ఎదిగిన మనసు !! ఎదగని వయసు!!! - శ్యామ్ కుమార్ చాగల్

Edigina manasu Edagani Vayasu

సూట్ కేసు చేతిలో పట్టుకుని అందరి కంటే ముందుగా వాల్ల పిన్ని ఇంటి గేట్ తీసుకుని లోనికి అడుగు పెట్టాడు చంద్రశేఖర్ . ఇంటి ముందు వున్న విశాలమైన ఆవరణ లో వున్న పక్కింటి వేపు అనుకోకుండా చూసాడుశేఖర్. ఆ ఇంటి లోగిలి బయటి అరుగు మీద కూర్చుని పూల దండ కడుతూ ఉందొక అమ్మాయి. రెండు జడలతో ,విప్పారిన నేత్రాలతో చంద్రం నే చూస్తూ ఉందా అమ్మాయి . ఎవరీ ' అందాలబొమ్మ ' అనుకుంటూ కళ్ళు తిప్పుకోకుండా ఆ అమ్మాయినే చూస్తూ ముందుకు అడుగులు వేసాడు చంద్రం.

" రారా .చంద్రం ...అక్క ఎక్కడ ? '' అనుకుంటూ ఇంట్లోనుంచీ ఎదురొచ్చి ,చంద్రం
చేతిలోనుంచీ సూటుకేసి అందుకుంది,చంద్రంపిన్ని అరుణ .

" అదుగో వెనకాల వస్తోంది అమ్మ '' అని వెనక్కి చూపించి, మళ్ళీ ఒక సారి పక్కింటి వేపు ఓచూపు విసిరాడు చంద్రం .

ఆ అమ్మాయి చంద్రం నే చూస్తూ నేవుంది. పెద్ద నుదురు, రింగుల జుట్టుతో ముందుకు జారిన జడలు , విశాల మైన కాటుక కళ్ళు , జడలో నిండుగా మల్లె పూల దండ తో చూస్తున్న అమ్మాయిని కళ్ళార్పకుండా చూసాడు చంద్రం.

" పిన్నీ ఆ అమ్మాయి ఎవరు ?" అన్నాడు మెల్లిగా ,ఆ కాటుక కళ్ళనే చూస్తూ .

" ఇంకెవరు, మీ మామ కూతురు రాణి. నువ్వటు చూడకు. లోనికి రా " అని కాస్తచిరాకుగా , కోపంతో చిట పట లాడుతూ అంది చంద్రంపిన్నిఅరుణ.

పిన్ని మొహం లో కోపం చూసి ,కారణం ఏంటో అర్థం కాక ఇంటి లోనికి వెళ్లిపోయాడు చంద్రం.

'భలే వున్నాడు కుర్రాడు , అచ్చంగా రౌడీ లాగా ఆ చూపులు' అని నవ్వుకుంది రాణి ,లోనికి వెళ్ళిపోతున్న చంద్రం ని చూసి.

కాసేపయ్యాక బయటకు వచ్చి చూసీ చూడనట్లుగా పక్కింటి వేపు చూసాడు చంద్రం. కానీరాణి లేదక్కడ . ఇంతలో అరుణ పిన్ని కొడుకులు రాజు, రవి వచ్చి చంద్రం ను ప్రేమతో గట్టిగా హత్తుకున్నారు.
"పద..పద అలా బయటకు వెళ్ళొద్దాం " అంటూ చంద్రం బుజాల మీద చేతులు వేసి బయటకు తీసుకెళ్లాడు రాజు.

గేటు తీసుకుని బయటకు వెళ్తున్న చంద్రాన్ని ముందు గది కిటికీ లో నుండీ గమనించసాగింది రాణి. " చిన్నవాడే..కానీ
పే..ద్ద మనిషి లాగ వీడి చూపులు" అని నవ్వుకుంది రాణి.

మరుసటి ఉదయం మెల్లిగా " అమ్మా.. పక్కింట్లో మామయ్య ఇంట్లోకి మనం వెళ్లకూడదా?" అనితల్లినిఅడిగాడు చంద్రం

"మీ పిన్ని తో వారికెప్పుడూ తగాదాలే. నువ్వెళ్లు . కానీ మీ పిన్ని చూసిందంటే అంతే సంగతులు. జాగ్రత్త '' అంది చంద్రంతల్లిశాంత కాస్తహెచ్చరిస్తూ
టిఫిన్ చేసి ఇంటి బయటకు వచ్చి అటు ఇటూ చూసాడు చంద్రం. ఎవరూ చూడట్లేదని గమనించి మామయ్య ఇంట్లోకి అడుగు పెట్టాడు.
షర్ట్ తొడుక్కుంటూ ఆఫీస్ కు రెడీ అవుతున్న మామయ్య గోపాల్, చంద్రం ను చూసి " ఆఁ.. రా రా కూర్చో..నువ్వు శాంత కొడుకు వి కదూ ..ఎప్పుడో చూసా..పెద్దవాడివై పోయావు. ఎప్పుడొచ్చారు ?" అన్నాడు సంతోషంగా నవ్వుతూ.

"నిన్ననే మామయ్యా " అన్నాడు చంద్రం నమస్కరిస్తూ

" ఇదుగో నిర్మలా...శాంత కొడుకుచంద్రంవచ్చాడు." అని లోపలనున్న భార్య కు చెప్పి, చంద్రం కేసి చూసి " .కూర్చోరా నిలబడే వున్నావే..నాకు ఆఫీస్ టైం అయ్యింది ,నే వెళ్ళొస్తా " అని బయటకు నడిచాడు.

" ఏరా ..చంద్రం..మీ అమ్మేది? ..నువ్వొక్కడివే వచ్చావా ..టిఫిన్ చెయ్యి " అంది నిర్మల గలగలా నవ్వుతూ.

" పిన్నికి వంటలో సహాయం చేస్తోంది ... నన్ను వెళ్ళమంది అత్తయ్యా " అన్నాడు చంద్రం.

తలుపుకి జారగిలబడి చుస్తూ నిల్చుంది రాణి.

రాణి కేసి సూటిగా చూసి నవ్వాడు చంద్రం. తనను చూడగానే చంద్రం కళ్ళు మెరవటం గమనించింది రాణి.

"కూర్చో .. మా ఇంట్లో టిఫిన్ చెయ్యి ?'' అంది రాణి అభిమానంగా చూస్తూ..

" ఇప్పుడే చేసి వచ్చా రాణీ" అన్నాడు చంద్రం.

పళ్లెం నిండా ఉప్మా తీసుకొచ్చి " ఇదీ కాస్త తినరా చంద్రం '' అంది అ త్తయ్యనిర్మల ప్రేమగా చంద్రం ను చూస్తూ.

ఎదురు సోఫా లో కూర్చుని చంద్రాన్ని అదేపనిగా చూడ సాగింది రాణి.

తల వంచుకుని ఉప్మా తినటం మొదలు పెట్టాడు చంద్రం.

" మీ ఇంట్లో ఏం టిఫిన్ ? " అడిగింది రాణి.

" నేతి గారెలు " చెప్పాడు,చంద్రం

" అవును..మీ పిన్నిగారు ఆస్తిపరులు బాబు.. .చాలా ఖరీదైన టిఫిన్లుంటాయి.. మా ఇంట్లో ఉప్మా నచ్చుతుందో లేదో మరి నీకు " అంది కిల కిలా నవ్వుతూ.

ఉప్మా లో నెయ్యి గానీ జీడిపప్పులు గానీ ఎక్కడా లేనట్లు గమనించాడు చంద్రం.

" మా పిన్ని సంగతి కాదు గానీ , మేం మాత్రం మధ్య తరగతే సుమా! " అని రాణి కేసి చూసాడు చంద్రం.

అదేసమయంలో,బారు జడ ముందుకు వేసుకుని అల్లుకుంటూ చంద్రం కేసి చూసింది రాణి .

" జడ బావుంది " అన్నాడు నవ్వుతూ చంద్రం.

" అబ్బో.. నిజంగానే ? " అని కొంటెగా నవ్వి " అది సరే కానీ ..నిన్న నువ్వెందుకలా చూసుకుంటూ వెళ్ళావ్ ..పైగారౌడీ చూపులు మరీను " అంది.

చంద్రంనవ్వి." నీకలా కనపడ్డాయేమో .. నేను మామూలుగానే చూసా రాణి " అన్నాడు తనదేం బాధ్యత లేదన్నట్లుగా భుజాలెగిరేసి..

కాసేపు అత్తయ్య తో, రాణి తో మాట్లాడి తర్వాతఇంట్లోకి కివెళ్ళిపోయాడు చంద్రం.

లోనికెళ్ళగానే కోపంగా చంద్రాన్ని చుర చురా చూసి " ఏరా చంద్రం ఎటెళ్ళావు ? " అనిఅడిగిందిఅతనిఅత్త య్య అరుణ

" పక్కకే మామయ్య ఇంటికి ' అన్నాడు నిదానంగా..

." నువ్వోచ్చింది నా ఇంటికి . ఇంట్లో ఉండటం నేర్చుకో. వాళ్ళు మాయ చేస్తారు.జాగ్రత్త." అనికొరకొరా చూస్తూవంటింట్లోకి వెళ్ళిపోయింది అరుణ.
అయోమయంగాతల్లి వేపు చూసాడు చంద్రం. ఏమీ మాట్లాడకు ..ఊరుకో అన్నట్టుగా సైగ చేసిందితల్లి కొడుకుని చూసి.
" వాళ్ళు కూడా మన బంధువులే కదా! ,ఇదెక్కడి గొడవ " అన్నాడు మెల్లిగా తల్లి తో.

*****

"ఎక్కడికి రెడీ అవుతున్నావుటా?" అన్నడు చంద్రం పసుపు రంగు కాటన్ చీర కట్టుకుని బ్యాగ్ పట్టుకుని వున్నరాణి ని చూసి.

" కాస్త షాపింగ్ వుంది ...వస్తావా నావెంట ?" అని చెప్పులు వేసుకుంటూ ,ఆగి అడిగింది రాణి.

" సరే, నే బట్టలు మార్చుకుని వస్తానుండు" అన్నాడు.

"వద్దులే ,మహానుభావా .. మీ పిన్ని కి గానీ తెలిసిందంటే , మాతో తగువు పెట్టుకుంటుంది , వద్దు" అంది రాణి.

" అయితే ముందుగా నువ్వెళుతూ ఉండూ..నే వచ్చి వీధిలో కలుస్తా" అని చెప్పి సమాధానాని కై ఎదురు చూడకుండా పిన్ని ఇంట్లోకి వెళ్ళిపోయాడుచంద్రం.


వీధిలో రాణి నడుస్తూ ఉంటే తననుసమీపిన్చిన చంద్రాన్ని చూసి సంతోషంగా నవ్వి చేయి పట్టుకుని " భలే తొందరగా వచ్చేసావే "అంది.

రాణి చేయి పట్టుకోగానే చంద్రం మనసంతాఅదోలా ఆనందం తో నిండి పోయింది.

అల్లాగే చేయి పట్టుకుని నడక కొనసాగించారిద్దరు.

" అదుగో ఆ ఐస్ క్రీం తిందామా ?" అంది అక్కడొక పెద్ద షాప్ ను చూపిస్తూ.

" ఇప్పువుడొద్దు లే రాణి..డబ్బుల్లేవు " అన్నాడు కాస్త ఇబ్బందిగా.

" ఫరవాలేదునా దగ్గరున్నాయి పద" అని గట్టిగా చంద్రం చేయి పట్టుకుని లాక్కెళ్ళింది రాణి.

షాపింగ్ అంతా అయింతర్వాత చాట్ భణ్డార్ లోకి తీసుకెళ్లింది రాణి. అక్కడ , చంద్రం అన్నింటినీ చాలా ఇష్టంగా తినటం కూడాగమనించింది.

ఇంటికి రాగానే హాల్ లో కూర్చున్న పిన్ని కొడుకు రవి అదోలా చూసాడు చంద్రం ని .

"ఏరా ..ఎటు మాయమైపోతావు సడెన్ గా, అర్థం కావటం లేదు." చిరాకుగా అడిగాడు పిన్ని కొడుకు రాజు.

" ఎటూ మాయం కాలేదు..అలా ఊరికే మార్కెట్ లోకి వెళ్ళొచ్చాను." అన్నాడు చంద్రం నవ్వుతూ.

" ఏమోరా బాబు అసలునువ్వర్థం కావు " అని నవ్వేసాడు రాజు.

చంద్రం కేసి అనుమానంగా చూసింది అరుణ .

ఆ రోజునుంచీ రాణి,చంద్రం ఇద్దరూ ఇంట్లో వాళ్ళు చూడకుండా గప్చిప్గా గుడికి, షాపింగ్ కు, టిఫిన్ సెంటర్ లకు వెల్లడం మొదలు పెట్టారు..

రోజులు గడిచిన కొద్దీ ఇద్దరూ ఒకరినొకరు వదల లేని పరిస్థితి ఏర్పడింది .
తన కి వెళ్లే వీలు లేకుంటే చంద్రాన్ని పిలిచి ఎవరూ చూడకుండా వంద నోటు చేతిలో పెట్టి " నే రాలేను గానీ నువ్వెళ్ళి నీ కిష్టమైనవి తినేసి రా చందు " అని అభిమానంగా చెప్పేది రాణి.
రాణి చూపించే ప్రేమ కు , ఆప్యాయతకు, పూర్తిగా కరిగి పోయాడు చంద్రం.

" చంద్రం ఈ రోజు సినీమా కు చెక్కేద్దామా ? " గుసగుసగా అడిగింది రాణి.

"సరే వెళదాం పదా" అని బట్టలు మార్చుకోవడానికి ఇంట్లోకి వెళ్లి పోయాడు చంద్రం ..

ఇంట్లోకి వెళ్లి తల్లిని పక్కకు పిలిచి " అమ్మా..రాణి తో కలిసి సినిమా కెళ్ళొస్తా " అ న్నాడు చిన్నగా

" వెళ్ళిరా ..కానీ మీ పిన్ని కి తెలీకూడదుసుమా, తెలిస్తే గొడవ. మనకు పిన్ని ముఖ్యం. అది గుర్తుంచుకో ,జాగ్రత్త." అంది.

చంద్రం సినిమా థియేటర్ కి వెళ్లే సరికి టికెట్స్ తీసుకుని అతనికోసంఎదురు చూస్తూ వుంది రాణి.
"రా త్వరగా , మూవీ మొదలైపోయింది" అని కంగారుగా లోనికి అడుగులు వేసింది రాణి.
రాణిమాత్రంసినీమా చాలా ఇష్టం గా చూసింది . కానీ చంద్రం మనసు చూపులన్నీ మాత్రం రాణి మీదే వున్నాయి.

ఇంటికి రాగానే ఎదురొచ్చాడు రవి . చంద్రం భుజం పైన చేయి వేసి " అలా బయటకి వెళ్ళొద్దాం పదరా " అంటూ ఎదురుగా వున్న చిన్న టీ కొట్లోకి తీసుకెళ్లాడు.

" ఒరేయ్ చంద్రం ..ఒక మాట చెప్పుతా విను..రాణి మన మామ కూతురు ..బాగానే వుంది కానీ దానికి ఒక ప్రేమ వ్యవహారం వుంది..చూసుకో. జాగ్రత్త " అని స్నేహంగా నవ్వాడు.
ఇబ్బందిగా కదిలాడు చంద్రం. 'కుళ్ళు వెధవ' అనుకున్నాడు మనస్సులో . ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా వుండిపోయాడు.

మరుసటి రోజు సంధ్యా సమయం అవుతోంది . రాణి ఇంట్లోకి వెళ్లి చూస్తే ఎవరూ కనపడ లేదు. ఏమైపోయారబ్బా అనుకుంటూ పెరట్లోకి నడిచాడు చంద్రం.

అక్కడ పొడవాటి పున్నాగ చెట్టు కింద నిలబడి వుంది రాణి. ఎదురుగా ఎవరో అబ్బాయి నిలబడి నవ్వుతూ మాట్లాడుతూ వున్నాడు.
చంద్రం ను చూసి 'ఇటు రా 'అని సైగ చేసింది రాణి.
" ఇదుగో నా అత్త కొడుకు చంద్రం బాపట్ల లో చదూకుంటున్నాడు" అని చంద్రం చేయి పట్టుకుని " చందు ! ఇతను
శేఖర్ ..నా స్నేహితుడు ..మన ఇంటెదురుగా ఉన్న బ్యాంకు లో వుద్యోగం " అంటూ పరిచయం చేసింది.

"సరే నే ఇంట్లో కూర్చుంటా ..వచ్చేయ్ " అని ముభావంగా చెప్పి వెనక్కి తిరిగి వెళ్లి పోయాడుచంద్రం.

కాసేపటికి ఇంట్లోకి వచ్చి చంద్రం ను చూసి ." నేనే శేఖర్ ఇంటికి నిన్ను తీసుకెళ్లి పరిచయం చేద్దామనుకున్నాను ..ఇంతలో నువ్వు వచ్చేసావు " అందిరాణి .మొహం లో ఎప్పుడూ లేని ఆనందం కనపడింది చంద్రానికిఆమెలో.

" ఊ ' అన్నాడు కోపంగా చంద్రం .

"ఏంటీ జెలసీ నా ? కుళ్ళు మొహమా " అంది కిల కిలా నవ్వుతూ.

ఏమీ మాట్లాడ లేదు చంద్రం .
చంద్రం వంక సాలోచనగా చూసి అంది రాణి " నేనంటే చాలా ఇష్టం శేఖరానికి ..రెండు సంవత్సరాల నుండీ ప్రేమిస్తున్నాడు..ఇంట్లో పెద్ద వాళ్లకు చెప్పాలి అనుకుంటున్నాడు " అంది. కళ్ళలో ఎక్కడా లేని మెరుపులుఆమెలోచూసాడుచంద్రం.

" మరి నా విషయం ఏంటీ ?" అన్నాడు చంద్రం మొహం కందగడ్డలా పెట్టుకుని.

గలగలా నవ్వింది రాణి. " చందూ..నువ్వు భలే ముద్దొస్తున్నావు సుమా.." అని దగ్గరకు వచ్చి రెండు చేతులూ చంద్రం బుజం మీద వేసి ,బుగ్గ గిల్లింది.

" అయితే ..నన్ను పెళ్లి చేసుకోవా రాణీ '' అన్నాడు చంద్రం మొహం గంటు పెట్టుకుని.

మళ్ళీ నవ్వింది రాణి.

చంద్రం బుజాల మీద చేతులు తీయకుండా అలాగే చంద్రం కళ్ళలోకి కళ్ళు పెట్టి ప్రేమ గా చూసి " చంద్రం నువ్వింకా చిన్న వాడివి రా..చూడు నా కంటే మూడు అంగుళాలు చిన్న, పైగా వయసులో నువ్వేమో పద్నాలుగు , నేనేమో ఇరవై రెండు ..ఎలా కుదురుతుంది రా..పిచ్చి కన్నా.." అని ముందుకు వంగి చంద్రం నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టింది.

చంద్రం ను అభిమానంగా చూసి ". నువ్ చాలా మంచి మనసున్న పిల్లాడివి ..నీకు పెళ్లి వయసు వచ్చే నాటికి నేను పెద్ద దాన్ని అయిపోతాగా. నీ పెళ్లి వయసుకి మాంచి అందమైన అమ్మాయి వస్తుంది. ఈ పాటికే ఎక్కడో చదువుతూ ఉంటుంది " అంది .రాణిమాటలకు చంద్రంఆలోచనలోపడ్డాడు.

పక్కనున్న అద్దం లోకి ఒక సారి చూసుకున్నాడు చంద్రం 'నిజమే ..ఇంకా సరిగా మీసాలు కూడా రాలేదుసుమా!' అనుకున్నాడు ఉక్రోషంగా.
*

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు