నీలాగే అందరూ - బుద్ధవరవు కామేశ్వరరావు

Neelaage andaroo నీలాగే అందరూ ============ (క్రైమ్ కధ) రచన :: బుద్ధవరపు కామేశ్వరరావు హైదరాబాద్ రాజమండ్రిలోని ఓ ప్రైవేటు బేంకులో పని చేస్తున్న తమ కూతురు ఉష దగ్గర ఓ నాలుగు రోజులు గడపి, ఆ రోజే తమ ఊరికి తిరిగి బయలుదేరి వెళ్తున్నారు ఆమె తల్లిదండ్రులు. "అమ్మాయ్, మరి ఈ రోజు బయలు దేరతాం, రెండు మూడు రోజుల్లో కోయకపోతే, పంట పాడవుతుంది" చెప్పాడు ఆమె తండ్రి. "సరే, నాన్నా ! ఓ పని చేద్దాం, ఈ రోజు శనివారం కదా, మధ్యాహ్నం పర్మిషన్ పెట్టి, కొంచెం పెందరాళే వస్తా. సాయంత్రం అందరూ కలిసి ఫస్ట్ షో సినిమా చూద్దాం, ఆ తర్వాత మిమ్మల్ని బస్ ఎక్కించి, నేను నా రూమ్ కి వచ్చేస్తాను" చెప్పింది ఉష. కానీ, తను తీసుకున్న ఆ నిర్ణయమే తనని ఇబ్బందులు పాల్చేస్తుందని , పాపం ఆ టైంలో ఉషకి తెలియదు. ***** ***** ***** ***** సినిమా వదిలాకా, బయటకి వెళ్తున్న ఉషకు ఓ సీట్లో సెల్ ఫోన్ కనిపించింది. ఎవరో మర్చిపోయారని, దాన్ని తీసుకుని, కొంతసేపు వేచి చూసింది, ఎవరైనా వస్తారేమోనని. థియేటర్ సిబ్బందికి ఇవ్వాలనుకుంది కానీ, ఎవరూ కనిపించ లేదు. అప్పటికే రాత్రి పది దాటింది. ఇక, ఆ ప్రయత్నం విరమించుకొని,ఆ సెల్ ని బేగ్ లో వేసుకుని, తల్లి తండ్రులను బస్సు ఎక్కించవలసి రావడంతో, హడావుడిగా బయటకు వచ్చింది ఉష. ***** ***** ***** ***** తల్లిదండ్రులను బస్సు ఎక్కించి, రూమ్ కి వచ్చిన ఉషకి ఓ అరగంట తర్వాత ఆ సెల్ మోగడంతో కాల్ రిసీవ్ చేసుకుంది. ఆమె గొంతు విని, "మీరు ఎవరూ? ఇది నా ఫోన్" చెప్పాడు ఓ వ్యక్తి, అవతలనుంచి. థియేటర్ లో తనకు సెల్ దొరకడం గురించి వివరించింది ఉష. " చాలా థాంక్స్ మేడమ్. థియేటర్ లో ఫోన్ మాట్లాడి, పొరపాటున జేబులో పెట్టకుండా సీట్లో పెట్టి మర్చిపోయా ! అది మీ దగ్గరే ఉంచండి. నేనొచ్చి తీసుకుంటాను" చెప్పాడు అవతల వ్యక్తి. "సరే రేపు మా బేంకు కి వచ్చి తీసుకోండి" బ్రాంచ్ వివరాలు చెప్పింది. "రేపు ఆదివారం బేంకు శెలవు కదా మేడమ్ !" "ఓ, షిట్..మరచేపోయా ! పోనీ ఇప్పుడే వస్తారా ?" "అయ్యో, ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. రేపు వచ్చి తీసుకుంటా. దయచేసి అంతవరకూ నా ఈ నెంబర్ నుంచి తప్ప, ఈ సెల్ కి ఏ ఫోన్ వచ్చినా ఎత్తకండి" వేడుకుంటూ అడిగాడు అవతలి వ్యక్తి. ***** ***** ***** ***** మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకి, ఆ సెల్ మోగడంతో మంచం మీంచి బద్ధకంగా లేచింది ఉష. "మేడమ్, నేనే ! కాకినాడ నుంచి రావాలి, ఓ రెండు గంటలు పట్టవచ్చు. కొంచెం మీ అడ్రసు చెబుతారా ?" "రాజమండ్రి, దానవాయిపేట, ఇంటి నెంబర్..............." ఇంటి చిరునామా, ఆనవాళ్లు చెప్పింది ఉష. "అలాగే మేడమ్, మీకు శ్రమ కలిగిస్తున్నా ! ఏమీ అనుకోకండి" "అయ్యో, పరవాలేదు రండి" అని ఫోన్ పెట్టేసింది ఉష. ***** ***** ***** ***** మధ్యాహ్నం పదకొండు గంటలకు మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఆన్సర్ చేసింది ఉష. "సారీ, మేడమ్ ! మేము స్కూటర్ మీద