ఆ పాఠశాలలో 8వ తరగతిలో 70కి పైగా విద్యార్థులు ఉండేవారు. తెలుగు ఉపాధ్యాయులు తిరుమలేశం గారు ఆ తరగతి ఉపాధ్యాయులు. ప్రతిరోజూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను, పాఠశాలకు గైర్హాజరు అయిన విద్యార్థులను సున్నితంగా మందలించి, పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలని చెప్పేవారు. ఉపాధ్యాయుని నిరంతర కృషి వల్ల ఆ తరగతిలో ప్రార్థనకు వచ్చే విద్యార్థుల శాతం, రోజూవారీ విద్యార్థుల హాజరు శాతం మిగిలిన తరగతుల కంటే ఎక్కువగా ఉండేది. తిరుమలేశం గారు తెలుగులో చదవడం, రాయడంపై ధ్యాస పెట్టడమే కాదు, పద్యాలను చూడకుండా రాయించడం, సారాంశాలు, వ్యాసాలను సొంత మాటల్లో రాయించడం ఇలా నిరంతరం చేస్తూ చదువు రాని వారిని కూడా మంచి విద్యార్ధులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసేవారు. ఆ తరగతిలో రేణుక అనే అమ్మాయి చాలా బాగా చదివేది. ఎప్పుడూ మొదటి ర్యాంకు రావడమే కాక మార్కులలో ఎప్పుడూ రెండవ ర్యాంకు విద్యార్థినికి అందనంత ఎత్తులో ఉండేది. అదే తరగతిలో గణిత అనే అమ్మాయి రెండవ ర్యాంకు వచ్చేది. గోపి అనే విద్యార్థి పాఠశాలకు ఎక్కువగా గైర్హాజరు అయ్యేవాడు. దానితో మార్కులు చాలా తక్కువగా వచ్చేవి. పైగా తెలుగులో అక్షర దోషాలు బాగా రాసేవాడు గోపి. తరగతి ఉపాధ్యాయులు ఎంత మందలించినా ఫలితం శూన్యం. ఈ విద్యార్థులు 9వ తరగతిలోకి వచ్చినా అంతే. రేణుక 95 శాతానికి పైగా మార్కులు సాధిస్తూ ఇతరులకు అందనంత ఎత్తులో ఉండేది. గణిత రెండవ ర్యాంకు వచ్చేది. అబ్బాయిల్లో గోపి అనే విద్యార్థి నెలకు పది రోజులు కూడా పాఠశాలకు రాకపోయేవాడు. ఇతడు 10వ తరగతిలోకి వచ్చాక ఫెయిల్ అవడం ఖాయం అనుకునే వారు ఉపాధ్యాయులు అంతా. ఈ విద్యార్థులు 10వ తరగతిలోకి వచ్చారు. గణిత మరింత పట్టుదలతో చదువుతూ మార్కులను బాగా పెంచుకుంటుంది. రేణుక మొదటి ర్యాంకు చెక్కు చెదరడం లేదు. గోపి పాఠశాలకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా రావడం ప్రారంభించారు. తెలుగులో తప్పులు లేకుండా రాస్తేనే నూటికి తొంభైకి పైగా మార్కులు వస్తాయి. పైగా అది తెలుగు మీడియం స్కూల్ కాబట్టి ఇతర సబ్జెక్టులలోనూ బాగా మార్కులు రావాలంటే తెలుగు తప్పులు లేకుండా రాయడం రావాలని భావించారు తిరుమలేశం. తెలుగు సబ్జెక్టులో ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చినప్పుడల్లా ఈ ప్రశ్నకు జవాబు ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాసిన వారికి బహుమతి అని ప్రకటించారు. అలా చాలా ప్రశ్న జవాబులను చూడకుండా తప్పులు లేకుండా రాయించారు. బహుమతి కోసం చాలామంది విద్యార్థులు పట్టుదలతో చదవడం ప్రారంభించారు.గోపి తరచూ తెలుగు ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి, "నాకు కూడా బహుమతులు సాధించాలని ఉంది గురువు గారూ! నేనూ కష్టపడి చదువుతా." అనేవాడు. కొన్ని ప్రశ్నలలో రేణుక, మరి కొన్ని ప్రశ్నలలో గణిత ఫస్ట్ వస్తూ బహుమతులు సాధిస్తున్నారు. వీరికి పోటీగా గోపి కూడా మరింత పట్టుదలతో చదువుతూ బహుమతులు సాధిస్తున్నాడు. తెలుగు మాస్టారు ఆశ్చర్యానికి అంతులేదు. ప్రీ పైనల్స్ పరీక్షలలో గోపి తెలుగులో అందరి కంటే ఎక్కువ మార్కులు సాధించి తెలుగు ఉపాధ్యాయుడిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఉపాధ్యాయులు ఆ ఆశ్చర్యంలోంచి తేరుకోక ముందే పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో కలిపి ఏకంగా మండలంలోనే ప్రథమ స్థానం సాధించాడు గోపి. అతనికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. పాఠశాలకు సరిగా రాని విద్యార్థి, 9వ తరగతి వరకూ తెలుగులో బాగా అక్షర దోషాలు రాసే విద్యార్థి 10వ తరగతిలో క్రమం తప్పకుండా వస్తూ బహుమతుల కోసం బాగా ప్రాక్టీస్ చేసి, తప్పులు లేకుండా రాయగలగడం, అదే కష్టంతో మిగతా సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకోవడం తెలుగులో చిన్న చిన్న బహుమతుల కోసం కష్టపడితే ఏకంగా బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చి పెద్ద బహుమతి రావడం అంతా ఆశ్చర్యమే అనుకున్నాడు తిరుమలేశు మాస్టర్. గోపిని అభినందించారు.