అనగనగా ఒక కుందేలు. ఆ కుందేలు చాలా అందంగా ఉండేది. అందుకే ఆ అడవిలోని జీవులన్నీ కుందేలును ముద్దు చేసేవి. ఒకరోజు ఆ కుందేలు ఒక పులి కంట పడింది. ఆ పులి చాలా క్రూర స్వభావం కలది. అడవి జీవులకు ఆ పులి అంటే చాలా భయం. కుందేలు అందానికి పెద్దపులి ఆశ్చర్యపోయింది. కుందేలుతో స్నేహం చేసింది. రానురాను పులికి కుందేలుకు చాలా చనువు ఏర్పడింది. పెద్దపులి కుందేలును తన వీపు మీద ఎక్కించుకొని అడవి అంతా తిరగసాగింది. దుష్టులతో సహవాసం మంచిది కాదని అది ఏనాటికైనా ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుందని హెచ్చరించింది కుందేలు ప్రాణ నేస్తం జింక. "ఓ అలాగా! ఐతే నీతో సహవాసం మానేస్తానులే." అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది కుందేలు. రానురాను కుందేలులో పొగరు ఎక్కువైంది. ఇతర జంతువులను లెక్క చేయడం లేదు. ఇతర జంతువులు ఉన్నప్పుడు పులితో వెటకారంగా మాట్లాడసాగింది కుందేలు. పులిపై తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి కదా! పులి దానిని చాలా తేలికగా తీసుకుంటుంది. ఒకరోజు ఆ అడవికి రాజైన సింహం పుట్టినరోజు సందర్భంగా అన్ని జీవులనూ వేడుకలకు ఆహ్వానించింది. పెద్దపులి కుందేలును వీపుపై ఎక్కించుకొని తీసుకు వచ్చింది. కుందేలు తాను మహారాజులాగా ఊహించుకొని, పులిని తన సేవకునిగా ఇతర జంతువుల ముందు అనిపించడానికి కళ్ళు నెత్తికి ఎక్కి ప్రవర్తిస్తుంది. పులిని తన ఆజ్ఞతో అటూ ఇటూ తిప్పిస్తుంది. విన్యాసాలు చేయిస్తుంది. చెప్పినట్లు వినకపోతే తిట్టడం మొదలు పెట్టింది. పెద్దపులి "కుందేలు నేస్తమా! నీకు కమ్మని విందు దొరికే చోటుకు తీసుకు వెళ్ళినా?" అన్నది. "వెళ్ళవే తొందరగా తీసుకు వెళ్ళు." అన్నది. పెద్దపులి ఏ జీవీ లేని ప్రదేశానికి తీసుకెళ్ళి కుందేలును తన వీపుపై నుంచి పడవేసింది. "ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తిస్తున్న నీకు తగిన శాస్తి చేయాలి." అంది. కుందేలు భయంతో తనను క్షమించమని వేడుకుంది. పులి కుందేలుపై దాడి చేసి దాన్ని చంపి తినేసింది. అందుకే అహంకారం మంచిది కాదు.