పాండు2: వలలో చేప - రెండవ భాగం - కణ్ణన్

Valalo chepa-2

పొద్దుటినుంచీ పోర్టులోని ఫస్ట్ క్లాస్ లాంజిలో కూర్చుని బోరుకొడుతుంది నూర్జహానుకు. అక్కడి రెస్టారెంట్ భోజనం కూడా నచ్చలేదు, ఒక్క బిరియానీ తప్ప. అదీ చాలా కారం. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సగం బిరియానీ తిని ఐస్ నీళ్ళు తాగుతూ మధ్యాహ్నం షిప్ లోకి వచ్చేసింది. లాంజ్ లో రియాజ్ కూడా ఉన్నాడు. గాగుల్స్ పెట్టుకుని, జీన్స్, లైట్ బ్లూ కలర్ టీ షర్టులో, మూడు రోజుల గెడ్డంతో హాండ్ సమ్ గా ఉన్నాడు. ఒక్క క్షణమైతే అసలు క్లింట్ ఈస్ట్ వుడ్ ను చూసినట్లనిపించింది. నూర్జహానుకు నవ్వొచ్చింది. తన కళ్ళకు రియాజ్ ఎప్పుడూ క్లింట్ లాగే కనిపిస్తాడు. తనను చూసి కూడా గుర్తు పట్టనట్టుగా దూరంగా కూర్చుని న్యూస్ పేపరు చదువుతూ కూర్చున్నాడు. థాంక్ గాడ్, ఇక్కడ ఎవ్వరూ తామిద్దరినీ గుర్తు పట్టలేదు. తను రైల్వే స్టేషను వెయిటింగ్ రూంలో తొడుక్కున్న బురఖాని పోర్టులోని రెస్ట్ రూంలో తీసేసింది. అసలే ఎండ. దానికి తోడు హై లెవల్ హ్యుమిడిటీ. చెమట కారుతుంది. తన డ్రస్ పైన బురఖా. అబ్బో, నరకం అనుభవించింది. ఈ ఎండలో, ఈ చెమటలో ఇంతమంది జనాలు ఎలా ఉంటున్నారో?

వైజాగ్ ఎయిర్ పోర్టు బయటకు వచ్చినప్పటి నుంచి షిప్ లోనీ తన ఎ.సి. క్యేబిన్ లోకి వచ్చేవరకూ తను ప్రశాంతంగా – మానసికంగా, శారీకరంగా కూడా, ఉండలేక పోయింది. గుండెలు దడ దడమంటూ కొట్టుకుంటున్నాయి. లాంజ్ తలుపులు తెరుచుకున్న ప్రతిసారీ తండ్రి వస్తున్నట్లు ఊహించుకునేది. కేబిన్ లోకి రాగానే ప్రొద్దుటినుంచి అనుభవిస్తున్న టెన్షనులో సగం రిలీఫ్ అయింది. షిప్ బయలుదేరగానే పూర్తిగా ఉపశమనం పొందింది. ఇక నాన్న తనను కనిపెట్టలేరు. తనను పోర్టులో, షిప్ ఎక్కేటప్పుడూ ఎవ్వరూ గుర్తు పట్టలేదు. అయినా ఓవర్ సైజు గాగుల్స్, తలపైన స్కార్ఫ్ – తనని గుర్తు పట్టటం చాలా కష్టం. ఒకవేళ ఎవరైనా రియాజును గుర్తు పట్టినా ఏమీ ఫరవాలేదు. తాను కొత్త సినిమా లోని కేరెక్టరు మెరైన్ ఇంజనీరని, అందుకోసం తయారవడానికి ఇలా జర్నీ చేస్తున్నాడని చెబుతాడు. “నిజంగా రియాజ్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ గై. ఎ జీనియస్.”

బయట ఎలా ఉన్నా కేబినులోపల మాత్రం చల్లగా ఉంది. తన ట్రాలీని ఒక పక్క ఉంచి ఆహ్వానిస్తున్న మెత్తటి పరుపుపై దూకింది. కళ్ళు మూసుకుంది. వెంటనే నాన్న గుర్తుకు వచ్చారు. భయంతో చటుక్కున కళ్ళు తెరిచింది. తను నాన్నకు తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళడం ఇదే మొదటిసారి. ఈ పాటికి – ఈ పాటికి ఏమిటి, ప్రొద్దున్నే ఇంట్లో తాను పారిపోయిన విషయం తెలిసిపోయి ఉంటుంది. అమ్మ ఏడుస్తూ తనను తిడుతూ ఉంటుంది. తనతోబాటుగా తనకు బాగా స్వేఛ్ఛనిచ్చి పెంచినందుకు నాన్ననూ తిడుతుంది. తమ్ముడైతే లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం అమ్మను ఓదారుస్తూ ఉంటాడు.

పాపం నాన్న. తను నమ్మకాన్ని వమ్ముచేసిందన్న బాధ. బయటకు తెలిస్తే పరవు పోతుంది. తను రియాజుతో కలిసి కాకపోయినా రియాజుకోసమే వచ్చి ఉంటుందవి గ్రహించి ఉంటారు. ఒకవేళ తమ నిఖా కాకముందే రియాజ్ నాన్నగారికి దొరికితే? అమ్మో, ఇంకేముంది. బ్రతికి ఉండగానే రియాజ్ చర్మం వలిపిస్తారు. తండ్రి ప్రేమ ఎంత హాయిగా ఉంటుందో ఆయన కోపం అంత భయంకరంగా ఉంటుంది. తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు లోకల్ ఎమ్.ఎల్.ఏ కొడుకు కామెంట్ చేశాడని నాన్నకు కంప్లైంట్ చేసింది. వారం తిరక్కముందే వాడికి యాక్సిడెంట్ జరిగింది. కుడికాలు చీలమండ పైవరకు తీసేశారు. తర్వాత వాడు స్కూలుకు వస్తే చూసింది. అందరూ వాడిని “క్యారే లంగ్డే” అని ఏడిపిస్తే జాలి వేసింది. కానీ, వాడికి అలా కావలసిందే. చాలా మంది అమ్మాయిలను ఏడిపించేవాడు. అబ్బాయిలను చాలా మందిని కొట్టేవాడు. కొంతమందికైతే వాడి దెబ్బలనుంచి కోలుకోవడానికి నెలలు పట్టేది. అంతకు అంతా అనుభవించాడు.

ఒకవేళ నాన్న రియాజుకు కూడా యాక్సిడెంట్ చేయిస్తాడు? అమ్మో, ఆ ఆలోచనే భయంకరంగా ఉంది. చీలమండల పైవరకూ కాలు తీయబడ్డ రియాజును ఊహించుకుంది. ఒక చేతిలో క్రచ్ పట్టుకుని మెల్లగా నడుస్తున్నాడు రియాజ్. ఒళ్లంతా జలదరించింది నూర్జహానుకు. జైపూర్ కాలు పెట్టుకోవచ్చు కదా, క్రచ్ వాడడం ఎందుకు? తన ఆలోచనపై తనకే కోపం వచ్చింది. జైపూర్ కాలు వాడడం అంటే అతని కాలు విరిగినట్లే కదై. తానూ ఒక అవిటివాడితో కాపురం చేయగలదా? ఆ ఊహకే ఆమె భయపడిపోయింది.

పాపం రియాజ్. తన భార్య అసహ్యంగా ఉంటుంది. కొంచెం కూడా డ్రెస్సింగ్ సెన్స్ లేదు. బఱ్ఱెకు గోతం చుట్టినట్టు ఉంటుంది. అసలు రియాజ్ ఆమెతో ఎలా కాపురం చేశాడో? ముగ్గురు పిల్లలు. బహుశా చీకట్లోనే కష్టపడి ఉంటాడు. ఆమెను అసలు ఎక్కడికీ తీసుకు వెళ్ళలేడు. అప్పుడెప్పుడో ఒక రిసెప్షనుకి తీసుకు వెళ్ళాడు. గబ్బిలంలా ఉంది. అసలు ఎవరితోనూ మాట్లాడటం రాదు. టిపికల్ కంట్రీ బ్రూట్. ఎప్పుడూ రియాజ్ మీదనే కళ్ళు. ఎవరెగరేసుకు పోతారా అని. అసలు అది ఎవరో ఆటో డ్రైవరును చేసుకోక రియాజును ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు?

నూర్జహానుకు సడెనుగా తనపైనే కోపం వచ్చింది. తాను మాత్రం ఏం చేస్తుంది? అసలే దుఃఖభరితమైన రియాజ్ జీవితంలో తాను అవిటి వాడనే కొత్త అధ్యాయాన్ని చేరుస్తున్నట్లు ఆలోచిస్తుంది. అలా ఏమీ కాదులే. ముందు కోప్పడ్డా నాన్న తన ప్రేమను గుర్తిస్తారు. అంతగా ఐతే తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించవచ్చు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోమంటే? నాన్న అలా అనరు. ఆయనకు తనంటే ప్రాణం. కానీ ఒకవేళ అంటే? ఏమో, అప్పుడు ఆలోచిద్దాం. తన నెగటివ్ ఆలోచనలపై తనకే కోపం వచ్చింది. అసలు పాజిటివ్ థింకింగ్ అనేదే లేదే తనకు.

లేచి కూర్చుని పోర్ట్ హోల్ నుంచి బయటకు చూసింది. ప్రశాంతమైన బంగాళాఖాతం. దూరంగా రెండు డాల్ఫినులు ఎగురుతున్నాయి. చీకటి పడబోతోంది. ఇక్కడ ముంబయిలోలాగా కాదు. అయిదు, అయిదున్నరకే చీకటి పడుతుంది. మళ్ళీ మంచం మీద వాలింది. రియాజుతో బాటు ఒకసారి స్విట్జర్లాండు వెళ్ళాలి. ఫాతిమాతో ఇన్ని సంవత్సరాలు నరకమనుభవించిన రియాజుకు తను భూమ్మీదే స్వర్గం చూపిస్తుంది. తన ఆలోచనలకు తానే నవ్వుకుంది. అయినా కాళ్ళు విరగ్గొట్టే విషయం ఆలోచించడంకన్నా హనీమూన్ గురించి ఆలోచించడం మంచిది కదా.

కేబిన్ లోంచి వెలుతురు పూర్తిగా మాయమైపోయింది. అంతలో ఎవరో కెబిన్ తలుపు కొట్టారు. ఎవరై ఉంటారు? రియాజ్ హోటలుకు వెళ్లే వరకు మాట్లాడకూడదని చెప్పాడే. మరెందుకు వచ్చినట్లు? విరహతాపమా? తన రొమాంటిక్ తలపులకు తానే సిగ్గుపడింది. పోనీ ఇంకెవరైనా అయ్యుంటారా? తానిక్కడ ఉన్నట్లు ఎవరికి తెలుసు? ఒకవేళ షిప్ స్టాఫ్ అయ్యుంటారా? అయినా వాళ్ళకు తనతో ఏం పని? ఫస్ట్ క్లాస్ కేబినులోని ప్రయాణీకుల ఏకాంతత, ప్రశాంతతలకు వాళ్ళు భంగం కలిగించరాదు కదా? అసలు తను తలుపుకు గొళ్ళెం వేసిందా? తలుపు తెరిచే ఉండాలి కదా?

తలుపువైపు తలతిప్పి “ప్లీజ్ కమిన్” అన్నది.

స్టీవార్డ్ ఒకతను మెల్లగా తలుపు లోనికి తెరిచి అడుగు పెట్టాడు. ఇంకా లైటు ఆన్ చేయలేదని గ్రహించి, తలుపు పక్కనున్న స్విచ్ ఆన్ చేశాడు. చప్పున లేచి కూర్చుంది నూర్జహాన్. అతనికి ముఖం కనిపించకుండా ఉండడం కోసమన్నట్లు కొంచెం తల పక్కకు తిప్పంది.

కాఫీ మేడమ్” ట్రేలో కాఫీ పాట్, షుగర్ క్యూబ్స్, స్పూన్, విడిగా గ్లాసులో పాలు, ఒక నాప్కిన్ ఉన్నాయి. జాగ్రత్తగా మధ్యలో ఉన్న సెంటర్ టేబులుపై పెట్టాడు. తలుపు దగ్గరకు వెళ్ళి ఆగాడు “మీరు డిన్నర్ హాలులో తీసుకుంటారా? లేక ఇక్కడికి తీసుకు రానా?”

ఈ కేబినులో ఇంకా రెండు రోజులు ఉండాలన్న ఆలోచనే విసుగెత్తిస్తుంది. “నేనే వస్తాను” జవాబిచ్చింది నూర్జహాన్.

మీకు సీ సిక్నెస్ ఫీల్ అయితే చెప్పండి. డాక్టరును పంపిస్తాను. ఏమాత్రం అన్ కంఫర్టబులుగా ఉన్నా చెప్పండి” కెప్టెన్ చెప్పమన్నవన్నీ చెప్పేశాడు అతను.

ప్రస్తుతానికి బాగానే ఉంది. థాంక్యూ” మర్యాదగా జవాబిచ్చింది నూర్జహాన్. కాఫీ కలుపుకుని తాగుతూ టీవీ ఆన్ చేసింది. ఫోన్ ఉండి కూడా అత్యవసర పరిస్థితిలో తప్ప తను ఫోన్ చేయకూడదు. రియాజ్ అసలు ఫోన్ తీసుకురావద్దన్నాడు. పొరపాటున ఫోన్ స్విచ్ ఆన్ చేసినా లొకేషన్ ట్రాక్ చేయగలరు పోలీసులు. పోలీసుల కళ్ళు కప్పి ఇలా ప్రయాణించడం ఆమెకు ఒక సాహసకార్యంలా ఉంది. తనదే కాదు, రియాజ్, రియాజ్ భార్యాపిల్లలందరూ గమనించబడుతున్నారన్న సంగతి తెలియక, తన తెలివితేటలకు తానే మురిసిపోతూ కాఫీ తాగుతూంది.

* * *

తెల్లవారుఝాము నాలుగున్నరకే తూర్పు దిశలో చీకటి దుప్పటికి రంధ్రాలు పడసాగాయి. అదే సమయానికి అలలపై ఊగుతున్న నౌక నుంచి లంగరు మెల్లగా జారుతూంది. డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఒక్కొక్కళ్ళుగా పాసింజర్లను నిద్ర లేపుతున్నారు. ముందు బంక్ క్లాసులోని ప్రయాణీకులను, తరువాత సెకండ్ క్లాస్, ఆ తరువాత ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులను నిద్రలేపుతారు.

కానీ కెప్టెన్ ఆదేశాల మేరకు బంక్ ప్యాసింజర్లతోబాటుగా రియాజును నిద్ర లేపారు. త్వరత్వరగా డ్రస్ మార్చుకుని బయటకు వచ్చాడు రియాజ్. అతనికి బయటికి వచ్చేటప్పుడు భార్య, పిల్లలు కనబడలేదు. అంతే కాదు నూర్జహాన్ కూడా కనబడలేదు. కానీ ఏమని అడగగలడు? ఎవరిని అడగగలడు? నోరు మూసుకుని నడిచాడు. గ్యాంగ్ ప్యాంక్ దాటుతుంటే అతనికి అర్థమయింది. తనతో పాటుగా ఫస్ట్ క్లాసులో ప్రయాణించిన వారెవ్వరూ బయటకు రాలేదు. తన వారందరి నుంచీ తాను వేరుచేయబడ్డానని అర్ధమైంది. అనిర్వచనీయమైన భయం వేసింది. కాళ్ళు, చేతులు నిస్సత్తువగా అయిపోయాయి. మోకాళ్ళలో వణుకు మొదలైంది. అలాగే నడుచుకుంటూ ట్రాలీని తోసుకుంటూ బయటికి వచ్చాడు.

పోర్టునుంచి బయటకు వచ్చేముందు ఒకచోట కస్టమ్స్ అధికారులు కాబోలు, బయటకు పోతున్న ప్రయాణీకులను తనిఖీ చేస్తున్నారు. అందరినీ ఆపడం లేదు. పది, పదిహేను మందిలో ఒకరిని పక్కకు తీసుకెళుతున్నారు. ఈ తనిఖీ కేవలం తనకోసమేనని రియాజుకు అనిపించింది. అతను అనుకున్నట్లే అతనిని పక్కకు పిలిచారు. ఇద్దరు గార్డ్స్ వచ్చారు. ఒకతను రియాజ్ ట్రాలీ తెరచి ప్రతి చొక్కా, పాంటు చూపించి “ఇది నీదేనా?” అని అడుగుతాన్నాడు. ఇంకొకతను రియాజ్ ఒంటిమీద చెక్ చేస్తున్నాడు. రియాజ్ ట్రాలీలోని సెల్ ఫోన్ తనదేనని చెప్పేటంతలో రెండవ గార్డ్ ప్యాంట్ జేబులోంచి చేయి తీశాడు.

ఏమిటిది?”. అతని చేతిలో ఏదో చిన్న ఉప్పు ప్యాకెట్ ఉంది.

రియాజ్ మాట్లాడేలోపే అతను వెనక్కి తిరిగి “సాబ్. ఇన్ కే పాస్ కుఛ్ మిలా హై” అంటూ ప్యాకెట్ తీసుకుని అక్కడినుంచి తన అధికారి వద్దకన్నట్లు ఆ చిన్న గది నుంచి వెళ్ళిపోయాడు. ట్రాలీ చెక్ చేస్తున్న గార్డ్ రియాజ్ వైపు దొంగను చూసినట్లు చూశాడు.

నాకేం తెలీదు. అది నాది కాదు”. రియాజ్ బయటకు వెళ్ళిన గార్డుకు వినిపించేలా అరిచాడు.

ఏయ్. చిల్లావ్ మత్” కర్కశంగా ఆదేశించాడు పక్కనే ఉన్న గార్డు. అతనిని అక్కడే అతని సామానుతో వదిలేసి అతను కూడా బయటకు వెళ్ళాడు. ఏం చేయాలో తెలియక అక్కడున్న స్టూల్ మీద కూర్చున్నాడు రియాజ్.

* * *

రియాజ్ బయటకు వెళ్ళిన పది నిముషాలకు అతని భార్య ఫాతిమా కేబిన్ తలుపు తట్టబడింది. మెల్లగా లేచి పిల్లలను లేపి, సామానులు సర్దుకుని మెల్లగా బయటికి వచ్చింది. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. చల్లగాలికి వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ తాను బయటకు వచ్చేటప్పుడు భర్త కనబడకపోవడమనేది ఆమెకు అర్థం కాలేదు. ఒకవేళ అప్పుడే నూర్జహానుతో హోటలుకు వెళ్ళి ఉంటాడా? ఆమెకు కోపం వచ్చింది. ముక్కుపుటాలెగరేస్తూ బయటకు వచ్చింది. టాక్సీ తీసుకుని ఐ.టి.సి. హోటలుకెళ్ళింది. ముందే అందరికీ రెండు రోజులకు రూములు రిజర్వు చేయబడి ఉన్నాయి. కాకపోతే రియాజ్, నూర్జహానులకు కొంచెం ప్రైవసీ ఎక్కువగా ఉండే రిసార్టులో. ఎటూ ఇక్కడికి వచ్చింది కాబట్టి పిల్లలతో కలిసి అండమానులు ఎంజాయ్ చేయడానికి ఫాతిమా తయారైంది. రాత్రి తొమ్మిది గంటలకు రియాజ్ రెస్టారెంటులో కలుస్తాడు. అంతవరకూ తాను ఫ్రీ. రూములోకి వెళ్ళగానే రూమ్ సర్వీసుకు ఫోన్ చేసి తనకు టీ, పిల్లలకు పాలు ఆర్డర్ చేసింది.

* * *

నూర్జహాన్ నిద్ర లేచేటప్పటికి అందరు ప్రయాణీకులూ వెళ్లిపోయారు. ఎవరో తలుపు కొట్టగానే మెలకువ వచ్చింది. ఒళ్ళు విరుచుకుని మెల్లగా బెడ్ దిగి తలుపు తీసింది. తలుపు కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. మళ్ళీ తలుపేసి డ్రస్ మార్చుకుని, ట్రాలీ ప్యాక్ చేసి మెల్లగా బయలుదేరింది. ఈరోజు తన పెళ్ళి. తలుచుకుంటేనే సిగ్గేసింది. కానీ అమ్మా, నాన్న లేనందుకు దిగులుగా ఉంది. ఇదే ముంబయిలో అయితే, తన పెళ్ళి ఒక పండుగలా జరిగేది. కొన్ని రోజుల తరువాత నాన్నను ఒప్పించి గ్రాండ్ రిసెప్షన్ అయినా ఇప్పించాలి. లేకుంటే తన ఫ్రెండ్స్ తనను భయంకరంగా గేలి చేస్తారు.

పెళ్ళి నడక నడుస్తూ ముందు నౌకనుంచి, తరువాత పోర్టు నుంచి బయటకు వచ్చి టాక్సీ ఎక్కింది. తన టాక్సీ వెనకాలే ఇంకో కారు రావడం తను చూడలేదు. షిప్ కెప్టెనే స్వయంగా ఆ కారులో వస్తున్నాడు. రిసార్టులో సూట్ నూర్జహానుకు బాగా నచ్చింది. కింగ్ సైజ్ బెడ్. బయట కొబ్బరితోట, ఇంకొంచెం దూరంలో పగడాల బీచ్. పాల నురగల్లాటి అలలతో సముద్రం. ఫ్రెష్ అయిన తరువాత బ్రేక్ ఫాస్ట్ కోసం ఫోన్ చేసింది. రియాజ్ వస్తాడని ఎదురు చూస్తూ పది గంటల వరకూ కూర్చుంది. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది నూర్జహానుకు. రియాజుతో తన జీవితం ఎంత హాయిగా ఉంటుందో ఊహించుకుంటుంటే సమయం ఇట్టే గడిచి పోయింది.

పదకొండు వరకూ రియాజ్ రాకపోయే సరికి లేచి రిసెప్షన్ వద్దకు వెళ్ళింది. నేరుగా అడిగేందుకు ధైర్యం చాలక అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని కాస్సేపు పేపర్లు తిరగేసింది. చివరికి గుండె నిబ్బరం చేసుకుని రిసెప్షనిస్టు దగ్గరకు వెళ్ళి “రియాజ్ పేరు మీద రిజర్వేషన్ ఉందా?” అని అడిగింది.

సదా మందహాస వదనయైన ఆ అమ్మాయి “వన్ మినిట్ మేడమ్” అని కంప్యూటరులో చూసి ఉందన్నట్లుగా తల ఊపి “ఎస్ మామ్”. గుండెలపై భారం తీసేసినట్లుగా నిట్టూర్చింది నూర్జహాన్. “ఏ రూమ్?” అని అడిగింది.

రిసెప్షనిస్టు అమ్మాయి మళ్ళీ కంప్యూటరులో చూసి “రిజర్వేషన్ ఉంది కానీ, ఆయన రాలేదు మేడమ్” అన్నది. తలెత్తి నూర్జహాను ముఖంలోని కలవరపాటు చూసి “అంటే, ఇప్పటి వరకూ రాలేదు మేడమ్. ఇకపై రావచ్చు” అన్నది.

తన ముఖంలోని కలవరపాటును ఇతరులు చాలా సులభంగా గ్రహిస్తున్నారని నూర్జహానుకు అర్థమైంది. “ఆయన చెక్ ఇన్ చేస్తే నాకు ఇన్ ఫార్మ చేయండి” కాజువల్ గా చెప్పి వెనక్కు తిరిగింది నూర్జహాన్. కానీ, మనసులో రియాజ్ ఎక్కడికెళ్ళాడన్న ప్రశ్న. రియాజుకు ఏమైనా అయి ఉంటుందా? మళ్ళీ పిచ్చి ఆలోచనలు మొదలయ్యేటట్టున్నాయ్. కానీ, రియాజ్ ఎక్కడ?

ఏం చేయాలో తోచక బయటకు వెళ్ళి టాక్సీలో కాస్సేపు ఊరు తిరిగింది. ఎండ భయంకరంగా ఉంది. జనవరిలోనే ఇలా ఉంటే మే, జూనులలో ఎలా ఉంటుందోనని అనుకుంటూ తిరిగి హోటలుకు వచ్చేసింది. లోనకు వెళుతూ ప్రశ్నార్థకంగా రిసెప్షనిస్టువైపు చూస్తే రియాజ్ ఇంకా రాలేదన్నట్లు తల అడ్డంగా ఆడించింది. రెస్టారెంటులోకి వెళ్ళి లెమన్ జ్యూస్ ఆర్డర్ చేసి నెమ్మదిగా రియాజ్ గురించి ఆలోచించసాగింది. జ్యూస్ అయిపోయేటప్పటికి ఆమెకు ఆలోచించడానికి ఎమీ మిగల్లేదు. అక్కడే కూర్చుని కళ్ళు మూసుకుంది. తను కళ్ళు తెరిచేటప్పటికి లంచ్ కోసం వచ్చిన వాళ్ళందరూ అక్కడక్కడా కూర్చుని ఆర్డర్ చేస్తున్నారు. ఎండకి ఆమెకి పెద్దగా ఆకలి అనిపించలేదు. కానీ ఏదో ఒకటి తినాలి కాబట్టి మెనూ చూసి కిచిడీ ఆర్డర్ చేసింది. వెయిటరుకు కిచిడీ తేవడానికి అరగంట పట్టింది. దానిని తింటూ ఇంకో అరగంట గడిపేసింది.

రియాజ్ జాడలేదు. అసలేమయిపోయాడోనని కంగారుగా ఉంది. ఒకవేళ నాన్నకు తమగురించి తెలిసిపోయిందా? నాన్నకు తెలిస్తే రియాజుకు ఏమవుతుందో ఆమెకు బాగా తెలుసు. తలుచుకొంటేనే భయం వేసింది. కాళ్ళు వణికాయి. కానీ నాన్నకు గాని తమ విషయం తెలిస్తే ముందు తనను కదా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. రియాజుపై ప్రతీకారం తీర్చుకోవడం కన్నా కూతుని క్షేమమే కదా షౌకత్తుకు ప్రధానం. కానీ ఇప్పటి వరకూ తను స్వతంత్రంగా ఉందంటే తనెక్కడ ఉన్నదీ నాన్నకు తెలియలేదు. రియాజ్ ఎక్కడ ఉన్నదీ తెలిస్తే తానెక్కడ ఉన్నదో కూడా తెలిసిపోయి ఉండేది.

అంతలో ఆమె దృష్టి రెస్టారెంటులోపలికి వస్తున్న దంపతులపై పడింది. తాను ప్రయాణించిన షిప్ కెప్టెన్, అతని భార్య. ఆరేళ్ళ పాప. నేరుగా వెళ్ళి ఒక కిటికీ పక్కన కూర్చున్నారు. కుర్చీలు బయటివైపుకు తిప్పి బయటున్న చెట్లగురించో ఎండకు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న పక్షులగురించో కెప్టెన్ పాపకు చెబుతున్నాడు. పాప శ్రద్ధగా వింటుంది. నూర్జహానుకు తన తండ్రి గుర్తొచ్చాడు. తను చిన్నప్పుడు ఇలాగే తండ్రి ఒడిలో కూర్చుని ఆయన చెప్పే మాటలు వినేది. ఆ వయస్సులో తండ్రికి తెలియనివి ఈ ప్రపంచంలో లేనేలేవని అనిపించేది. తన తలిదండ్రులు ఇద్దరూ సెలెబ్రిటీస్. తాతయ్య అయితే భారత విదేశాంగమంత్రిగా పదేళ్లు ఉన్నాడు. అంతర్జాతీయ సంస్థలో భారత దేశం తరఫున ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన వ్రాసిన వ్యాసాలు, చాలా దేశాలలోని విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలు. ప్రపంచ ఖ్యాతిగాంచిన వాడు. తానేమో ఒక మారుమూల ద్వీపంలో నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా కూర్చుని ఉంది. ఒక్క క్షణం పాటు తను రియాజుతో కలసి బ్రతకాలని నిర్ణయించుకోవడం సరైనదేనా అని అనిపించింది. అంతలోనే తేరుకుని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే తనకు పిచ్చి పడుతుందని అనుకుంది.

లేచి కెప్టెన్ దంపతుల దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. వెనక నిలబడి “ఎక్స్క్యూజ్ మీ” అన్నది. తన స్వరం తనకే వినిపించలేదు. దగ్గరలో ఉన్న టేబులులో ఉన్న కుర్రవాళ్ళ బ్యాచ్ – బహుశా నేవీ ఆఫీసర్స్ కాబోలు – తనవైపే చూడటం గమనించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి పెద్దగా “హెలో” అన్నది. కెప్టెన్ వెనక్కి చూశాడు. ఆయన భార్య, పాప కూడా నూర్జహానును “ఏంటీ విషయం?” అన్నట్లు చూశారు.

నేను మీకు తెలుసా?” అదేదో థ్రిల్లర్ సినిమా టైటిల్ లాగా ఉంది తన ప్రశ్న.

కెప్టెన్ భార్యవైపు చూశాడు, నీకేమైనా తెలుసా అన్నట్లు. ఆమె భర్తవైపు చూసింది, ఈ పిల్లెవరన్నట్లు.

ఎక్స్క్యూజ్ మీ” కెప్టెన్ ఆమె అడిగినది అర్థం కాలేదన్నట్లు చూశాడు.

మళ్ళీ సినిమా టైటిల్ చెప్పింది.

తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడాయన. “ఎనీ ప్రాబ్లమ్?” ఒంటరిగా ఉన్న అమ్మాయి ఏదో కష్టంలో ఉంటే అడిగినట్లు ఉంది.

నో ప్రాబ్లమ్ సర్” గబగబా చెప్పింది నూర్జహాన్. “నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది”.

తేలికగా నవ్వాడతను. “ఓహ్. బహుశా నా షిప్పులో ఇక్కడికి వచ్చి ఉంటావ్. నేను ఆ షిప్ కెప్టెన్ని”.

అప్పుడే తెలిసినట్లు నవ్వింది నూర్జహాన్. “, అయామ్ సారీ” అంటూ ఒక అడుగు వెనకేసింది.

డోంట్ వర్రీ. నీవు ఒక్కదానివే ఉండి బోరు కొడుతుంటే మాతో కలిసి భోజనం చేయవచ్చు” భార్య వంక చూశాడు. “తనేమీ అనుకోదులో”

కెప్టెన్ భార్య చిరునవ్వుతో తన ప్రక్కనున్న కుర్చీ చూపించి “కూర్చోమ్మా” అన్నది.

లేదండి, నా భోజనం అయిపోయింది” కంగారుగా అక్కడనుంచి బయటపడడానికి సిద్ధం అయింది నూర్జహాన్. “థాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్”. చప్పున వెనుదిరిగి తన గదికి వెళ్ళింది. కెప్టెనుకు తాను తెలియదంటే తను ఇక్కడ ఉన్న విషయం తండ్రికి తెలిసి ఉండక పోవచ్చు. పక్కమీద పడుకుని టీవీ అన్ చేసింది. ఒకవేళ ఇంకెవరి ద్వారా అయినా తండ్రి తెలుసుకుని ఉంటే? తన నెగటివ్ ఆలోచనలపై కోపం వచ్చింది. టీవీలో “టామ్ & జెర్రీ” కార్టూను వస్తుంటే అది చూసి రియాజ్ గురించి కాస్సేపు ఆలోచనలను మనసు వెనక్కు నెట్టడానికి ప్రయత్నం చేయసాగింది.

* * *

సాయంకాలం నాలుగున్నరకు షౌకత్ ఆలీ ఖాన్ ప్రైవేటు విమానం పోర్ట్ బ్లేయర్ విమానాశ్రయంలో దిగింది. పాండుకు అదే తొలి ఆకాశయానం. కిటికీలోనుంచి కనిపించే ప్రకృతిని చూస్తూ కూర్చున్నాడు. అతనిని చూస్తే షౌకత్తుకు ఒక ఆదర్శవంతుడైన యువకుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడని అనిపించింది. పదునైన మేథస్సు, ప్రసన్న వదనం, పెదాలకంటుకున్న చిరునవ్వు, అవధులు లేనంత అమాయకత్వం, సత్యవాదిత్వం వల్ల వచ్చే ధైర్యం – అంతా కలిపి ఒక సంక్లిష్టమైన వ్యక్తిత్వం. షౌకత్ ముందు దిగాడు. పాండు అతని వెంటనే దిగి విమానాశ్రయ పరిసరాలన్నీ గమనిస్తూ షౌకత్ వెనకాలే నడిచాడు. ఇద్దరూ నేరుగా ఫాతిమా ఉన్న హోటలుకు వెళ్ళారు. తనను ఎవరూ గుర్తు పట్టడానికి వీల్లేకుండా పెద్ద గాగుల్స్, ముందుకు వంచిన బేస్ బాల్ క్యాపుతో షౌకత్ కారులోనే కూర్చున్నాడు. పాండు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ చేసి ఉంది. పాండు వెళ్ళి చెక్ ఇన్ చేశాక షౌకత్ నేరుగా ఎక్కడా ఆగకుండా తమ సూట్ లోకి వెళ్ళాడు.

వాతావరణం చల్లగా మారుతూంది. హోటల్ గార్డెనులో ఒక మూలన కూర్చుని కాఫీ ఆర్డర్ చేసి సిగరెట్ వెలిగించాడు పాండు. అక్కడనుంచి గార్డెనులో ఉన్న వాళ్ళందరితోబాటు హోటలులోకి వచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు అందరూ కనిపిస్తారు. ఫాతిమా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.

అతను కాఫీ పూర్తి చేసేటప్పటికి పిల్లలతో కలిసి ఫాతిమా గార్డెనులోకి వచ్చింది. పిల్లలు అక్కడున్న జారుడుబండ దగ్గర క్యూలో ఉన్న పిల్లలతో కలిసిపోయారు. ఫాతిమా అక్కడున్న ఆడవాళ్ళతో కబుర్లలో పడింది. ఒక అరగంటసేపు ఆమెను చూస్తూ కూర్చున్నాడు పాండు. లేచి రూముకెళ్ళి స్నానం చేసి డ్రస్ మార్చుకుని షౌకత్తును కూడా తయారయి కూర్చోమని తాను మళ్ళీ బయటకు వెళ్ళాడు. బయట చీకటి పడింది. చాలా మంది పిల్లలు లైట్ల వెలుగులో తమ ఆటలు కొనసాగిస్తున్నారు. ఫాతిమా, ఆమె పిల్లలు మాత్రం లేరు. నవ్వుకున్నాడు పాండు. రిసెప్షను దగ్గర ఉన్న సోఫాలో కూర్చుని అక్కడున్న టైమ్ మ్యాగజైన్ చదువసాగాడు. అక్కడనుంచి రెస్టారెంట్ డోర్ ఎదురుగా ఉంది.

ఇంకొక పది నిముషాలలో పాండు టైమ్ మ్యాగజైన్ చదవడం పూర్తి చేసేవాడు. అంతలో ఫాతిమా పిల్లలతో లిఫ్టులోంచి బయటకు వచ్చి రెస్టారెంట్ లోకి వెళ్ళింది. పాండు లేచి రిసెప్షన్ దగ్గరకెళ్ళి తమ రూముకు ఫోన్ చేసి షౌకత్ ను రెస్టారెంటుకు రమ్మని పిలిచాడు.

ఫోన్ రిసీవర్ క్రెడిల్ పై ఉంచి రిసెప్షనిస్తుని చూసి “ఈ రెస్టారెంటులో భోజనం బాగుంటుందా?” రిసెప్షనిస్ట్ బాగుంటుందని తల ఆడించగానే ఆమె మాటకోసమే ఎదురుచూస్తున్నవాడిలా రెస్టారెంటులోకి వెళ్ళాడు. ఒక కిటికీ దగ్గర ఫాతిమా కూర్చుని ఉంది. ఆమెకు ఎదురుగా పిల్లలు కూర్చుని ఉన్నారు. పాండు మెల్లగా నడుచుకుంటూ పిల్లలు కూర్చున్న కుర్చీలకు ఆనుకున్న కుర్చీలో కూర్చున్నాడు. పాండు ఎదురుగా షౌకత్ కూర్చుంటే ఫాతిమాకు ఎదురుగా కూర్చున్నట్లే.

అయిదు నిముషాల తరువాత షౌకత్ వచ్చాడు. పాండును చూసి హలో అన్నట్లు చేయి ఊపి నేరుగా అతని వద్దకొచ్చాడు. కూర్చున్న తరువాత గాగుల్స్, క్యాప్ తీసేశాడు. ఫాతిమా వెంటనే గుర్తు పట్టింది. అతను మాత్రం ఆమె ఎవరో తనకు తెలియనట్లు రిలాక్సుగా పక్కనున్న కుర్చీ మీద చేయి వేసి రెండో చేత్తో చిటికేసి “బేరర్” అన్నాడు.

షౌకత్, పాండు ఇద్దరూ నవ్వుతూ పెద్దగా మాట్లాడుకుంటూ మెల్లగా భోజనం చేశారు. ఫాతిమా పిల్లలను త్వరగా తినిపించి, తానూ నాలుగు మెతుకులు గతికి అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తరువాత పాండు “వెల్ డన్ సర్” అన్నాడు. “ఇక మీరు వెళ్ళి హాయిగా నిద్ర పోండి. రేపు ప్రొద్దున్న క్లైమాక్స్”.

పాండు మళ్ళీ రిసెప్షన్ దగ్గర కూర్చున్నాడు.

* * *

ఫాతిమాకు ఎ.సి.లో కూడా చెమటలు పడుతున్నాయి. షౌకత్ ఆలీ ఖానును చూడగానే ఆమె గుర్తు పట్టింది. షౌకత్ అవసరమైతే ఎంత మొండివాడో, క్రూరుడో ఆమెకు బాగా తెలుసు. వంశపారంపర్యమైన వేల కోట్ల ఆస్థికి వారసుడు. తను కెప్టెనుగా ఉన్నప్పుడు సెలెక్షన్ కమిటీ, కోచ్, టీం మేనేజర్ అన్నీ తానే అనుకునేవాడు. కెప్టెన్ పదవి పోయిందని టీములోంచి బయటకు వచ్చేస్తే అప్పటి క్రీడా మంత్రి నచ్చచెప్పి అతనిని మళ్ళీ ఆడడానికి ఒప్పించాడని అంటారు. ఆయన ఇక్కడ ఉండడం, తనకు దగ్గరలో కూర్చుని భోజనం చేయడం ఆమెకు ఒక షాక్ లాగా ఉంది. తొమ్మిదవడానికి ఇంకా పది నిముషాలుంది. తొమ్మిదింటికల్లా రియాజ్ తన రూముకి రావాలి. షౌకత్ ఆలీ ఖానుకు రియాజ్ గురించి తెలుసా? తననైతే ఆయన గుర్తు పట్టినట్టు లేదు. నూర్జహాన్ ఎక్కడ ఉందో షౌకత్తుకు తెలిసిపోయిందా? ఆ అమ్మాయిని ఇప్పటికే ఇంటికి పంపించి ఉంటాడా? రియాజును ఏం చేసి ఉంటాడు? రియాజుకేమీ కాలేదు కదా?

తొమ్మిదైంది. రియాజ్ రాలేదు. లేచి కిటికీ దగ్గర నిల్చుని బయటకు చూడసాగింది. బయట కార్లు కూడా ఒకటే, రెండో తిరుగుతున్నాయి. మామూలుగానే ఇక్కడ ట్రాఫిక్ తక్కువ. రాత్రయితే ఏదో అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరూ బయటకు రారు. ఒక జిప్సీ వాన్ తన హోటల్ వైపు వచ్చింది. ఒకవేళ రియాజ్ దీంట్లో ఉన్నాడేమో. ఇంకొక పది నిముషాలైనా ఎవరూ తలుపు కొట్టలేదు. తలుపు తెరిచి చూసింది. కారిడార్ ఖాళీగా ఉంది. లోపలకు వచ్చి పిల్లలను చూసింది. పాప సోఫాలోనే నిద్రపోయింది. బాబు నిద్ర కళ్ళతో కార్టూన్స్ చూస్తున్నాడు. పాపను ఎత్తుకుని లోపలకు తీసుకెళ్ళి పడుకోబెట్టింది. బాబును కూడా వచ్చి పడుకోమంది. రోజంతా ఆడుకుని అలసి, బాగా నిద్ర వస్తుంది కాబోలు. ఏమీ ఎదురుచెప్పకుండా వచ్చి పడుకున్నాడు. మళ్ళీ కిటికీ దగ్గర నిలబడి రాని కారు కోసం ఎదురుచూపులు చూడసాగింది. పది నిముషాలైన తరువాత మళ్ళీ పిల్లలను చూసింది. ఇద్దరూ నిద్ర పోతున్నారు. మెల్లగా బయటకు వచ్చి రూమ్ లాక్ చేసి కిందకు వెళ్ళింది. రిసెప్షన్ కౌంటరుకు ఎదురుగా ఉన్న లాంజిలో కూర్చుని ఉన్న పాండును గుర్తు పట్టింది. పాండు కూడా ఆమెను గమనించాడు. పట్టించుకోనట్లుగా తాను చదువుతున్న మ్యాగజైనునుంచి తల పక్కకు తిప్పలేదు. పాండునే చూస్తూ ఫాతిమా రెస్టారెంట్ లోపలికి వెళ్ళింది. ఒకవేళ రియాజ్ డిన్నర్ చేస్తున్నాడేమో. రెస్టారెంట్ మొత్తం చూసి నిరాశతో మళ్ళీ లాంజ్ లోకి వచ్చింది. ఏం చేయాలో తెలియలేదు. హోటల్ బయటకు వచ్చి కాస్సేపు ఆ చల్లగాలిలో నడుస్తూ రియాజ్ కోసం చూసింది. చాలాసేపు అక్కడ వాకింగ్ చేసిన తరువాత కాళ్ళు నొప్పులు పుట్టాయి. మళ్ళీ హోటల్ లోపలకు వచ్చి నేరుగా పాండు దగ్గరకు వెళ్ళి హిందీలో “నీతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు” అని అడిగింది. పాండు ముందే తయారయి ఉన్నాడు.

తలెత్తి “హిందీ నహీ మాలూమ్” అని రిసెప్షనువైపు చేయి చూపించాడు. “యూ మే ఆస్క్ ది రిసెప్షనిస్ట్ ఫర్ ఎనీ అసిస్టెన్స్”.

అతను చెప్పింది ఫాతిమాకు అర్థమైంది కానీ, బదులివ్వడం ఎలాగో తెలియదు. విసురుగా వెనక్కి తిరిగి లిఫ్ట్ వైపు వెళ్ళింది. తనకు ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అతనికి హిందీ రాదు. కానీ అతని ఉఛ్ఛారణ మాత్రం ఖచ్చితంగా దక్షిణ భారత ప్రాంతం నుంచే. “ఎవడో మదరాసీ అయి ఉంటాడు” అనుకుంది. ఒకవేళ నూర్జహాన్ రియాజును రాకుండా ఆపిందేమో. ఇలా రాత్రికి ఆపిందంటే ఏమిటి దానర్థం? ఫాతిమాకు రియాజుతో నూర్జహానును ఊహించుకుంటేనే ఉక్రోషంగా ఉంది. తన నిస్సహాయ పరిస్థితికి తననే నిందించుకుంటూ నిద్రకు ఉపక్రమించింది.

ఇంకొక అరగంట రిసెప్షనులోనే కూర్చుని ఇంక ఈరోజుకు చేయడానికి ఏమీ లేదని గ్రహించి, పాండు కూడా నిద్రోన్ముఖుడై లిఫ్ట్ వైపు వెళ్ళాడు.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు