"బాబాయ్, మనిషికి నిద్ర ఎప్పుడు బాగా వస్తుందో తెలుసా?"
సుందరమూర్తి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతసేపటికీ సమాధానం రాకపోవడంతో పాండుకు మూర్తిగారు నిద్రపోయారని అనుమానం వచ్చింది.
డబ్బు సంపాదించాక పెద్ద భవనంలో అమ్మానాన్నలను ఉంచాలని ముందు అనుకున్నప్పటికీ, "లంకంత కొంపలో లింగులింగుమంటూ ఇద్దరమేముంటాంరా?" అని వాళ్ళమ్మ అనడంతో మూర్తిగారి పక్కనున్న పాత పెంకుటిల్లును కొని, పడకొట్టి దాని స్థానంలో ఒక డాబా ఇల్లు కట్టించాడు. పైనున్న పెద్ద రూము తనకు ఆఫీస్-కమ్-లివింగ్ క్వార్టర్స్ అని డిక్లేర్ చేసుకున్నాడు. చిమ్మడానికి, బూజు దులపడానికి పనమ్మాయి రావాల్సిందే కానీ తలిదండ్రులు అక్కడికి రావడానికి వీల్లేదన్నాడు. అక్కడికి ప్రవేశమున్న ఒకే వ్యక్తి సుందరమూర్తి. ఎప్పుడో నెలకోసారి ఎవరైనా తమకు సహాయం చేయమని వస్తే, వాళ్ళు మాత్రం పైనున్న రూములోకి వెళ్ళొచ్చు.
అప్పటికి పాండుకు పాతికేళ్ళొచ్చాయి. పనీ పాటా లేకుండా ఇరవైనాలుగ్గంటలూ ఆగదిలోనే ఉండి పిచ్చోడైపోతున్నాడని వాళ్ళమ్మ గొణగడం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్న మాత్రం విఠల్, పాండులిద్దరూ జీవితంలో సెటిల్ అయిపోయారనీ, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేస్తే తను ప్రతిరోజూ ఆదివారంలా గడపొచ్చనీ దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తూ వాళ్ళమ్మ మాటలు పట్టించుకోడు. చివరకు తన గోడు చెప్పుకోడానికి ఆమెకు సుందరమూర్తి భార్య మాధవి తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. కొన్ని రోజులయ్యాక ఈమె పాండు గురించి చెబితే మాధవి పాండుతో చేరి సుందరమూర్తి ఎలా చెడిపోతున్నాడో చెప్పడం మొదలెట్టింది. ఇక లాభం లేదని పాండు తలిదండ్రులు కలెక్టరుగా ఉద్యోగం వెలగబెడుతున్న విఠల్ దగ్గరకు వెళదామని నిశ్చయించుకుని నాగపూరానికి వెళ్ళారు.
మాధవికి కష్టాలు కనీసం మూడు రెట్లయ్యాయి. పాపం పాండు ఒక్కడే ఉన్నాడని సుందరమూర్తి పాండుతోబాటుగా ఆ రూములోనే ఉంటాడు. అంటే ఆఫీసులో లేనప్పుడు. మాధవికేం, ఆమెకు తోడుగా పిల్లలున్నారుగా, అని ఆయన ధైర్యం.
ఆ వీధిలో వాళ్ళ లెక్క ప్రకారం పాండుకు, మూర్తిగారికి మధ్య ఎక్కువసేపు నిద్రపోవడంలో వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతన్నాయి – జరుగుతూనే ఉన్నాయి.
ఆరోజు ఆదివారం. తెల్లవారుఝాము తొమ్మిదిన్నరకే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని టిఫినీలు లాటి పాశ్చాత్య సంప్రదాయాలేవీ పాటించకుండా పదకొండుగంటలకు మాధవి వండిన భోజనం చేసి ఇద్దరూ మధ్యాహ్ననిద్రకు ఉపక్రమించారు. పాండు వాళ్ళ ఫ్యామిలీతోబాటు తానూ నాగపురం పోయుంటే బాగుండేదని అనిపించింది మాధవికి.
"ఏం బాబాయ్, నిద్ర పోయావా?" మళ్ళీ అడిగాడు పాండు.
"లేదురా. ఆలోచిస్తున్నా".
"ఎంతసేపు చించుతావేంటి?" పాండు ఎకసెక్కాలు మొదలెట్టాడు. "ఇదేమైనా కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామనుకున్నావా ఏంటి. నీకేమీ ప్రైజ్ మనీ ఇవ్వరిక్కడ".
సుందరమూర్తి నేల మీద పడుకుని రెండు కాళ్ళూ సోఫాలో ఉంచి దినపత్రిక చదువుతున్నాడు. "ఏముందిరా. బాగా కడుపు నిండా తిని, చల్లగా ఏసీ పెట్టుకుని మెత్తటి పరుపుపైన, ఇంకా మెత్తని దుప్పటి కప్పుకుని పడుకుంటే బాగా నిద్ర పడుతుంది" జవాబిచ్చాడు. తను ఏ సమాధానం ఇచ్చినా అది తప్పని చెబుతాడు పాండు. కానీ మూ. ర్తికి కోపం రాదు. ఎందుకంటే, తన సమాధానానికన్నా మంచి సమాధానం చెబుతాడు. మూర్తి కాలక్రమేణా పాండుకు వీరాభిమానియై పోయాడు. "సరే. సరైన సమాధానమేదో నువ్వే చెప్పు".
"వేసనికాలం మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఎర్రబస్సులో సీటులేక జనాల మధ్య నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు చెమట కారుతూ కళ్లూ బరువెక్కుతుంటే నిద్ర పడుతుంది కదా? అది నిజమైన నిద్ర. అప్పుడప్పుడూ జనాల శరీరాల మధ్య సందు వెతుక్కుంటూ తగిలే చల్లగాలి తీపికల లాటిది. ఒక అరగంట అలా నిద్రపోయినా శరీరం ఎంతో రిలాక్సవుతుంది". దుప్పటితో ముఖం కప్పుకుంటూ కొత్త నిద్రా సిద్థాంతాన్ని ప్రతిపాదించాడు పాండు.
ఇద్దరూ ఎర్రబస్సులో ప్రయాణిస్తున్నట్లు ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్నారు. ఒక్క నిముషం కూడా కాలేదు. పాండు సెల్ ఫోన్ మ్రోగింది. విసుక్కుంటూ ఫోన్ తీశాడు. వాళ్ళమ్మ "రేయ్. ఒక అర్జంటు పని ఉందిరా".
"నీకన్నీ అర్జంటేలే" విసుక్కున్నాడు పాండు. "సరిగ్గా నేను నిద్ర పోయేటప్పుడు ఫోన్ చేస్తావు"
"ముందు లేచి ముఖం కడుక్కుని ఫోన్ చేసి తలుపు తియ్యి. కాస్సేపట్లో అమెరికా నుంచి ఇందిర ఫోన్ చేస్తుంది". అమ్మమాటకు తిరుగులేదు.
పాండు లేచి ముఖం కడుక్కుని ఫోన్ కోసం ఎదురుచూడసాగాడు. మూర్తి మాత్రం నిద్రాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడు.
ఇందిర అత్తయ్య తాము ఒంగోలులో ఉన్నప్పుడు ఇంటివాళ్ళ కూతురు. ప్రస్తుతం సపరివారంగా అమెరికాలో ఉంటుంది. అసలు వాళ్ళ నాన్న తప్ప ఒంగోలులో ఎవరూలేరు. లాయరుపేటలో ఇల్లు. కనీసం వందేళ్ళుంటాయి ఆ ఇంటికి. ముందు మామిడిచెట్టూ, వెనుక వేపచెట్టూ. ఇంకా చాలా పూల మొక్కలు ఉండేవి. పైనున్న రెండు గదుల్లో తాముండేవారు. విఠలన్నయ్య ఇంజనీరింగు కోసం విజయవాడ వచ్చాము తప్పితే ఆ ఇంట్లోనే తన బాల్యమంతా గడిచింది. ఇందిర ఒక్కతే కూతురు చంద్రశేఖరానికి. ఆయన ఒకప్పుడు హైకోర్టులో పెద్ద లాయరు.
పాండు గతస్మృతుల ధ్యానానికి అంతరాయం కలిగిస్తూ ఫోన్ మ్రోగింది. ఇందిర. ఇంత నడిరాత్రిలో ఎందుకు ఫోన్ చేస్తున్నట్లు?
* * *
"పాండూ, నేనూ గుర్తున్నానా" ఇందిర గొంతులో కంగారు.
"చెప్పత్తా. ఏమైంది?" ధైర్యం చెప్పాడు పాండు.
"మా నాన్నగారిని హత్యచేసిందని సుందరిని అరెస్ట్ చేశారు. నీకు సుందరి గుర్తుందా?"
"గుర్తంది. నీకు చెల్లెలు వరసౌతుంది కదా?"
"కరెక్ట్. అది ఉత్త పిచ్చిమాలోకం. మా బాబాయ్ కొడుకు రాఘవే దాన్ని ఇరికించి ఉంటాడు. నాన్న శరీరం ఉదయాన్నే చూశారు. రాఘవ ఇంటికొచ్చి చూశాడట. తనే పోలీసులను పిలిచాడు. తన కంప్లైంట్ మీదనే సుందరిని అరెస్ట్ చేశారు. ఈపాటికి పోస్ట్ మార్టం కూడా అయిపోయి ఉండాలి. నువ్వు ఇప్పుడు లాయరువట కదా? సుందరిని బెయిలు మీద బయటకు తేగలవా?"
"నేను ఒంగోలు బయలుదేరతాను. ఏం చేయగలిగితే అది చేస్తాను. నువ్వేం కంగారు పడకు".
"మేం బయలుదేరుతున్నాం. సోమవారం ప్రొద్దుటికెల్లా ఒంగోలులో ఉంటాం"
"డోంట్ వర్రీ. నేను బయలుదేరుతున్నా". ధైర్యం చెప్పాడు పాండు.
* * *
సోమవారం ఉదయం. పది గంటలు. కోర్టు కాంప్లెక్స్ మొత్తం జనాలతో కిటకిటలాడుతోంది. నల్లకోటేసుకున్న లాయర్లు, ఖాకీలో పోలీసులు, సాధారణ దుస్తులలో కోర్టు సిబ్బంది, ప్లీడరు గుమాస్తాలు. ఆదుర్దా, భయం, ఉత్కంఠతో నిందుతులు, వాదులు, ప్రతివాదులు. వీళ్ళందరికీ టీలు, కాఫీలు ఇచ్చే కుర్రాళ్ళు. అక్కడున్న పొగడ చెట్ల మీద ఎన్ని రకాల పక్షులున్నాయో క్రంద అన్ని రకాల మనుషులున్నారు.
పాండు, సుందరమూర్తి కూడా ఒక చెట్టు క్రిందున్న సిమెంట్ చప్టాపై కూర్చున్నారు. పాండు చేతిలో ఒక నల్లకోటు ఉంది. పాండుకు గాభరాగా, సుందరమూర్తికి ఆతృతగా ఉంది. సుందరమూర్తికి ఇదే తొలిసారి కోర్టుకు రావడం. అతనికి ఎప్పుడూ ఎల్.ఐ.సి. ఆఫీసులో ఒక పద్ధతిగా, రోజూ ఒకేలా నడిచే వ్యవహారాలే తెలుసు. కానీ కోర్టులో రకరకాల వాజ్యాలు, రకరకాల మనుషులు. జీవితనాటకంలోని అన్ని ఘట్టాలూ అక్కడ ప్రతిరోజూ చూడవచ్చు. సరే, సినిమాలలో కొంచెం నాటకీయత ఎక్కువ ఉండవచ్చు. కానీ నిజజీవిత నాటకం కల్పనకంటే రసవత్తరంగా ఉంటుంది. మొదటిసారి తాను ఆ నాటకాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నాడు. పాతసినిమాలో జగ్గయ్య, శారదలలా పాండు నల్లకోటేసుకుని కోర్టులో వాదిస్తుంటే – తలచుకుంటేనే అతని ఉత్తేజం ద్విగుణీకృతమయ్యింది.
పాండు మనసులో మాత్రం గుబులు గుబులుగా ఉంది. తానేమీ శిక్షితుడైన అపరాధ పరిశోధకుడు కాదు. లా చదివాడు కానీ, బారులో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్ప ఎప్పుడూ కోర్టు ముఖం కూడా చూసి ఎరుగడు. అక్కడి పద్ధతులూ తెలీవు. అన్నింటి కంటే ముఖ్యమైనది, ప్రస్తుతం తనమీద ఒక మనిషి జీవితం ఆధారపడి ఉంది. తన మూలంగా సుందరమ్మకు శిక్షపడితే – ఊహించుకోడానికే భయంగా ఉంది. ఇందిరత్తకు తాను నిన్ననే చెప్పాడు ఎవరైనా సీనియర్ లాయరును పెట్టుకోవడం మంచిదని. ఇందిర తనవంక చిన్నపిల్లాడిని చూసినట్లు చూసి. "ఎందుకురా భయపడతావు?" అన్నది.
ఆమె కుటుంబమంతా ఆదివారం రాత్రికి ఒంగోలు చేరుకున్నారు. తమ స్వగృహంలోనే దిగారు. చంద్రశేఖరంగారి పార్థివ శరీరం మార్చురీలో ఉంది. పోయి చూసి వచ్చారు. తండ్రి నిర్జీవ శరీరం చూసి ఇందిరవాళ్ళన్నయ్య బాధపడితే ఆమె మాత్రం కోపంతో వణకింది. సోమవారం తెల్లవారగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి మళ్ళీ ఇంటికి వచ్చారు.
పాండు, సుందరమూర్తితో కలసి వాళ్ళను చూడడానికి వెళ్లాడు. "నీకు నీ మీద నమ్మకం లేదా?" ఇందిర సూటిగా ప్రశ్నించింది పాండును.
"అది కాదత్తా" పాండుకు ఎలా చెబితే ఆమెకు అర్థం ఔతుందో తెలియలేదు.
అంతలో ఇంట్లోకి రాఘవ, భార్యతో సహా వచ్చాడు. వెంటనే లేచి నిలబడ్డారందరూ. "వాడెళ్ళేంత వరకూ నోర్మూసుకు కూర్చో" లోగొంతుకతో హెచ్చరించింది ఇందిర.
"ఏమక్కా బాగున్నావా" ముందు ఇందిరనే పలకరించాడు. ఆరడుగులెత్తు. నిండైన విగ్రహం. గుబురు గెడ్డం. ఆల్కహాలుతో ఎఱ్ఱబారిన కళ్ళు. పాపం ఆయన భార్యమాత్రం ఏం మాట్లాడలేదు. నేరుగా వచ్చి ఇందిర చేతులు పట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇందిరను గట్టిగా వాటేసుకుంది. అప్పటివరకూ నిమ్మళంగా ఉన్న ఇందిర గుండెల్లోని బాధ ఒక్కసారిగా బయటకొచ్చింది. ఇందిర రాఘవను మాత్రమే అనుమానిస్తుంది కాని, అతని భార్యను కాదని గ్రహించాడు పాండు.
రాఘవ ఇందిర భర్తనూ, అన్ననూ, అన్న భార్యనూ పలకరించాడు. "పిల్లలను తీసుకురాలేదా?"
లేదన్నట్లు తల ఊపింది ఇందిర.
"సుందరి ఇంతపని చేస్తుందనుకోలేదు" తను వచ్చిన విషయం కదిలించాడు రాఘవ.
రాఘవ భార్య కళ్ళలోకే చూస్తూ అతని వ్యాఖ్యను ఖండించింది ఇందిర "సుందరి నాన్నను చంపలేదు". తన మాట నిజమని ఋజువు చేయడంకోసమన్నట్లు అతని భార్యను ప్రశ్నించింది "నువ్వే చెప్పు. సుందరి నాన్నను చంపుతుందా?".
రాఘవ భార్య తల అడ్డంగా ఊపింది.
"దీని మొహం. దీనికేం తెలుసు మర్డర్లగురించి. ముద్దపప్పేసుకుని మెక్కమంటే ముప్పొద్దులా మెక్కుతుంది" భార్య తన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడిందన్న అక్కసు.
"నేనూ అదే చెబుతుంది" ఇందిర నెమ్మదిగా పలికింది. "సుందరి కూడా అంతే. ముప్పొద్దులూ ముద్దపప్పేసుకుని మెక్కగలదు గాని, ఈ మర్డర్లగురించి దానికేం తెలుసు, దాని బొంద.
తెల్లారే వరకూ ఎఫ్.ఐ.ఆర్. కాపీ చదవాలని నిశ్చయించుకున్నాడు పాండు.
* * *
రామేశ్వరం పోయినా శనీశ్వరం వెంటొచ్చినట్లు, మురళి ట్రాన్స్ఫరై ఒంగోలు సి.ఐ.గా ఉన్నాడు. శనివారం రాత్రే పోలీసు విచారణ వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన పాండును చూడగానే గుర్తుపట్టి నొసలు చిట్లించాడు. చంద్రశేఖరం హత్యకేసులో తాను సుందరి తరఫు న్యాయవాదిగా వచ్చానని పాండు చెప్పగానే అతని ముఖంలో చిరునవ్వు, "ఇప్పటికి దొరికావురా" అన్నట్లు. "నీకు ఏం కావాలన్నా కోర్టునుంచి పర్మిషన్ తీసుకురావాలి".
నిస్సహాయంగా బయటికొచ్చిన పాండు బయటకొచ్చి దూరంగా చెట్టుకింద నీడలో నిలుచున్నాడు. రాత్రి పదిన్నరప్పుడు మురళి బయటి వచ్చి, బహుశా ఇంటికే, వెళ్ళినట్లున్నాడు. ఒకవేళ మళ్లీ వస్తాడేమోనని అయిదు నిముషాలు వేచియుండి, సుందరమూర్తీ సమేతుడై మళ్ళీ పోలీసు స్టేషనులోకెళ్ళాడు పాండు.
అతన్ని చూసి నవ్వాడు హెడ్ కానిస్టేబుల్. "చూడు బాబూ, నీకు ఈ స్టేషనులో ఎవ్వరూ సహాయం చేయరు. సి.ఐ.గారికి ఎదురు నిలచి మేమెవ్వరమూ ఇక్కడ ఉండలేము. నీతో మాట్లాడినందుకే మాకు కష్టాలు రావచ్చు. పక్కనున్న రైటరు, ఆయన మాటలకు వంత పాడుతున్నట్లుగా తల ఊపాడు.
ఆదివారం ఉదయాన్నే లేచి పదింటికల్లా జిల్లాజడ్జి బంగళాకు వెళ్ళాడు పాండు. సుందరమూర్తిని బయట కాపలా ఉన్న సెంట్రీతో ఉండమని తానొక్కడే లోనకెళ్ళాడు. వరండాలో కూర్చుని పేపరు చదువుకుంటూన్నారు జడ్జిగారు. ఆయన భార్యకూడా అక్కడే ఉంది. పదవినోదం పూరిస్తున్నట్లుంది. పాండు జడ్జిగారికి నమస్కారం చేసి నాకు మీనుంచి ఒక సలహా కావాలన్నాడు. పాండు చేతిలో నల్లకోటును చూసి, ఆదివారం కోటు చేతపట్టుకుని తిరిగే లాయరును నేనింతవరకూ చూడలేదన్నాడాయన.
పాండు సిగ్గుపడుతూ "సార్, నేనింత వరకూ కోర్టు మెట్లెక్కలేదు. సీనియర్ లాయర్ చంద్రశేఖరంగారి అమ్మాయి నన్ను వాళ్ళ కజిన్ సుందరికి డిఫెన్స్ లాయరుగా చేయమన్నారు".
లాయర్ చంద్రశేఖరంగారి పేరు వినగానే ఆయన పాండును కూర్చోమన్నట్లు సైగ చేశారు. "థాంక్స్ సార్" అంటూ కూర్చున్నాడు పాండు. "టీ త్రాగుతావా?"
"ఫర్లేదు సార్".
"కనీసం మంచినీళ్ళైనా త్రాగుతావా?"
నీళ్ళు కూడా వద్దంటే జడ్జిగారు ఆయనను ఎక్కడ అవమానించినట్లు భావిస్తాడో. అందులో ఎండ కూడా బాగానే ఉంది. "సరే సార్. మంచినీళ్ళిప్పించండి".
ఆయన చెప్పకముందే ఆయన భార్య లేచి లోపలికెళ్ళి పాండుకోసం నీళ్ళు తీసుకువచ్చింది. పాండు గటగటా నీళ్ళు తాగాడు.
"సార్, నాపేరు పాండు" స్వపరిచయంతో మొదలుపెట్టాడు పాండు. "నేను ప్రస్తుతం విజయవాడనుంచి వచ్చాను. నా చిన్నప్పుడు మేము ఒంగోలులోనే ఉండేవాళ్ళం. చంద్రశేఖరంగారి ఇంట్లోనే అద్దెకు ఉండేవాళ్ళం".
చెప్పమన్నట్లు చూశాడు జడ్జిగారు.
"నాకు పోలీసు వాళ్ళ సహకారం కావాలంటే ఏం చేయాలి?" సూటిగా తన ప్రశ్నను అడిగాడు పాండు.
"పోలీసు స్టేషనుకు వెళ్ళి అడగాలి" బదులిచ్చాడాయన.
"అక్కడ సి.ఐ.కి నామీద కోపం సార్. ఆయన విజయవాడలో ఉన్నప్పుడు తను ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదని ప్రూవ్ చేశాను. అందుకని".
ఆయనకు పాండు గురించి ఎక్కడో విన్నట్లు అనిపించింది. తన కుడిచేయి పైకెత్తి చూపుడువేలిని పాండువైపు చూపి "నువ్వు ఆ ఆత్మహత్యను హత్యగా ఋజువు చేశావుగదా?" మెల్లగా అడిగాడు.
"ఫర్లేదు. తన పేరు లీగల్ సర్కిల్సులో చర్చనీయాంశమైంది" అనుకుంటూ తలూపాడు పాండు. "ఎస్ సర్".
"ఇక్కడేం చేస్తున్నావు?"
"చంద్రశేఖరంగారి కూతురు పంపించారు సార్. వాళ్ళ దూరపు బంధునవు ఒకామె ఆయనను చూసుకుంటూ ఆయనతో పాటే ఇంట్లో ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను హత్యానేరం కింద అరెస్ట్ చేశారు".
"కానీ వాళ్ళమ్మాయి మాత్రం ఆ బంధువు నిర్దోషని అనుకుంటుంది. ఎస్?"
"ఎస్ సర్".
"ఎందుకని?"
"నాకూ తెలియదు సర్. నా దగ్గర అసలు ఏ సమాచారమూ లేదు".
రెండు చేతులూ పైకెత్తి తలవెనుక పెట్టుకుని పాండును అడిగాడాయన "నీకేం కావాలి?"
"అసలు ఆమెను ఎందుకు అరెస్టు చేశారు? దేంతో చేశారు? ఎఫ్.ఐ.ఆర్. కాపీ, పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్. వీలైతే పోస్ట్ మార్టెమ్ చేసిన డాక్టరుతో మాట్లాడాలి". తన కోరికల చిట్టా విప్పాడు పాండు.
జడ్జిగారు నవ్వారు పాండును చూసి. "నేను ఎప్. ఐ. ఆర్. కాపీ మాత్రం ఇప్పించగలను. సాధారణంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. కాపీ ఇస్తారు. నీకు అతనితో గొడవమూలంగా ఇవ్వలేదేమో" ఆయన ఒంగోలు ఎస్.పి.గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఫోన్ పెట్టేసిన తరువాత "నువ్వు స్టేషనుకు వెళితే ఎఫ్.ఐ.ఆర్. కాపీ ఇస్తారు. తీసుకోవచ్చు. పోస్ట్ మార్టెమ్ రిపోర్టు మూత్రం కోర్టులో సబ్మిట్ చేసేంతవరకూ" తల అడ్డంగా తిప్పారాయన "ఊహూ" అంటూ.
* * *
కోర్టు ఆవరణలో పోలీసుల మధ్య ఉన్న సుందరి దగ్గరకెళ్ళారు ఇందిర కుటుంబమంతా. "అక్కా" ఇందిరను చూడగానే బావురుమంది సుందరి. "నేను కాదక్కా" అంటూ ఇందిర కాళ్ళపై పడబోయింది. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ గట్టిగా పట్టుకుంది సుందరిని. "నాకు తెలుసు. నువ్వేం భయపడకు" సుందరికి ధైర్యం చెప్పి కుటుంబంతో కలసి కోర్టుగదిలోకి నడిచింది ఇందిర. సుందరమూర్తి కూడా వాళ్ళతో పాటే లోపలికెళ్లాడు.
పాండు కోర్టు హాలుకున్న ఒక తలుపు పక్క నిలబడి అందరినీ పరిశీలిస్తున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దశరథరామిరెడ్డి గారు వచ్చి కూర్చున్నారు. బెంచి క్లర్కులు, దఫేదారు వచ్చి వాళ్ళ వాళ్ళ స్థానాలాక్రమించుకున్నారు. జడ్జి నాగేశ్వరరావుగారు వస్తున్నారని దఫేదారు చెప్పగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్నాక అందరూ కూర్చున్నారు.
పాండు కొంచెం ముందుకు వచ్చి నిలబడ్డాడు. చంద్రశేఖరం గారి హత్యకేసే మొదటిది. దశరథరామిరెడ్డి లేచి జడ్జిగారిని చూసి "గుడ్ మార్నింగ్ మిలార్డ్. శుక్రవారం తెల్లవారుఝామున ఒంగోలులో రెండు దశాబ్దాలకు పూర్వం లాయరుగా బాగా పేరుగాంచిన చంద్రశేఖరంగారు హత్య చేయబడ్డారు. ఈ హత్యలో ముద్దాయి సుందరి ఆయనతోబాటే ఆ ఇంట్లో ఉంటుంది. ఆయన తమ్ముడి కొడుకు ఆయన హత్య విషయాన్ని పోలీసులకు తెలియచేశాడు. హత్యాయుధంగా ఉపయోగించబడిన కత్తి స్వాధీనం కాబడింది. ఈ కత్తిని ఎగ్జిబిట్ నం. వన్ గా పరిగణించ వలసినదిగా కోర్టువారిని కోరుతున్నాను. హత్యాయుధంపై ముద్దాయి వేలుముద్రలు కూడా ధృవీకరించబడ్డాయి. ఇంతుకు సంబంధించిన ఫోరెన్సిక్ సర్టిఫికేట్లు కూడా దాఖలు చేయబడ్డాయి. మృతుని శరీరంపై పోస్ట్ మార్టెమ్ జరుపబడింది. ఆ రిపోర్టు కూడా దాఖలు చేయబడింది".
ఒక్క క్షణం ఆగి ఒక పక్కన లేడీ కానిస్టేబుల్ పక్కన వణుకుతూ నిలుచున్న సుందరిని చూశాడు దశరథరామిరెడ్డి. తనలో ఉన్న ఆవేశం ఆమెను చూస్తే ఇంకా పెరిగినట్లనిపించింది. సాధారణంగా పబ్లిక్ ప్రాసిక్యూటరుగా ఉన్నప్పుడు ఏలాయరైనా కేసులను యాంత్రికంగా వాదిస్తాడు. కానీ, ఈ కేసు ఒక పేరుమోసిన లాయరు హత్యకేసు. అందుకే ఈ కేసును రెడ్డగారు తన వ్యక్తిగత కేసులాగా భావించి వాదిస్తున్నారు. ఆయన మళ్ళీ జడ్జి వంక చూశారు "యువర్ ఆనర్. మృతులైన చంద్రశేఖరుగారు నాలాటి ఎంతో మంది లాయర్లకు గురుతుల్యులు. ఆయనకు ఇలాంటి అంతం సంభవించినందుకు మనస్సులో ఎంతటి క్షోభ ఉన్నప్పటికీ, హంతకురాలికి సరైన శిక్ష పడేందుకు నా సేవలు ఉపయోగపడేలా అవకాశం కలిగించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దొరికిన సాక్ష్యాలను విశదీకరించి పటిష్ట పరిచేందుకు ముద్దాయిని పోలీసు రిమాండుకు పంపవలసినదిగా కోర్టువారిక్ దరఖాస్తు చేసుకుంటున్నాను. రిమాండు పూర్తయ్యేలోపల కేసు ట్రయలుకు వచ్చేటట్టు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను". ఒంగోలులోని అందరు లాయర్ల తరఫున వాగ్దానం చేసినట్లుగా అక్కడ కూర్చున్న లాయర్లందరి వంకా చూశాడు ఆయన "నా ప్రసంగం ఎలా ఉందన్నట్లు?".
"ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ ది డిఫెన్స్ సైడ్?" జడ్జిగారు ఒక పక్కనున్న పాండు వంక చూశారు. అతని గురించి వినడమేకానీ పాండును చూస్తే ఆయన పెద్దగా ప్రభావితుడవలేదు. అందులోనూ పాండు చూడడానికి సాధారణంగా, సన్నగా ఉంటాడు. ఆయన తన అనుభవంలో ఎంతమందిని చూసి ఉంటాడు, ఇలాటి వాళ్ళని?
జడ్జిగారు డిఫెన్స్ గురించి మాట్లాడేవరకూ అక్కడున్న లాయర్లలో ఎవ్వరికీ డిఫెన్స్ లాయరెవరన్న ఆలోచనకూడా రాలేదు. పాండు ముందుకు జరిగి దశరథరామిరెడ్డి ముందు నిలబడ్డాడు. గుడ్ మార్నింగ్ అన్నట్టు తలాడించాడు. ఆయనా తలాడించాడు. పాండును ఆయన అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.
పాండు జడ్జి వైపు తిరిగి "గుడ్ మార్నింగ్" గొంతు పొడారిపోతుంది. "గుడ్ మార్నింగ్ యూవరానర్". చెమటలు కారడం మొదలెట్టాయి. చేతిలో ఉన్న కాసిని పేపరులూ చిరిగిపోయేంత గట్టిగా పట్టుకున్నాడు. ఊపిరాడడం లేదు. కనురెప్పలు బరువుగా అనిపించాయి.
జడ్జి దశరథరామిరెడ్డిని చూచి "ఆ కుర్రాడికి కాసిని నీళ్ళివ్వండి రెడ్డిగారూ" అన్నాడు. లాయర్లందరూ నవ్వారు. రెడ్డి టేబులుపైనున్న తన వాటర్ బాటిల్ తీసి పాండుకు అందించాడు. ఒక ప్రక్కన నిలబడి ఈ తతంగమంతా చూస్తున్న మురళికి నవ్వాగలేదు. "ఈరోజు నీకు మూడిందిరా పాండుగా" అనుకున్నాడు. పాండు రెండు గుటకలు నీళ్ళు త్రాగాడు. టేబులుపై చేయి ఆనించి తల వంచుకుని నిలబడ్డాడు. "ఏమైంది తనకు? ఈ క్లిష్ట పరిస్థితిలో, తన ప్రవర్తన, మాటలపై ఒక మనిషి జీవితం ఆధారపడి ఉన్నప్పుడు, తానేంటి, ఇలా ఎందుకూ పనికిరానివాడిలా ప్రవర్తిస్తున్నాడు?"
పాండు సుందరివంక చూశాడు. ఆమెకు డిఫెన్స్ అన్నా డిఫెన్స్ లాయరన్నా తెలియదు. అందరిలాగే పాండును ఒక పిచ్చోణ్ణి చూసినట్లు చూస్తుంది. ఒక హత్యానేరంలో నిందితురాలు, ఒక పిచ్చిమాలోకం – తనను పిచ్చోడనుకుంటుంది. పాండుకు నవ్వొచ్చింది. వెంటనే తెగింపూ వచ్చింది. వాటర్ బాటిల్ మూతేసి టేబుల్ మీద పెట్టి జడ్జి వంక తిరిగాడు.
"గుడ్ మార్నింగ్ యువరానర్. నేను ముద్దాయి తరఫున వాదిస్తాను".
"అసలు నువ్వు లాయరువేనా? నిన్నెప్పుడూ చూడలేదే" అన్నాడు రెడ్డి. గొంతులో హేళన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. హేళనతోబాటుగా అపనమ్మకం కూడా. అసలు ఒంగోలులో ఏ లాయరూ చంద్రశేఖరంగారి హంతకురాలి తరఫున వాదిస్తాడని ఆయన అనుకోలేదు. ఆయనకు తెలిసినంతవరకూ సుందరికెవ్వరూ లేరు. ఆమె చంద్రశేఖరం గారి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి బ్రతుకుతుంది. ఒకవేళ ఏదైనా సామాజిక సంస్థవారు ఆమె తరఫున లాయరును పెట్టి ఉంటారు. అందుకే ఇలాంటి లాయరు దొరికాడు. ఆయనకు ఒక్క క్షణం సుందరిపై జాలేసింది. తనకు లాయరెవ్వరూ లేకపోతే ప్రభుత్వమే ఆమె తరఫున ఎవరినైనా నియోగించేది. ఈ కుర్రాడు ఆ అవకాశం కూడా ఆమెకు లేకుండా చేశాడు. పాపం సుందరి.
రెడ్డి ప్రశ్నలు అప్రస్తుతమన్నట్లు చేయి ఊపారు జడ్జిగారు. అర్థం చేసుకున్నట్లుగా తలాడించాడు రెడ్డి.
పాండు జడ్జిగారి వైపు తిరిగి "చంద్రశేఖరంగారి కూతురైన ఇందిరగారే నన్ను ముద్దాయి తరఫున వాదించడానికి నియమించారు". ఒక్క క్షణం కోర్టులో కలకలం రేగింది. మృతుని కూతురు ముద్దాయి తరఫున న్యాయవాదిని నియమించిందా? ఈ కేసు కనిపిస్తున్నంత సరళమైనది కాదేమో. రెడ్డికైతే సుందరికి ఖచ్చితంగా శిక్ష పడడానికి చంద్రశేఖరంగారి కూతురు ప్రయత్నిస్తుందేమోనని అనుమానం వచ్చింది. దటీజ్ రాంగ్. అందులోనూ ఇందిరే పాండుని నియమించి ఉంటే, తాను ఈ కేసు గెలిచినా, అది పూర్తిగా తన గెలుపవదు. అడ్డదారిలో గెలిచినట్లవుతుంది. ఆయన అహం దెబ్బ తిన్నది. మురళివైపు చూశాడు. రెడ్డి పాండు గురించి అడుగుతున్నాడేమోననుకుని "వాడిని పట్టించుకునే అవసరం లేదు" అన్నట్లు చిన్నగా నవ్వుతూ అడ్డంగా తలాడించాడు మురళి. మురళికి పాండు అవస్థ చూసి ఆనందంగా ఉంది.
వెంటనే దశరథరామిరెడ్డి "ఆబ్జెక్షన్ యువరానర్" పెద్దగా అరిచాడు.
పాండుకు ఆయన ఎందుకు అభ్యంతరం చెబుతున్నాడో అర్థం కాలేదు. రెడ్డివైపు విస్మయంగా చూసి "సార్, నేను ఇంకా ఏమీ మాట్లాడనే లేదు". లాయర్లందరూ నవ్వారు. రెడ్డికి కోపంతో ముఖమంతా కందిపోయింది.
పాండు వైపు నిర్లక్ష్యంగా చేయూపాడు. "యువరానర్. మృతుని కుటుంబసభ్యులు ముద్దాయి తరఫున న్యాయవాదిని నియోగిస్తే ముద్దాయికి సరైన న్యాయం జరుగుతుందాయని నా అనుమానం". తను చెప్పింది పాండుకు అర్ధమయ్యేందుకన్నట్లు రెండు సెకనులు ఆగి పాండు వైపు తీక్షణంగా చూస్తూ "ఒకవేళ ముద్దాయి తన తరఫున న్యాయవాదిని నియమించుకోవడానికి ఆర్ధికంగా అశక్తురాలయితే ప్రభుత్వమే ఆమె తరఫున న్యాయవాదిని నియమించవచ్చు". రెడ్డి జడ్జికి ఎదురుగా నిలబడి "మీరు ఈ విషయమై ఒక్క క్షణం ఆలోచించవలసినదిగా కోరుతున్నాను" వినయంగా తల వంచాడు.
పాండు కూడా రెడ్డి పక్కనే జడ్జివైపు తిరిగి నిలుచున్నాడు. "సార్, పోలీసుల తరఫున ముద్దాయి సుందరి హంతకురాలని నమ్ముతున్న ప్రభుత్వ న్యాయవాది, ముద్దాయికి న్యాయం జరగడం గురించి ఆరాటపడటం కొంచెంచ హాస్యాస్పదంగా ఉంది. వాది, ప్రతివాదులిద్దరివైపూ ప్రభుత్వ న్యాయవాదులే ఉంటే ఆమెకు న్యాయం జరుగుతుందని భావించే పబ్లిక్ ప్రాసిక్యుటర్ గారు, మృతుని కుటుంబ సభ్యులు ముద్దాయి తరఫున న్యాయవాదిని నిర్మిస్తే దానిని ఎలా ప్రశ్నిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.
కోర్టులో కాస్సేపు నిశ్శబ్దం తాండవించింది. రెండు కాళ్ళూ ఒక అడుగు దూరంలో ఉంచి, నిటారుగా నిలబడి, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్న సిపాయిలా ఉన్నాడు పాండు. జడ్జి ఒక్క నిముషం ఆలోచించాడు "ముద్దాయిని ముందుకు రమ్మనండి".
ఆడ పోలీసు సుందరిని ముందుకు నెట్టుకుంటూ వచ్చింది. సుందరి అప్రయత్నంగా జడ్జికి చేతులు జోడించి "అయ్యగారూ, మావయ్యను నేను చంపలేదు సార్" భోరున ఏడవసాగింది. .
జడ్జి చేయెత్తి వారించాడు "నువ్వు ముందు ఒక్క నిముషం ఆగమ్మా. నేను చెప్పేది కాస్త విను. ఏడుపు ఆపు".
సుందరి చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుని ఏడుపు దిగమింగుకుంది. జడ్జి ఆమెకు పాండును చూపించి అడిగాడు "ఇతను నీకు తెలుసా?" తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది సుందరి. ఇప్పుడేమంటావన్నట్లు పాండు వంక చూశాడు జడ్జి. రెడ్డి ముఖం మొదటి బంతికి ఫోర్ కొట్టిన బ్యాట్స్ మాన్ లాగా వెలిగింది.
నిట్టూర్చాడు పాండు. జడ్జిగారిని ఉద్దేశించి "యువరానర్. ఈమె నన్ను ఇప్పటివరకూ చూడలేదు. నేను స్టేషనుకు వెళ్ళినా పోలీసులు ఆమెను కలవనీయలేదు. నన్ను ఇందిరగారు నియమించారు. బహుశా ఈ విషయం కూడా సుందరిగారికి తెలియదు. కోర్టులో ఇందిరగారు ఉన్నారు" చేయి ఇందిరవైపు సాచాడు పాండు. ఇందిర లేచి నిలబడింది. అందరూ ఆమెను చూశారు.
"ఇందిరగారితోపాటు, ఆమె అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు. ముద్దాయి వాళ్ళకు బంధువు. నాకన్నా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికన్నాకూడా వాళ్ళకు సుందరిగారికి న్యాయం జరగాలని ఎక్కువగా ఉంటుంది. నన్ను ఇందిరగారు నియమించారని తెలిసిన తరువాత సుందరిగారికి నేను ఆమె తరఫున వాదించడంపై అభ్యంతరమేదైనా ఉంటే, నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను" ఇప్పుడు పాండు నాటకీయంగా తలవంచాడు. "మీరొక్క నిముషం ఇందిరగారిని సుందరికి నాగురించి చెప్పే అవకాశమివ్వవలసినదిగా ప్రార్థన". మళ్ళీ తలవంచాడు.
"ఇది కోర్టా, లేక నడి రోడ్లో పంచాయితీనాయని జడ్జికి అనుమానం వచ్చింది. ఈ కేసులో ఏదీ క్రమంగా లేదు. తాను ఎవరిని పిలవాలో కూడా తనకు చెప్పే లాయర్లొచ్చారు, అంతా నాఖర్మ" అనుకుని ఆయన సుందరిని చూసి "అమ్మాయ్, ఈ లాయరును నీ తరఫున ఏ చంద్రశేఖరంగారినైతే నువ్వు చంపావని నీపై అభియోగం ఉందో, ఆయన కూతురు ఇందిర నియమించింది. నీకు ఇతను వద్దంటే నేను నీకోసం ప్రభుత్వం తరఫున లాయరును నియమిస్తాను. నీ ఇష్టం" అన్నాడు.
"ఇందిరక్క ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు సార్" జవాబివ్వడానికి సుందరి పెద్దగా ఆలోచించనూ లేదు.
"ఒకసారి ఆలోచించుకో అమ్మాయ్. చూడబోతే ఈ కుర్రాడు కొత్త లాయరులా ఉన్నాడు. తరువాత ఏం జరిగినా, నువ్వు బాధపడి ప్రయోజనం లేదు". ఆయనకే నవ్వొచ్చింది ఆయన మాటలకు. ఈరోజు నిజంగానే కోర్టు కోర్టులా లేదు.
"లేదయ్యగారూ. ఇందిరక్క ఏం చేసినా సరిగ్గానే చేస్తుంది".
సుందరి సమాధానం విన్న ఇందిర కూర్చుంది. "ఇప్పుడేమంటావ్" జడ్జిగారు దశరథరామిరెడ్డి వంక చూశారు.
కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్లు "ఆమెకే అభ్యంతరం లేకపోతే నాకెందుకు అభ్యంతరం సార్" అని భుజాలెగరేశాడు రెడ్డి. సుందరిని వెనక్కెళ్ళమన్నట్టు చేయూపి పాండును చూశాడు జడ్జి "ఇప్పుడు చెప్పు బాబూ, ఆమెను రిమాండుకు పంపించడంపై నీకేమైనా అభ్యంతరమా?"
"ఎస్ యువరానర్".
"బెయిల్ కావాలా?"
"నో యువరానర్".
జడ్జికి చిరాకేసింది. "మరేం కావాలి?"
"పోలీసు వాళ్ళు ఆమెను అనుమానించారు తప్పితే ఆమె హత్య చేసిందనడానికి ఒక్క ఆధారం కూడా లేదు సార్. అలాంటప్పుడు ఆమెను కేవలం అనుమానం మీద అరెస్ట్ చేయడం, రిమాండుకు పంపండం తప్పు కదా సార్"
జడ్జి, దశరథరామిరెడ్డి ఇద్దరూ ఒకేసారి మాట్లాడబోయారు. జడ్జి మాట్లాడుతున్నాడని రెడ్డి, రెడ్డి మాట్లాడుతున్నాడని జడ్జి ఆగిపోయారు.
పాండు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు "ఆమే ఈ హత్య చేసిందని కనీసం ఒక్క సరైన ఆధారమైనా చూపించి ఆమెను రిమాండుకు పంపండి సార్".
జడ్జి, రెడ్డివైపు చూశాడు.
రెడ్డి అక్కడ టేబులుపై ఉన్న కత్తిని పాండుకు చూపించి జడ్జివైపు తిరిగి "ఈ కత్తితోనే చంద్రశేఖరంగారు హత్య చేయబడ్డారు. దీనిపైనున్న రక్తం మరకలు ఆయనవేనని ధృవీకరణ జరిగింది. అలాగే ఈ కత్తిపైనున్న వేలిముద్రలు ముద్దాయి సుందరివేనని కూడా ధృవీకరించబడింది".
పాండు గొంతు సవరించుకున్నాడు. "మీ రిపోర్టులు రక్తం మరకలనూ, వేలిముద్రలనూ ధృవీకరించాయిగానీ, ఈ కత్తితోనే హత్య చేయబడిందని ధృవీకరించబడలేదు. ఈ కత్తితో హత్య జరగలేదని నేను ఋజువు చేయగలను".
రెడ్డి పాండును పిచ్చోడిని చూసినట్లు చూశాడు.
పాండు తన చేతిలోని ఎఫ్.ఐ.ఆర్. కాపీ ఎత్తి పట్టుకుని "దిసీజ్ ది కాపీ ఆఫ్ ఎఫ్.ఐ.ఆర్ మిలార్డ్. నేను ఇది నిజమని నమ్ముతున్నాను". రెడ్డివైపు చూసి "మీరూ నమ్ముతారా?".
నమ్ముతానన్నట్లు తలూపాడు రెడ్డి.
"ఈ ఎఫ్.ఐ.ఆర్. నిజమని ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ చెబితే వినాలనుంది సార్. ఒక్కసారి ఆయనను ప్రశ్నించే అవకాశమిపించాలి".
"కేసు ట్రయలుకు వచ్చిన తరువాత ఆయనను విచారించేందుకు మీకు ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. నువ్వు కోర్టుకు కొత్తకదా. నీకు కోర్టులో విచారణ జరిగే పద్ధతి, క్రమమూ ఏవీ తెలియదులాగుంది" మళ్ళీ హేళనగా మాట్లాడాడా రెడ్డి.
రెడ్డిని పట్టించుకోకుండా జడ్జివైపు చూశాడు పాండు. జడ్జికి పాండుగురించి విన్నది గుర్తొచ్చింది. మురళివైపు చెయ్యి ఊపి పిలిచాడు. మురళి ముందుకు వచ్చి బల్లమీద నిలబడ్డాడు. ఏమడుగుతావో అడుగన్నట్లు పాండువైపు చూశారు జడ్జి.
పాండు మురళి వైపు చూశాడు. దగ్గరకెళ్ళి "ఈ కేసును దర్యాప్తు చేసింది మీరేనా?"
జడ్జి వైపు చూస్తూ "ఔను". ముక్తసరిగా జవాబిచ్చాడు మురళి. మొదటిరోజు బల్లెక్కడం జరగదు. అతనికి లోపల గుబులు మొదలైంది.
అతని చేతికి ఎఫ్.ఐ.ఆర్ కాపీ ఇచ్చాడు పాండు.
"ఇది ఈకేసుకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్. కాపీయేనా?"
"ఔను".
"ఇందులో వ్రాసినదంతా నిజమేనా?"
"ఔను"
"ఇందులో ఎక్కడైనా ఎగ్జీబిట్ నం.1 గా ఉన్న కత్తి హత్యాయుధమని వ్రాసి ఉందా?"
చదవడం మొదలుపెట్టాడు మురళి. కొంచెం చదివి "ఈ కత్తి హత్యా ప్రదేశంలో దొరికింది. సరిగ్గా చెప్పాలంటే శవంపైన పడివుంది".
"మరి ఈ కత్తితోనే హత్య జరిగిందని పి.పి.గారు ఎలా చెప్పారు?" రెడ్డి వంక చూశాడు పాండు. మౌనంగా నిలుచున్న మురళితో "ఈ కత్తితోనే హత్య జరిగిందని మీరు పి.పి.గారికి చెప్పారా?"
చిరాగ్గా ముఖం పెట్టి "ఔను" అన్నాడు మురళి. "శవం మీద దొరికింది హత్యాయుధమే ఔతుంది కదా?" తన సమాధానం సరేనా అని అడుగుతున్నట్లూ రెడ్డి వంకా, జడ్జి వంకా మార్చి మార్చి చూశాడు మురళి. జడ్జి ముఖంలో ఏభావమూ కనిపించలేదు. "నీ తిప్పలేవో నువ్వు పడు" అనుకుని రెడ్డి తల పక్కకు తిప్పుకున్నాడు.
"హత్య చేసినవాడు ఇంకో కత్తి తీసుకు వచ్చి శవంనుంచి కారుతున్న రక్తంలో ముంచి శవంపై పడవేసి ఉండవచ్చు కదా?"
మురళికి చిరాకు ఎక్కువైంది. "అక్కడ హంతకురాలు, ఐ మీన్, ముద్దాయి తప్ప ఇంకెవ్వరూ లేరు".
"ఇంకెవ్వరూ లేకపోతే హత్య జరిగిన విషయం మీకు ఎవరు తెలియజేశారు?"
"చంద్రశేఖరంగారి తమ్ముడి కొడుకు రాఘవ. ఆయన వాళ్ళింటికి వచ్చి చూస్తే వాళ్ళ పెదనాన్న శవం కనిపించింది. ఆయన ఫోన్ చేశారు".
"మరి ఇందాక హత్య జరిగిన చోట ముద్దాయి తప్ప ఇంకెవ్వరూ లేరన్నారు?"
"అంటే హత్య జరిగినప్పుడు ఇంకెవ్వరూ లేరన్నాను. తరువాత రాఘవ వెళ్ళి మాకు సమాచారమిచ్చారు".
"రాఘవ హత్య జరిగినప్పుడు అక్కడ లేడని ఎందుకనుకుంటున్నారు?"
మురళికి విషయం అర్థమైంది. లెక్క ప్రకారం రాఘవ కూడా అనుమానితుడు కావలసినవాడే.
"ఉండి ఉండ వచ్చు. కానీ, రాఘవే హత్య చేస్తే మాకు ఆయన ఫోన్ ఎందుకు చేయాలి?" తానూ లాజిక్ మాట్లాడటం మొదలు పెట్టాడు మురళి.
"కరెక్ట్" సరైన సమాధానం చెప్పిన విద్యార్థిని మెచ్చుకుంటున్న గురువులా చూశాడు పాండు. "అందుకే నేను రెండవ అనుమానితుడి గురించి మాట్లాడలేదు. కేవలం హత్యాయుధం గురించే మాట్లాడుతున్నాను". మురళి పెదాలపై ఏదో సాధించినట్లు ఒక నవ్వు.
అంతలో పాండు "మీరొకసారి ఈ ఎఫ్.ఐ.ఆర్. కోర్టు వినేలా చదువుతారా?"
రెడ్డి వంకా, జడ్జి వంకా చూశాడు మురళి. ఎంతసేపు నిలబడతానీ వయసులో అనుకుని రెడ్డి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు.
గొంతు సవరించుకుని చదవడం మొదలుబెట్టాడు మురళి. అంతలో పాండు ఉచితసలహా ఇచ్చాడు. "మూడో పేరాచదవండి సార్. మీరు చూసినప్పుడు శవం ఎలా ఉందో అక్కడ వ్రాసి ఉంది".
"శవం కడుపు చీల్చబడి ఉంది. బాగా లోతుగా కత్తిని దింపి చీరినట్లు ఉంది. ప్రేగులూ, పొట్టలోని మిగ.తా అవయవాలూ బయటపడి ఉన్నాయి. బాగా రక్తస్రావమైంది. కత్తితో పొట్టపై నిలువుగా, అడ్డంగా చీల్చి శరీరంలో కత్తిని గుండ్రంగా తిప్పినట్లు అన్ని అవయవాలూ తెగి ఉన్నాయి. అంతర్గత అవయవాలన్నీ బాగా లోతుగా తెగినట్లు కనబడుతుంది. బొడ్డుకు సరిగ్గా క్రిందవైపు వెన్నెముక కూడా కొంచెం కనిపిస్తుంది. హంతకుడు చాలా బలం కలిగి ఉండాలి. హత్య జరిగినప్పుడు హతుడు నిలబడి ఉండాలి. అందుకు గుర్తుగా తెగిన కొన్ని అవయవాలు ప్రక్కన పడి ఉన్నాయి. శవం గుండెలపై ఒక కత్తి ఉంది. పిడి రెండున్నర అంగుళాలు, కత్తి మూడంగుళాలూ ఉంటాయి". చదవడం ముగించి తలెత్తాడు మురళి.
"ఇప్పుడు మీరు చదివినవన్నీ మీరూ, మీ జట్టులోని సభ్యులూ హత్యజరిగిన స్థలంలో చూసినది చూసినట్లు వ్రాసిన నిజాలు. అవునా?"
"అవును" మూరళికి రెండు కాళ్ళూ ఊబిలో పెట్టి నిలబడిన భావన కలిగింది.
"ఈ మూడంగుళాల కత్తితో రాజశేఖరంగారి భారీకాయాన్ని అంత లోపలకు గాయాలయై, అంతర్గత అవయవాలు తెగేలా కోయవచ్చా?"
ఊబిలోకి మెల్లగా జారుతున్నట్లనిపించింది మురళికి. పక్కనే ఉన్న పిచ్చిగడ్డి పొదను గట్టిగా పట్టుకోవాలి. "కడుపు నిలువుగా, అడ్డంగా కోయబడి ఉంది. ఒకసారి శరీరంలో పెద్ద రంధ్రం ఏర్పడితే కత్తి పట్టుకున్న చేతిని లోపలకు జరిపి కోయవచ్చు".
కోర్టులో కేసు విచారణ చూడడానికి వచ్చిన వాళ్ళందరితోపాటు, జడ్జి, రెడ్డి కూడా తరువాత పాండు వేయబోయే ప్రశ్నకోసం ఎదురుచూస్తున్నారు. పాండు ఏం మాట్లాడకుండా మురళినే చూస్తున్నాడు. మురళికి అసహనం పెరిగిపోతుంది. ఈ బచ్చాగాడు తనని దోషిని విచారించినట్లు విచారిస్తున్నాడు. వెనుక కూర్చున్న జర్నలిస్టులలో ఇద్దరు తమ కెమెరాలతో ఫ్లాష్ వాడకుండా నిశ్శబ్దంగా ఫోటోలు తీస్తున్నారు.
"ఇంకా ఏమైనా అడగాలా?" నోరుజారాడు మురళి.
పాండు చిన్నగా నవ్వాడు. "ఏదైనా అత్యవసరమైన పని ఉందా?" సిక్స్ కొట్టడానికి ముందు గ్రౌండు మొత్తం పరిశీలించే బ్యాట్స్ మన్ లాగా కోర్టులో అన్నివైపులా చూశాడు పాండు. అందరి చూపులూ తన మీదనే ఉన్నాయి. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వదిలాడు. "ఒక్క చిన్న ప్రశ్న. మీరన్నట్లు కత్తి పట్టిన చేతిని పొట్టలో దించి చీల్చబడితే కత్తి పిడి కూడా పూర్తిగా రక్తంతో తడిసి ఉండాలి కదా? పిడిపై ఎందుకని ఒక్క చుక్క రక్తం కూడా లేదు?"
ఒకేసారి గొంతువరకూ ఊబిలోకి జారినట్లనిపించింది మురళికి. రుమాలు తీసి ముఖం తుడుచుకున్నాడు. ఇప్పుడు ఏం సమాధానమిచ్చినా తరువాత ప్రశ్నకు జవాబివ్వడం కష్టమనిపించింది. ఆలోచిస్తున్నట్లు క్రిందచూపులు చూడసాగాడు.
పాండు మాట్లాడటం మొదలు పెట్టాడు. "నేను చెప్పనా. మీరు చెప్పినట్లు కత్తి ఉన్న చేతిని కడుపులో దింపి చుట్టూ తిప్పి ఉంటే, ఖచ్చితంగా కత్తి మొత్తం రక్తంతో తడిసి ఉండాలి. అప్పుడు ముద్దాయి కత్తిని పిడి వరకూ దేనితోనైనా తుడిచి శరీరం మీద వదలి ఉండాలి. కానీ అలా తుడవాలంటే కత్తిలోని పదునైన భాగాన్ని పట్టుకుని ఏదైనా బట్టతో పిడి మాత్రం తుడిచి ఉండాలి. లేదా కత్తిని ఏ వాష్ బేసినులోనో, కుళాయి కిందో కడిగి ఉండాలి. కడిగితే పదునైన భాగంలోనుంచి కూడా రక్తపు మరకలు పోతాయి. అంతేకాక కడిగినా, తుడిచినా ముద్దాయి వేలుముద్రలు చెరిగిపోతాయి. ఇంకా నీళ్ళతో కడిగడానికి కత్తిని బాత్రూముకో, కిచెనుకో తీసుకు వెళితే, మళ్ళీ తీసుకువచ్చి పిడిపై తన వేలుముద్రలు ఉండేలా పట్టుకుని హతుని రక్తంలో మిగతా భాగాన్ని తడిపి శవం గుండెలపై వదిలి వేసి ఉండాలి. అంటే ముద్దాయి ఉద్దేశ్యపూర్వకంగా తనను ఒక అనుమానితురాలిగా గుర్తింపబడడానికి పథకం వేసి ఉండాలి".
పాండు తన భాషణకు విరామమిచ్చి ముందు రెడ్డిగారివైపూ, తరువాత జడ్జిగారి వైపూ చూశాడు.
"ఈ ఎగ్జిబిట్ నం.1గా కోర్టుకు సమర్పించి కత్తి ఖచ్చితంగా హత్యాయుధం కాదు మిలార్డ్". మురళికి పూర్తిగా ఊబిలోకి మునిగిపోయినట్లు అనిపించింది.
పాండు తన చేతిలోని శనివారం దినపత్రికను జడ్జిగారికి చూపాడు. " మిలార్డ్. ఈ ఫోటో పోలీసువారే మీడియాకు రిలీజ్ చేసినట్లున్నారు. హతుని బనియను పైభాగంలో రక్తసిక్తమైన హత్యాయుధాన్ని తుడిచిన మరకలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ గుర్తులనుంచి కత్తి వెడల్పు దాదాపు ఒక అంగుళం ఉంటుందని చెప్ప వచ్చు. కానీ గౌరవనీయులైన ఇన్స్పెక్టరుగారు ఈ సాక్ష్యాలను నిర్లక్షించారు. అంతేకాదు యువరానర్, చిన్న కత్తితో చీరితే అవయవాలన్నీ చాలా సార్లు ముక్కలు చేయవలసి ఉంటుంది. అప్పుడు అవయవాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా బయటకు రాలతాయి. కానీ హతుని అంతర్గత అవయవాలన్నీ పెద్ద ముక్కలుగానే బయట పడ్డాయి".
పాండు రెడ్డిగారివైపు చూసి అడిగాడు "మీరు పోస్ట్ మార్టెమ్ రిపోర్టు చదివారా?"
దశరధరామిరెడ్డి లేచి నిహబడ్డాడు. కేసు ఓడిపోయానని ఆయన గ్రహించాడు. పోలీసులపై నమ్మకం ఉంచడం తన తప్పు. జడ్జిగారి వైపు చూసి, "లేదు యువరానర్. నేను ఇంకా పోస్ట్ మార్టెమ్ రిపోర్టు చదవలేదు".
పాండు మురళి వైపు చూసి "మీరు చదివారా?" అని అడిగాడు.
చదివానన్నట్లు మురళి తల ఊపాడు. "హత్యాయుధం పరిమాణం గురించి వ్రాసి ఉందా? లేదా?"
ఉందన్నట్లు తల ఊపాడు మురళి. "అంటే మీకు ముందే ఈ కత్తితో హత్య చేయబడలేదని తెలుసు కదా?". మురళి మౌనం వహించాడు.
"గౌరవనీయులైన ఇన్స్పెక్టరుగారి మౌనం సుందరిగారి నిర్దోషిత్వానికి ఋజువు మిలార్డ్. నిజమైన నేరస్థులను రక్షించడానికి ఆమెను అక్రమంగా ఈ కేసులో బలిపశువును చేసారు. అమాయకులైన సుందరిగారిపైనున్న అభియోగాన్ని కొట్టివేసి ఆమెను విడుదల చేయవలసినదిగా ప్రార్థన" పాండు ముగించాడు.
"ప్రాసిక్యూషన్ వారెమైనా చెప్పదలచుకున్నారా?" జడ్జిగారు రెడ్డివైపు చూసి అడిగారు.
మురళివైపు అసహ్యంగా చూశాడు రెడ్డి. "ఆమెను విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు యువరానర్. అతి తక్కువ సమయంలో ముద్దాయిపైనున్న నిందలు తప్పని ఋజువు చేసిన డిఫెన్స్ లాయరుగారికి నా అభినందనలు. కాకపోతే ఈ హత్య ఎవరు చేసి ఉంటారన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు" పాండువైపు ఏదో ఎదురుచూస్తున్నట్లు చూశాడాయన.
పాండు ఆయన అభినందనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తలవంచి నమస్కరించాడు. "హంతకుడిని పట్టుకోవడం నా పని కాదు సార్. అది పోలీసుల పని. బహుశా ఎవరైనా తన కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వర్తించే ఇన్స్పెక్టరుకు ఈ కేసు అప్పచెబితే త్వరగా హంతకుడు పట్టుబడతారు". జడ్జివైపు తిరిగాడు పాండు. "ఒకవేళ నేనే ఈ కేసు దర్యాప్తు చేసేటట్లయితే మాత్రం వెంటనే రాఘవను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాను. దర్యాప్తు సరిగ్గా చేస్తే రెండు రోజుల్లో ఆధారాలు లభిస్తాయి".
* * *
కోర్టు బయట సుందరి ఇందిరను కౌగలించుకుని బావురుమంది. రాఘవ భార్య కూడా ఇందిర దగ్గరకు వచ్చింది "నన్ను క్షమించు వదినా" అంటూ. "ఊరుకోవే. నీ తప్పేముంది, వాడిని చేసుకోవడం తప్ప" అని సముదాయించింది ఇందిర.
చెట్టుకింద కూర్చున్న పాండు దగ్గరకొచ్చి "ఇంకా భయంగా ఉందారా నీకు?" అంది నవ్వుతూ. "నామీద నీకు అంత నమ్మకం ఎక్కడినుంచి వచ్చిందత్తా?" విస్మయంగా అడిగాడు పాండు. "ఎందుకో నాన్నగారి విషయం తెలియగానే ముందు నువ్వే గుర్తుకొచ్చావురా. నీ గురించి పోయినసారి ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారే చెప్పారు. అందుకే కాబోలు, వెంటనే నీకు ఫోన్ చేశాను. అయినా మొదటగా మనసుకేది స్ఫురిస్తే అదెప్పుడా సరి అవుతుందిరా" ప్రేమగా తల నిమిరింది ఇందిర.