తలరాతను మార్చని చూచిరాత - సరికొండ శ్రీనివాసరాజు

Talaraatanu marchani choochi raata

ప్రశాంతి చిన్నప్పటి నుంచి ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చేది. అదే తరగతిలో అంకిత రెండవ ర్యాంకు వచ్చేది. కానీ ప్రశాంతి మార్కులకు, అంకిత మార్కులకు చాలా తేడా ఉండేది. అందుకే ఎప్పుడూ అంకితకు ప్రశాంతి అంటే ఈర్ష్య. ప్రశాంతి మీద ద్వేషంతో ప్రతి చిన్న విషయానికి ఆమె మీద ఉపాధ్యాయులకు చాడీలు చెప్పేది అంకిత. తిట్టించాలని ప్రయత్నం చేసేది. కానీ ప్రశాంతి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అందరితో స్నేహంగా ఉండేది. పైగా అంకితను కష్టపడి చదివి, మార్కులు పెంచుకోవాలని, అందుకు తానెంతో సహాయం చేస్తానని అనేది. కానీ అంకిత ప్రశాంతికి చాలా దూరంగా ఉండేది. ఆ పాఠశాలలో గతంలో చదివి, ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తూ ధనవంతుడైన విద్యార్థి సతీశ్వర్ అక్కడికి వచ్చాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఈసారి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అందరి కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి యాభైవేల రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఆ విషయం అంకిత తన తల్లిదండ్రులకు చెప్పింది. అంకిత తల్లిదండ్రులు అంకితను కష్టపడి చదివమని ఎంతగానో ప్రోత్సహించారు. కానీ అంకిత ఇంటివద్ద చదువుతున్నట్లు నటించేది. కానీ చదువు అంటే చాలా అశ్రద్ధ. కానీ ఆ యాభైవేల రూపాయలు తనకే రావాలని చాలా ఆశపడింది. ప్రీ పైనల్ పరీక్షల్లో ప్రశాంతి మొదటి ర్యాంకు సాధించింది. ప్రశాంతి చూసి రాయడం వల్ల మొదటి ర్యాంకు వచ్చిందని తాను సొంతంగా రాసి రెండవ ర్యాంకు వచ్చానని అంకిత చెప్పింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అంకితకు ముందు నంబర్ వేరే పాఠశాలకు చెందిన అత్యంత తెలివైన విద్యార్థిని స్రవంతి. స్రవంతిని బతిమాలి ప్రతిరోజూ తనకు జవాబులు చూపించాలని వేడుకుంది అంకిత. స్రవంతి కారణంగా అంకిత 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించింది. ప్రశాంతి ఎంత కష్టపడి చదివి రాసినా దురదృష్టవశాత్తు 9.8 జీపీఏ పాయింట్లు సాధించింది. అంకిత ప్రశాంతి వద్దకు వచ్చి "నేను ఫస్ట్ వచ్చాను తెలుసా. యాభైవేల రూపాయలు గెలుచుకున్నాను." అన్నది. అప్పుడు ప్రశాంతి అంకితకు అభినందనలు చెప్పింది. "పాపం నువ్వు నా చేతిలో ఓడిపోయావు. యాభైవేల రూపాయలు చేజారినాయి. బాధపడకు." అని సానుభూతి వ్యక్తం చేసింది అంకిత. "నేను డబ్బుల కోసం ఎప్పుడూ ఆశ పడలేదు. నా మార్కులతో నాకు సంతృప్తి ఉంది. అది చాలు. ఐనా ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది కాదు ముఖ్యం. మనం కష్టపడి సంపాదించుకున్న చదువు ఎంత అనేది ముఖ్యం. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. ఇదే కష్టాన్ని కొనసాగించి ఖచ్చితంగా పెద్ద ఉద్యోగం సాధిస్తారు. అప్పుడు ఎంతో ధనాన్ని సంపాదించి మా తల్లిదండ్రుల కష్టాలను గట్టెక్కిస్తా. ఈ యాభైవేలు రానంత మాత్రాన నేను ఎంతో కోల్పోయాను అని బాధపడటం లేదు." అన్నది ప్రశాంతి. అంకిత నోరు మూసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ప్రశాంతి ఉన్నత చదువులు చదివి గ్రూప్ వన్ ఆఫీసర్ కాగా, అంకిత చదువు డిగ్రీతోనే ఆగిపోయింది. పూర్వ విద్యార్ధుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయం తెలిసిన అంకిత సిగ్గుతో తల వంచుకుంది. "పదవ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చి యాభైవేల రూపాయలు గెలుచుకున్నావు. నువ్వు ఎంతో పెద్ద ఉద్యోగం సాధించావు అనుకున్నా. చదువు సరిగా సాగకుండా డిగ్రీతో ఆగిపోయిందా.?" అంటూ హేళన చేసింది అంకిత క్లాస్ మేట్ కావ్య. చూచిరాతలతో భవిష్యత్తు ఏమీ ఉండదు. కష్టపడి, ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు