ఆనందాశ్రువులు - రాము కోలా.దెందుకూరు.

Aanandaashruvulu

ఆస్తులు సంపాదించలేని నాకు ,వయో భారంతో సంక్రమిస్తున్న కొన్ని అనారోగ్య సమస్యలకు మాత్రం కొదవే లేదు. కుటుంబ సమస్యలకు తోడు , మానసిక సంఘర్షణలు మరొకవైపు నాపైన మూకుమ్మడిగా దాడిచేస్తూనే ఉన్నాయ్. వాటిని ఎలా అధిగమించాలో తెలియక, నాలో నేను సతమతమౌతూ ... నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ,కాలంతో రాజీపడుతూ ,జీవితం సాగిస్తున్న ఓ మధ్యతరగతి అల్పసంతోషిని.. అలా సాగే జీవన ప్రయాణంలో ఒకరోజు ,నావైపు సంశయంగా చూస్తున్న అమ్మ మనస్సును చదివే ప్రయత్నం చేస్తూ !పరధ్యానంగా ఉన్న నాతో ... బలవంతంగా ఎదలో బాధను నొక్కిపెట్టి పిలుస్తున్న అమ్మ పిలుపు... నన్ను వాస్తవ ప్రపంచం లోనికి లాగేసింది. "ఒరేయ్!రాఘవా!" రాత్రి పూట విపరీతమైన దగ్గు వస్తుంది రా.!తట్టుకోలేక పోతున్నా!" "ఒక్కసారి పట్నంలో డాక్టర్ కు చూపించుకోవాలి అనిపిస్తుంటుంది.!. కాస్త వీలున్నప్పుడు చెప్పరా!" "తొందరేమీ లేదులే,ఒక మాట నీ చెవిన వేయాలని చెపుతున్నా!". "అంతేకానీ!మరొకటి లేదు." అంటూ చెప్పలేక లేక చెపుతున్న అమ్మ వైపు, చూడగల ధైర్యం లేక తలవంచుకున్నా.... నా చేతకాని తనానికి సిగ్గుపడుతూ. "ఇదిగో! ఇప్పుడే అనుకుంటున్నా." అమ్మను వీలుచూసుకుని,నాన్నతో పాటుగా, పట్నంలోని దవాఖానా లోనే చూపించాలని". "సమయానికి నువ్వు కూడా! అదే గుర్తుచేసావు. వీలు చూసుకుని రెండుమూడు రోజుల్లోనే వెళ్దాం" అన్నాను,మాటలను పేర్చుకుంటూ, ఇంకేం చెప్పాలో అర్థం కాక. ఆ మాత్రానికే అమ్మ కన్నుల్లో ఎంత వెలుగు కనిపించిందో .. ప్చ్... నా పేదరికాన్ని అర్దం చేసుకుందేమో అమ్మ! చిన్నగా నవ్వుకుంది. అమ్మకు కనిపించనీయకుండా, కంటనీరు తుడుచుకుంటూ, ఆలోచనల్లోకి దూరిపోతున్న నాకు వినిపించీ వినిపించినట్లుగా! అమ్మ మాటలు దగ్గుతో కలసిపోతూ నన్ను చేరుతున్నాయ్. "పిచ్చి సన్యాసి, అమ్మకు అబద్ధం చెప్పలేకపోతున్నాడు. " "ఎంతగా తల్లడిల్లుతున్నాడో?". వాడికి చెప్పకుండా ఉండవలసింది". వినిపిస్తున్న అమ్మ‌ మాటల్లోని అనునయం ,ఎదను తాకుతుంది. అమ్మ చేతి స్పర్శ లా!. ఇంతగా అర్దం చేసుకుంటున్న కన్నతల్లికి ,సరైన వైద్యం చేయించలేని నా నిస్సహాయత ఎంతటి దౌర్భాగ్యమో కదా..!. **** గత రెండున్నరేళ్లలో పంటలు సరిగా పండక,అప్పుపుట్టే పరిస్థితి కూడా నాకు లేదనే విషయం ,అప్పుకోసం పది గడపలు ఎక్కి దిగేవరకు తెలియడం లేదు నాకు. "ఏమండి!" "బయటకు వెళుతున్నారేమో?," "పెద్దవాడి కాళ్ళకు చెప్పులు లేవు." "మీకు చెప్పలేక, ఉన్నవాటితో సర్దుకోలేక! బాగా ఇబ్బంది పడుతున్నట్లున్నాడు." "కాస్త ఆలోచించండి" . అంటూ మాటలు పూర్తికుండా మింగేస్తూ , గడప దాటి బయిటకు రాలేక,చిరుగుల రవికను పవిట చెంగు మాటున దాచేస్తున్న ఇల్లాలిని చూస్తుంటే. జలజలా రాలుతున్న కన్నీరును అదుపు చేసుకోలేని మనసు. "కార్యేషు దాసి, కరణేషు మంత్రి భోజ్యేషు మాత, అనే పదాలను గుర్తు చేసుకుంటుంది . అపురూపమైనదమ్మ ఆడజన్మ..ఆ జన్మకు పరిపూర్ణత నీవే నమ్మా" అంటూ ఎక్కడ నుండో పాట వినపిస్తుంది... "నిజమే!కదా "అనుకుంటూ అప్రయత్నాంగా చేతులు జోడించేసా. **** "చిన్నా!" అదేంట్రా!నీకు కొత్త చెప్పులు తెచ్చాను కదా! పాతవే వేసుకున్నావ్?". ఆశ్చర్యంగా అడిగాను . దగ్గరగా కూర్చోబెట్టుకుంటూ మా పెద్దోడిని.. తల నిమురుతూ. "కొత్త చెప్పులు కదా!నాన్నా," "కాళ్ళు కొరికేస్తున్నాయ్." "అవి మీకైతే కరెక్ట్ గా సరిపోతాయ్." "ఇవి మీరు వాడుకోండి.తరువాత నాకు వీలు చూసుకుని తీసుకు రావచ్చు". అంటూ నా కాళ్ళకు కొత్త చెప్పులు తొడుగుతున్న నా బిడ్డలో మా నాన్నను చూస్తున్నా!. వైద్యం చేయించలేని నా అసమర్ధతను ప్రేమగా అర్ధం చేసుకుంటున్న కన్నతల్లి. తనకు ఒంటినిండా సరైన చీరలు కూడా కొని వ్వలేకపోయిన నా పేదరికాన్ని అర్ధం చేసుకుంటూ, ఇల్లు గుట్టుగా నెట్టుకొస్తున్న అర్ధాంగి. ఈరోజుల్లో పిల్లలు తమ కోర్కెలతో తల్లిదండ్రులను ఎలా వేధిస్తున్నారో! అలాంటిది నా కాళ్ళకి చెప్పులు లేవని, తను కోరిన చెప్పులు ,నాకు తొడుగుతున్న నా బిడ్డ. అసలు నాకోసమే కొనిపించాడేమో?కొత్త చెప్పులు. పసిహృదయం మాటున ఇంతటి ప్రేమా దాగుందా? ఇంతటి ప్రేమను పంచే కుటుంబం అండగా ఉన్న నేను, పేదోడిని ఏంటీ????.. కాదు కదా! నాకు సమస్యలేంటీ... దిగులు ఎందుకసలు??. ఆలోచనలతో ఒక్కసారిగా వెయ్యి ఏనుగులు బలం వచ్చిన అనుభూతి నిలువెల్లా పాకింది.. ఇలా అర్దం చేసుకునే కుటుంబ సభ్యులు మధ్యన, ఎంత కష్టం వచ్చినా! అది దూది పిందెలా తేలిపోదా???. నాకుటుంబాన్ని చూస్తుంటే కన్నులు ఆనందాశ్రువులు కురిపిస్తున్నాయి.. నా బిడ్డను దీవిస్తున్నట్లు తన తలపై రాలుతూ..

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు