతనైన సాయం చేశాం” అని చెబుతుంటే నాలో ఉత్సుకత ఆగలేదు.

“అసలు ఏమయ్యింది వేణూ.. రామకృష్ణయ్యకు పెన్షన్ రావడం లేదా” అంటూ అడిగాను.

“మీరు అప్పటికే మన ఊరు వదలి వెళ్ళారు. రామకృష్ణయ్య సార్.. అతణ్ణి సార్ అనడానికే నాకు మనస్కరించడం లేదు. అలాంటి దుర్మార్గుణ్ణి నేను ఇంతవరకు చూడ లేదు సార్. పురాణాలలో ఒక స్త్రీ మూలాన రాజ్యభ్రష్టులయ్యారని, రాజ్యాల మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగాయని చదివాం. నేటి కాలంలో గూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

ఆమధ్య ఒక సినీ మహానటుడు, మేటి రాజకీయవేత్త ఒక స్త్రీ మూలాన భ్రష్టుడు కావడం.. పేరు ప్రఖ్యాతులన్నీ మట్టిలో కలిసి పోవడం.. మనం తిట్టు కోవడం.. తెలియంది కాదు.

మీరూ ఒక సారి నాకు చెప్పారు. మీ కాలేజీ ప్రిన్సిపాల్ ఒక వివాహిత స్త్రీని తిరిగి వివాహమాడాడని.. ఆమె భర్తకు నెల, నెలా బత్తెం కోసం డబ్బులు చెల్లిస్తున్నాడని. అలాంటి యదార్థమే ఇది సార్..” అంటుంటే వేణు గొంతు జీర పోయింది. సన్నని దుఃఖం అతణ్ణి అడ్డు కుంటోందని అర్థమయ్యింది. కాని నాకు రామకృష్ణయ్య ఆదారిలో ఉన్నట్టు గోచరించ లేదు.

“వేణూ.. ఏమయ్యింది” అంటూ అడిగాను. కాసేపటికి తేరుకొని వేణు తిరిగి చెప్పసాగాడు.

“సర్.. నేను నిజం చెప్పి మీకు రామకృష్ణయ్య మీద ఉన్న అపారమైన నమ్మకాన్ని వమ్ము చేయాలంటే కష్టంగా ఉంది. అయినా చెప్పక తప్పదు. ఎవరూ వారి జీవన చరమాంకంలో ఇలా మసులుకొని యావత్తు జీవితానికి చెరగని మచ్చ తెచ్చుకోగూడదని చెప్పాల్సి వస్తోంది” అంటూ గొంతు సవరించుకున్నాడు వేణు.

“సార్.. రామకృష్ణయ్య పదవీ విరమణకు ముందు జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ పొందాడు. ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం చదివే అమ్మాయిని ఇతను వలలో వేసుకున్నాడో! లేక ఆమెనే ఇతన్ని కుతంత్రంతో లోబర్చుకుందో! తెలియదు గాని.. ఐలా పదవీ విరమణ కాగానే అలా అమ్మాయిని తీసుకుని అంతర్థానమయ్యాడు రామకృష్ణయ్య.

క్రాంతి, నేను ఇంకా మాస్నేహబృదం గాలించాం. నిష్ప్రయోజనమే అయ్యింది. పంతులమ్మ రోదించని రోజు లేదు. ఇంట్లో పెళ్ళీడుకు వచ్చిన అమ్మాయి ఉంది. చూసి చూసి.. కళ్ళు కాయలు కాచాయి. మేము ప్రతీ క్షణం ధైర్యం నూరి పోస్తూ.. సాయం చేస్తూ వచ్చాం. నా స్నేహితుని తండ్రిగారు క్రాంతికి తన కంపెనీలో ఉద్యోగమిచ్చాడు. దాంతో కుటుంబం కాస్త ఊపిరి పోసుకుంది.

ఒక రోజు రామకృష్ణయ్య జాడ తెలిసింది. క్రాంతి, నేను కలిసి వెళ్లాం. పలాస దగ్గర ఒక పల్లెటూల్లో ఒంటరిగా గుడిసెలో ఉన్నాడు. మమ్మల్ని చూసి తల దించుకున్నాడు. పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బులన్నీ ఆ మాయ లేడి ఊడ్చుకొని మరో సోగ్గాడితో పారి పోయిందట. తగిన శాస్తి జరిగిందని అనుకున్నాను... కాని క్రాంతి కాళ్ళా, వేళ్ళా బతిమాలాడి రామకృష్ణయ్యను ఇంటికి తీసుకు వెళ్ళాడు..” అని చెబుతుంటే.. నాలో ఆవేశం పొంగి పొర్లింది. తమాయించుకుంటూ..

“ఇప్పుడు ఎక్కడున్నాడు వేణూ.. నేను కలుస్తాను” అంటూ అడిగాను.

“లేదు సర్.. ఇంటికి వచ్చాక మరో మాసం లోనే కన్నుమూశాడు”

నా చేతి లోని ఫోన్ జారి కింద పడింది.*

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు