గోవిందాపురంలో సునందుడు అనాథ.కట్టెలు కొట్టుకు జీవించే వాడి తల్లిదండ్రులు అడవిలో పులికి ఆహారమైతే ముసలి అవ్వ చేరదీసి పెంచింది. పదిహేనేళ్లు వచ్చేసరికి అవ్వ కూడా చనిపోవడంతో ఊళ్లో వారి పసువులను మేపుతు కాలం వెళ్లదీస్తున్నాడు. చిన్నప్పటి నుంచి పల్లె జానపదాలు కూనిరాగాలు పాడే సునందుడికి గ్రామంలో ఉండే సంగీత విధ్వాంసులు సోమయాజులు గారి ఇంటి దగ్గర కెళ్లి వారి శిష్యులతో పాటు తనకు కూడా భక్తి సంగీతం నేర్పమని ప్రాధేయపడ్డాడు. " గొల్లోడివి, నీకు సంగీత మెందుకురా పోయి పసువుల్ని కాసుకో " అని కసురు కున్నారు సోమయాజులు గారు .చేసేది లేక మొహం చిన్నబుచ్చుకుని వెనక్కి వచ్చినా సంగీతం నేర్చుకోవాలన్న ఆశక్తి తగ్గలేదు. సాయంకాలం సోమయాజులు గారు వారి ఇంటి వీధి వసారాలో శిష్యులకు సంగీతంలో రాగాలు కీర్తనలు లయ బద్దంగా నేర్పించేవారు. శిష్యులు సంగీత సాధన సమయంలో సునందుడు సోమయాజులు గారి ఇంటి వసారాలో చేరి పూలమొక్కల చాటున ఉండి అన్నీ ధ్యానంగా విని గోవిందాపురం ఊరి బయట నల్లరాతి బండ మీద కూర్చుని సాధన చేసేవాడు. గొల్ల సునందుడు పరోక్షంగా తన శిష్యులతో సంగీత సాధన చేస్తున్న విషయం సోమయాజులు గారికి తెలియదు. రోజులు గడుస్తున్న కొద్దీ గొల్ల సునందుడు భక్తి శాస్త్రీయ సంగీతంలో ఎన్నో పాటలు రాగాలు ఊరి బయట నల్ల రాతిబండ మీద కూర్చొని సాధన చేస్తున్నాడు. ఆ నల్ల శిలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆకాశం మీద నుంచి భూమి ఆకర్షణకు కింద పడిన చంద్ర శిల అది. దగ్గరలోని ధ్వని తరంగాల్ని ఆకర్షించి ప్రతి ధ్వని చెయ్యగలదు. సునందుడు సాధన చేసి వెళ్లిన తర్వాత ఆ సంగీత రాగాల్ని పలికించేది నల్ల చంద్ర శిల. ఆ రాజ్యపు మహరాజు మహీధరుడికి ఆధ్యాత్మిక దైవభక్తితో పాటు సంగీత శిల్పకళలంటే ఇష్టం. పండగలు పర్వ దినాలప్పుడు రాజ్యంలోని కళాకారుల్ని కోటకు రప్పించి వారి ప్రతిభకు మెచ్చి పురస్కారాలతో సత్కరించేవాడు. తన రాజ దర్భారులో అనేక నాట్య భంగిమలతో శిల్పాలను చెక్కించి నలువైపుల అలంకరించాడు.అందులో ఒక నాట్యకత్తె చెయ్యి విరిగినందున దానికి బదులుగా మరో కొత్త నాట్యభామ శిల్పాన్ని తయారు చేయమని ఆస్ధాన శిల్పచార్యుల్ని ఆదేశించాడు మహరాజు. ఆస్థాన శిల్పి గంగాధరాచారి ఆ నాట్యభామకు సరిపోయే నల్లరాతి కోసం వెతుకుతుంటే గోవిందాపురం పొలిమేరలో పడి ఉన్న చంద్రశిల కంటపడింది. వెంటనే గంగాధరాచారి ఆ శిలను రాజదర్బారుకు రప్పించి విరిగిన నాట్యభామ స్థానంలో శిల్పంగా చెక్కి అమర్చాడు.ఆ నాట్యభామ శిల్పం లోని మెరుపుకు అందరూ ఆశ్చర్య పోయారు. అటువంటి అద్భుత శిల్పాన్ని తయారు చేసిన ఆస్థాన శిల్పిని బహుమతులతో గౌరవించాడు మహరాజు. దసరా వేడుకలు వచ్చినందున రాజ్యంలోని సంగీత విధ్వాంసుల్ని కోటకు రప్పించి వారి ప్రతిభను అందరికీ పరిచయం చేయాలని ఆహ్వానాలు పంపారు. గోవిందాపురంలోని సంగీత విధ్వాంసులు సోమయాజులు గారికి కూడా ఆహ్వానం అందింది.అప్పటికి ఆయన శరీర ఆరోగ్యం బాగులేకపోయినా రాజు ఆహ్వానాన్ని కాదనలేక కొందరు శిష్యులను తోడుగా కోటకు చేరినారు. సంగీత కచేరీ వేడుకలో సోమయాజులు గారి వంతు వచ్చింది. ఆయన తన గాత్రం సరిచేసి కచేరీ ప్రారంభించారు. గాత్ర కచేరీ మొదలైన కొద్ది సేపటికి ఆరోగ్యం బాగులేని కారణంగా వారి గళం ముందుకు సాగలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన పాడలేక పోతున్నారు. వెంట వచ్చిన శిష్యులు అయోమయంతో తెల్లమొహాలు వేసారు. ఇంతలో రాజదర్బారులో కొత్తగా అమర్చిన నాట్య సుందరి కంఠం నుంచి శ్రావ్యమైన కంఠంతో సోమయాజులు గారు వదిలిన మిగతా సంగీత రాగాన్ని పూర్తిచేసింది. వాద్యకారులు విస్మయ పోయారు.అంతా అద్భుతంలా అనిపించింది. ఇదేమి వింతని సంగీత విధ్వాంసులు సోమయాజులు గారు తన వెంట ఉండే శిష్యులకు సాద్యంకాని రాగాన్ని శిల్పసుందరి ఎలా పాడగలిగిందని ఆశ్చర్య పోతున్నారు. రాజ దర్బారులోని కళాకారులు, మహరాజు మహీధరుడు కూడా సంబ్రమాశ్చర్యాలకు గురయారు. తర్వాత ఆ శిల్పసుందరి మౌనమైపోయింది. ఆ నాట్యసుందరి శిలను ఎక్కడి నుంచి తెచ్చారని వాకబు చేయగా గోవిందాపురం ఊరి పొలిమేరల నుంచి తెచ్చి నట్టు తెల్సింది. తర్వాత గోవిందాపురంలో సోమయాజుల గారంతటి సంగీత విధ్వాంసుల శిష్యులెవరని పరికించగా గొల్ల సునందుడని తెల్సింది. తన వద్ద శిష్యరికం తిరస్కరించినప్పటికీ ఏక సంతాగ్రాహి పరోక్షంగా సంగీత విద్య నేర్చుకుని ఊరి బయట చంద్రశిల మీద కూర్చుని సాధన చెయ్యడం, ప్రతిధ్వనిలో నాట్యసుందరిగా ఉన్న చంద్రశిల సోమయాజులు గారి గానాన్ని పూర్తి చెయ్యడం బయట పడింది. చిన్న జాతని గొల్ల సునందుడికి సంగీత సాధనకు తిరస్కరించడం తన అహంబావానికి సిగ్గుపడ్డారు సోమయాజులు. ఈ అద్భుత విషయం తెలిసి మహరాజు మహీధరుడు గొల్ల సునందుడిని రాజదర్బారుకు రప్పించి ప్రశంసించి సత్కరించాడు. * * *