సంజీవని - శింగరాజు శ్రీనివాసరావు

Sanjeevani

పుట్టిన ప్రతి మనిషికి జీవితం ఎంత గొప్పగా వున్నా మనసులో ఏదో ఒక వెలితి ఉంటుంది. అలాగే ఈమధ్యకాలంలో పదవీవిరమణ చేసిన నాకు కూడ ఒక కొరవ మనసులో ఉండిపోయింది. భగవంతుడిచ్చిన అదృష్టమో, అవకాశమో తెలియదు కానీ, మంచి ఉన్నత పదవిలోనే నేను పదవీ విరమణ చేశాను. ఉద్యోగం వచ్చిన నాలుగు సంవత్సరాలకల్లా ఆఫీసరుగా ప్రమోషను రావడంతో నా స్థితే మారిపోయింది. అప్పటిదాకా నాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరు, ముగ్గురు స్నేహితులు కూడా పేరు పెట్టి పిలవడం మానేసి 'సర్' అని పిలవడం మొదలుపెట్టారు. మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించినా, నా పోజిషన్లో ఆ మాత్రం దర్పం చూపించకపోతే మరీ చులకనయిపోతానేమోనని వారికి అడ్డు చెప్పలేదు. రోజులు గడిచే కొద్దీ అవసరానికి దగ్గరకు వచ్చేవారు తప్ప ఆప్యాయంగా పలకరించేవారే కరువయ్యారు. అది నాకు చాలా గర్వంగా అనిపించేది. నేను అందరికంటే గొప్ప కనుక నన్ను అందరూ గౌరవిస్తున్నారని విర్రవీగిపోయాను. అడుగు వెనుక పడకూడదని కష్టపడుతూ మెట్టుమెట్టుగా ఎదిగి డిపార్టుమెంటులో పైస్థాయికి చేరుకున్నాను. ఎవరైనా నాతో మాట్లాడాలన్నా, నా ఛాయలకు రావాలన్నా భయపడేవారు. చివరకు నా భార్యా, పిల్లలు కూడ. అంతా మిలటరీ డిసిప్లేన్. మనిషి అంటే నాలాగే ఉండాలి అనుకునేవాడిని. పదవీవిరమణ సభ కూడ ఒక షష్టిపూర్తి మహోత్సవంలా జరిగింది. అందరూ వందనాలు, వెల కట్టలేని బహుమతులు. అది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. సర్వీసులో ఉండగా ఫోను ఆగేది కాదు. కానీ ఇప్పుడు ఫోను మ్రోగడం దాదాపు ఆగిపోయింది. చివరికి నా పిల్లలు కూడ 'బాగున్నారా నాన్నగారూ' అని ఒక్కమాట అడిగి 'అమ్మకివ్వండి' అనేవారు. తనతో గంటల తరబడి మాట్లాడేవారు. ఏమీతోచక నాతో పాటు పనిచేసిన కొలీగ్సుకు ఫోను చేస్తే ముక్తసరిగా మాట్లాడి పెట్టేసేవారు. ఆ ఐదు నిముషాలలోనే వందసార్లు 'సార్' అని సంబోధించేవారు. భార్యతో చనువుగా ఉందామని ప్రయత్నించినా ఎందుకో బెదిరిపోయేది తను. ఒకప్పుడు అదే కావాలి అనుకున్న నాకు ఇప్పుడందులో కృత్రిమత్వం కనిపిస్తున్నది. నన్ను ఒంటరివాడిని చేసి పక్కకు నెడుతున్న భావన కలుగుతున్నది. ఎందుకిలా అందరూ నన్ను తమకు దూరంగా నిలబెడతున్నారు. నా మనసు అందుకు అంగీకరించడం లేదు. అది 'నేనంటే భయమా? గౌరవమా? అసహ్యమా?' తేల్చుకోలేక పోతున్నాను. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో నాతో కలిసి పనిచేసిన బ్యాచ్ మేట్స్ ను పలకరించాలని అతి కష్టం మీద ఒకరిద్దరి నెంబర్లు సంపాదించి ఫోను చేశాను. నేను ఎంత చనువుగా మాట్లాడాలనుకున్నా, వాళ్ళు ఆ అవకాశమే ఇవ్వలేదు. నేను మాట్లాడడం తప్ప, వాళ్ళు హద్దుల్లోనే ఉన్నారు. మరీ ఒకరైతే 'మీకూ, మాకు పోటీ ఏమిటి సార్, మీరు చాలా తెలివైన వారు. మీరు చెబితే వినడం తప్ప మేము ఏమి చెప్పగలం' అన్నారు. ఇది కాదు జీవితమంటే. ఇంకా ఏదో ఉంది. ఈ అంటరాని బ్రతుకు కాదు నాకు కావలసింది. నన్ను అభిమానించేవారు కావాలి, ఆప్యాయంగా పలకరించేవారు కావాలి. ఎక్కడ, అలాంటి మనుషులు ఎక్కడ. మనసు దిగులుతో నిండిపోయింది. అప్పుడు నాకు మనసులో మెదిలాడు నరసింహ. వాడు నా బాల్యస్నేహితుడు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. ఒకరిని విడిచి మరొకరం ఉండలేనట్లుగా ఉండేవాళ్ళం. వాడు పది ఫెయిలవడంతో చదువు మానేసి వాళ్ళ నాన్న దగ్గర ప్లీడరు గుమాస్తా పనులు నేర్చుకుని, ఆ ఊరిలోనే మరో లాయరు దగ్గర గుమాస్తాగా చేరిపోయాడు. అదే సమయంలో నేను కాలేజి హాస్టలులో చేరి, మెరిట్ తో చదువుకుంటూ సిల్వర్ జూబ్లీ కాలేజిలో డిగ్రీ, ఆపైన పోస్టుగ్రాడ్యుయేషను చేసి తర్వాత ఉద్యోగంలో స్థిరపడడంతో వాణ్ణి కలవడం దాదాపుగా మానేశాను. దానికి తోడు నేను తెలివికలవాడినన్న అహం తలకెక్కి, ఫెయిలనవాడితో నాకేం పని అన్న తీరుగా వ్యవహరించవాడిని. ఒకటి, రెండు సార్లు వాడిని కించపరిచిన సందర్భాలు కూడ ఉన్నాయి. అవి తలుచుకుంటుంటే నామీద నాకే అసహ్యం వేసింది. ఆలోచనలను ఆపి ఒక నిర్ణయానికి వచ్చి లేచాను. ****** "హలో ఎవరండీ.." అంటూ తలూపుతీశాడు ఒకతను. మనిషిలో పెద్ద మార్పేమీ లేదు. తల ముగ్గుబుట్టయింది అంతే. "నేనురా..శీనుని" గడపదాటి లోపలికి అడుగుపెట్టాను. "శీను అంటే..మా వీధిలో ఉండి నాతో పాటు చదువుకున్న శ్రీనివాసరావు గారేనా.." కళ్ళజోడు సవరించుకుని పరీక్షగా చూస్తూ అడిగాడు. "అవునురా నరసింహ. నేనేరా" వాడి చేతులు పట్టుకోబోయాను. "రండి సార్. చాలా సంవత్సరాల తరువాత వచ్చారు. కూర్చోండి" అంటూ సోఫా చూపించాడు. నా స్పందనకు దీటుగా స్పందిస్తాడనుకున్నాను. కానీ నన్ను ఎడం పెట్టేశాడు. మనసు చివుక్కుమంది. వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. "మొన్న ఈమధ్య ఎక్కడో చూశాను. మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు చెబుతూ వేసిన యాడ్. పేరు చూసి మీరే అనుకున్నాను. చిన్నప్పటికి, ఇప్పటికి చాలా మార్పు ఉంది మీలో. రింగుల జుట్టు, పచ్చనిరంగు ఇప్పుడు కనిపించడం లేదు. మీరు కోరుకున్నట్లుగా మంచి ఉన్నతస్థితికి వెళ్ళారు. చాలా సంతోషం" అని నాతో మాట్లాడుతూ "శశీ..రెండు గ్లాసులు మంచినీళ్ళు పట్టుకురా" అని కేక వేశాడు, బహుశా వాడి భార్య అనుకుంటా. మంచినీళ్ళ గ్లాసులతో వచ్చిన ఆమె తోటి "ఈయన శ్రీనివాసరావు గారని, మన పెళ్ళయిన కొత్తల్లో మన వీధి మొదట్లో ఉన్నారే, శకుంతలమ్మ అత్తయ్య అని, వాళ్ళబ్బాయి. అప్పుడు కొన్నాళ్ళు నాతో చదువుకున్నారు కూడ" అని పరిచయం చేశాడు. "నమస్కారం అన్నయ్య గారూ" అంటూ మంచినీళ్ళ గ్లాసు అందించింది శశి. "శశీ..ఆయన మనలాంటి మధ్య తరగతి మనిషి కారు. వారికి ఇలా వరసలు పెట్టి పిలవడం నచ్చకపోవచ్చు. సారీ అండీ, ఏదో పల్లెటూరిలో పుట్టిన పిల్ల. తొందరపడింది. ఏమీ అనుకోకండి. శశీ నువ్వెళ్ళి కాఫీ తీసుకురా" వాడి ఒక్కొక్క మాట నన్ను కత్తిపెట్టి కోస్తున్నట్లు అనిపించింది. " ఇన్నాల్టికి ఈ ఊరికి వచ్చారు. ఏదైనా పని మీదనా" అడిగాడు. "నీ కోసమే" ఆశ్చర్యంగా చూశాడు. "అవునురా నీకోసమే. నీతో మాట్లాడాలనే. తప్పు చేశానురా. చాలా పెద్ద తప్పుచేశాను. ఆస్తి, అధికారం ఇవే ముఖ్యమైనవి అనే భ్రమలో ఇన్నాళ్ళూ బ్రతికాను. ఉద్యోగం ఉన్నంతవరకు నా చుట్టూ చేరిన వందిమాగధుల భజనలే నాకు ఆనందాన్నిచ్చి అహాన్ని పెంచాయి. తీరా పదవి ఊడిపోయాక తెలిసింది. అవన్నీ అవసరపు మాటలని, ఆత్మీయతలు కాదని. ఆత్మావలోకనం చేసుకుంటే అప్పుడు తెలిసిందిరా, నేను ఎంత పాతాళంలో ఉన్నానో. నన్ను ఆప్యాయంగా 'ఒరేయ్' అని పిలిచి నాతో మనసువిప్పి మాట్లాడే మనిషేలేడని. కళ్ళు తెరిచి చూస్తే జ్ఞాపకాలలో నువ్వు మెదిలావు. మనిద్దరం కలిసి తిరిగిన రోజులు, పంచుకున్న తినుబండారాలు, తాగిన వన్ బై టు టీలు గుర్తుకువచ్చాయి. మనతో కలిసి తిరిగిన రాముడు, వేణు గుర్తుకు వచ్చారు. అప్పుడు తెలిసిందిరా. నిజమైన ఆనందం ఎక్కడున్నదో. చేతులు కాలిపోయాయిరా. జీవితాంతం నిలుపుకోవలసిన బాల్యస్నేహాన్ని నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను. చివరకు ఉద్యోగపర్వంలో కూడ నాకంటూ ఒక్క మిత్రుడిని కూడ మిగుల్చుకోలేక పోయాను. అంతా స్వయంకృతాపరాధం" మాట్లాడుతుంటే నా గొంతు బొంగురు పోయింది. కళ్ళల్లో చెమ్మ చేరసాగింది. ఇంతలో కాఫీ తీసుకువచ్చింది శశి. "తీసుకోండి సర్ " అంటూ చేతికిచ్చింది. "అమ్మా.. నన్ను సర్ అనకు. ఇందాక పిలిచినట్లే ప్రేమగా "అన్నయ్యా" అని పిలువు" అంటూ కాఫీగ్లాసు అందుకున్నాను. ఆమె భర్త వంక చూసింది. నరసింహ మౌనంగా ఉన్నాడు. కాఫీ తాగడం పూర్తిచేసి మరల నేనే మాట్లాడసాగాను. "నన్ను చూస్తుంటే నీకు అసహ్యం కలుగుతోంది కదూ. అవకాశవాదిని అన్న భావన కలుగుతున్నది కదూ...కాదురా జీవితమంటే డబ్బు, అధికారం అనుకుని కళ్ళు మూసుకుని పోయినవాడిని. నాకు కావలసినదేదో తెలుసుకునేసరికి మూడు వంతుల జీవితం ముగిసిపోయింది. అందరూ దూరమై ఒంటరితనం మిగిలింది. అందుకే వచ్చానురా నీ దగ్గరికి. స్నేహభిక్ష కోసం యాచకుడినై వచ్చానురా" వర్షించే కళ్ళతో వెళ్ళి వాడి ఒడిలో తలపెట్టుకుని ఏడువసాగాను. అదిరిపోయాడేమో వాడు. వెంటనే తల మీద చెయ్యివేసి "శీనూ..ఏమిటిరా ఇది పసిపిల్లాడిలా. అంత పెద్ద హోదాలో పనిచేసి బేలగా ఇలా...చూడలేకపోతున్నారా. లే..నేను ఎప్పటికీ నీ బాల్య స్నేహితుడినేరా. నీ నరిసిగాడినే. నేను నిన్ను ఎపుడూ మరిచిపోలేదురా. మరిచిపోలేను కూడ. నువ్వు కూడ అంతే కదా. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. శీనూ..మనిషి తన జీవితంలో ఎన్నింటిని మర్చిపోయినా పుట్టిన ఊరును, అక్షరం దిద్దించిన ఉపాధ్యాయుడిని, బాల్య స్నేహితులను మరచిపోలేరురా. అది కల్మషం లేని వయసులో ఏర్పడ్డ స్నేహబంధం, మరణం వరకు విడిపోని జ్ఞాపకం. మబ్బులు మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి. ఇప్పుడు మన మనసులు మబ్బులు తొలగిన నిర్మలాకాశాలు. లేరా శీను తమాయించుకో" అని నన్ను లేపి తన గుండెకు హత్తుకున్నాడు నరిసింహ. నా మనసు తేలికపడింది. వాడి చేత పదేపదే ఒరేయ్ అనిపించుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. **** భోజనాలు ముగించుకుని ముచ్చట్లకు దిగాము. ఎన్ని జ్ఞాపకాలో మా మధ్య దొర్లాయి. కాకి ఎంగిలి దగ్గర నుంచి స్కూలు ఎగ్గొట్టి గోలీలు ఆడుకుని ఇంటికి చేరుకున్నదాక ఎన్నో మాట్లాడుకున్నాము. సాయంత్రం పదవీవిరమణ తరువాత సొంత ఊరిలోనే స్థిరపడిన రాముడిని, వేణుని కలిశాము. నరసింహ నా దిగులు గురించి చెప్పాక భేషజాలన్నీ మరిచిపోయి అందరం మనసులు విప్పి మాట్లాడుకున్నాము. చిన్నతనంలో మా ఖాతా టీకొట్టుకు వెళ్ళి దస్తగిరిని కలిశాము. అతను పెద్దవాడయి పోయి తన వ్యాపారం కొడుకుకు అప్పచెప్పాడు. మేము కబురు పెట్టగానే వచ్చి మమ్మల్ని చూసి ఆనందపడ్డాడు. బాగా చీకటిపడింది. వెళ్దామని లేవబోతూ అడిగాను. "ఒరేయ్..నేను కూడ ఇక్కడే ఉండాలనుకున్నాను. ఒక మంచి ఇల్లు చూడరా. కొనుక్కుని ఇక్కడే ఉండిపోతాను. ఈరోజు నేను పొందిన ఆనందం ఈ ఊరు వదిలి వెళ్ళిన తరువాత ఇంతవరకు పొందలేదు. ఈ గడ్డలో ఏదో మహత్యం ఉందిరా" అన్నాను రాముడితో. "ఒరేయ్ శీనూ..నువ్వు ఏదో ఆశతో బయటికి వెళ్ళావు గానీ, మేమంతా ఈ చుట్టుపక్కలే ఉన్నామురా. పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిదిరా. అక్కడి జ్ఞాపకాలు మనకు సంజీవని లాంటివి. ఆ ప్రదేశాలు చూస్తూ ఆ రోజులు గుర్తుచేసుకుంటుంటే మన రోగాలన్నీ మాయమై పోతాయి. అందుకేరా అందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా చివరకు వచ్చి పుట్టిన ఊరిలోనే స్థిరపడి పోతారు. అదేరా పుట్టిన ఊరి మహత్యం. అందరం కలిసేవుందాంరా. ఏమీ ఆలోచించకుండా వచ్చెయ్" అన్నాడు రాముడు. అందరికీ వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరాము నేను, నరసింహ. మనసులో చెప్పలేని ఆనందం గంతులు వేసింది. నేను ఇక్కడ స్థిరపడతానని చెప్పగానే శశికూడ చాలా సంతోషపడింది. చీకటి అంతరించి నా బ్రతుకులో సరికొత్త వెలుగు వస్తున్నదనే సంతోషం నా రెప్పలను వాలనివ్వలేదు. మళ్ళీ బాల్యంలోకి మనసు జారిపోయింది. ఇప్పుడు నా మనసు కడిగిన ముత్యంలా ఉంది. రేపే వెళ్ళి పిల్లలను, రాధను ఒప్పించి ఇక్కడకు వచ్చేయాలి. యాంత్రికతను వదిలి అనుబంధాల జీవనంలోకి అడుగుపెట్టాలి. ముసురుతున్న ఆలోచనలతోనే తెల్లవారిపోయింది. శశి ఇచ్చిన కాఫీ తాగి, ప్రస్తుతానికి వాడికి దగ్గరలో ఒక అద్దె యిల్లు చూడమని నరసింహకు చెప్పి బస్సు ఎక్కాను. **** అయిపోయింది******

మరిన్ని కథలు

Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.