దాదాపు నలభై సంవత్సరాల తర్వాత రామారావును హైద్రాబాదులో కలుసుకున్నాడు మోహన్రావు .
" అలా ఆశ్చర్య పోకు. ఇదంతా వయసు తెచ్చిన మార్పు. ఎప్పుడో నువ్వూ నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్నప్పుడులా వుంటానని ఎలా అనుకున్నావు ? అప్పుడు నిజమే తలంతా ఉంగరాల జుట్టుతో అచ్చం చిన్నప్పటి నాగేశ్వర రావులా వుండే వాడిని అని అందరూ అనుకునే వాళ్ళు. తర్వాత ఉద్యోగాలలో టెన్షన్లు, పిల్లల చదువులు , పెళ్లిళ్లతో ఆ తర్వాత ఎదురైన సమస్యలతో జూట్టంతా చెదిరి పోయింది. నా విషయం సరే . నువ్వు అప్పటి దుబ్బు జుట్టు ఇంకా ఎలా మెయిటైన్ చేస్తున్నావు కొంపదీసి విగ్గు కాదు కదా ? కొద్దిగా నల్లగా చామన ఛాయిగా వుండేవాడివి ఇప్పుడు దబ్బపండు రంగులో మెరిసి పోతున్నావు ఎలా సాధ్యమయ్యిందిరా బాబూ ? " అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు మోహన్రావు .
" అదేమీ కాదులేవోయ్ . మా ఇంట్లో మా తాతగారికి కానీ, మా నాన్నకు కానీ బట్టతల లేదు. కాబట్టి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం లేదు . ఇక పోతే ఆర్ధిక సమస్యలు అంటూ ఇప్పటివరకూ అనుభవం కాలేదు. ఇక రంగు తేలాను అంటున్నావు కాబట్టి చెపుతున్నాను . ఒకే చోట లెక్చరర్గా ఉద్యోగం. బదిలీలు లేవు. మా వూళ్ళో ఎండలు కూడా తక్కువే. " అన్నాడు రామారావు విజయగర్వంగా .
" పెట్టిపుట్టావురా బాబూ . నేను చూడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోలేక పోయాను. . ప్రైవేట్ ఉద్యోగాలలో నాతో పనిచేసే పై ఆఫీసర్లు, కింద వాళ్ళ పద్దతులు నచ్చక వాళ్ళతో పొసగక ఎన్నో కంపినీలు మారాను. వాళ్ళ అక్రమ సంపాదనకు అడ్డంగా వున్నానని అనుకుంటున్నారో ఏమో ఉద్యోగం మానేసి వెళ్లిపోతూ వుంటే పండగ చేసుకునే వాళ్ళు. ఒకసారి జబ్బు చేసి ఆసుపత్రిలో వుంటే ఆఫీసులో నా టేబుల్ కూడా పక్కకి తీసేశారు. ఇక ఫోటోకి దండ వెయ్యడం ఒకటే తక్కువ. ఉద్యోగాలు మారే క్రమంలో సంపాదించుకున్న డబ్బంతా రవాణాకి, ఇళ్ళు మారడాలకూ సరిపోయేది. అప్పటినుండి నా జీవన శైలిలో చాలా మార్పు వచ్చింది. ఎటువంటి ఆర్భాటాలు , బేషిజాలు పోదల్చుకోలేదు . ఏదైనా ఖర్చు చెయ్యాలంటే రెండు రోజులు వాయిదా వేసేసరికి ఆ ఖర్చు అనవసరం అనిపించి దాని జోలికి వెళ్ళే వాడిని కాను. కొంతమంది అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు చేసిన పిసినారి కారెక్టర్ నిజజీవితంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం అని అవహేళన చేసినా ఏ మాత్రం భంగపడక నేను నా దారిలో నేను వెళ్ళే వాడిని. అది సరే. ఈ నలభై ఏళ్లల్లో నేను నీకు అస్సలు గుర్తుకు రాలేదా ? అడపా దడపా పత్రికల్లో కధలు , కార్టూన్లు, రేడియొలో హాస్య నాటికలు నావి వస్తూండేవి కదా. . ఒక్కసారి కూడా అవి నీ దృష్టికి రాలేదా ? నువ్వు కూడా పుస్తకాల పురుగువే కదా ? సంపాదనలో పడి అందరినీ మర్చిపోయి వుంటావులే " అన్నాడు మోహన్రావు వ్యంగ్యాత్మకంగా నవ్వుతూ .
"అవునురా. అప్పట్లో హాస్య కథలు రాసి పత్రికలకు పంపుతూ మిమిక్రీ కూడా చేస్తూ వుండేవాడువుగా. నిన్నెలా మర్చిపోగలను ? ఎటొచ్చీ మనం ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాక నువ్వు ఎక్కడుంటున్నావో నీ వ్యాపకాలు ఏమిటో నేను తెలుసుకోలేక పోవడం నా పొరపాటే. " అన్నాడు రామారావు అపరాధిలా తలదించుకుంటూ.
" సరే కానీ నిన్నిలా రైల్వే స్టేషన్లో నిలబెట్టి మాట్లాడటం నాకు ఇబ్బందిగా వుంది. పద మన ఇంటికి వెళ్ళి హాయిగా ముచ్చలాడుకుందాం . నీకు మా దొడ్లో కాసిన కూరలతో మీ చెల్లెలు రుచికరమైన వంటలు చేసి పెడుతుంది. రాత్రి పూట చక్కగా ఆరుబయట మడత మంచాల మీద పడుకుని చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ నువ్వుండే ఈ రెండు మూడు రోజులు సరదాగా గడిపేద్దాం " అంటూ మోహన్రావు రైల్వే స్టేషన్కు దగ్గరగా వున్న తన ఇంటికి రామారావును తీసుకు వెళ్ళి భార్య రాధికకు పరిచయం చేశాడు.
తన మిత్రుడు రామారావును ఇంటికి తీసుకువస్తున్నాడన్న విషయం ముందే భార్య రాధికకు చెప్పి వుండటంతో ఆవిడ ఇల్లంతా నీటుగా సర్ధి వుంచింది.
" చాలా సార్లు మీ గురించి చెప్తూండేవారు కాలేజీలో కలిసి చదువుకున్నామని . ఇప్పుడెక్కడున్నాడో మా ఫ్రెండ్ అని తల్చుకోని రోజు లేదంటే నమ్మండి " అంది మోహన్రావు భార్య రాధిక మొహం చాటంత చేసుకుని .
" అవునమ్మా అప్పుడు మేము ఎంతో చనువుగా ఒకరినొకరం వదిలి వుండే వాళ్ళం కాము . చిన్నప్పుడు వీడు వేసిన జోక్స్ గురించి ఎంజాయ్ చెయ్యని వాళ్లంటూ లేరు . కాలేజీ లెక్చరర్ లను కూడా పకపకా నవ్వించేసే వాడు. ఇద్దరు ముగ్గురు ఆడ ఫ్రెండ్స్ కూడా వీడంటే పడిచచ్చేవాళ్లు . . కంగారు పడకులేమ్మా . వీడు ఆ వూరు విడిచి వెళ్లిపోయాక ఆ అమ్మాయిలు వీడిని మరిచిపోయారులే . నా అదృష్టవశాత్తు చాలా కాలం తర్వాత ఒక ముఖ్యమైన మిత్రుడి ద్వారా వీడి ఆచూకీ కనుక్కుని ఆగలేక వెంటనే బండెక్కి వచ్చేశాను. . " అన్నాడు రామారావు విచిత్రమైన భావోద్వేగానికి లోనవుతూ .
ఒక పక్క దొడ్లో రంపపు పొట్టు పొయ్యిమీద నీళ్ళు సలసలా కాగుతున్నాయి రామారావు స్నానం చెయ్యడం కోసం. . ఈలోపు రాధిక ఇద్దరికీ చెరో పెద్ద గ్లాడుసు నిమ్మకాయ రసం తెచ్చి అందించింది.
" ఇవి మన దొడ్లో కాసినవే. వీటి రుచి బహుశా నువ్వు ఎక్కడా చూసి వుండవు. ఎండను పడి వచ్చాం కదా .మొహమాట పడక్కరలేదు. ఇంకా ఒకటి రెండు గ్లాసులు కూడా నిరభ్యంతరంగా తాగేయొచ్చు . వెళ్ళేటప్పుడు నీకు రెండు మూడు డజన్లు నిమ్మకాయలు కూడా పార్సిల్ చేసి ఇస్తానులే . ఈ రుచి చెల్లెమ్మకు, పిల్లలకు కూడా చూపించు " అన్నాడు మోహన్రావు నవ్వుతూ. నిష్కల్మషమైన ఆ నవ్వులో ప్రేమానురాగాలు ఉట్టి పడుతున్నాయి ..
ఇంటికి రాగానే మోహన్రావు వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఆఫర్ చేస్తాడని అనుకున్నాడు రామారావు. ప్రయాణపు బడలికతో ఉండటంవల్ల కాఫీ తాగాలనిపించింది. .
" ఇంకా నిమ్మకాయ రసం వద్దుకానీ ఒక అరగంట తర్వాత వేడి వేడి కాఫీ చేయించి ఇవ్వరా బాబూ . ప్రయాణంలో ఒళ్ళంతా చింతకాయ నలక్కొట్టినట్టుగా వుంది. . . కాస్త వేడి పానీయం తాగితే సర్ధుకుంటుంది " అన్నాడు రామారావు మొహమాటాన్ని పక్కన పెట్టి.
"సారీరా బ్రదర్. మా ఇంట్లో మేము అస్సలు కాఫీ తాగం. మా ఒంటికి శుభ్రంగా నిమ్మకాయ రసం పట్టేసింది. . ఇందాక నాకు కొన్ని అలవాట్లు వున్నాయి అవి అవతలివారికి చాలా ఇబ్బందికరంగా వుంటాయని చెప్పాను కదా. అందులో ఇది మొదటిది అనుకో. మా ఇంట్లో కొంత గ్రామీణ వాతావరణం ప్రతిబింబిస్తుందని అందరూ అంటూ ఉంటారు. నేను పొరపాటు చేశానులే. అవతలి వారి అలవాట్లు దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి ఇకనుండి. అలా బయటకెళ్లి కాఫీ తాగొద్దామంటే వెళదాం ."అన్నాడు మోహన్రావు గిల్టీగా ఫీలవుతూ .
"అబ్బే ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళే పరిస్తితి లేదురా. కాఫీ తాగకపోతే కొంపేమీ మునిగిపోదులే వూరికె అన్నాను " అన్నాడు రామారావు సరిపెట్టుకుంటూ.
"అయితే సరే. పొట్టు పొయ్యిమీద నీళ్ళు సలసల కాగుతున్నాయి అని చెప్పానుకదా. బాత్ రూంలో గీజర్లు అంటువంటివి పెట్టించలేదు. మా కొబ్బరి చెట్టు మట్టల సహాయంతో కొంత వంట కూడా ఆ పొయ్యిమీదే అయిపోతుంది. గ్యాస్ మరీ ఏ వర్షాకాలంలో ముసురు పట్టేసినప్పుడు పనికొస్తుందని పక్కన పెట్టేశాం. ఇంకా ఇటువంటి ఎన్నో విశేషాలు ఇక్కడ మా ఇంట్లో చూడటానికి సిద్దంగా వుండు. లే. లే నీకు నీళ్ళు తోడేస్తాను. చల్లారి పోతాయి " అంటూ లేచి నల్లటి పెద్ద బానలో సలసలా కాగుతున్న నీళ్ళను బకెట్లో పోసి రెడీ చేశాడు మోహన్రావు క్షణాల్లో . .
"ఇదిగో మనం కాలేజీలో చదువుతున్నప్పుడు నేను కాలేజీ మ్యాగజైన్ కు రాసిన కథలు జాగ్రత్తగా పెట్టి వుంచాను. ఒకసారి అటూ ఇటూ తిప్పి చూడు. ఈ లోపల మన భోజనాలు ఏర్పాటు చేయించేస్తాను " అన్నాడు మోహరావు రెండు మూడు పాత పుస్తకాలు టీపాయిమీద పెడుతూ .
వంటింట్లోంచి మంచి సువాసనలు గుప్పుమని బయటకు వస్తూండటంతో ఆ హడావిడి అంతా చూశాక మోహన్రావు ఏదో మంచి టిఫిన్ చేయిస్తున్నాడని అనుకున్నాడు రామారావు . . కానీ ఆశ్చర్యంగా భోజనానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అంటున్నాడు ఏమిటో ? పుస్తకం చూస్తున్నాడు కానీ మనసు మనసులో లేదు. ఇంకా ఎటువంటి అనుభవాలు చవి చూడాల్సి వస్తుందో అని లోలోపల భయపడుతున్నాడు.
"అన్నట్టు రామారావు అడగడం మర్చిపోయాను నీకు కాళ్ళు అవీ బాగా వంగుతున్నాయా ?" హఠాత్తుగా అడిగాడు మోహన్రావు .
రామారావు ఆశ్చర్య పోయి " నీ దయవల్ల నాకు ఇంకా ఆ పరిస్తితి రాలేదు. బాగానే వంగుతున్నాయి. ఐదు కిలోమీటర్లు వాకింగ్ కూడా చేస్తున్నాను " అన్నాడు. మనసులో మాత్రం మోహన్రావు నోట్లోంచి ఏది వినాల్సి వస్తుందో అని శంకగానే వుంది. .
"హమ్మయ్య. ఇకనేం ఏ సమస్యా లేదు. ఎందుకడిగానంటే మా ఇంట్లో భోజనాలు చెయ్యడానికి డైనింగ్ టేబుల్ లేదు. అందరం కింద కూర్చునే తింటాము .కింద కూర్చుని భోజనం చెయ్యడం చాలా ఆరోగ్యకరం అని శాస్త్రాలు చెప్తూ వుంటే వాటిని ఆచరించక పోవడం మూర్ఖత్వం . . ఈ మాత్రం డాక్టర్ల జోలికి పోకుండా ఆరోగ్యం కాపాడుకుంటున్నాం అంటే అదే కారణం. . మీ చెల్లెలు పక్క గదిలో కిందే అరిటాకులలో భోజనాలు వడ్డించేసింది. ఈ వెధవ కంచాలలో తినడం కన్నా ఆకులలో తినడం చాలా శ్రేయస్కరం అనుకో. దొడ్డినిండా అన్నేసి అరటి చెట్లు పెట్టుకుని ఉపయోగించుకోక పోవడం తెలివితక్కువ తనం అవుతుంది. నువ్వేమేనా అనుకో సాధ్యమైనంతవరకు నేను నా భార్య పక్కాగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాం. " అన్నాడు మోహన్రావు గర్వంగా ఫీలవుతూ.
" ఈ ఆకుల వెనుక అసలు రహస్యం ఇంకొకటి కూడా వుందిరా బాబూ ! . మా ఇంట్లో అంట్లు తోమడానికి పని మనిషిని పెట్టుకోలేదు. చక్కగా తిన్న ఆకులు ఎత్తి గోడ పక్కన పడేస్తే అది ఎరువుగా మారి నా చిన్న వ్యవసాయ క్షేత్రంలోని మొక్కలకు ఎంతో ఉపయోగ పడుతోంది... నీకు ఇదంతా చూస్తూంటే కొత్తగా అనిపిస్తోంది కదూ. సరే .. సరే. చక్కగా లుంగీ కట్టుకుని కూర్చో. ఫ్రీగా భోజనం చేసేద్దాం " అంటూ ఒక పొడవాటి చాప నేలమీద పరిచాడు మోహన్రావు . .
భోజనాలయ్యాక వరండాలో రెండు మడచమంచాలు వేశాడు రామారావు.
