(గల్పిక)
సోమలింగం ఒక ప్రైవేట్ కంపెనీలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు . ఆఫీసుపను లన్నీ చక చక చేస్తూ అధికారుల మెప్పు మెండుగా పొందుతాడు గానీ ఇంట్లో పనులుగానీ ,స్వంతపనులు గానీ అనేటప్పడికి అతను ఎంతటి ముఖ్యమైన పనినైనా బద్ధకించేస్తాడు ,ప్రతి పనినీ వాయిదా వేయడంలో సిద్ధహస్తుడు . ఈ విషయంలోనే భార్య సుందరితో పాటు ఇంటిల్లి పాదికీ ఎప్పుడూ ఇంట్లో చిన్న - పాటి యుద్దాలు జరుగుతుంటాయి . ఇంట్లో ఎంతటి వ్యతిరేకత వచ్చినా ,సునా యాసంగా నెగ్గుకురాగలడు . అలా అని అతని తెలివి తేటలతో నెగ్గుకొస్తాడని కాదు ,అతని మొండి వైఖరి తట్టుకోలేక అవతలివాళ్లే తోకముడిచేస్త్తారు . అలా అని ఇంటివాళ్ళని వాల్లపనులు వాళ్ళని చేసుకోనివ్వడు ,ప్రతిదానిలోనూ వేలు పెట్టి వెర్రిమొర్రి పనులు చేస్తుంటాడు . ఇది ఇంట్లోవాళ్లకే కాదు ఒకోసారి బంధు వులకీ స్నేహితులకీ కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి . అయినా అతని అతితెలివి ఆలోచనలు మానుకోడు !అందుకని ఏదైనా సమస్య వస్తే తప్ప అతనిగురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు . సోమలింగం మాత్రం అతని నైజం ఏమాత్రం మార్చుకోవడానికి సాహసించడు . అలా జీవితం బాగానే లాగించేస్తున్నాడు , కుటుంబ సభ్యులుకూడా అతని ధోరణికి అలవాటు పడిపోయారు . రోజులు గడిచిపోతున్నాయి . అరవై ఏళ్ళు నిండిన సోమలింగం ఆఫీసులో ఎలాంటి సమస్యలు లేకుండానే పదవీ విరమణ చేసాడు . అంతవరకూ బాగానే ఉందిగానీ ,అతని చాదస్తానికి తోడు ఇప్పుడు మతిమరుపు కూడా అతనితో చేయికలిపింది . మొత్తం సమయం ఇంట్లోనే గడపడం తో అప్పుడప్పుడూ పరాకు మాటలు కూడా మాట్లాడుతున్నాడు . దీనికి తోడు మళ్ళీ అయిదుగురు ఆడపిల్లలతరువాత పుట్టిన మగసంతానం అతని కాలక్షేపానికి అదనపు ఆకర్షణ అయింది . కొడుకు మీద ఈగ వాలనివ్వడు . గారాభం తీవ్రస్థాయికి చేరుకొని , ఏమేమి చేయకూడదో అన్నీ చేస్తున్నాడు . తండ్రి అండ అతనికి ఒక వరం అయింది . దానితో ఆ పిల్లవాడి అల్లరికూడా అంచనాలకు మించిపోయింది . అది ఎంతవరకూ అంటే ,సోమలింగం సైతం ఏరూపంలోనూ అదుపుచేయలేనంత ! ఇలాంటి నేపథ్యంలో ఒకరోజు అర్ధరాత్రిపూట వాళ్ళ కుటుంబ వైద్యుడు డా . రంగారావు ను నిద్రలేపాడు సోమలింగం . సోమలింగం ఫోను అనగానే అది ఒక పనికి రాని ఫోన్ కాల్ అనితెలిసినా ,అర్ధరాత్రి ఫోన్ చేసాడంటే అదేదో సీరియస్ మేటర్ కూడా కావచ్చునని ఆలోచించి మానవతా దృక్పధంతో మంచం మీదినుండి లేచి కూర్చుని ‘’ హలొ .. !’’ అన్నాడు . ‘’ అయ్యా .. డాక్టరుగారూ .. బాగున్నారా ?’’ అన్నాడు సావధానంగా మన సోమలింగం . ‘’ ఈ సమయంలో ఫోన్ చేసి .. ఇదేమి సంభాషణ య్యా ?’’ అన్నాడు విసుక్కుంటూ కాస్త నిద్రమత్తులో . ‘’ అయ్యో డాక్టరుగారూ మరోలా అనుకోకండి ,తమరిని పలకరించకుండా ,నా సమస్యను చెప్పడం ఏమి బాగుంటుంది చెప్పండి !’’ అన్నాడు సోమలింగం ‘’సరేనయ్యా .. ఇప్పుడైనా అసలు విషయానికి వస్తావా ?లేదా ?’’ అన్నాడు మరింత విసుగ్గా . ‘’ అయ్యో .. అలా అంటే ఎలా ?నాకు అత్యవసరమైన పనివుండే ఇప్పుడు చేయాల్సి వచ్చింది ‘’ అన్నాడు సాగదీస్తూ ,అసలు విషయం ప్రస్తావించకుండా ‘’ చూడు సోమలింగం .. నా సహనాన్ని దారుణంగా పరీక్షిస్తున్నావయ్యా .. డాక్టర్ గా ప్రస్తుతం నేను నీకు ఎలా సాయపడగలనో .. దయచేసి చెప్పగలవా?’’ అన్నాడు పాపం కోపాన్ని అణగదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఆ డాక్టర్ మహాశయుడు . ‘’ అయ్యో .. మీ అవసరం వుందికదా ,ఇంతరాత్రి అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ‘’ అన్నాడు సోమలింగం . ‘’ మహాశయా .. అసలు విషయానికి రావయ్యా బాబూ ‘’ అన్నాడు కాస్త నిద్రమత్తు వదిలిపోయిన ప్రశాంతతో . ‘’ అవును .. అదే డాక్టర్ గారూ .. మా చిన్నబ్బాయి లేడూ .. వాడు మహా అల్లరి .. ‘’ అని ఇంకా ఏదో చెప్పవుతుండగానే .. డాక్టర్ అందుకుని – ‘’ అయితే నన్నేమి చేయమంటావయ్యా ?’’ అన్నాడు చికాగ్గా . ‘’ అక్కడికే వస్తున్నానండి మహాప్రహో .. వాడికి గారాభం ఎక్కువై ,చెప్పిన– మాట బొత్తిగా వినడం మానేసాడు . వాడు అడిగింది కొనివ్వలేదని తాళం వేసివున్న మా బీరువా తాళం మింగేసాడండీ ‘’ అన్నాడు ఏదో కథచెబుతున్న స్టయిల్లో . ‘’ తాళం మింగేసాడా ?ఎప్పుడూ .. ?’’ అన్నాడు ,ఎమర్ఝన్సీ కి సిద్దపడినవాడి లా , ‘’ వారం రోజులయిందండీ .. ‘’ అన్నాడు సావధానంగా సోమలింగం . ‘’ ఆ .. వారం రోజులా .. ! మరి .. అప్పటి నుండి ఏమి చేస్తున్నావ్ ?ఇంత అర్ధరాత్రి నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావ్ ‘’ అన్నాడు కాస్త కోపంగా . ‘’ అదే చెప్పబోతున్నా సార్ .. ఈ వాల్టి వరకూ బీరువా డూప్లికేట్ తాళం వాడాను ,ఎలాంటి ఇబ్బంది లేకుండా ,కానీ ఇప్పుడు అదికూడా కనిపించడం లేదండీ .. అందుకనీ .. ‘’ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే — ‘’ ఛీ .. ఫోన్ పెట్టెయ్ !!’’ అని తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తలపట్టుకుని మంచంమీద కూలాడిపోయాడు ఆ సహృదయ ధన్వంతరి . ***