పూర్వం సాకేతపురాన్ని శాంతలవ్యుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను ఎంతో దయాహృదయం కలిగినవాడు. మంచి సాహితీప్రియుడు. తన ఆస్థానంలో ఎంతోమంది కళాకారులను పోషించేవాడు.
అతని ఆస్థానంలో రవివర్మ అనే గొప్పచిత్ర కారుడు ఉండేవాడు. కళాత్మక బొమ్మలు చిత్రీకరించడంలో అతనిది అందెవేసిన చేయి. రాజును ఘనంగా కీర్తిస్తూ గీచిన చిత్రాలతో మంత్రముగ్ధుడ్ని చేసేవాడు. ఎంతగానో ఆకట్టుకునే అతను చిత్రకళా నైపుణ్యంతో రాజును పరవశింపజేసేవాడు. తాను ఎంతో ఆ చిత్రాలను వీధుల్లో గోడలకు అతికించి తాను ప్రజారంజకంగా పాలిస్తున్నానని అందుకు ఇదే తార్కాణం అని మురిసిపోయేవాడు. క్రమక్రమంగా శాంతలవ్యుడు పాలనను గాలికొదిలేశాడు. రాజ్యంలో ఎక్కడ చూసినా లంచగొండితనం పెరిగింది. పైసలిస్తేనే పనిజరిగే పరిస్థితి ఏర్పడిరది. దీనికి తోడు సంక్షేమ కార్యక్రమాలు అమలు కాలేదు. ప్రజల్లో అసహనం పెరిగింది. ప్రజలు పన్నులు చెల్లించలేదు. పాలన గాడి తప్పింది. రాజు ఇదేమీ పట్టనట్లు వ్యవహరించాడు. రాజోద్యోగులకు జీతభత్యాలు సరిగా అందలేదు. అధికారుల్లోనూ కోపం పెరిగింది. జీవనం గడవక ప్రజల వద్ద లంచాలు తీసుకోసాగారు. ఇవ్వని వారిని జైలులో శిక్షించి ఇబ్బందులకు గురిచేసేవారు. దీన్ని రాజు గ్రహించలేకపోయాడు.
ఈ పరిస్థితిని కొందరు చిత్రకారులు పసిగట్టారు. తన చిత్రాలతో కళాకారులు రాజుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. శాంతలవ్యుడు దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. తనకు ఎదురుచెబుతున్నారనే నెపంతో వారిపై కత్తిగట్టాడు. తన ఆస్థానంలో ఉన్న కళాకారులందరిని బహిష్కరించాడు. ‘‘ రాజా..లంచం రాజ్యమేలుతోంది..అంగట్లో సరుకుల ధరలు ఇష్టం వచ్చినట్లు అధికంగా అమ్ముతున్నారు. సామాన్యులు ఏమి కొనలేక, తినలేక పస్తులతో కాలం వెళ్లతీస్తున్నారు. దుర్భర పరిస్థితి నెలకొంది. కళ్లు తెరవండి..ప్రమాదం ముంచుకొస్తోంది..’’ హెచ్చరించారు.
శాంతలవ్యుడి దయాహృదయం కాస్త రాతిగుండె అయ్యింది. ‘‘ నా పాలనను విమర్శించడానికి ఎవరికీ అర్హతలేదు.. వెళ్లిపోండి..నాకు కనిపించకండి..’’ అంటూ కారాలు మిరియాలు నూరాడు శాంతలవ్యుడు.
కళాకారుల మనసులు ఆవేదనతో నిండినా వారు శాంతలవ్యుడికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోయారు.
రాజు అసమర్థతను ఆసరాచేసుకుని రవివర్మ మరింత కీర్తిస్తూ చిత్రించిన చిత్రం చూపి స్వలాభం పొందాడు. రోజూ తనకు వచ్చే బంగారు, నగదు కానుకలను తన భార్య వద్దకు తీసుకెళ్లాడు. అతని భార్య అరుణ పేద కుటుంబం నుంచి వచ్చింది. దీంతో ఆమె ప్రజల కష్టాలను అర్థం చేసుకుంది. భర్తను ‘‘ మీ చిత్రాల్లో ప్రజల కష్టాలు వివరించండి.. రాజులో మార్పు తెచ్చి దయాహృదయం పెంచి మంచి మనసును చాటుకోండి..లేదంటే మీ ఉనికికే ప్రమాదం’’ అంటూ హెచ్చరించింది.
రవివర్మ తన ఆశను వదులుకోలేదు. రాజును మరింత స్థుతిస్తూ రాజ భోగాలు అనుభవించ సాగాడు. రానురాను ప్రజలు అధిక రేట్లతో నిత్యావసర సరుకులు కొనలేక ఆకలితో అలమటించారు. రాజ ఉద్యోగులు సైతం జీతాలు అందక పస్థులతో అలమటించసాగారు. దీన్ని అరుణమ్మ గమనించింది. రాజు కళ్లు తెరచి ప్రజల, రాజ ఉద్యోగుల కష్టాలను తీర్చాలనుకుంది.
రవివర్మ చిత్రాల్లోని గీతలను రోజూ గమనించి ఓ రోజు అద్భుత చిత్రం గీచింది. రవివర్మ హావ భావాలు అనుకరించి అతని వేషం ధరించి రాజ ఆస్థానానికి చేరింది. ప్రజల, రాజ ఉద్యోగులు పడుతున్న కష్టాలను ప్రతిబింబిస్తూ రూపొందించి ప్రజా వ్యతిరేక పాలనకు అద్దంపట్టేలా వున్న చిత్తరువును రాజుకు చూపి నిప్పులు కక్కింది అరుణమ్మ.
శాంతలవ్యుడులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘ ఇదేమిటీ రోజూ నా పాలనను ప్రశంసించే రవివర్మ ఇంతగా విమర్శిస్తున్నాడు .. అసలు నువ్వు రవి వర్మ కాదు..’’ ఆగ్రహించాడు రాజు.
అదే సమయానికి రవివర్మ అక్కడికి వచ్చాడు. ‘‘ప్రభూ..రవివర్మను నేనే..’’ అన్నాడు.
‘‘ కాదు..కాదు..’’ అసలైన రవివర్మను నేనే..’’
‘‘కాదు..నేనే..’’ అంటూ అడ్డుకుంది అరుణమ్మ.
‘‘ అసలు రవివర్మ ఎవరో తేల్చుకోండి..’’ అని ‘‘ ఎవరక్కడ వీరు రాజునే మోసగించారు. నా పాలననే
విమర్శించారు.. మిమ్మల్ని వదిలేస్తే ఇంకెన్ని చేస్తారో..వీరిని తీస్కెళ్లి కళ్లు తీసెయ్యండి..నన్ను గుడ్డి పాలన అన్నారు. అసలు కళ్లు లేవు వీళ్లకి..అభివృద్ధిని చూసి ఓర్వలేరు..విమర్శించడమే వీరిపని.. శాశ్వతంగా కళ్లు పీకేయండి..పీడ విరగడవుద్ది..’’ అంటూ భటులను ఆజ్ఞాపించాడు.
అరుణమ్మ భయభ్రాంతికి గురైంది. ఏదో రాజు కళ్లు తెరిపించి పాలనను బాగుచేద్దామనుకుంటే నా కళ్లనే తీసేయాలనుకున్నాడు..అమ్మో..’’ గుడ్డి జీవితం కళ్ల ముందు కనిపించింది. భయంతో ముసుగు తీసి అసలు రూపం చూపింది అరుణమ్మ.
ఆశ్చర్యపోయాడు రవివర్మ.
నందివర్థిని ‘‘ ప్రభూ నా భర్త మిమ్మల్ని ప్రశంసించడమే పనిగా పెట్టుకున్నాడు. వీరిచ్చే కానుకల్ని చూసుకుని మురిసిపోవడమే తప్ప ప్రజలు, రాజోద్యోగులు పడుతున్న కష్టాలు పట్టవు..అటు చూడండి..లంచం ఎలా రాజ్యమేలుతోంది.. దీన్ని నా భర్తకు వివరించినా చెవిన వేస్కోలేదు. అందుకే నా భర్త వేషంలో ఇలా వచ్చాను..మీకు ప్రజల కష్టాలు ప్రతిఫలించే చిత్తరువును చూపాను..నా పని అయిపోయింది..ఇక నన్ను ఏమైనా చెయ్యండి..బాధలేదు..ప్రజలు, రాజ ఉద్యోగులు, రాజ్యం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే..’’ అంటూ కంటతడి పెట్టింది అరుణమ్మ.
శాంతలవ్యుడి హృదయం కరిగింది. నిజంగా లంచగొండితనం వుందోలేదో పరీక్షించాలనుకున్నాడు.
మరుసటి రోజే ఓ వృద్ధుడి వేషంలో అధికారుల వద్దకు వెళ్లాడు.
తనకు దిక్కెవరూ లేరని పింఛను ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. ఆ అధికారి అతనికి అర్హత ఉన్నా లేకున్నా పింఛను ఇప్పిస్తానని పదివేలు లంచం ఇవ్వాలని అడిగాడు..
ఆ వృద్ధుడు రాజుకు ఫిర్యాదు చేస్తానన్నాడు.
‘‘వెళ్లి ఫిర్యాదు చేసుకో.. ఆయన కళ్లు ఉన్నా కబోది.. నిజం గ్రహించలేడు.. ఇన్నాళ్లు ఆయన ఇలా కళ్లు మూసుకుని ఉండడం వల్లే మాకు సరిగా జీతాలు అందలేదు.. మేమంతా మారో మార్గం లేక లంచాలు తీసుకుని బతుకుతున్నాం..’’ అన్నాడు.
వృద్ధుడికి ఆగ్రహం వచ్చింది. వెంటనే తన ముసుగును తొలగించాడు. ఇన్నాళ్లు నా హృదయం రాతి గుండె అయ్యింది. నేను గ్రహించలేకపోయాను.. నా అలసత్వం వల్లే రాజ్యంలో అవినీతి మర్రిచెట్టులా ఊడలు వేసింది.. రాజ ఉద్యోగులు పడరాని పాట్లు పడ్డారు.. ఇదంతా ఓ బక్కచిక్కిన పౌరుడిని చెర్నాకోలతో కొడుతుంటే హాహా కారాలు చేస్తున్న చిత్రాన్ని అరుణమ్మ గీచి నా కళ్లు తెరిపించింది.. అని ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు. చిత్ర కళ ప్రజా శ్రేయస్సును ప్రతిబింబించేలా ఉండాలని, ప్రభువులను స్థుతించి ప్రజా వ్యతిరేక పాలనకు బాటలు వేసేదిగా వుండకూడదని , వాస్తవాన్ని చిత్రీకరిస్తూ ప్రజా పాలనను పెంపొందించేలా వుండాలని సూచించారు. తను నిజాన్ని గుర్తించలేకపోవడం వల్లే లంచంగొండితనం పెరిగి ప్రజలు అశాంతికి గురయ్యారని గ్రహించాడు శాంతలవ్యుడు. ఆ తర్వాత పాలనపై నిశిత దృష్టి సారించాడు. ప్రజా సమస్యలను చిత్రీకరించే చిత్రకారులను ప్రోత్సహిస్తూ సుపరిపాలనకు శ్రీకారం చుట్టాడు శాంతలవ్యుడు.