"అదిరా మిత్రమా !. చూశావుగా మా ఇంట్లో పరిస్తితి. ఇంట్లో మన ఆడవాళ్ళు సహకరించాలే కానీ ఈ రోజుల్లో నామోషీ వదిలేస్తే మనం చేసే సగం దుబారా ఖర్చులు వాటంతట అవే తగ్గిపోతాయి. డబ్బు విపరీతంగా వుంటే అవసరాలు కూడా అంతే స్తాయిలో వుంటాయి. నీ ఆర్ధిక పరిస్తితి బాగోలేదు కనుక నువ్విలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నావు మాలాగా డబ్బు దండిగా వున్నవాళ్లకు అంత ఖర్మేమి పట్టిందని నువ్వు అనుకోవచ్చు.నా ఇంటిలో నేను కొన్ని పద్దతులు పెట్టుకుని వాటిని ఆచరిస్తూ ఎంతో సంతోషంగా వున్నాను. నేను ఎవరినీ మీరు కూడా నాలాగే ఉండండి అని శాసించడం ఇష్టం లేదు. అందుకు ఆకర్షితులైన వారు ఆ మార్గంలో వాళ్లంతన వాళ్ళే వెళతారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఆ డబ్బు మిగుల్చుకుని స్థలాలు, పొలాలు కొనుక్కుంటారు . అవి మనకు కాళ్ళూ, చేతులు ఆడనప్పుడు ఆదుకుంటాయి . నేను నీకు ఇంకా ఎన్నిరకాలుగా మన సృజనాత్మకతను పెంచుకుంటూ ఇంట్లో వున్న వనరులతోనే అద్భుతంగా జీవితాన్ని ఎలా కొనసాగించవచ్చో చెప్పి నువ్వున్న రెండు రోజులు విసిగించడం ఇష్టం లేక వూరుకున్నాను. నా ఇంటికి ఎవరు వచ్చినా నా పద్దతిలో మార్పు ఉండదు. ఈ విషయంలో నువ్వు నన్ను అపార్ధం చేసుకోవని అనుకుంటున్నాను. దూరపు ప్రయాణం చేశావు. . కాసేపు విశ్రమించు. ఇక ఈ రెండు రోజులు మన చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకుందాం. నా అలవాట్లు గురించి నీదగ్గర ప్రస్తావించనులే " అన్నాడు అప్పుడప్పుడు రామారావు మొహంలో అసహనం పాళ్ళు గమనించిన మోహన్రావు. .
తిరుగు ప్రయాణంలో రామారావు ఆలోచించసాగాడు.తన భార్య అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతుంది. కట్టిన చీర కట్టదు. ఏ చెప్పులూ నెల రోజులు పొడుగునా వాడిన దాఖలాలే లేవు. సౌందర్య సాధనాలంటే పిచ్చి.అయిన దానికీ కాని దానికి డబ్బు నీళ్లలా ఖర్చు చేసేస్తుంది. పనిమనిషి లేకుండా ఒక్క నిమిషం గడవదు . పిల్లలు కూడా అచ్చంగా ఆమెనే అనుసరిస్తారు. మోహన్రావు ఆచరిస్తున్న వాటిలో ఏ ఒక్కటి కూడా తన అనుభవంలో లేదు. ఇంకా నయం తను ఈ ప్రయాణంలో భార్యను కూడా తీసుకు వచ్చాడు కాదు ?. మోహన్రావు కుటుంబాన్ని, వాళ్ళ పద్దతులను చూసి వుంటే వాళ్ళను మోహమ్మీదే అసహ్యించుకుని ఇటువంటి మిత్రుడు తనకు వున్నందుకు తనని జీవితాంతం దెప్పి పొడిచేది. నిజానికి తను నేనూ వస్తానని బలవంతం చేసినా ఆమెను తీసుకురాకపోవడం వల్ల ఎంత ప్రమాదం తప్పింది ? " ఇప్పుడు అతని మొహంలో చెప్పలేనంత రిలీఫ్ . . అప్పుడప్పుడు తోచనప్పుడు " మీ ఫ్రెండ్ వాళ్ళింటికి ఒకసారి సరదాగా వెళ్లొద్దామా ?" అని భార్య అన్నప్పుడు " వాళ్ళు ఇప్పుడు ఇండియాలో లేరులే . వాళ్ళ కొడుకులదగ్గరకు అమెరికా వెళ్లారు . ఎప్పుడు వస్తారో కూడా తెలియదు " అని చెప్పి తప్పించుకునే వాడు రామారావు ఆత్మవంచనతో .
ఏమాటకామాట చెప్పుకోవాలి మోహన్రావు ఇంట్లో తను వున్న ఆ రెండు మూడు రోజులు మటుకు అక్కడ పరిస్తితులు కొంత విభిన్నంగా వున్నా కూడా గతంలో తనెప్పుడూ అనుభవించని ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని మటుకు పొందాడు. ఆ భార్యా, భర్తల ప్రేమానురాగాల జల్లులో ఒకరకంగా తను అనుభవిస్తున్న స్వార్ధపూరిత విలాస జీవితం గురించి ఆలోచనలో పడ్డాడు. . ఇప్పుడు మోహన్రావు రామారావు మనసులో ఒక రోల్ మోడల్ గా మిగిలిపోయాడు. *******
సమాప్తం