వేసవి యెండలు మండిపోతున్నాయి .బస్ కోసం షెల్టర్ కూడా లేని అక్కడ చెమటలు క్రక్కుకుంటూ నిలబడ్డారు ! చిన్న బిడ్డలతో కొంతమంది ఆడవాళ్లు తపన తపన గా వున్నారు .ఇంతలో బస్ అరుచుకుంటూ వచ్చి ఆగింది .అందరూ తోసుకుంటూ తొక్కుకుంటూ ఎక్కేసారు .చంక లోని చిన్నబిడ్డలు నలిగిపోయి యేడ్చేసారు .సీటు దొరికిన వాళ్లు వూపిరి పీల్చుకున్నారు .దొరకని వాళ్లు ముఖ్యం గా ఆడవాళ్లు బిడ్డ చంకలో ,యింకో చేతిలో బరువు తో సతమతమవుతున్నారు .రామం కిటికీ ప్రక్క కూర్చుని బయటకు చూస్తున్నాడు .అతని ప్రక్కన మధ్య వయస్సు వ్యక్తి కూర్చున్నాడు .అయన ప్రక్కన నెలల బిడ్డ చంకలో ,మూడేళ్ల పాప ప్రక్కన పెట్టుకుని ఒక సంచీ తో పల్లెటూరి యువతి నించుంది .
బస్ రణగొణ ధ్వని చేస్తూ బయల్దేరింది .అందరూ స్రద్దుకున్నారు .ఇంతలో ఒక పెద్దావిడ ,రామం ప్రక్క సీటు లో కూర్చున్న వ్యక్తి ని చూస్తూ
“ఏమయ్యా ,నువ్వు లేచి చంటి బిడ్డ తల్లి కి సీటివ్వచ్చు కదా !”అంటూ కొంచెం గట్టిగా హెచ్చరించింది .
ఆవిడ మాటలకు అందరూ ఒకసారి అటు తిరిగి చూసారు కానీ మౌనం గా వున్నారు .ఆ వ్యక్తి కూడా తనల్ని కానట్టు ఎటో చూస్తున్నాడు .
“చెప్పినా అర్ధం కానట్టు వులుకు ,పలుకు లేకుండా ఎట్టా కూసున్నాడో “అంటూ ఆ పెద్దావిడ గొణుక్కుంది .అక్కడ కూర్చున్న ఆడవాళ్లందరి ఒళ్లల్లో యేదో ఒక బరువుంది . ఆవిడ మాటలను ఆడవాళ్ళందరూ బలపరిచారు .మగవాళ్లు మాత్రం ఏం మాట్లాడలేదు .ఎవరి వైపు మాట్లాడినా తంటా అని యెవరికి వాళ్లే దిక్కులు చూస్తున్నారు .బస్ స్టాప్ లు దాటుతున్నది ,జనాలు యెక్కుతున్నారు ,ఆ పల్లెపడుచు రద్దీ లో నలిగిపోతున్నది .పెద్దావిడ మాత్రం కూర్చున్న ఆ వ్యక్తిని కొరకొరా చూస్తూనే వుంది .అందరికీ అదొక కాలక్షేపం కబురయ్యింది .అంతేకాని యెవ్వరూ లేచి సీటిద్దామనుకోవడం లేదు .
మళ్లీ పెద్దావిడ ఆ వ్యక్తి భుజం తడుతూ ఒక అరుపు అరిచింది .మళ్లీ బస్ లో కలకలం మొదలయ్యింది .అంతవరకూ ఓపిక పట్టిన కండక్టర్ వాళ్ల సీట్ల దగ్గరకు దూసుకొచ్చాడు .
“ఏమయ్యా !నీకు చెముడా ,వినిపించుకోవా !లేచి ఆ యమ్మ కు సీటివ్వచ్చుకదా !”అరిచాడు కండక్టర్ !
ఆ వ్యక్తి కోపం గా “నేను డబ్బిచ్చి టికెట్ కొనుక్కున్నాను .నా స్టాప్ వచ్చేదాకా లేవను “కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పాడు .
కండక్టర్ కి ఒళ్లుమండింది ! ఆయన్ను చేత్తో లాగి ముందుకు తోసాడు .అతను ముందుకెళ్లి కూర్చున్న వాళ్ల మీద పడ్డాడు .వాళ్లు విసుక్కుంటూ యింకా ముందుకు తోసారు .తోటిప్రయాణికులు యిదంతా చూస్తూ నవ్వుతున్నారు .ఈ గోల లో ఆ పల్లెపడుచు ఖాళీ అయిన సీట్లో కూర్చుంది .ఇదంతా చూస్తూ అవమానం ఫీల్ అయిన ఆ వ్యక్తి కండక్టర్ మీద పెద్దగా అరుస్తున్నాడు ,రద్దీలో వూగిపోతున్నాడు .తోటి ప్రయాణికులు ఆపినా ఆగడం లేదు .ఆ పెద్దావిడ ‘రోగం కుదిరింది ‘అనుకుంటూ నవ్వుకుంది .
రామం అంతా చూస్తున్నాడు .తాను లేచి సీటివ్వాలంటే నిస్సహాయుడు ,మోకాలి ఆపరేషన్ యింకా నొప్పిగా వుంది ! బయటకు కనిపించకుండా జాగ్రత్తగా కూర్చున్నాడు .తమాషా యేమిటంటే ప్రయాణికులందరూ వాళ్ల సీటు యివ్వరు కానీ ప్రక్కవాడిని లేచి సీటివ్వమంటున్నారు .
కండక్టర్ యెండ మంటలకు మహా చిరాగ్గా వున్నాడు .అందుకు తోడు యీ గోల !కోపం తో వూగిపోయాడు .
“ఇంకా అరిచావంటే క్రిందకు దింపేస్తాను యేమనుకున్నావో “అంటూ ఒక పెద్ద అరుపు అరిచాడు ,ప్రయాణికులందరూ కిసుక్కున నవ్వారు .ఆ వ్యక్తి మొహం కందగడ్డయ్యింది .
బస్ మరో స్టాప్ దాటుతున్నది .అంతలో ఒకతను లేచి “అయ్యో నేను దిగాల్సిన స్టాప్ యిదే అంటూ కంగారుగా లేచాడు .
“ఏమయ్యా నిద్రపోతున్నావా “అంటూ కోపం తో వూగిపోతూ కండక్టర్ నిప్పులు చెరిగాడు .డ్రైవర్ కి చెప్పి ఆపించాడు బస్ !
“మాటలు తిన్నగా మాట్లాడు ,నీ చిరాకంతా నా మీద చూపించకు !”అతను దిగబోతున్నాడు .
“ఏం చేస్తావయ్యా “అంటూ కండక్టర్ కోపం గా అతన్ని దిగనివ్వకుండా చెయ్యి అడ్డం పెట్టాడు .యెదెక్కడి గొడవరా బాబూ అనుకుంటూ ప్రయాణికులందరూ కండక్టర్ చెయ్యి ప్రక్కకు లాగారు .అతను దిగిపోయాడు .
బస్ కదులుతుంటే ఒక గృహిణి పిల్ల తో హడావిడి గా బస్ యెక్కింది .
“కూరల బజారు కి టికెట్ కావాలి “అంటూ బొడ్లో సంచీ విప్పి డబ్బివ్వబోయింది .
“అమ్మా బోర్డు చూసుకుని యెక్కాలి ,బస్ అటు పోదు “అంటూ కండక్టర్ మళ్లీ బస్ ఆపాడు .ఆవిడ దిగింది .
మళ్లీ అందరి ప్రవర్తనలకు సాక్షి గా నిలబడుతూ మళ్లీ రోడ్డెక్కింది .
ఒక యువకుడి దగ్గరకు వచ్చి కండక్టర్ డబ్బుల కోసం చెయ్యి చాపాడు .ఆ యువకుడు నిర్ల్యక్షం గా “ఏం కావాలి “అంటూ కండక్టర్ ని చూసాడు .అసలే తిక్కలో వున్న కండక్టర్ “నేను అడుక్కు తినేవాణ్ణి కాదు ,మీరు టికెట్ తీసుకోలేదుసాధ్యమైనంత వరకు తను గళం కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు .
“ఓహో “అంటూ ఆ యువకుడు డబ్బులు కండక్టర్ చేతిలో పెట్టి ఆకాశం వంక చూస్తున్నాడు .
“ఎక్కడికి ?”కండక్టర్ అసహనం తో ప్రశ్నించాడు .
“నాకు స్టాప్ పేరు తెలియదు ,కానీ ‘మల్లిక ‘థియేటర్ ప్రక్క స్టాప్ “అన్నాడు ఆ యువకుడు .
కండక్టర్ గొణుక్కుంటూ టికెట్ యిచ్చాడు .తల కొట్టుకుంటూ కండక్టర్ తన సీట్లో కూర్చున్నాడు .అరిచే ఓపిక కూడా లేదు .ఆఖరి స్టాప్ వచ్చింది .అందరూ దిగుతున్నారు .అవమానపడ్డ వ్యక్తి కండక్టర్ ని తీక్షణం గా చూస్తూ “ఏమయ్యా నన్నయితే అరిచావు ,మరి నా యెదురు సీటు లో ఆయనను యెందుకు లెమ్మని అడగలేదు ? నేను మురికి పంచె కట్టుకున్నాను ,అయన నీటుగా యిస్త్రి బట్టలు వేసుకున్నాడు ,అవునా !!”అంటూ దిగిపోయాడు ! కండక్టర్ నిరుత్తరుడయ్యాడు !రామం ఆఖర్లో దిగుతూ “కండక్టర్ గారూ ! సంస్కారాన్ని ఉద్యోగ ధర్మం గా భావించండి ! అంటూ దిగిపోయాడు .