మగధ సామ్రాజ్యాన్ని పాలించే గుణశేఖరుడు గొప్ప కళా పోషకుడు. ఒకరోజు చిత్ర లేఖనం పోటీని నిర్వహించాడు. తనను మెప్పించిన వారికి విలువైన బంగారు బహుమతులు ఉంటాయని ప్రకటించాడు. ఎంతోమంది కళాకారులు ముందుకు వచ్చారు. అందులో 20 మంది చిత్రాలు రాజును బాగా ఆకట్టుకున్నాయి. రాజుగారు మంత్రిని పిలిచి, "నేను రేపు అత్యవసర సమావేశం కారణంగా పొరుగు దేశానికి వెళ్తున్నాను. తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పట్టవచ్చు. అంతవరకు కళాకారులను నిరీక్షింప చేయవద్దు. కాబట్టి రేపు ఈ 20 మంది కళాకారులను పిలిపించి, బహుమతులను మీ చేతుల మీదుగా ఇవ్వండి." అన్నాడు. ఆ అవినీతి మంత్రి పదిమందికి సరిపడా బహుమతులను తన దగ్గర ఉంచుకొని, పది మందికి మాత్రమే బహుమతులను ఇచ్చాడు. మిగిలిన వారితో రాజుగారు ఈ పది మందికి మాత్రమే బహుమతులను ఇవ్వమని చెప్పాడు. బహుమతుల కొరత ఉందట. మిగిలిన వారిని అభినందించి పంపమన్నాడు." అని చెప్పి, పది మందికి మాత్రమే బహుమతులను ఇచ్చాడు. మిగిలిన వారు అసంతృప్తితో ఇంటికి వెళ్ళారు. ఇందుశేఖరుడు అత్యుత్తమ చిత్రకారుడు. అతని ప్రతిభ మిగిలిన చిత్రకారులకు కూడా తెలుసు. ఇందుశేఖరునికి కూడా బహుమతి రాలేదు. బహుమతి పొందిన చిత్రకారులు ఇందుశేఖరుణ్ణి హేళన చేస్తూ నవ్వారు. మా ముందు నీ ప్రతిభ తేలిపోయిందని అన్నారు. ఇవేవీ పట్టించుకోలేదు ఇందుశేఖరుడు. రాజుగారు తిరిగి రాజధానికి వచ్చాక ఇందుశేఖరుని ప్రత్యేకంగా పిలిపించాడు. "మీ ప్రతిభ అనన్య సామాన్యం. నేను ఎంపిక చేసిన 20 మందిలో మీ కళ నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. నాతో కలిసి మీరు భోజనం చేసి, నన్ను ఆనందింపజేయండి." అని అన్నాడు. ఊహించని ఈ అరుదైన సత్కారానికి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు ఇందుశేఖరుడు.ఆ తర్వాత తనను హేళన చేసిన కళాకారులు కలిసినప్పుడు ఇలా అన్నాడు ఇందుశేఖరుడు. "రాజుగారు ఇప్పించిన బంగారు బహుమతులకే పొంగిపోయి నన్ను హేళన చేశారు కదా! రాజుగారు స్వయంగా నన్ను పిలిచించి, నాతో కలిసి భోజనం చేశారు. ఈ అవకాశం ఎతమందికి వస్తుంది!" అని. సిగ్గుపడ్డారు మిగిలిన కళాకారులు. మంత్రి అవినీతి ఆలస్యంగా రాజుగారికి తెలిసింది. మంత్రి పదవి నుంచి తొలగించి అతణ్ణి కారాగారంలో బంధించాడు.