వస్తూంటే, రాజానగరం దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. మా ఫ్రెండ్ కి దెబ్బలు తగిలాయి. హాస్పిటల్ లో ఉన్నా. మీ ఆదివారం ప్రోగ్రాం పాడుచేయడం నాకు ఇష్టం లేదు. ఈ ఫోన్ మీ ఇంట్లో ఎవరికైనా ఇచ్చి మీ వీకెండ్ ఎంజాయ్ చేయండి" చెప్పాడు అవతలి వ్యక్తి. "మా ఇంట్లో ఎవరూ ఉండరండీ. నేను సెపరేట్ గా ఓ సింగిల్ రూమ్ తీసుకుని ఉంటున్నా. సరే ! మీ ఫ్రెండ్ ని జాగ్రత్తగా చూసుకోండి. వీలు వెంబడి రండి" "సరే, మేడమ్ ! రాత్రి లోగా ఏదో టైం లో వచ్చి ఫోన్ తీసుకుంటా! నాకు ఇంకో ఫోన్ ఉండడం మూలంగా నా పనులకు ఆటంకం లేదు కానీ అనవసరంగా మిమ్మల్ని కష్ట పెడుతున్నందుకు మటుకు నన్ను మన్నించాలి" అంటూ ఫోన్ పెట్టేసాడు ఆ వ్యక్తి. ***** ***** ***** ***** రాత్రి తొమ్మిది గంటలకు డోర్ బెల్ మోగడంతో తలుపు తీసింది ఉష. "మేడమ్, నేనూ....ఆ సెల్ గురించి.." చెప్పాడు ఆ వ్యక్తి. "ఓ ! మీరేనా ? రండి లోపలికి" అంటూ ఆహ్వానించింది ఉష. "ఔనండీ, నాదే ఆ ఫోన్. అసలు నిన్న రాత్రి ఫోన్ ఎలా పోయిందంటే........" అంటూ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు అన్నీ చెప్పి, "కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా?" అని అడిగాడు. మంచి నీళ్ళు తేవడానికి ఉష లోపలికి వెళ్ళగానే, వీధి తలుపులు మూసేసాడు ఆ అగంతకుడు. కిచెన్ లోంచి బయటకు వచ్చి, ఆ సంఘటన చూసి బిత్తరపోయిన ఉష, "ఎవరు నువ్వు ? హెల్ప్, హెల్ప్.." అని గట్టిగా అరిచింది. వెంటనే వేగంగా కదలిన అతను, తన మొహం కనబడకుండా మాస్క్ వేసుకుని, ఆమె నోరును కర్చీఫ్ తో కట్టేసి, తన ఫోన్ లో వీడియో ఆన్ చేసి, ఆమెను మంచం మీదకు తోసేసాడు, బలవంతంగా ఆక్రమించుకోవడానికి ! ఈ లోగా, హఠాత్తుగా ఓ ఇద్దరు మహిళా పోలీసులు, ఇద్దరు మగ పోలీసులు మెయిన్ డోర్ తీసుకుని వచ్చి, ఆమెను రక్షించి, ఆ అగంతకుడుని అదుపులోకి తీసుకున్నారు. ***** ***** ***** ***** మర్నాడు ఉదయం పది గంటలు. రాజమండ్రి టూటౌన్ పోలీసు స్టేషన్. విలేకరుల సమావేశం. "నాలుగు రాష్ట్రాల్లో , అమ్మాయిలను బలవంతంగా అత్యాచారం చేసి, వాటిని వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం లేదా ఆ వీడియోలు సీడీలుగా తీసి అమ్ముకుంటున్న సుధీర్ గాంగ్ ముఠాను ఈ అమ్మాయి ఉష ఇచ్చిన ఓ చిన్న సమాచారంతో పట్టుకోగలిగేం!"చెప్పారు మహిళా ఎస్సై మంజుల. "ఎస్సై గారూ, ఆ ముఠా వాళ్ళ కార్యకలాపాలు ఏమిటి ?" అడిగాడు ఓ విలేఖరి. "వీళ్ళు , ఇలా ఓ డమ్మీ అడ్రసుతో సిమ్ తీసుకుని, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ లాంటి ప్రాంతాల్లో, ఆ ఫోన్ ను వదిలేసి, ఆ తరువాత రంగంలోకి దిగుతారు. ఆ ఫోన్ ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గర ఉంటే ఇదిగో ఇలా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తారు. అలా కాకుండా కుటుంబంతో ఉంటే ఏమీ ఎరగనట్టు వచ్చి ఫోన్ తీసేసుకుంటారు" చెప్పారు మంజుల. "ఉష గారూ, మీకు ఆ ముఠా మీద ఎప్పుడు అనుమానం వచ్చింది ?" అడిగాడు మరో విలేఖరి. "సాధారణంగా ఎవరైనా ఫోన్ పోతే, వెంటనే వచ్చి తీసుకుని పోతారు. కానీ ఇతను ఫోన్ తీసుకోకుండా ఏవో కారణాలు చెప్పడంతో నాకు మొదట అనుమానం వచ్చింది. అంతేకాదు, నాకు తెలియకుండానే నేను ఒంటరిగా ఉన్నాను అని అతనితో చెప్పేసాను. ఇలాంటి సంఘటన ఓ రెండు నెలల క్రితం హైదరాబాద్ లో జరిగిన విషయం, నాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే నిన్న మధ్యాహ్నం పోలీసు స్టేషన్ కి వచ్చి మొత్తం జరిగింది చెప్పాను" చెప్పింది ఉష. "ఈ అమ్మాయి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు స్టేషన్ కి వచ్చి చెప్పడంతో, మేము అలర్ట్ అయ్యాం. వెంటనే మా రాజానగరం పీ.యస్. ని సంప్రదించాం, ఏ స్కూటర్ అయినా ఏక్సిడెంట్ కి గురి అయ్యిందా అని. అలాగే అన్ని హాస్పిటల్స్ వెరిఫై చేసాం, ఏదైనా ఏక్సిడెంట్ కేసు వచ్చిందా అని. అలాంటి కేసులు ఏమీ రాలేదని తేలడంతో మా అనుమానం నిజం అయ్యింది. ఈ అమ్మాయికి ధైర్యం చెప్పి, ఆ ముఠాను వీడియో తీస్తుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ చేసాం. వాళ్ల పాపం పండింది. మన ఉచ్చులో పడ్డారు" చెప్పారు ఎస్సై గారు. "ఉష గారూ, మిమ్మల్ని వాళ్ళు బలాత్కారం చేయబోతోంటే, ఆశ్చర్యంగా లోపలికి పోలీసులు ఎలా వచ్చారు ?" అడిగాడు ఇంకో విలేఖరి. "ఎస్సై గారి ప్లాన్ లో భాగంగా, నాకు ఒక కార్డ్ లెస్ కాలింగ్ బెల్ ఇచ్చారు. అతను నా మీద పడడానికి ప్రయత్నిస్తూంటే, వెంటనే నా దుస్తుల్లో దాచుకున్న బటన్ నొక్కేను. వెంటనే బయట వేచి ఉన్న పోలీసుల వద్ద ఆ బెల్ మోగడంతో బిలబిల మంటూ అందరూ లోపలికి వచ్చేసారు" ఆనందంగా చెప్పింది ఉష. "ఎస్సై గారూ, మరి అగంతకుడు లోపల తలుపు వేసేసాడు కదా ! మరి మీ పోలీసులు లోపలికి ఎలా వెళ్ళగలిగేరు ?" అడిగాడు ఓ ఔత్సాహిక విలేఖరి. "గుడ్ క్వశ్చన్. ఇది కూడా మా పథకంలో భాగమే. అది ఆటోమేటిక్ లాక్ ఉన్న తలుపు. లోపలి నుంచి, బయటనుండి కూడా తీసుకోవచ్చు. ఆ అమ్మాయి నుంచి రెండో తాళం తీసుకుని మా పోలీసులుకు ఇచ్చాం. బెల్ రాగానే లోపలికి దూసుకు పొమ్మని" చెప్పారు మంజుల. "ఎస్సై గారూ, మరి ఈ విషయంలో మీరు ఇంకా ఏమైనా చెప్పదలచుకున్నారా?" "అమ్మాయిలు అందరూ ఇటువంటి సంఘటనలు జరిగినపుడు భయపడకుండా మన ఉష లాగ ధైర్యంగా వచ్చి పిర్యాదు చేస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా, నేరస్తులను పట్టుకోవడం సులభమౌతుంది. అలా కాకుండా వారిలో వారు కుమిలిపోయి, ఆత్మహత్యలు లాంటి చేసుకోవడం వలన మీకు తెలియకుండానే మీరు నిందితునికి ఇంకో అవకాశం ఇస్తున్నారన్న విషయం మరచి పోవద్దు.' అని ముగిస్తూ..ఉష వద్దకు వచ్చి, "అమ్మాయ్ ఉషా ! అందరూ నీలాగే ధైర్యంగా ఇటువంటి సంఘటనలు ఎదుర్కో వాలని కోరుకుంటూ, నీ ధైర్యసాహసాలు గురించి ప్రభుత్వానికి తెలియచేస్తూ ఓ లెటర్ పంపుతాం. ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్స్ ఫర్ యువర్ వండర్ ఫుల్ సపోర్ట్."అంటూ ఉషని అభినందించి, ముందుకు కదిలేరు మహిళా ఎస్సై మంజుల. ***** **** సమాప్తం ***** *****

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి