పాండు2: వలలో చేప - మూడవ భాగం - కణ్ణన్

Valalo chepa-3

ప్రొద్దున్నే లేచి పిల్లలను లేపి ఏడు గంటలకల్లా తయారయింది ఫాతిమా. లిఫ్టులో కిందకు దిగి రెస్టారెంటులో పిల్లలను కూర్చోబెట్టి రిసెప్షను వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఎవ్వరు కస్టమర్లు లేనందువల్ల ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుని ఉన్నాడు అక్కడి అబ్బాయి. నైట్ షిఫ్ట్ చేసినట్లున్నాడు. కళ్ళూ నిద్రలేమితో ఎర్రగా ఉన్నాయి. “షౌకత్ ఆలీ ఖాన్ పేరుతో ఎవరైనా నిన్న ఇక్కడ దిగారా?” సూటిగా ప్రశ్నించింది ఫాతిమా. నీకెందుకన్నట్లు చూసిన అతని చూపులకు “మా బంధువులు, సాయంత్రం వచ్చి ఉండాలి” అన్నది.

అతను రికార్డులు చూసి, ఎవరూ లేనట్లుగా పెదవి విరిచాడు. తాను నిజంగానే ఎవరినో చూసి షౌకత్ అనుకుందా ఏమిటని ఫాతిమాకు అనుమానం వచ్చింది. రిసెప్షనిస్టుకు థాంక్స్ చెప్పి పిల్లలదగ్గరకొచ్చింది. బ్రేక్ ఫాస్ట్ పూర్తవగానే బయటికి వచ్చి పిల్లలతో సహా టాక్సీలో నూర్జహాన్ ఉన్న రిసార్టుకు వచ్చింది. ఎనిమిదిన్నర కావస్తుంది. ఎండ తీవ్రత పెరుగుతోంది. కానీ సముద్రం మీదనుంచి వీచే చల్లగాలులు హాయిగా ఉన్నాయి.

నేరుగా రిసెప్షను వద్దకు వెళ్ళింది. ఆమె నోరు తెరిచేలోపే అక్కడున్న అమ్మాయి “రూమ్స్ ఖాళీ లేవు మేడమ్” అన్నది. అంత టెన్షనులోనూ ఫాతిమాకు నవ్వొచ్చింది. ప్రపంచంలో ఎవరి బాధలు వారివి. నిట్టూర్చి తన లోపల ఉడుకుతున్న టెన్షనును తగ్గించడానికి విఫలయత్నం చేసింది. మఖంపై చిరునవ్వు పులుముకుంటూ “రియాజ్ ఏరూములో ఉన్నారు?” అని అడిగింది.

వన్ మినిట్” ఆ పిల్ల రికార్డులు తిరగేయసాగింది.

నిన్న ఉదయానికి రిజర్వేషన్ ఉండాలి” ఆదరాగా రిసెప్షనిస్టుకు సహాయం చేసింది ఫాతిమా. రిసెప్షనిస్టు కళ్ళెత్తి ఫాతిమా వంక చూసింది. నా పని చేయడం నాకు తెలుసు, నీకెందుకు ఇంత తొందర అన్నట్లు. మళ్ళీ కళ్ళు దించుకుని వెతికి “నిజమే మేడమ్, రియాజ్ పేరున రిజర్వేషన్ ఉంది. ఆయన నిన్న ఉదయమే రావలసింది. కానీ రాలేదు. నిన్న సాయంత్రం వరకూ వెయిట్ చేసి రాత్రికి ఇంకొకరికి రూమ్ ఎలాట్ చేశారు”

ఇంతేనా, ఇంకా ఏమైనా కావాలా” అన్నట్లు చూసింది ఫాతిమాని, పిల్లలనీ.

రియాజ్ రాలేదా? ఏమైంది తనకు? గొంతులో తడారి పోయింది. ఒక్క క్షణం ఆలోచించింది ఫాతిమా. ఇంకేమైతే అదౌతుందని “నూర్జహాన్ పేరున కూడా రిజర్వేషన్ ఉండాలి. తనైనా వచ్చిందా?” ఒకవేళ రియాజ్ ప్లాన్ ఏమైనా మార్చి నూర్జహానుతో హనీమూన్ జరుపుకుంటున్నాడా?

మళ్ళీ రికార్డులు చూడడం మొదలైంది. ఈసారి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డది ఫాతిమా. “వచ్చారు మేడమ్. ఆమె కాటేజ్ 7లో ఉన్నారు”. ఓహో నీకు కాటేజ్ 7 ఎక్కడ ఉందో తెలియదు కదా? నవ్వుతూ “కుడివైపున రెండో కాటేజ్” అని చేయి చాచి చూపించింది. అప్పుడే రిసార్ట్ ముందు దిగిన టాక్సీలనుంచి దిగుతున్న పాండును ఫాతిమా చూడలేదు.

* * *

దబదబా తలుపు బాదుతున్నారెవరో. పక్కకు తిరిగి దిండు తీసి చెవిపై పెట్టుకుంది నూర్జహాన్. అయినా ఆ శబ్దం ఆగలేదు. రియాజ్ ఏమై పోయాడోనన్న కలవరంతో నూర్జహానుకు ముందురోజు సరిగ్గా నిద్రాహారాలు లేవు. ఎప్పుడో తెల్లవారుఝామున శోష వచ్చి నిద్రలోకి జారుకుంది. నిద్రలో కూడా పీడకల. టైటానిక్ హీరో జాక్ లాగా రియాజ్ సముద్రంలోకి మునుగుతున్నట్లు, నాన్నగారు పక్కనే బోటులో నిలబడి నవ్వుతున్నట్లూ. ఆ కల తరువాత మళ్లీ అరగంట వరకూ నిద్ర పట్టలేదు. ఎవరో గాని, తలుపు విరిగిపోయేలా కొడుతున్నారు. కొంపదీసి రియాజ్ కాదుగదా! వెంటనే లేచి పరిగెత్తింది నూర్జహాన్ తలుపు తీయడానికి.

తలుపు ఓరగా తీయగానే నూర్జహాన్ ఫాతిమాని, పిల్లలను గుర్తుపట్టింది. కొద్దిగా తెరచుకున్న తలుపులను ఖడ్గమృగంలా పూర్తిగా వెనక్కి నెట్టి ఫాతిమా లోపలకు వచ్చింది. ఆమె పిల్లలూ ఆమె వెనకాలే వచ్చి నేరుగా అక్కడున్న కుర్చీలలో కూర్చున్నారు.

నూర్జహాన్ ఫాతిమాను గుర్తుపట్టింది. చాలా సార్లు ఆమె ఫోటోలు చూపించాడు రియాజ్. కానీ నేరుగా చూడడం ఇదే మొదటిసారి. రియాజ్ చెప్పినదానికన్నా, ఫోటోలలో చూసినదానికన్నా కూడా – బాగా లేదు. సర్కసులో ఎలుగుబంటికి బట్టలేసినట్లుంది. అంత షాక్ లోనూ నూర్జహానుకు నవ్వొచ్చింది. అంతలోనే అసలు నేనిక్కడున్నట్లు దీనికెలా తెలుసు? తెలిసినా ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చింది?

వదిలేస్తే తన ఆలోచనలు అలాగో సాగేవేమో. ఫాతిమా పెద్దగా అరచిన అరుపులకు నూర్జహాన్ ఆలోచనలనుంచి బయటకు వచ్చింది.

రియాజ్ ఎక్కడ?” ఫాతిమా నేరుగా అటాచ్డ్ బాత్రూము తలుపులు తెరచి, గార్టెనులోకి తెరచుకునే రెండో తలుపును తెరచి వెతకడం మొదలు పెట్టింది. నూర్జహానుకు భయం వేసింది ఫాతిమాను చూసి. నోరు తెరిచి తాను ఏం మాట్లాడితే ఎలాటి ప్రశ్నలేస్తుందో, ఏం జవాబు చెప్పాలోనని లోపల గాభరాగా ఉంది. రియాజ్ కోసం కాటేజ్ అంతా వెదికి అసలు అతను అక్కడ ఉన్న ఆనవాలు కూడా కనిపించకపోయే సరికి నూర్జహాన్ ముందుకు వచ్చి నిలుచుంది. “రియాజ్ ఎక్కడ?”

ఫాతిమా తనను గుర్తు పట్టవచ్చు. కానీ రియాజు గురించి ఇక్కడకు వచ్చి తనను అడగడం ఏంటి? లేని ధైర్యం తెచ్చుకుంది నూర్జహాన్ “రియాజ్ ఎవరు? అసలు నువ్వెవరు? ముందు బయటకు ఫో. లేకుంటే... ఐ విల్ కాల్ ది సెక్యూరిటీ” ఒక్కసారిగా తలుపు వద్దకు పరిగెత్తి తలుపు తెరిచి పెద్దగా “సెక్యూరిటీ... సెక్యూరిటీ...” అని అరిచింది. ఫాతిమా పిల్లలు ఆ అమ్మాయి ఎందుకు అరుస్తుందో తెలియక కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు.

ఫాతిమా నూర్జహానుకంటే కనీసం పదేళ్ళు పెద్దది. అందులోనూ నూర్జహానులా సున్నితంగా పెరిగింది కాదు. పల్లెటూర్లో పంచాయితీలన్నీ చిన్నప్పుడే చూసింది. సన్నగా ఉన్న నూర్జహాను చేయి పట్టుకుని విసురుగా లోపలకు ఈడ్చి తలుపులు వేసేసింది. ఆ ఊపుకు సగం రూములోకి వెళ్ళి టేబులుపై చేయి ఆనించి అతి కష్టం మీద కింద పడకుండా నిలబడింది.

తను తేరుకునేంతలోనే మళ్ళీ నూర్జహాన్ మీదకు లంఘించింది ఫాతిమా. పిల్లలిద్దరూ చప్పున కుర్చీదిగి ఒక మూలన ఉన్న టీవీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. కుడిచేత్తో నూర్జహాన్ గొంతు పట్టుకుని వెనక్కు వంచింది ఫాతిమా. ముడివేయని నూర్జహాన్ శిరోజాలు పొడుగ్గా వేలాడాయి. నున్నగా పట్టులా ఉండి సువాసన వెదజల్లుతున్న ఆమె తలనీలాలను చూడగానే ఫాతిమాకు అసూయ పొంగింది. ఆ క్షణంలో ప్రపంచంలో తనకన్నా అందంగా ఉన్న ప్రతి ఒక్క స్త్రీని నూర్జహానులో చూసింది. వత్తైన ఆ శిరోజాల మధ్యకు వెనుక నుంచి ఎడమచేత్తో కుదుళ్ళ దగ్గర గట్టిగా పట్టుకుంది. ముందు గొంతు, వెనుక జుట్టుపై ఉడుంపట్టు పట్టి నూర్జహాను శరీరాన్ని నడుముపై భాగమంతా టేబులుపై పడుకోబెట్టి ముఖంపై ముఖం పెట్టింది ఫాతిమా. తన రెండు చేతులతో బల్ల అంచులను గట్టిగా పట్టుకుంది నూర్జహాన్. ఆమెకు తన చేతులతో ఫాతిమా పట్టును ప్రతిఘటించాలన్న ఆలోచన కూడా రాలేదు. ఫాతిమా విడిచే ఊపిరి నూర్జహాన్ ముఖంపై వేడిగా, పాము బుసలా విషయుక్తంగా తగులుతుంది. ఇలాటివన్నీ సినిమాలలో తప్ప నిజంగా ఎప్పుడూ అనుభవించని నూర్జహాన్ సహజంగా బెదిరిపోయింది. గొంతుపై ఫాతిమా ధృడమైన చేతివేళ్ళు పట్టు బిగిస్తుంటే గుటకలేయడానికి కూడా నొప్పిగా ఉంది. అదే సమయంలో తలపై జుట్టు లాగడంతో కలిగిన నొప్పి. అప్రయత్నంగా ఆమె కళ్ళలోనుంచి నీళ్ళు కారాయి.

రియాజ్ ఎక్కడ ఉన్నాడు?” ఫాతిమా కంఠం ట్రాన్సఫార్మర్ పేలేటప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ స్పార్కుల్లా కర్కశంగా, భయంకరంగా ఉంది. “చెప్పకపోతే నీ జీవితంలో ఇంకేమీ చెప్పలేవు”

గొంతుపై వత్తిడి పెరిగేటప్పటికి నూర్జహాన్ కళ్ళు పైకి తేలడం మొదలు పెట్టాయి. అసంకల్పితంగా నూర్జహాన్ చేతులు ఫాతిమా కుడిచేతిని పట్టుకుని పట్టును వదిలించడానికి ప్రయత్నించసాగాయి. కొంచెం పట్టు సడలగానే నూర్జహాన్ ఊపిరి తీసుకున్నది. తాను అంతసేపూ నూర్జహాన్ ఊపిరిని ఆపేసిందని గ్రహించిన ఫాతిమా తన చేతులు వెనక్కు లాగేసింది. దాంతో నూర్జహాన్ ఒక్కసారిగా కింద కూలబడింది. గట్టిగా గాలి పీల్చుకోసాగింది.

ఫాతిమా నూర్జహాన్ పక్కన కింద కూర్చుని మళ్ళీ అడిగింది. “రియాజ్ ఎక్కడ?”

నాకు తెలియదు”.

ఫాతిమా ఈసారి నూర్జహాను జుట్టు ముందు నుంచే బాగా కుదుళ్ల మధ్యలోన బాగా పట్టుకుంది. “మళ్ళీ కావాలా?”

నూర్జహాన్ కళ్ళల్లోంచి నీళ్ళు ధారగా కారడం మొదలుపెట్టాయి. “నిజంగానే నాకు తెలియదు”

మీరిద్దరూ ఇక్కడికి వచ్చారన్నది నాకు తెలుసు. నీకు నా మొగుడితో నిఖా కావాలా?” పెద్దగా అరిచింది. మొగుడు కనబడడం లేదన్న బాధ. నూర్జహాన్ తనకన్నా అందంగా ఉంటుందని, తన భర్తకు బాగా నచ్చుతుందని ఈర్ష్య. లాగి చెంపపై ఒక్కటిచ్చింది. తెల్లటి నూర్జహాన్ బుగ్గలపై ఎర్రగా ఆమె చేతివ్రేళ్ళ ముద్రలు తేలాయి.

నన్ను కొట్టొద్దు” నూర్జహాన్ బ్రతిమలాడసాగింది. “రియాజ్ నిన్న రావాలి. కానీ రాలేదు. నాకూ తెలీదు”.

నీకు తెలియకుండానే మీ నాన్న కూడా ఇక్కడికొచ్చాడా?” ఫాతిమా కొట్టడానికి చెయ్యెత్తితే రెండు చేతులూ అడ్డంగా పెట్టి ఆ చేయిని పట్టుకుంది నూర్జహాన్.

నాన్న ఇక్కడికొచ్చారా?” ఆమె కంఠంలో ఆశ్ఛర్యం.

ఏం నటిస్తున్నావే? తన చేతిని నూర్జహాన్ చేతులనుంచి విడిపించుకోడానికి ప్రయత్నిస్తూ అరిచింది ఫాతిమా. “సినిమాల్లో చేరవే. మీ అమ్మలా పెద్ద స్టారువౌతావు”.

నాన్న వచ్చాడన్న సమాచారం నూర్జహానుకు ఎక్కడలేని బలాన్నిచ్చింది. దీని సంగతి నాన్న చూస్తాడు. ముందు తను ఇక్కడనుంచి బయటపడితే చాలు. ఒక్కసారిగా ముందుకు వంగి ఫాతిమాను వెనక్కు నెట్టింది. కానీ నూర్జహాన్ జుట్టు ఫాతిమా చేతిలో ఉండటం వల్ల ఇద్దరూ కింద పడ్డారు.

ఇప్పుడు ప్రశ్నలడగడం నూర్జహాన్ వంతు. “మా నాన్న ఎక్కడ ఉన్నారు?”

ఫాతిమా నూర్జహానును వెనక్కు నెట్టి పైకి లేచింది. మళ్ళీ నూర్జహాన్ జుట్టు పట్టి లేపుతూ సగం లేవగానే పిడికిలి బిగించి “రియాజ్ గురించి చెప్పకపోతే ఈరోజు నువ్వు నాచేతిలో చచ్చావే” పెద్దగా అరుస్తూ నూర్జహాన్ పొట్టలో గుద్దింది.

అమ్మా” అంటూ ఆర్తనాదం చేస్తూ కింద కూలిపోయింది నూర్జహాన్.

వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. పాండు నిలబడి ఉన్నాడు. ఒక్క ఉదుటున ఫాతిమాను పక్కకు నెడుతూ లోపలకు వచ్చి నూర్జహానును భుజాలు పట్టుకుని లేవదీసాడు. నూర్జహానుకు కడుపులో బాగా నొప్పిగా ఉంది. ఊపిరి తీసుకోడానికి కూడా వీలు కావడం లేదు. పక్కనే ఉన్న మంచం మీద కూర్చోబెట్టాడు పాండు. కూర్చోలేక పడుకుని మోకాళ్ళు వంచి గుండెల్లో పెట్టుకుంది నూర్జహాన్. బాధతో మూలుగుతుంది.

ఆమె వీపుపై మెల్లగా తట్టి, “మెల్లగా కొంచెం ఊపిరి తీసుకో” అని పాండు తలుపు వైపు తిరిగాడు.

అతనెవరో ఫాతిమాకు తెలియకపోయినా షౌకత్ ఆలీ ఖాన్ మనిషని గుర్తించింది. అంటే షౌకత్ ఆలీ ఖాన్ కుడా ఇక్కడికి వచ్చి ఉంటాడు. మంచం పై బాధతో పడుకుని ఉన్న నూర్జహానును షౌకత్ చూస్తే తనగతి ఏమౌతుందో తలుచుకుంటేనే వణుకు పుట్టింది. వెంటనే మూలనున్న పిల్లల దగ్గరకెళ్ళి వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని అక్కడనుంచి బయలు దేరడానికి సిద్ధమైంది. కింద పడి ఉన్న తన హాండ్ బ్యాగ్ తీసుకుని తలుపువైపు అడుగు వేయబోయి ఆగిపోయింది. తలుపుకు ఆడ్డంగా, నిలబడి ఉన్న షౌకత్తును చూసేటప్పటికి ఆమె గొంతు పొడారి పోయింది. పిల్లల భుజాలను గట్టిగా పట్టుకుని తనకు దగ్గరగా లాక్కుంది. షౌకత్ మంచం మీద మెలికలు తిరుగుతున్న నూర్జహానునే చూస్తున్నాడు.

తలుపుకడ్డంగా షౌకత్తును చూసి ఇంక ఫాతిమా ఎక్కడికీ పోలేదని నిశ్చయించుకున్న పాండు నూర్జహాన్ వైపు తిరిగి “నీళ్ళు త్రాగుతావా?” అని అడిగాడు. వద్దన్నట్లు చేయి ఊపింది నూర్జహాన్. మెల్లగా ఆమెకు మాత్రం వినిపించేలా “మీ నాన్న వచ్చారు” అన్నాడు.

అంత బాధలోనూ తలెత్తి చూసింది నూర్జహాన్. గుమ్మానికి అడ్డంగా నిలువెత్తు విగ్రహంలా నిలబడి ఉన్న షౌకత్తును చూడగానే సంతోషం, బాధ, సిగ్గు, కోపం అన్నీ ఒకేసారి కలిగాయి. పాండు ఫాతిమాకు గదిలో ఒక మూల చూపించాడు “అక్కడ కూర్చో”.

ఫాతిమా నోరెత్తలేదు. పిల్లలతో సహా మూలనకెళ్ళి కూర్చుంది. తలుపులు మూసి లోపలకొచ్చాడు షౌకత్. మంచానికీ, తలుపుకూ మధ్యనున్న ఒక కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. అయిదు నిముషాల తరువాత నూర్జహాన్ లేచింది. తండ్రిని చూసింది. ఫాతిమా చెప్పింది నిజమేనా? తన తండ్రి ఇక్కడ ఉన్నాడంటే తండ్రికి ఖచ్చితంగా రియాజ్ ఏమయ్యాడో తెలిసే ఉంటుంది. ఎందుకు తెలియదు? ఆయనే చేయించి ఉంటాడు కదా? నూర్జహాన్ ఫాతిమా వంక చూసింది.

ఫాతిమా ఇక ఆగలేకపోయింది “చూడు మీ నాన్నని. ఆయన్నడుగు రియాజును ఏం చేశాడని?”

షౌకత్ ఏమీ మాట్లాడలేదు. నూర్జహాన్ తండ్రి జవాబిస్తాడేమోనని చూసింది. షౌకత్ కిటికీ నుంచి బయట చూసి పాండుతో “ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా?” అన్నాడు. పాండు సన్నగా నవ్వాడు.

అసలు మీ నాన్న ఇక్కడేం చేస్తున్నాడని అడుగు. ఆయనకు నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఎలా తెలిసిందని అడుగు?” షౌకత్ నిశ్శబ్దంగా ఉండేసరికి ఫాతిమాకి ధైర్యం పెరిగింది.

పాండు మంచం చివరన కూర్చుని ముందు ఫాతిమా వంక, తరువాత నూర్జహాన్ వంక చూశాడు. ఫాతిమా వైపు చూసి “ఆయన కూతురి దగ్గర ఆయన ఉన్నాడు. కూతురు కనబడకపోతే వెతికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళతాడు”. పాండు చిన్నగా నవ్వాడు. “ప్రశ్న షౌకత్ గారి గురించి కాదు. నీ గురించి”.

నూర్జహాన్ వైపు తిరిగి “దీదీ, రియాజుతో పాటు అతని భార్యాపిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నట్లు నీకు తెలుసా?” కళ్ళు పెద్దవి చేసి పాండును చూసింది నూర్జహాన్. “నువ్వు వచ్చిన షిప్ లోనే తన భార్యా పిల్లలు వస్తున్న విషయం నీకు రియాజ్ చెప్పలేదా?” పిచ్చిదాన్ని చూసి నవ్వినట్లు నవ్వాడు పాండు. “కానీ నువ్వు వస్తున్న విషయం, ఏ హోటల్లో ఉన్నది అన్నీ రియాజ్ భార్యకు తెలుసు. నీకు తన గురించి చెప్పని రియాజ్, తనకు నీ గురించి ఎందుకు చెప్పాడు?”

నూర్జహాన్ ఫాతిమావైపు సమాధానం చెప్పమన్నట్లు చూసింది. ఫాతిమాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. పాండు వైపు చూసి “రియాజ్ ఎక్కడ ఉన్నాడు?” ఆమె గొంతు చాలా బలహీనంగా ఉంది.

రియాజ్ గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు”.

రియాజ్ నిన్న రాత్రి నన్ను కలుస్తానన్నాడు. కానీ రాలేదు” ఏడుపు ఆపుకుంటూ చెప్పింది ఫాతిమా. “ఇక్కడ రిసార్టులో కూడా ఆయన అసలు రాలేదని చెప్పారు”.

నీకు నూర్జహాన్, రియాజ్ ఇక్కడికి వస్తున్నట్లు ముందే తెలుసా?”

తెలుసన్నట్లు తల ఊపింది ఫాతిమా. “గుమ్మడికాయలా తల ఊపడం కాదు. నోరు తెరచి జవాబివ్వు”.

తెలుసు”.

నేను రియాజుతో నిన్న నాలుగు గంటలు మాట్లాడాను” షౌకత్ వంక చూస్తూ అన్నాడు పాండు. “నాకు అంతా తెలుసు. ఇప్పుడు నువ్వు నూర్జహానుకు మీ ప్లానంతా చెబితే తనకూ తెలుస్తుంది. నువ్వు ప్లానులో ఏదైనా మార్చావనుకో” ఆగి ముందు నూర్జహాన్ వైపూ, తరువాత ఫాతిమా వైపూ చూశాడు పాండు. “అయినా నువ్వు నిజమే చెబుతావులే. ఎందుకు చెప్పవు? లేకపోతే రియాజును చూడడం అటుంచు, నీ పిల్లలను చూడాలి కదా”

నూర్జహానుతో “మంచినీళ్ళు త్రాగుతావా?” ఆమె సమాధానం కోసం ఆగకుండా లేచి ఫ్రిజ్ లోంచి ఒక బాటిల్ తీసి రెండు గ్లాసులలో నీళ్ళు నింపాడు. ఒకటి నూర్జహానుకిచ్చి రెండవది తాను త్రాగటం మొదలు పెట్టాడు. ఫాతిమా వైపు కథ మొదలుపెట్టమన్నట్లు చేయి ఊపాడు. షౌకత్ ఇంకో సిగరెట్ వెలిగించాడు. ఫాతిమా చెప్పడం మొదలుపెట్టింది.

నిన్న నూర్జహాను, రియాజుల నిఖా జరిగి ఉండాల్సింది. నిఖా తరువాత ఇద్దరూ ఇక్కడే రెండు, మూడు రోజులు – వీలైతే వారం రోజులు గడపాలి. రియాజ్ వీలైనన్ని ఫోటోలు, వీడియోలు తీస్తాడు. అంటే...” తలెత్తి నూర్జహాన్ వైపు చూసి మళ్ళీ తల దించుకుంది ఫాతిమా. “చెడ్డ ఫోటోలని కాదు, ఒక మోస్తరుగా – అంటే బీచిలో, స్నానం చేసేటప్పుడు – అలాగ. వారం తరువాత ముంబయికి వెళ్ళి ఇంకొక ఫ్లాటులో కాపురం పెడతారు. కొన్ని రోజుల తరువాత మా అన్నయ్య వచ్చి నన్నూ, పిల్లలనూ తనతో పాటు ఉండనీయకపోతే రియాజును చంపేస్తానని... నూర్జహాన్ ముందు బెదిరిస్తాడు. తరువాత అందరం కలసి ఉంటాం”.

నూర్జహాన్ మంచం దిగి నిలబడింది. ఫాతిమాను లెమ్మంది. చెయ్యెత్తి ఫాతిమా చెంపపై కొట్టేందుకు కూడా శక్తి లేదు. మెల్లగా షౌకత్ ముందుకు వెళ్ళి నిలుచుంది. “సారీ అబ్బూ. నేను చాలా పెద్ద తప్పు చేశాను” తల వంచుకు నిలబడింది. ఫాతిమా కూడా వెళ్లి పక్కన నిలబడి పిల్లల తలలపై చేతులుంచి “నన్నూ క్షమించండి సార్”. నూర్జహాన్ చివ్వున తలెత్తి తండ్రి కళ్ళల్లోకి చూసింది. చేతితో ఫాతిమాను చూపించి “ఇది నన్ను కొట్టింది. అసలు చంపేయాలని చూసింది”. పొట్టపై చేతితో రుద్దుకుంటూ “చాలా నొప్పిగా ఉంది అబ్బూ” అంది.

షౌకత్ ఆవేశంతో ఊగిపోయాడు. ఫాతిమా అతని కాళ్ళపై పడింది “ముఝే మాఫ్ కీజియే” అంటూ ఏడవడం మొదలు పెట్టింది. షౌకత్ కాలు లేపబోయేంతలో పాండు అడ్డం పడ్డాడు. “సర్”.

ఏమిటన్నట్టు చూశాడు షౌకత్. మిమ్మల్ని మోసం చేసింది మీ అమ్మాయి. మీ అమ్మాయిని వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు బయటి వాళ్లు. కానీ, మీ సొంత కూతురు మిమ్మల్ని మోసం చేసింది. మీ ప్రేమకు విలువ లేకుండా చేసింది. అలాటి వాళ్ళను నమ్మితే ఏం జరుగుతుందో తనకు ఆ మాత్రం తెలియాలి”.

నూర్జహాన్ పాండు వంక చిరాకుగా చూసింది, వీడెవడు తన మీద, తనముందే, తన తండ్రికి చాడీలు చెబుతున్నాడని. కానీ పాండు మాటలు విని నిలబడిపోయిన తండ్రిని చూస్తే ఆమెకు పాండు మాటలు నిజంగా నిజాలని అర్థమైంది. “సారీ అబ్బూ” మరోసారి తండ్రిని క్షమాపణలు కోరింది. షౌకత్ కోపం తగ్గిందని భావించి ఫాతిమా లేచి నిలబడింది. షౌకత్ ఆమెను నిశితంగా చూశాడు. అతని చెయ్యి ఎప్పుడు లేచిందో, ఎప్పుడు ఆమె దవడ పగిలిందో తెలియలేదు. ఫాతిమా మూడడుగుల దూరంలో పడింది. పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. “ఛుప్” షౌకత్ గర్జనకు ఫాతిమా భయపడి పిల్లల నోళ్ళు మూసింది. తర్జని చూపిస్తూ “ఇంకోసారి నువ్వు, నీ మొగుడూ నాకు కనబడటం కాదుగదా, మీ పేర్లు కూడా నాకు వినబడకూడదు. ముంబయి వదలి వెళ్ళాలి. లేదంటే..”

అర్థమైందన్నట్లు తల ఊపి ఫాతిమా పిల్లలను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఆరోజు సాయంత్రం నౌకలో విశాఖ పట్నం తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకుంది.

పదకొండు గంటలకు షౌకత్, నూర్జహాన్, పాండులను తీసుకుని షౌకత్ విమానం విశాఖకు బయలుదేరింది. ఆరోజు సాయంత్రం ఎమ్.పి.గారింట్లో మళ్ళీ అందరూ సమావేశమయ్యారు. షౌకత్ పాండుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. ఎస్.పి. వంక చూసి “నేను పాండుకి ఫీజ్ ఇవ్వాలి కదా” అన్నాడు.

నవ్వుతూ “పాండునే అడగండి సార్” అన్నాడాయన.

పాండు వంక తిరిగాడు షౌకత్ ఆలీ ఖాన్. “నీకెంత ఫీజు కావాలి పాండూ?”

నాకు ఫీజేంటి సార్. మీరు భలేవారు” చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడు పాండు.

ఊహూ. అలాక్కాదు. నువ్వు వాళ్ళను కనిపెట్టడమే కాదు. విషయం చాలా సున్నితంగా నా కూతురికి అర్థమయ్యేలా చేశావు. అసలు ఈ పని దాని తమ్ముడు చేసి ఉండాల్సింది. వాడికి ... నీ అంత మెచ్యూరిటీ లేదు. నీకు ఫీజ్ ఇవ్వాలి పాండు. ఏంకావాలో అడుగు”

పాండు ఏమడుగుతాడో అని అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. ఒక్క క్షణం వాళ్ళందరినీ చూశాడు పాండు. “మీ ఇష్టం సార్. ఎంతిచ్చినా నేనూ, పోలీస్ వెల్ ఫేర్ అసోసియేషన్, సగం సగం పంచుకుంటాం” నవ్వుతూ అన్నాడు పాండు.

షౌకత్ నవ్వాడు. “వెరీ గుడ్. నువ్వు సగం పోలీస్ వెల్ ఫేరుకు ఇస్తాననడం నాకు నచ్చింది”. తన కోటు లోజేబులోంచి చెక్ బుక్ తీసి రెండు చెక్కులు తీశాడు. పాండు పేరుతో రెండు కోట్లు, పోలీస్ వెల్ ఫేర్ అసోసియేషన్ పేరుతో రెండు కోట్లకు చెక్కులు రాసి సంతకం పెట్టాడు. రెండు చెక్కులూ పాండుకు ఇచ్చి “నీ చేత్తోటే ఎస్.పి.గారికి ఇవ్వు” అన్నాడు.

ఏంటి సార్, రెండు కోట్లా" పాండు ముఖంలో విస్మయం.

పాండు రెండో చెక్కును ఎమ్.పి.గారికి ఇచ్చి “మీరు పెద్దవారు. మీ చేతులపై ఈ మంచి పని జరుగనివ్వండి సార్”.

* * *

వారం రోజుల తరువాత రియాజ్ ఉన్న గదిలోకి ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు. “ఆ పౌడర్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అది డ్రగ్స్ కాదు. నువ్వు వెళ్ళవచ్చు” అతని ట్రాలీ ముందుకు నెట్టాడు. ఏమీ మాట్లాడకుండా ట్రాలీ నెట్టుకుంటూ బయటికొచ్చాడు రియాజ్. రిసార్టులో ఒక చిన్న రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యాడు. కాఫీ తాగుతూ ఫాతిమాకు ఫోన్ చేశాడు.

* * *

పదిహేను రోజుల తరువాత రియాజ్ ముంబయిలోని తన ఫ్లాట్ ఖాళీ చేసి లక్నో వెళ్ళిపోయాడు. నెలరోజుల తరువాత పాండు ఒక ఇల్లు కొని దాంట్లో కింద ఫ్లోర్లో అమ్మా నాన్నలను ఉంచి పై ఫ్లోర్ తన ఆఫీసని అమ్మకు చెప్పాడు. ఆఫీసులో ఏం చేస్తావని వాళ్ళమ్మ అడిగితే “ఏదైనా చేయాలనిపించినప్పుడు ఇంటికి వస్తాను. ఏమీ చేయకుండా ఉండటానికే కదా ఆఫీసుకు వెళ్ళేది” పాండు నెత్తిన ఓ మొటిక్కాయ వేసింది ఆమె ప్రేమగా.

ఆరు నెలల తరువాత నూర్జహాన్ పెళ్ళి జరిగింది. పాండు మొదటిసారి ముంబయి వెళ్ళాడు.

పాండు సలహా ప్రకారం షౌకత్ పోలీసులకు ఇచ్చిన డబ్బును బ్యాంకులో వేసి ఏడాదికి పదిమంది కానిస్టేబుళ్ళ పిల్లలకు కాలేజీ ఫీజు కట్టేందుకు ఏర్పాటు చేశారు.

మరిన్ని కథలు

Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.