"ఒరేయ్!రాఘవా!" "రాత్రిపూట విపరీతమైన దగ్గు వస్తుందిరా.! "తట్టుకోలేక పోతున్నా!" "ఒక్కసారి పట్నంలో డాక్టర్ కు చూపించరా.! అడగలేక అడుగుతున్న అమ్మ వైపు చూడలేక తలవంచుకున్నా. "ఇదిగో ఇప్పుడే అనుకుంటున్నా." అమ్మను ఒక్కసారి పట్నం దవాఖానాలో చూపించాలని.సమయానికి నువ్వుకూడా అదే గుర్తుచేసావు.వీలుచూసుకుని రెండుమూడు రోజుల్లో వెళ్దాం" అంటుంటే ,అమ్మ కన్నుల్లో కనిపించిన వెలుగు నా పేదరికాన్ని అర్దం చేసుకుందేమో. క్షణకాలం అలా మెరిసి కనుమరుగైయింది. "అమ్మకు కనిపించకుండా, కంటినీరు తూడ్చుకుంటూ,ముందుకు సాగిపోతున్న నాకు వినపడీ వినపడనట్లుగా అమ్మ మాటలు దగ్గుతో కలసిపోతూ నన్ను చేరుతున్నాయి. "పిచ్చి సన్యాసి,అమ్మకు అబద్దం చెప్పలేక ఎంతగా తల్లడిల్లుతున్నాడో?." ఇంతగా అర్దం చేసుకున్న కన్నతల్లికి సరైన వైద్యం చేయించలేని నా నిస్సహాయతను తలుచుకుంటూ మరోసారి కన్నులు తూడ్చుకున్నా . **** గత రెండు సంవత్సరాలుగా పంటలు సరిగా పండక,అప్పుపుట్టే పరిస్థితి కనుమరుగై పోయిందనే విషయం ,పది గడపలు ఎక్కి దిగుతుంటే తెలుస్తుంది. "ఏమండి! బయటకు వెళుతున్నారేమో? పెద్దవాడి కాళ్ళకు చెప్పులు లేవు,మీకు చెప్పలేక, ఉన్నవాటితో సర్దుకోలేక బాగా ఇబ్బంది పడుతున్నట్లున్నాడు.కాస్త ఆలోచించండి" గడప దాటి బయటకు రాలేక,చిరుగుల రవికను పవిట చెంగు మాటున దాచేస్తున్న ఇల్లాలిని చూస్తుంటే, "కార్యేషు దాసి, కరణేషు మంత్రి భోజ్యేషు మాత, అనే పదాలు గుర్తు చేసుకుంటుంది నామనసు. అపురూపమైనదమ్మ ఆడజన్మ..ఆ జన్మకు పరిపూర్ణత నీవే నమ్మా"అనకుండా ఉండలేక పోయాను. **** "చిన్నా! అదేంట్రా!నీకు కొత్త చెప్పులు తెచ్చాను కదా! పాతవే వేసుకున్నావ్". ఆశ్చర్యంగా అడిగాను . దగ్గరగా కూర్చోబెట్టుకుంటూ మా పెద్దవాన్ని. "కొత్త చెప్పులు కదా,నాన్నా,కాళ్ళు కొరికేస్తున్నాయ్. అవి మీకైతే సరిగ్గా సరిపోతాయ్. ఇవి మీరు వాడుకోండి.తరువాత నాకు తీసుకురావచ్చు". అంటూ నా కాళ్ళకు కొత్త చెప్పులు తొడుగుతున్న నా బిడ్డలో మా నాన్నను చూస్తున్నా. ఇలా అర్దం చేసుకునే కుటుంబ సభ్యుల మధ్యన జీవితంలో ఎంత కష్టం వచ్చినా ?అది క్షణకాలమే కదా!అనిపిస్తుంటే కన్ను ఆనందాశృవులు చిలకరిస్తుంది. నా బిడ్డను దీవిస్తున్నట్లు తన తలపై రాలుతూ.