ఆఫీస్ నించి వచ్చి, కాఫీ త్రాగు తున్న రాజారావుతో, భార్య రమ – "రాత్రి తొమ్మిదింటికి అబ్బాయి ఫోన్ చేస్తాడట. అప్పుడు కైపులో ఏదో చూపిస్తానంటున్నాడు."
" ‘ కైపు ’ కాదు, ‘ స్కైప్ ’. ‘కైపు’ అంటే మత్తు. ‘ స్కైప్ ’ అంటే వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నవారు కంప్యూటర్లో చూసుకుంటూ మాట్లాడుకొనే సదుపాయం. " అని రాజారావు భార్యని సరిదిద్దాడు.
రాత్రి తొమ్మిది దాటుతూండగా, అమెరికాలో ఉన్న కిషోర్ ఫోన్ చేసి, స్కైప్ ఓపెన్ చేయమని చెప్పాడు.
స్కైప్ ఓపెన్ చేస్తే ---
ఎదురుగా ఉన్న కొడుకు కిషోర్, కోడలు రాగిణి, మనవడు రాజేష్, మనవరాలు రంజన కనబడగానే -- ఇద్దరూ మహదానందపడిపోయారు.
కిషోర్ " మా వెనకాతల ఉన్న, ఇంట్లోకి వెళ్లే ముందర, ఈ బయటి ప్రదేశం చూడండి" అని -----విశాలమైన కాంపౌండ్, ఎత్తుగా ఉన్న ప్రహరీ గోడలు, బలిష్టంగా ఉన్న కాంపౌండ్ గేట్, ఆ కాంపౌండ్ లో ఉన్న రకరకాల కూరగాయల చెట్లు, అందమైన పువ్వుల చెట్లు, వాటిమధ్యలో ఉన్న పెద్ద ఊయల, చుట్టూరా జాగింగ్ ట్రాక్, ఆరేడు రకాల పళ్ళ చెట్లు, వెనకవేపున్న ఈత కొలను, చెరో మూలా ఉన్న సర్వెంట్ క్వార్టర్స్, కాంపౌండ్ అంతా నిండిన ఎండ–
తాపీగా చూపెడుతుంటే ---
రాజేష్ "చూడు తాతా, ఈ కాలిఫ్లవర్ ఎంత పెద్దదిగా ఉందో " అంటూంటే –
రంజన "చూడు మామ్మా, ఈ రోజ్ ఫ్లవర్ ఎంత బాగుందో " అని, --
----వాళ్ళ ఆనందాన్ని తాతామామ్మలతో పంచుకున్నారు.
"సరే పదండి. తాతామామ్మా లోపల చూస్తారు" అని కిషోర్, కాంపౌండ్లో ఉన్న కారు చూపించి, "ఈ కారు, రాగిణి కోసం తీసుకున్నాను. పదిహేను రోజులలో నేను కూడా పాత కారు అమ్మేసి, క్రొత్తది కొనుక్కుంటాను.” అని లోపల చూపెట్టడం ఆరంభించేడు.
-2-
లోపల ---
--బాగా విశాలమైన హాలు, ఒక పెద్ద ఊయల, విశాలమైన నాలుగు పడకగదులు, వాటికి ఉన్న అటాచెడ్ బాత్రూమ్స్, వాటిలో ఉన్న బాత్ టబ్స్, విశాలమైన వంటగది, భోజనాలగది, వేరుగా పూజగది, ఇల్లంతా నిండిన వెలుతురు --- చూపించి,
" ఇల్లెలా ఉంది. బాగుందా." అని అడిగిన కిషోర్ మాటలతో –
ఈ లోకంలోకి వచ్చిన రాజారావు "బాగుందా ఏమిట్రా. చాలా బాగుంటేను."
అప్పుడే తేరుకున్న రమ: "దిష్టి తగిలేటట్టు ఉన్న ఇల్లు ఎవరిది, నాన్నలూ" అని అడిగింది.
చిరునవ్వుతో, రాగిణి : “ఎవరిదో అయితే మీకెందుకు చూపడం అత్తయ్యా, మీ అబ్బాయి
పదిరోజుల క్రిందట కొన్నారు. అందుకే, మీకు చూపిస్తున్నారు."
ఏదో అనబోతున్న రమని ఆపి, రాజారావు "చాలా బాగుందమ్మా” అని రాగిణికి చెప్పి –
“ఇంట్లో దిగేరా, నాన్నలూ" అని అడిగాడు.
“ మీరు ముహూర్తం నిర్ణయించి చెప్పకుండానా ?” అని నవ్వి , “ మాకు ఇక్కడి సిటిజెన్షిప్ వచ్చేస్తుందని తెలియగానే, ఇండియా వెళ్ళిపోతున్న తమిళ కుటుంబం ఏడాది క్రిందటే కట్టుకున్న ఈ ఇల్లు అమ్మేస్తుంటే, వాస్తు తెలిసిన ఒకతనికి చూపించే, తీసుకున్నాను. గృహప్రవేశానికి ముహూర్తం చూసి నాకు ముందుగా తెలియచేస్తే, మీరిద్దరూ రావడానికి టిక్కెట్లు పంపిస్తాను. మీరు వీసా చేసుకోవాలికదా.”
"అలాగే నాన్నలూ. సిద్ధాంతి గారిని కనుక్కొని మెయిల్ చేస్తాను. రాగిణి నాన్నగారు వాళ్ళకి ఇల్లు చూపించేరా”
“ ‘ముందు మీరు చూడాలి’ అంది రాగిణి. ఇప్పుడు ఇంటీరియర్ డెకొరేషన్ గురించి వెళ్ళాలి. వాళ్ళకి తరువాత చూపిస్తాము. ఇంక ఉంటాము.” అని,
---కిషోర్ స్కైప్ ఆపేసేడు.
"అదేమిటండీ, నన్ను మాట్లాడనివ్వకుండా మధ్యలో ఆపేరెందుకు?"
-3-
"నాకు తెలుసు నువ్వేమిటి మాట్లాడబోయేదీ."
"నేను ఏమిటి మాట్లాడాలనుకున్నానో, మీకు ఏమి తెలుసు"
"ఆ ఇల్లు ఖరీదెంత, అప్పు చేసావా, చేస్తే ఎంత అప్పు చేసేవు. చేయకపోతే అంత డబ్బెక్కడ తెచ్చావు. మీ ఇద్దరికీ ఒక కారు సరిపోదా, రెండు కార్లు ఎందుకు -- ఇవేగా నువ్వు అడగాలనుకున్నవి"
"అవును.”
“ఆ వివరాలు వాడు చెప్తే వినాలి. మనం అడగకూడదు. ఇద్దరూ ఉద్యోగం చేస్తూ, ఎవరికీ వారే నెలకి చెరో ఆరంకెల జీతం తెచ్చుకుంటున్న వారిని, ఆ వివరాలడిగితే, వాళ్ళ మనసులు - ముఖ్యంగా కోడలి మనసు - నొచ్చుకోవచ్చు.”
“సరేగానీ, సిటిజెన్షిప్ వచ్చేస్తుంది అంటాడేమిటండీ. అంటే, మరి ఇక్కడికి రారా పిల్లలు." అన్న రమ గొంతుకలో దిగులు వినిపిస్తుండడంతో –
“అక్కడి సిటిజెన్షిప్ సంపాదించుకుంటున్నారు, ఇల్లు కూడా కొనుక్కుంటున్నారంటే -- పిల్లలు అక్కడ ఉండడానికే నిర్ణయించుకున్నారని అర్ధం కదా. ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి. పిల్లలు కోరుకున్న చదువులు చదివించడం, అందుకు కావలసిన వనరుల్ని సమకూర్చడం, ఓ ఇంటి వాళ్ళని చేయడం, వాళ్ళు ఏ ఉద్యోగం, ఎక్కడ చేయాలనుకుంటే -- సరే అనడం వరకే -- మన తల్లితండ్రుల కర్తవ్యం. వాళ్ళు అలా హాయిగా ఉంటే, మనకి అంతకంటే కావలిసినదేముంది. మనం చేసిన దానికి, పిల్లల దగ్గరనించి -- అంతకు మించి ఆశించకూడదు. "
" మనకి ఉన్నదే ఒక్కడు. వాడు, కోడలు, మనవళ్లతో కలసి ఉండే అదృష్టం లేదా మనకి. ఒక ఏడాదిలో మీరు రిటైర్ అయిపోతే, మనిద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండవలిసిందేనా. పెద్దవాళ్లమైపోయిన మనల్ని చూడవలసిన కర్తవ్యం పిల్లాడిది కాదా. "
"ఎందుకు కాదు. వాడి కర్తవ్య పాలనకై, మనల్ని వాడి దగ్గరకి రమ్మంటే, వెళ్లిపోవడానికి మనం రెడీగా ఉన్నామా “
"ఊరు కానీ ఊరికి, అందునా, దేశం కానీ దేశంకి, మనం ఎలా వెళ్లగలమండీ"
"అంత మంచి ఉద్యోగాలు వదలి, వాళ్ళు కూడా మన దగ్గరకి ఎలా వస్తారు చెప్పు."
"మరి ఈ సమస్యకి పరిష్కారమేంటి "
-4-
“ఒక్కసారి గతం గుర్తు చేసుకో. అబ్బాయి చదువు బాగోగులకై, మనం స్వంత ఊరైన ‘ఆత్రేయపురం’ వదలి ఈ ‘విశాఖపట్నం’ వచ్చినప్పుడు, మనతో కలసి ఉండడానికి మా అమ్మనాన్న వచ్చేరా, లేదే. పోనీ వాళ్ళకోసం మనం ఆత్రేయపురంలో ఉండిపోయామా, లేదే. ఇప్పుడు మనకి, మన అబ్బాయికి అదే పరిస్థితి. ‘చరిత్ర’ ఇలా తిరగ వ్రాయబడుతూనే ఉంటుంది. అది లోకసహజం. మనం కృంగిపోకూడదు. ఉన్నంతలోనే హాయిగా ఉండడం అలవర్చుకుంటే, మనసులు శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి.”
"నన్ను మీరు, మిమ్మల్ని నేను చూసుకుంటూ, బిక్కుబిక్కుమంటూ ఉండడంలో, ఆనందం ఏముంది."
" అందుకే. రిటైర్ అయిపోయిన తరువాత, సమాజానికి మేలు చేసే మంచి పనులు చేస్తూ, అందులోనే మనం ఆనందం వెతుక్కోవాలి."
" అంటే"
“మా ఆఫీస్ లో రెండునెలలు ముందు వెనకగా రిటైరయ్యే పదిమంది, ఈ విషయాలే పదిహేనురోజులై చర్చించుకుంటున్నాము. అందరి పిల్లలు విదేశాల్లో ఉన్నవారే కాబట్టి, వాళ్ళ దగ్గరకి వెళ్లి ఉండడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పదిరోజుల్లో, ఏమేమి ‘మంచి పనులు’ చేయగలమో ఒక నిర్ణయానికి వస్తాం. అలా నిర్ణయించి చేసే పనులలో, మీ ఆడవాళ్ళని కూడా కలుపుకొని చేసేవి ముఖ్యంగా ఉండాలన్నదే మా అందరి ఆలోచన. మీ ఆడవాళ్ళకి ఈ రోజు వారీ పనులనించి ఎంతమేర రిటైర్మెంట్ ఏర్పాటు చేయగలమా అన్నది కూడా ఆలోచిస్తున్నాము.
----కాబట్టి, వచ్చే రోజులన్నీ మంచివే అన్న భరోసాతో, ఇప్పటికి హాయిగా పడుకో.
-----------రేపటినించి మనం వెళ్లే అమెరికా ప్రయాణం హడావిడిలో ఉందువుగాని.”
***************