భాగవత కథలు -12
ఉగ్ర నరసింహస్వామి అవతారం
-1-
మరీచి కళ దంపతుల కుమారుడు కశ్యపుడు. ప్రసూతి దక్షప్రజాపతి దంపతులు తమ కమార్తెలు అదితి, దితి, ధను, కష్ట, అరిష్ట, సురస, ఇల, ముని. క్రోధవశ, తామ్ర, సురభి, వినత, కద్రు అనే పదమూడు మంది కన్యలను కశ్యపునకు ఇచ్చివివాహం చేసారు. జయవిజయులు వైకుంఠంలో శ్రీహరి మందిరానికి ద్వారపాలకులు. వారు బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందాదుల వలన శాపగ్రస్తులైనారు. ఆ శాప ఫలితంగా మూడు జన్మలు కామక్రోధలోభాది చెడుగుణాలకు పాత్రులై భూలోకంలో శ్రీహరికి విరోధులుగా పుట్టవలసి ఉంది. ఆ జయవిజయులు మొదటి జన్మలో కశ్యప ప్రజాపతి, దితి దంపతులకు లోక కంఠకులైన హిరాణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు రసాతలంలో యజ్ఞవరాహస్వామి చేతిలో మరణించాడు.
-2-
తన సోదరుడు యజ్ఞవరాహమూర్తి చేతిలో హతుడైనాడని విని హిరణ్యకశిపుడు ఎంతో విచారించాడు. తల్లిని, మరదళ్ళను ఓదార్చాడు. అతని మనస్సు అగ్నిగుండంగా మారింది. తన అనుచరులను ఉద్దేశించి “దానవ శ్రేష్ఠులారా!యజ్ఞాలు, జపతపాలు, వేదాధ్యయనాలూ, వ్రతాలు ఆచరించే వారందరిని పట్టి, హింసించి, చంపండి. మాయావి అయిన విష్ణువు వారిని రక్షించడానికి తప్పక వస్తాడు” అని ఆజ్ఞాపించాడు. తరువాత హిరణ్యకశిపుడు వార్ధక్యం రాకుండా ఉండాలనీ, చావులేకుండా బ్రతకాలనీ, శత్రువులను జయించాలనీ, త్రిలోకాలను ఎదురులేకుండా పరిపాలించాలనీ నిశ్చయించుకొన్నాడు.మందర పర్వతంపై ఒకచోట ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెట్టాడు.
-3-
హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్న సమయంలో దేవతలు, రాక్షసరాజు రాజ్యంపై పెద్ద సైన్యంతో వచ్చి పడ్డారు. ఆ ధాటికి తట్టుకోలేక దానవులు తమ భార్యాభర్తల పిల్లలను వదలిపెట్టి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. దేవతలు హిరణ్యకశిపుని మందిరాన్ని ఆక్రమించి, ధనాగారాన్ని దోచుకున్నారు. అప్పుడు దేవేంద్రుడు అంతఃపురంలోఉన్న అతని భార్య లీలావతిని చెరపట్టి భలవంతంగా స్వర్గానికి తీసుకు పోతుంటే అదృష్టవశాత్తు మార్గంలో నారదుడు ఎదురయ్యాడు. నారదుడు ఇంద్రునితో “ ఓ దేవరాజా! నీకిది తగదు. పరస్త్రీని, అందులోనూ గర్భవతియైన ఈమెను ఈ విధంగా నిర్బంధించి తీసుకు రావడం న్యాయం కాదు. నీ కోపాన్ని దేవ విరోధియైన హిరణ్యకశిపునిపై చూపించు. భక్తురాలైన ఈమెను వదిలిపెట్టు” అని చెప్పాడు. దానికి దేవేంద్రుడు “ఈమె గర్భంలో దేవతల శత్రువైన హిరణ్యకశిపుని సంతానం పెరుగుతోంది. ప్రసవం తరువాత శిశువును వధించి ఈమెను తప్పక విడిచి పెడతాను” అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నారదుడు లీలావతి కడుపులో పెరిగేవాడు గొప్ప విష్ణు భక్తుడు, కాబట్టి ఆతనిని నీవు చంపలేవు అనిదేవేంద్రుడికి నచ్చజెప్పాడు. లీలావతిని కూతురు వలె భావించి, ఓదార్చితన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. గర్భంలో ఉన్న శిశువుకు నారద మహర్షి దైవభక్తిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించాడు.
