కారు నెమ్మదిగా పోతూంది. ఆ ప్రయాణం ఒక కారణం తో జరుగుతోంది. కార్లో కూర్చున్న నలుగురూ ఆలోచనలూ వేరుగా వున్నాయి.
కారులో వున్నది డ్రైవ్ చేస్తూన్న శంకరం, భార్య సావిత్రి, ఆమె తమ్ముడు అనిల్, అనిల్ భార్య రాధ.
అనిల్, రాధ ‘తమ ఈ ప్రయత్నం ఫలిస్తుందా’ అని, సావిత్రి ‘ఈ సారి మంచే జరగాలి’ అని, ‘ఇది అయ్యే పనేనా మంత్రాలకు చింతకాయలు రాలతాయా..’ అని శంకరం.
సావిత్రి “చూద్దాం ఏ పుట్టలో ఏ పాము౦దో... టెక్నాలజీ తో వద్దనుకున్నారు కదా. మన సాయం కోరితే బాగుండదు” అంటే ఇంకేమీ మారుమాట లేకుండా వచ్చాడు మూడనమ్మకాలు అస్సలు నమ్మని శంకర౦.
రాకెట్ యుగం లో వున్నా ప్రజలు ఇంకా క్షుద్ర పూజలు చేయిస్తూనే వున్నారు, చిలక జోస్యాలూ చెప్పించుకుంటున్నారు. దేనిని ఆపగలం?అనుకుంటూ బయలు దేరాడు శంకరం
ఇంతకూ సమస్య అనిల్ కు పెళ్లి అయి నాలుగేళ్ళు దాటినా పిల్లలు కలగలేదు. టెస్టులు చేసుకున్నాక పిల్లలు కావాలంటే ఇప్పుడు చేసే వివిధ విధానాలను డాక్టర్లు చెప్పినా ‘వద్దు’ అనుకున్నారు. అప్పటి నుండీ మొక్కులూ అవీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరో పలసపల్లె లో స్వామీజీ వున్నాడని ఆయన దగ్గరకు వెళ్ళి వచ్చాక సంతానమే కాదు ఇతర బాధలూ, రోగాలూ తగ్గుతున్నాయని తెలిసి అక్కడికి బయలుదేరారు...అందుకే ఈ ప్రయాణం.
***
పలసపల్లి చెరినాక గంగమ్మ గుడి దారి పట్టి అయిదు నిముషాల్లోనే అక్కడికి చేరి నారు. ఒక చిన్న గుడి, దాని ముందు రేకుల షెడ్డు అందులో కూర్చున్న మనుషులూ కనిపించారు. గుడి లోపల నుండీ కర్పూర హారతి చేస్తూ ఒక వ్యక్తి తెల్లటి బట్టల్లో భుజం మీద కాషాయ అంగ వస్త్రం దరించిన పూజారి గంట మ్రోగిస్తే అందరూ లేచి నిలబడినారు. హారతి తీసుకున్నారు. చివరగా నిల్చున్న అనిల్ వాళ్ళ ను చూసి ”ఇప్పుడే వచ్చినట్టున్నారు. కొంచెం ఆగండి”అని చెప్పాడు ఆయన. శ్రీధర్ కు ఎందుకో ఆయన ముఖ౦ చాలా తెలిసినట్టుగా అనిపించింది. గడ్డం, ముడి వేసుకున్న జుట్టు తప్పిస్తే ఈ మనిషిని ఎక్కడ చూసివుంటాను అని తేల్చుకోలేక పోతున్నాడు.
“మీరు నేను చెప్పిన విధంగా 21 రోజులు దీక్ష చేసి మిగిలిన నెల రోజులూ అదే విధంగా మనసు పవిత్రంగా చేసుకుని కోరికను గుర్తు చేసుకోండి. మీకు సత్పలితం వస్తే ఇక్కడ కు వచ్చి మొక్కు తీర్చుకోవాలి.. సరేనా”అని అక్కడ వున్న వారిని ఉద్దేశించి అన్నాడు. అందరూ ఆయనకు దూరం నుండీ మొక్కీ గంగమ్మ ముందు ప్రణమిల్లీ. బయలు దేరారు.
వారు వెళ్ళినాక అనిల్ వాళ్ళ వైపు తిరిగి “అమ్మకు మొక్కు కోవాలని వచ్చినారా? ఇక్కడ కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని పక్కనే వున్న చిన్న ఇంట్లోకి వెళ్ళారు. బహుశా ఆయన నివాసమేమో. ఒకసారి గుడి లోపలవున్న చిన్న విగ్రహానికి దండం పెట్టుకుని వచ్చి అక్కడే వున్న జ౦ఖాణా మీద ఆశీనులయ్యి ఆయన కోసం కాచుకున్నారు.
పది నిముషాల్లోనే వచ్చాడు ఆయన.
“మొదటిసారి వస్తున్నాము. ఇక్కడివిశేషాలు చెప్పండి సామీ” అన్నాడు కుతూహలంగా శంకరం.
“ఇక్కడ స్థలపురాణం ఏమిటి అని అడగ వద్దు. అమ్మవారు ఎన్నాళ్ళ నుండీ వుందో తెలియదు నాకు ఉపదేశం ఇచ్చిన గురువుగారు ఇక్కడ చూపించి ధ్యానం చేయించారు. ఆయన కాలం చెందినా నేను ఈ స్థలం వదలలేదు. స్థలమహాత్యం కావచ్చు కొంత ధ్యానం చేస్తే నిజమైన ఫలితం రావడం తో జనం రావటం. అమ్మవారికి వచ్చిన కానుకలతో ఈ చిన్న గుడి కట్టడం జరిగినది. ఆ నమ్మకం తోనే ఇక్కడ కొన్ని కుటుంబాలకు టెంకాయలు, కర్పూరం లాటి పూజా సామాగ్రి అమ్మడంతో జీవనోపాధి కలిగి, నాకు కూడా ఒక వసతి ఏర్పడింది. మీరు చెప్పండి మీ గురించి..”
అనిల్ కు సంతానం కలగక పోవడం. టెక్నాలజీ తో కాకుండా, సహజం గా పుడితే బాగుంటుందని ఇలా ప్రయత్నం చేస్తుంటే మీ గురించి తెలిసింది. ఒక సంతానమే కాక ఇతర జబ్బులు కూడా తగ్గుతాయనటం తో ఎంతో ఆశతో ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు.
“సరే మీరు అక్కడ వున్న బావి లో నీళ్ళతోడుకుని కాళ్ళు కడుక్కుని రండి. అమ్మకు హారతి ఇస్తాను.”అని గుడి లోపలకు వెళ్ళాడు.
వీళ్ళు వచ్చాక గంగమ్మకు కర్పూర హారతి ఇచ్చి అందరూ తీసుకున్నాక ‘సమస్య వున్నదంపతులు
లోననే ఆశీనులు కండి’ అన్నాడు. శంకరం, సావిత్రీ బయటకు నడిచారు. అనిల్ దంపతులు లోన కూర్చుంటే వారి ఎదురుగా పద్మాసనం లో స్వామి కూర్చున్నాడు.
శంకరం వాళ్ళు బయట కూర్చుని చుట్టూ పరిసరాలను గమనించారు. చిన్న చిన్న షాపులు వున్నా ఆవరణమంతా శుబ్రంగా వుంది. పదిహేను నిముషాల తరువాత స్వామి బయటకు వచ్చి అనిల్ వాళ్ళు ఇంకా కొద్ది నిముషాలు ధ్యానం చేసుకుంటారని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళాడు.
శంకరం భార్యను కూర్చోమని తాను స్వామి ఇంటి తలుపు మీద ఒకసారి కొట్టగానే ఆయన లోనికి రమ్మన్నాడు. అక్కడే వున్న ఒక బెంచీ మీద శంకరాన్నికూర్చోమని తాను ఎదురుగా కూర్చున్నాడు..
“స్వామీ, మీరు నాకు తెలిసినట్టు అనిపిస్తే అడగడానికి వచ్చాను. నాకు స్కూల్ లో మీలాగే వున్న రాజు అన్న స్నేహితుడు వుండే వాడు. పదవతరగతి తరువాత రాజు వూరు విడిచి వెళ్ళా డు తరువాత అతని గురించి తెలియదు. మీరు రాజు లాగా అనిపిస్తే, మీరు ఏ ప్రా0తం వారో అడగాలని ...”
“శంకరం నేనూ గుర్తుబట్టాను. నేను రాజునే ..” అన్నాడు స్వామి నవ్వుతూ .
“అవునా, మరి ఇదేమిటి ఇలా మారిపోవడం ..”
“మొదట అందరి కథే.. సరిగా చదవటం లేదని ఇంట్లో పోరు మీకందరికీ తెలిసినదే. ఒకరోజు నాయన బాగా కొడితే కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోయాను. రోజూ కడుపునింపుకోవడం కోసం నానా కష్టాలూ పడ్డాను... బయట ప్రపంచం ఎన్నో నేర్పింది.. తరువాత వెనక్కి వూరికి వచ్చేద్దామని రైలు ఎక్కితే, ఆరైల్లో ఒక స్వామీజీ కనబడి నన్ను తనతో తీసుకు వచ్చాడు ఈ ప్రాంతానికి. నాకు ధ్యానం నేర్పాడు..మొదట అన్య మనస్కగానే వున్నాను. ఒక మూడు నెలల్లో ధ్యానం ఎంత శాంతినిస్తుందో తెలిసింది. అందులో ఆయన చెప్పిన ఒక్క వివరణ నాకు చాలా నచ్చింది. ప్రతి విషయానికీ శ్రద్దగా ఒకే మనసుతో చేయగలిగితే తప్పకుండా ఫలితం వస్తుంది అని...ఈ విషయం నాకే పరిమితం కాకుండా నలుగురికి సహాయ పడాలని ఇక్కడే నిలిచాను. చుట్టుపక్కల వాళ్ళు నన్ను గమనించి తమ సమస్యలను చెప్పుకోవడం, దానికోసం ధ్యానం ఎలా చేయాలో నేర్పడం మొదలు పెడితే వారికి నిజం గానే మంచి ఫలితాలు వచ్చాయి. ఇంకా నలుగురికి చెప్పి ఈ గుడి
గురించి అందరికీ తెలిపేలా చేసిందనడానికి నిదర్శనమే మీరు అంతదూరం నుండీ రావడానికీ కారణం”
“అంటే కేవలం మన నమ్మకం, మనస్సు ఒక్క దానిమీద నిలపడం కావచ్చు. కోరికల కోసం హనుమాన్ చాలీసా 41 రోజుల మండలం చేసినట్టే అనిపిస్తుంది కదా..” అన్నాడు శంకరం.
“నిజమే, ఇది నమ్మకమే. ఇక్కడ దేనికీ పెద్దఎత్తున పూజలూ, కానుకలు ఇవ్వమని ప్రలోభ పెట్టడం వుండదు. ఈ గుడి లోపల మొదటిసారి ధ్యానం చేయడం కూడా వారి మనస్సులో నిలుస్తుంది ... అందుకే రోగాలయినా, సంతానం అయినా ఇతర ఏ సమస్యలైనా తీరుతున్నాయి. ఇంకా ఒక్కటి ఇక్కడ మొక్కు తీరాక కేవలం వారి ఇష్టానికి కానుక హుండీలో వేసి చివరగా ఇక్కడ ధ్యానం చేసుకోవడమే. కాబట్టి డబ్బు ఒత్తిడి లేదు. ఈ ధ్యానం చెడు కోరికల కోసం పని చేయదు అని మొదటనే చెబుతాను. కాబట్టి అందరికీ మంచికే ఉపయోగ పడుతూంది..”
“వూర్లో మీ అమ్మా, నాయనా..”అడిగాడు శంకరం
“కాలం చేశారు. నేను ఎటువంటి బంధాలనూ ఏర్పరచుకోలేదు. ఉన్నన్నాళ్ళూ నలుగురికీ ఉపయోగపడితే చాలు శంకరం. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతునదనే ఆశీర్వదిస్తున్నాను... మీ ఏకాగ్రతే ఉపయోగపడుతుంది ”రాజు చాలా నిజాయితేగా అంటూంటే లేచి ఒక నమస్కారం పెట్టి లేచి వచ్చాడు శంకరం. బయట అనిల్ దంపతులు స్వామి బయటకు రాగానే నమస్కారం పెట్టి ‘ మళ్ళీ వస్తామని చెప్పారు.
అందరూ కారువైపు నడుస్తుంటే “స్వామి నీతో ఏమైనా చెప్పాడా బావా“అన్న అనిల్ ప్రశ్నకు శంకరం
“లేదు అనిల్, ఈ ప్రాంతం గురించి అడిగాను అంతే. మీరు ఆయన చెప్పినట్టు చేస్తారు కదా..”
“తప్పకుండా, అక్కడ చాలా ప్రశాంతం గా అనిపించింది. చాలా మహిమ గల ప్రదేశం, అమ్మవారు, స్వామీ జీ అంతా బాగుందని అనిపించింది.. ఈ సారి బిడ్డతోనే వస్తాం’ అనిపించిందనుకొండి” అనిల్ భార్య రాధ దగ్గరనుండీ వచ్చింది సమాధానం... శంకరం చిన్నగా నవ్వుకున్నాడు..
రెండునెల్ల తరువాత అనిల్ రాధ నెలతప్పడం మాత్రం శంకరానికి నవ్వుతెప్పించలేదు.
ఎందుకంటే ఎంతో మంది స్వామీజీల మీద నమ్మకం తో వారిని పోషిస్తూ ఉంటే చాలా మంది దొంగ సన్నాసులూ డబ్బు చేసుకుంటూ వున్నారు. ఈ నేపధ్యంలో రాజు డబ్బు ఆశ లేకుండా మంచి ఉద్దేశ్యం తో భక్తులు తమ మనసును ఏకాగ్రత చేయగల ధ్యానం విధానం తో అందరికీ ఉపయోగ పడుతుండంటే తప్పేమిటి? అనుకుంటూ ఒక నమ్మకాన్ని అంగీకరించాడు శంకరం.
****