ఆబ్దీకం - వెంకటరమణ శర్మ పోడూరి

Aabdikam

రాజ గోపాల్ అఫీసుకి బయలు దేరి, కారు కీస్, బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వెళ్ళబోతూ భార్య వకుళ ని పిలిచాడు. వంటింట్లోంచి వచ్చి ఏమిటన్నట్టు అతనికేసి చూసింది " ఎల్లుండి మా నాన్నగారి తిధి. మన పనిమనిషి, లేదా ఇంకెవరినయినా చూసి ఇల్లంతా కడిగించి శుభ్రం చేయించు. దగ్గర్లో ఎవరయినా వంట చేసే వాళ్ళు, ఆబ్దీకం బ్రాహ్మలు ఉన్నారేమో కాంతం ఆంటీని కనుక్కుని మాట్లాడు" అని వెళ్లి పోయాడు. ఆమెకి మనసులో చాలా ప్రశ్నలు వచ్చాయి. కానీ, అతను హడావిడిగా వెళ్ళిపోతోంటే ఎందుకని ఊరుకుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి అయి ఆరు నెలలే అయింది. పెళ్లి అయిన మూడు నెలలకే ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ బుక్ చేసుకుని నెలక్రితమే గృహప్రవేశం అయ్యారు. గృహ ప్రవేశం సమయంలో వీళ్ల ఫ్లోర్ లోనే ఉంటున్న కాంతం గారు పరిచయం అయి, చాలా విషయాలలో వకుళ కి సహాయం చేయడంతో సాన్నిహిత్యం పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ కాబట్టి, ఉన్న నాలుగు బ్లాక్ ల చుట్టూ చక్కటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాడు బిల్డర్. అక్కడ నడుస్తుండగా నరసయ్య గారి తో పరిచయం అయింది. ఆయన కొడుకు కూడా ఒక బ్లాక్ లో ఫ్లాట్ తీసుకున్నాడు . కొత్తగా రావడం తో చాలా విషయాలలో కాతం గారూ, నరసయ్య గార్ల సలహాలు తీసుకోవడం పరిపాటి వకుళ కి. అందుకే రాజగోపాల్ ఆఫీస్ కి వెడుతూ అలా చెప్పాడు. వకుళ కి, రాజగోపాల్ చెప్పిన విషయం మీద చాలా సందేహాలు వచ్చాయి. సందేహాలు తీర్చుకునే అవకాశం ఇవ్వకుండానే అతను హడావిడి గా అఫీసుకి వెళ్లి పోయాడు . ప్రతి సంవత్సరం తల్లి తండ్రుల ఆబ్దికాలకి అన్నగారి దగ్గరికి వెళ్ళేవాడు. ఈ మాటు తండ్రి తిధి కి ఆఫీస్ పని వత్తిడి వల్ల బెంగళూర్ లోనే పెట్ట దలుచుకున్నాడు రాజగోపాల్ **** సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే వకుళ ఇచ్చిన కాఫీ తాగి అడిగాడు " కాంతం గారితో మాట్లాడావా?" అని " అది కాదు ఇక్కడ ఎక్కడో గాయత్రి సదన్ అని ఉందట. అక్కడికి వెడితే వాళ్లే అన్నీ చేసి, పెట్టిస్తారట అక్కడికి వెళ్ళకూడదా అంది" " అదేమిటి? ఎందుకలా ? నేను కనుక్కోమన్నవి కనుక్కో లేదా? " అన్నాడు కొంచం చిరాకుగా " మొన్ననే గృహప్రవేశం చేసుకుని, ఏడాది గడవకుండానే ఇంట్లో ఆబ్దికం ఎందుకు అశుభంగా? అదీ కాకుండా ఇంట్లో పెడితే చాలా ఎక్కువ ఖర్చు అనుకుంటా" అంది అతని కేసి చూస్తూ మొదటి సారిగా రాజగోపాల్ కి వకుళ మీద సడన్ గా కోపం వచ్చింది. అది అతని ముఖం లో ప్రస్ఫుట మయింది. అతను ఇంతవరకూ ఆమె మీద ఎప్పుడూ కోపం ప్రదర్శించలేదు. వెంఠనే తలుపు తీసుకుని బయటికి వెళ్లి పోయాడు. వాళ్లిద్దరి మధ్య దాంపత్యం చాలా అన్యోన్యంగానే సాగుతోంది. చిన్నప్పటినుంచీ రాజగోపాల్ ది చాలా సున్నితమయిన మనస్తత్వం. ఎవరయినా తనను నొప్పించేలా ప్రవర్తించినా, అవతలివాళ్ళమీద పరుష ప్రద ప్రయోగం చేసి రిటార్ట్ చేయడం అతనికి అలవాటు లేదు అతనికి అంత కోపం ఎందుకు వచ్చిందో వకుళ కి అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉండి పోయింది. తాను అన్న దాంట్లో తప్పేమిటో ఆమెకి అర్థం కాలేదు. ఆ మధ్యాహ్నం, భర్త చెప్పిన విషయం గురించి కాంతం ఆంటీ సహాయం కోసం వెళ్ళినప్పుడు ఆమె . "కొత్త ఇంట్లో ఏడాది గడవకుండా శ్రాద్ధ కర్మ ఎందుకమ్మా? బయట బోల్డు మంది కొంత డబ్బు ఇస్తే ఏర్పాటు చేస్తారు కదా?" అంది. వకుళ కి సినిమాలలో సముద్రం పక్కన, చెరువుల పక్కన మూడు పిండాలు పెట్టి చేసే కార్యక్రమాల దృశ్యాలు మనసు లోకి వచ్చి కాంతం ఆంటీ చెప్పినది చాలా సబబు అనిపించింది. **** కోపంగా బయటికి వచ్చి నడుస్తూ ఆలోచనలో పడ్డాడు రాజగోపాల్ . వాళ్ళ వీధి చివర ఉన్న గణపతి ఆలయం దగ్గరికి రాగానే ఎదో ఆలోచన వచ్చి లోపలికి వెళ్లి పూజారి ఖాళీ గా ఉంటె ఆయన్ని అడిగాడు "దగ్గరలో అబ్దికాలు ఏర్పాటు చేసే సంస్థ ఏదయినా ఉందా ?" అని. దగ్గరలోనే గాయత్రీ సదన్ అని ఉందనీ అక్కడ కనుక్కోమని ఎలా వెళ్ళాలో చెప్పారు. ఆ సమయంలో ఉండరని మరునాడు పది గంటల తరువాత వెళ్ళ మనీ చెబితే మరునాడు కనుక్కుందామని వచ్చేశాడు. ఇంటికి వచ్చిన తరువాత అతను మామూలు గానే ఉన్నాడు కానీ, రాత్రంతా ముభావంగా ఉన్నాడు. వకుళ కి తాను అన్నదాంట్లో తప్పేమిటో తెలియక భర్తకి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు. భర్త ముభావంగా ఉండడం చూసి తాను కూడా ఊరుకుంది. ఆమెతో ఆర్గ్యు మెంట్ చేద్దామని ముందు అనిపించినా, కొత్త ఇంట్లో ఆ కార్యక్రమం ఎందుకు అన్నది అతని మనసులోకూడా పీకుతూ ఉండడం వల్ల అప్పటికి ఊరుకున్నాడు. ** మరునాడు మామూలుగా కంటే ముందుగా ఆఫిసుకి వెళ్లి పోయాడు రాజగోపాల్. ఆఫీసులో చెప్పి, పది దాటిన తరువాత గాయత్రి సదన్ కి వెళ్లి వాకబు చేశాడు. ఒక చిన్న బిల్డింగ్ లో ముందు భాగం లో చిన్న ఆఫీసు లా ఉంది. అక్కడ వాకబు చేస్తే వాళ్ళు చెప్పారు. కొంత డబ్బు కడితే, భోక్తల్నీ , మంత్రం చెప్పే వాళ్ళనీ ఏర్పాటు చేస్తామనీ, కార్యక్రమం బిల్డింగ్ వెనకాల ఉన్న వసారాలో చేసుకోవచ్చనీ చెప్పారు. అక్కడికి వెళ్లి చూశాడు అతను. వెనుక ఉన్న స్థలం లో అడ్డంగా రేకుల షెడ్డు లా ఉంది. ముందు భాగంలో ఒక కుళాయి. అక్కడ ఒకావిడ నీళ్లు పడుతోంటే, పక్కనే అంట గిన్నెలు ఒకఆమె తోముతోంది. అంతా గలీజు గా ఉంది. వసారా రెండు భాగాలుగా తడకలు తో విభజించి ఉంది. ఒక పక్కన ఒక పార్టీ శ్రాద్ధ కర్మ జరుగుతుంటే, ఇంకో పక్క ఇంకో పార్టీ వాళ్ళు కర్మ పూర్తి చేసిన తరువాత బ్రాహ్మలకి భోజనాలువడ్డిస్తున్నారు . మట్టి నేల. అంతా తడి తడి గా ఉంది. అక్కడే పీటలు వేసి భోజనం పెడుతున్నారు. ఒకమాటు అంతా చూసి వెనక్కి వచ్చేశాడు. ఏ సంగతీ రాత్రి వచ్చి చెప్పి డబ్బు కడతానని మళ్ళీ అఫీసుకి వెళ్లి పోయాడు. సాయియంత్రం ఇంటికివస్తూ అనుకున్నాడు. గ్గాయత్రి సదన్ కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయేమో వాకబు చేయాలి అనుకుంటూ. ఇంటికి వస్తూ అనుకున్నాడు. తాను అంతక్రితం రోజు రాత్రి అంత ముభావంగా ఉండి ఉండకూడదనిపించింది. వకుళ చిన్నప్పుడే తల్లి తండ్రులు ఆక్సిడెంట్ లో పోవడంతో, చిన్నప్పటి నుంచీ ఢిల్లీ లో వాళ్ళ చిన్నాన్న దగ్గర పెరిగింది. అందుచేత పితృ కార్యక్రమాల గురించి అంతగా తెలియక పోవచ్చు. ఈ సంగతి అప్పుడు తట్టక పోవడం, ఆ కొద్దీ పాటి కోపాన్నయినా అప్పుడు నిగ్రహించుకోక పోవడం పట్ల అతనకి తన మీద తనకే కోపం వేసింది. ఇంటికి వెళ్ళగానే అన్నీ వివరించి వకుళకి సర్ది చెప్పాలనుకున్నాడు ఇంటికి వెళ్లే టప్పటికి తలుపులు తీసే ఉన్నాయి.డ్రాయింగ్ రూమ్ లో ఇద్దరు బ్రాహ్మలు కూర్చుని ఉన్నారు. ఎవరో అర్థం కాలేదు. వాళ్ళని పలకరింపుగా నవ్వి లోపలి వెళ్ళాడు. ఇద్దరు పనివాళ్ళు ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. అతను బెడ్ రూమ్ లోకి ప్రవేశిస్తే వెనకే వకుళ వచ్చింది " మీరేం బయట చూడక్కర లేదు. రేపు మనింట్లోనే మీ నాన్నగారి ఆబ్దికం జరుపుతున్నాము. మీరు ముందు వెళ్లి అక్కడ కూర్చున్న బ్రాహ్మలతో మాట్లాడి వాళ్ళు ఏమేమి కావాలంటారో, అవి ఎక్కడ దొరుకుతాయో కనుక్కోండి. లేదా వాళ్ళే తెచ్చుకుంటామంటే డబ్బు ఇవ్వండి. తెల్లవారు జామునే వంటకి కూడా వాళ్ళ మనిషిని పంపుతామన్నారు వాళ్లు" అని గుక్క తిప్పుకోకుండా అతనికి అవకాశం ఇవ్వకుండా చెప్పేసింది " ఏమి జరిగింది ? ఇంతలో మనసు ఎలా మార్చుకున్నావు?" అన్నాడు నవ్వుతూ పెద్ద రిలీఫ్ ఫీలవుతూ " చెబుతాను.ముందు వాళ్లతో మాట్లాడి రండి" అని తాను వంటింట్లోకి వెళ్లి పోయింది."వాళ్ళని పంపించేయకండి. కాఫీ తాగి వెడతారు" అంది లోపలికి వెడుతూ రాజగోపాల్ హాలు లోకి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోగానే, వాళ్ళిద్దరిలో పెద్దాయన " తండ్రి గారి ఆబ్దికం అన్నారు. రేపు వచ్చి కార్యక్రమం నడుపుతాము. మీది కృష్ణ యజుర్వేదం అయితే నేను వస్తాను, అలా కాకుండా వేరే అయితే ఇంకొకరిని పంపుతాను" అన్నాడు " మాది కృష్ణ యజుర్వేదమే నండి. అగ్నిహోత్రం ఎక్కడ పెడతారో చూపిస్తే కావాల్సినవి తెప్పిస్తాను" అన్నాడు. వాళ్లిద్దరూ అన్నీ వివరంగా చెప్పి ఏమేమి కావాలో, ఎక్కడ దొరుకుతాయో అన్నీ చెప్పి రేపు వస్తామని చెప్పి వెళ్ళ బోతోంటే వకుళ కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చి తాను కూడా కూర్చుంది. వంట మనిషి తెల్లవారు ఝామునే వస్తుందనీ ఏమేమి సిద్ధంచేయాలో అన్నీ చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళగానే " ఇప్పుడు చెప్పు ఏమిటి? ఇంతలోనే ఇంత మార్పు? ఏమి జరిగింది ?" అన్నాడు వకుళ కేసి చూసి నవ్వుతూ " మీరు ఏదీ సరిగా చెప్పరు. నాకు అన్నీ పూర్తిగా వివరిస్తే బాగుండేది." నిష్టూరంగా అని, ఆ మధ్యాహ్నం ఏమి జరిగిందో చెప్పింది. ఆమె చెప్పిన వివరాల లోకి వెడితే - రాజగోపాల్ ఆఫీసు కి వెళ్లిన తరువాత మనసు బాగోక వాకింగ్ ట్రాక్ దగ్గర ఒక చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చుంది. ఎప్పుడయినా తోచనప్పుడు, అక్కడ కూర్చుని, ఏదయినా పుస్తకం చదవడం, లేదా సంగీతం వినడం ఆమెకి అలవాటే. ఇవాళ మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది. ఎందుకు రాజగోపాల్ కి కోపం వచ్చిందో ఆమెకి అంతు పట్టలేదు. ఆమె అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు నరసయ్య గారు కూడా వచ్చి కూర్చోడం కద్దు. ఈవేళ కూడా అయన కూర్చునే చోటికి వెడుతూ వకుళ ముఖం లోకి చూసి ఆగి పలకరించారు. ఆమె ముఖంలో ప్రస్ఫుట మవుతున్న విచారం చూసి ఏమిటి సంగతి అని నొక్కి నొక్కి అడిగితే ఆమె జరిగినదంతా చెప్పింది. ఆయన వకుళ పక్కన కూర్చుని అడిగారు " ఆబ్దికం అంటే ఏమిటనుకుంటున్నావమ్మా నువ్వు?" " అదేదో చనిపోయిన వాళ్ళ కి శాంతి కోసం చేసే శ్రాద్ధ కర్మ కదా? అందుకే కదా ఇళ్లల్లో చేయకుండా సముద్రం ఒడ్డున, చెరువు గట్ల వద్ద చేస్తున్నట్టు చూపిస్తారు సినిమాలలో" అంది. ఆమె జ్ఞానానికి పరిధిలో ఉన్న విషయాన్ని తెలుపుతూ. " ఓహో అదా నీ అభిప్రాయం. నువ్వు ఢిల్లీ లో పెరిగావు కదా? మీ చిన్నాయన అటువంటి కార్యక్రమం చేయడం ఎప్పుడూ చూడ లేదు కదా ? అందుకే నీకు తెలియదు.. నాకు ఒకటి చెప్పు. మీ అయన నిన్ను బాగా చూసుకుంటాడా ? మంచి వాడేనా? " అన్నారు నవ్వుతూ. "అదేమిటి ఆయన చాలా మంచి వారండి" అంది వకుళ జవాబుగా " మీ ఆయనకి వాళ్ళ నాన్న అంటే ఇష్టమేనా? " " అలా ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ నాన్నగారిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. తండ్రి అంటే చాల ప్రేమ ఆయనకి " అలాంటి వాళ్ళ నాన్నగారు ఒక రోజు వచ్చి " అమ్మా ఇవాళ నాకు భోజనం పెట్టు" అని అడిగితే అదేమయినా అశుభం అనుకుంటావా? ఆబ్దికం అంటే ఏమిటనుకుంటున్నావమ్మా. గతించిన వాళ్ళని ఒక రోజు ఇంటికి ఆహ్వానించి, అతిధి సత్కారాలు, ఉపచారాలు చేసి, చక్కటి భోజనం పెట్టడం సంప్రదాయం . తండ్రినే కాకుండా, పితామహుణ్ణి, ప్రపితామహుణ్ణి కూడా తలుచుకుని సత్కారం చేయడం జరుగుతుంది. వాళ్ళు భౌతికంగా రాక పోయినా వాళ్ళని ఇంకొకళ్ళలో చూసుకుని సత్కారం చేసి, వాళ్ళ ఆశీర్వాదం పొందే సంప్రదాయం ఆబ్దికం. పెద్ద వాళ్ళ పట్ల అతి శ్రద్ధగా చేసే కార్యక్రమం కాబట్టి "శ్రాద్ధం" అంటారు. వారిని ఇంట్లోకి ఆహ్వానించి చేసే కార్యక్రమం అది. అంతేకాని అదేదో చెరువు గట్టున, ఎక్కడో రేకుల షెడ్డు లో చేసే పని కాదమ్మా. కొత్త ఇంట్లో గృహ ప్రవేశం రోజున చేసినా తప్పులేదు" అని సుదీర్ఘం గా వివరించేటప్పటికీ వకుళ తాను ఎంత పొరపాటు చేసిందో అర్థ మయి, ఏర్పాట్లు చేయడానికి ఆయన సహాయం కోరింది. **** వకుళ వివరించింది అంతా విన్న తరువాత రాజగోపాల్ మనసులో అంతక్రితం ఉదయించిన కొత్త ఇల్లు అన్న చిన్న శంక కూడా పోయింది. " సారీ వకుళా. దాని ప్రత్యేకత నీకు తెలియకుండా ఉంటుందని నాకు తట్ట లేదు. గాయత్రీ సదన్ లో రేకుల షెడ్డు చూసి నా మనసు ఎంత క్షోభించిందో నీకు తెలియదు. స్వంత ఇల్లు ఉండగా ఇటివంటి చోటనా మా నాన్నకి అన్నం పెట్టేది? అనిపించింది" అన్నాడు కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ " ఇంకా దాని గురించి ఆలోచించకండి " అంటూ అతని చేతి మీద చెయ్యి వేసింది వకుళ తనకి వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ.

సమాప్తం

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