-4-
హిరణ్యకశిపుని కఠిన తపస్సుకు అగ్నిజ్వాలలు ఆకాశం అంత ఎత్తు లేచాయి. సప్త సముద్రాలు సుళ్ళు తిరిగాయి. దిక్కులు గ్రహాలతో సహా ముక్కలై మండిపోసాగాయి. దేవతలు ఈ పరిస్థితి భరించలేక విధాతను రక్షించమని వేడుకొన్నారు. విధాత పరిష్కారం ఆలోచించి భృగువు మొదలైన మహర్షులను వెంటపెట్టుకొని మందర పర్వతం దగ్గరకు వెళ్ళాడు. చీమలు పుట్టలు పెట్టి, చర్మాన్ని చీల్చి, రక్తం త్రాగుతున్నా చలించకుండా తపోదీక్షలో ఉన్న హిరణ్యకశిపుళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. బ్రహ్మదేవుడు “ఓ రాక్షసేంద్రా! ఈ విధంగా తీవ్రమైన తపస్సు చేసినవారు ఇదివరకు ఎవరూ లేరు. నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను” అంటూ మంత్రజలం చల్లాడు. మంత్రజల ప్రభావంతో హిరణ్యకశిపుడు మహా సుందరమైన నవయవ్వనుడుగా తయారై లేచి నమస్కరించాడు.
“విధాతా! నాకు మరణంలేని జీవితం ప్రసాదించు. గాలిలో కానీ, ధూళిలో కానీ, నీటిలో కానీ, నేలపై కానీ, నింగిపై కానీ, రాత్రి కానీ, పగలు కానీ నన్ను మృత్యువు చేరరాదు. నాకు దేవతలచేత కానీ, రాక్షసులచేత కానీ, మానవులచేత కానీ, మృగాలచేత కానీ, సర్పాలచేత కానీ మరణం కలుగ రాదు. ఎటువంటి యుద్ధంలోనూ, ఏ అస్త్రశస్త్రాల చేత చావు కలుగ రాదు” అని వరాన్ని కోరాడు. అంతకు ముందు ఇటువంటి వరం ఎవరికీ ఈయలేదు. నీ తపస్సుకు మెచ్చి నీవు కోరిన వరాలు ప్రసాదిస్తున్నాను. బుద్దిమంతుడవై జాగ్రత్తగా ఉండు అని చెప్పివిధాత నిష్క్రమించాడు.
బ్రహ్మదేవుడి వలన వరాలు పొందిన రాక్షసరాజు తన రాజధాని నగరం చేరుతున్నాడు. తను లేనప్పుడు తనరాజ్యంలో దేవతలవల్ల జరిగిన దోపిడీ, విధ్వంసంగురించి తెలుసుకున్నాడు. దేవతలను, దిక్పాలకులను, గంధర్వులను, కిన్నెరలు, యక్షులను అందరినీ ఓడించి తరిమి కొట్టాడు. దేవేంద్రుడి సింహాసనంపై అధిష్టించి మూడులోకాలకు ప్రభువయ్యాడు.దేవతలందరూ ఏకాగ్రతతో శ్రీహరిని ప్రార్థించారు. పరమేశ్వరుడైని శ్రీహరి,దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి నేనే సంహరిస్తాను; మీరు అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి అని వారికి ధైర్యం చెప్పాడు.
-5-
హిరణ్యకశిపుడికి నలుగురు కుమారులు. దేవేంద్రుడు చెరపట్టినపుడు లీలావతి గర్భంలో పెరుగుతూ, నారదుని ద్వారా భక్తి జ్ఞానాన్ని పొందినవాడే చిన్నకుమారుడైన ప్రహ్లాదుడు. గొప్ప విష్ణు భక్తుడు. మంచీమర్యాద తెలిసిన ఉత్తముడు. పెద్దలు, స్త్రీలు, గురువులు అంటే ఎంతో గౌరవం.ఎప్పుడూ శ్రీమహావిష్ణువు గురించే ఆలోచన. ఆ శ్రీహరినిఆరాధించడం, ఆ స్వామిని ధ్యానించడం అతనికి ఆనందదాయకం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని రాజగురువు శుక్రాచార్యుని కొడుకులైన చండామర్కుల వద్ద శిష్యుడిగా అప్పగించాడు. ప్రహ్లాదుడు అతి తక్కువ సమయంలోనే గురువుల దగ్గర అన్ని శాస్త్రాలను, విద్యలను నేర్చుకున్నాడు.
కొంతకాలం గడిచాక రాక్షసరాజుకు తన కుమారుడు గురువుల దగ్గర ఏమి నేర్చుకున్నాడో తెలుసుకోవాలని అనిపించింది. కుమారుని రాజభవనానికి పిలుపించుకొన్నాడు. ప్రేమగా ఒళ్ళో కూర్చోపెట్టుకుని చదువు ఎలా సాగుతుందని అడిగాడు. నీవు నేర్చుకున్నవాటిలో నీకు ఇష్టమైనది ఏదైనా చెప్పు నాన్నా అన్నాడు. దానికి ప్రహ్లాదుడు గురువులు చెప్పిన అన్ని విద్యలు,శాస్త్రాలు నేర్చుకున్నాను. కాని నాకు అన్నిటికంటె నచ్చిన విషయం మాత్రం ఒక్కటే. అది ‘నారాయణ చరణ స్మరణం’ అని చెప్పాడు.
దానికి హిరణ్యకశిపుడు“విష్ణువు మనకి శత్రువు. శత్రువుని మెచ్చుకోమని గురువులు నీకు నేర్పారా?లేక ఎవరన్నా గిట్టనివాళ్ళు చెప్పారా? లేక నీకే ఈ బుద్ధి పుట్టిందా? మన విరోధిని మనం నిందించాలి కాని పొగడకూడదు” అని హితబోధ చేసాడు. తండ్రి, గురువులు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తి వీడలేదు, తిరిగివారికి భక్తిమార్గాలను బోధించడం మొదలు పెట్టాడు. ఆ పలుకులు తండ్రి చెవులకు ముళ్ళవలె గుచ్చుకున్నాయి. కుమారుని రకరకాలుగా బెదిరించాడు, బయపెట్టాడు. కాని ప్రహ్లాదుని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పట్టరాని ఆగ్రహంతో కుమారుని తీసుకొని వెళ్ళి వధించమని రాక్షస వీరులను ఆదేశించాడు. ఆ క్రూర రాక్షసులు బాలుడు, సుకుమారుడు, అయిన ప్రహ్లాదుని శూలాలతో పొడిచారు, చిత్రహింసలు పెట్టారు, కాని అతని శరీరం కందలేదు, అతడు కంట తడి పెట్టలేదు. కోపం పట్టలేక హిరణ్యకశిపుడు తన కుమారుని మదించిన ఏనుగులతో తొక్కించమన్నాడు, విష సర్పాలతో కరిపించమన్నాడు, కత్తితో నరకమన్నాడు, కొండశిఖరాలపై నుండి క్రిందకి తోయమన్నాడు. కోపంతో కొడుకుపై చేయరాని ఘోరాలన్నీ చేయించాడు. కాని ప్రహ్లాదుడు హరినామస్మరణ వదలలేడు, దైవకృపవల్ల అతనికి ఏమీ కాలేదు.
హిరణ్యకశిపుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నా ఈ కొడుకు ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు, వీడిలో ఏదో దైవశక్తి ఉంది, కాని అది ఏమిటో తెలియడం లేదు అనుకున్నాడు. ఇంతలో గురువులు వచ్చి ప్రహ్లాదుడు బాలురందరికీ “ఈ చదువుల్నీ వ్యర్థం విష్ణుభక్తిఒక్కటే పరమార్థం” అనిబోధిస్తున్నాడు. ఇక నీ కొడుకును నీవే దారిలో పెట్టుకోవాలి అని విన్నవించారు. దానవరాజు ప్రహ్లాదుని పిలిపించాడు. “ ఓరీ డింభకా! నీవు అనుక్షణం పొగిడే ఆ విష్ణువుకు పౌరుషం ఉంటే, వీరుడైతే నిన్నుఖండిస్తున్నప్పుడు కూడా నా ముందుకు రాలేదేం? ముల్లోకాలలోనూ నేనే బలవంతుడను. అసలు నీవు నమ్మినవాడు ఎక్కడున్నాడు?” అని కోపంగా ప్రశ్నించాడు. తన తండ్రి గద్ధించగా ప్రహ్లాదుడు ఒక్క క్షణం కూడా సందేహించలేదు. అమితమైన ఆనందంతో “తండ్రీ! సందేహము లేదు. భగవంతుడైన విష్ణువు అక్కడా,ఇక్కడా, అన్నిచోట్ల, అన్నిసమయాలలో, అంతర్లీనమై ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడే కనిపిస్తాడు. నా మాట నమ్ము” అన్నాడు. హిరణ్యకశిపుడు హుంకరించాడు. “సరే అయితే ఈ స్థంబంలో ఉన్నాడా? ఇందులో నీ చక్రి లేకపోతే నిన్ను సంహరిస్తాను” అన్నాడు. వెంటనే ప్రహ్లాదుడు “విశ్వమంతట నిండినవాడు, విశ్వాత్ముడు అయిన విష్ణుమూర్తి ఇందులో ఎందుకు ఉండడు? కావాలంటే నువ్వేచూడు” అని ధైర్యంగా తండ్రికి చెప్పాడు.
ప్రహ్లాదుని మాటలకు హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసి, సింహాసనం దిగాడు. ఆవేశంగా “ఇందులో హరిని చూపు” అంటూ అరచేతితో ఆ సభామంటప స్థంబాన్ని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆ మహాస్థంబం పెళపెళమని భయంకర ధ్వని చేసింది. పిడుగులు పడ్డట్టుగా “ఫటాఫట” మనే చప్పుడు కర్ణకఠోరంగా వినిపించింది. బ్రహ్మాండం పగిలినట్లుగా ఆ స్థంభం ముక్కముక్కలు అయ్యింది. అందులో నుండి దేదీప్యమానమైన దివ్యతేజస్సుతో నరసింహస్వామి అవతరించాడు.
-6-
ఆ స్వామిది నరరూపమూ కాదు, సింహరూపమూ కాదు. మానవాకారం, సింహాకారం కలిసిన శ్రీహరి మాయారూపం. ఆ నరసింహస్వామి పాదాలు వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. తొడలు ఐరావతం తొండాల్లాగా బలిసి బలంగా ఉన్నాయి. ఆయన వక్షస్థలం కొండచరియల వలె అతి కఠినమై, విశాలంగా ఉంది. ఆయన వాడితేలి వంకర తిరిగిన గోళ్ళుకొడవళ్ళ వలె, బాహువులు వీర రసం ఒలకబోస్తూ ఉన్నాయి. ఆ ప్రభువు కంఠం పర్వత శిఖరంలా దృఢంగాఉంది.ఆ దేవునినోరు, ముక్కు రంధ్రాలు మేరుమందరపర్వత గుహలవలె విస్తారంగా ఉన్నాయి. ఆ ప్రభువు కళ్ళు సూర్యమండల కాంతులు వెదజల్లుతున్నాయి. ఆ స్వామి సింహగర్జనకు దిక్కుల చెవులు పగిలిపోతున్నాయి. ఆ అద్భుత దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు రాయిలా చేష్టలులేక ఉండిపోయాడు. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని గద ఎత్తి తొట్రుబాటుతో మృగరాజును సమీపించే మదగజంలాగా స్వామి ఎదుటకు నడిచాడు. స్వామి కాంతి ముందు దానవరాజు మిణుగురు పురుగులా ఉన్నాడు.
దానవ వీరుడు తన గదాదండం గిరగిరా త్రిప్పి నరసింహస్వామిపై విసిరాడు. ఆ స్వామి చాకచక్యంగా తప్పించుకొని రాక్షసరాజును పట్టుకున్నాడు. దానవుడు బలం పుంజుకొని, పట్టు తప్పించుకొని, పోరాడసాగాడు. నరహరి అదను చూసి విజృంభించి, దూకి దావవేంద్రుని మరల పట్టుకున్నాడు. ఆ స్వామి శక్తికి సుర విరోధి క్రమంగా లోబడి పోయాడు. నరసింహస్వామి ఆగ్రహంగా ఆ దనుజుణ్ణి బలవంతంగా తల తొడలపై అడ్డంగా పడవేసుకున్నాడు. వాడియైన తన గోళ్ళతో వాడి రొమ్ము చీల్చి వేశాడు. వాని రక్తనాళాలను త్రుంచేశాడు. కండరాలను ముక్కలు ముక్కలు చేసాడు. వాడి నెత్తుటిప్రేవులు తన కంఠంలో మాలవలె ధరించాడు.
ఈ విధంగా కేవలం నరరూపమూ మృగరూపమూ కాని నరసింహ రూపంతో; రాత్రీ పగలు కాని సంధ్యా సమయంలో; గృహమునకు లోపలా వెలుపలా కాని ద్వార మధ్యంలో; ఆకాశమూ భూమీ కాని తొడలపై; ప్రాణం ఉన్నవీ లేనివీ కాని గోళ్ళతో; ఏ రకమైన ఆయుధం ఉపయోగించ కుండా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి భంగం కలుగకుండా, రాక్షసరాజును వధించాడు.
ఆ నరహరి ఉగ్ర రూపం భయంకరంగా ఉంది. నాలుక నాగుపామువలె భీకరంగా ఉంది. మెడజూలు రక్తంతో తడిసి ఎర్రగా ఉంది. ఆ స్వామి ఆగ్రహం చల్లారలేదు. నరసింహస్వామి ఆ సభా భవనంలో సింహాసనంపై ఆసీనుడయ్యాడు.ఆ సమయంలో మూడు లోకాలలో ఉన్న దేవతలు, గంధర్వులు, కిన్నరులూ, సిద్ధులు, ఋషులు, అందరూ స్వామిని ధర్శించడానికి వచ్చారు. కాని ఎవ్వరూ దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేక భయంతో వణుకుతున్నారు. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మిగిలిన దేవతలు స్వామిని వివిధరీతుల స్తుతించారు. నీవు లోకకంఠకుడైన దానవుని సంహరించావు. మా అభినందనలు. ఈ బాలుడు నీవు సంహరించిన దానవుని కుమారుడు, నీ భక్తుడు, కరుణతో వీనిని కాపాడుప్రభూ అని విన్నవించారు. దేవతల కోరికపై లక్ష్మీదేవి అక్కడకు వచ్చింది. స్వామి రూపంలో వీర, రౌద్ర, అద్భుత రసావేశాలతో నిండి ఉంది, కాని అనుగ్రహకృపారస స్ఫూర్తులు లేకపోవడం గ్రహించి ఆశ్చర్య పోయింది. స్వామి శాంతించిన తరువాతనే దగ్గరకు వెళ్దామని, దూరంగా ఉండిపోయింది.
ఇక స్వామిని శాంతపరచడం ప్రహ్లాదునికి మాత్రమే సాధ్యం అవుతుందని గ్రహించిన బ్రహ్మ వానిని పిలిచి “నాయనా , ప్రహ్లాదా! నీ తండ్రి కారణంగా ఉగ్ర రూపం దాల్చిన శ్రీహరిని మెల్లగా వెళ్ళి నీవే చల్లపరచు” అని చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి దివ్య పాదాలకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేసాడు. ప్రహ్లాదుని చేతి స్పర్శకు స్వామి ప్రసన్నుడై అతనిని ప్రేమగా చూసాడు. ఆయనలో కరుణరసం ఉప్పొంగింది. దగ్గరగా పిలిచి ప్రహ్లాదుని తల ఆప్యాయంగా నిమిరాడు. నరహరి స్పర్శతో ప్రహ్లాదుని భయం పోయింది. బ్రహ్మజ్ఞానం కలిగింది. చేతులు ముడిచి ప్రభువును “స్వామీ నీ సన్నిధికి విధాత, లక్ష్మీదేవి, దేవేంద్రుడు అందరూ వచ్చారు. అయినా వారెవ్వరికీ నీ దివ్యహస్తంతో అభయం ఇవ్వలేదు. కాని బాలుడను, దానవవంశంలో పుట్టినవాడిని అయిన నాకు నీ అపార కృపారసం లభించింది. నా జన్మ ధన్యమయ్యింది” అని కీర్తించాడు.
ప్రహ్లాదుని వినయానికి సంతోషించిన నరహరి “ప్రహ్లాదా! నీవు ఒక మన్వంతరం పాటు దానవచక్రవర్తిగా సకల సౌఖ్యాలు అనుభవించి తరువాత నా సాన్నిధ్యం పొందుతావు.నిన్ను కనడం వలన నీ తండ్రి పవిత్రుడై శుభస్థితి పొందాడు. నా నరసింహ అవతారాన్నీ, నీవు చేసిన సంస్తుతినీ మనస్సులో భావించిన నరుడు పునర్జన్మ పొందడు. కర్మబంధాలనుండి విముక్తుడవుతాడు.” అని దీవించాడు. బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరించిన అనంతరం లక్ష్మీదేవితో కలిసి నరసింహస్వామి అంతర్ధానమయ్యాడు.
***శుభం***