విమల - సరికొండ శ్రీనివాసరాజు

Vimala

రామయ్యకు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్య కూతురు విమల. విమలకు రెండేళ్ళ వయసు ఉన్నప్పుడే కమల తల్లి చనిపోవడంతో చుట్టాల పోరు పడలేక రామయ్య చంద్రకాంత అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కాలక్రమంలో రామయ్య, చంద్రకాంతలకు కూతురు జన్మించింది. ఆ అమ్మాయికి కమల అని పేరు పెట్టారు ‌‌చంద్రకాంత కమలను అల్లారుముద్దుగా పెంచింది. అతి గారాబం చేస్తుంది. ఏ పనీ చెప్పకుండా సుకుమారంగా కమలను పెంచుతుంది చంద్రకాంత. చిన్నప్పటి నుంచే విమల చేత శక్తికి మించిన పనులను చేయిస్తుంది. పొరపాటు జరిగితే గొడ్డును బాదినట్లు బాదుతుంది. ఇంటిపని, వంటపని, బయటి పనులు అన్నింటినీ విమల చేతనే చేయిస్తుంది చంద్రకాంత. తాను తన కూతురు కమల సుఖంగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు. కాలక్రమేణా ఇద్దరూ యుక్త వయసు వారయ్యారు. కమలకు మంచి ధనవంతుల అబ్బాయికి ఇవ్వాలని, విమలను పేదింటి వారికి ఇచ్చి వదిలించుకోవాలని చంద్రకాంత ఆలోచన. ఒకరోజు ఇద్దరు బాటసారులు ఎండలో అలమటిస్తూ చంద్రకాంత ఇంటికి వచ్చారు. ఆ సమయంలో చంద్రకాంత ఇంట్లో లేదు. విమల బాటసారులకు చల్లని మజ్జిగ ఇచ్చింది. వినయంగా మాట్లాడుతూ భోజనం చేసి వెళ్ళమని పట్టు పట్టింది. అప్పటికప్పుడు కమ్మని భోజనం, రుచికరమైన కూరలతో చేసి వడ్డించింది. తమ పట్ల విమల చూపిస్తున్న ఆదరాభిమానాలకు బాటసారులు ముగ్ధులు అయ్యారు. కూతురిని మంచిగా పెంచినందుకు రామయ్యను మెచ్చుకుంటున్నారు. సంతృప్తిగా వెళ్ళిపోయారు. రెండు రోజుల తర్వాత రాజుగారి నుంచి రామయ్యకు విమలకు కబురు వచ్చింది. వెళ్ళారు. చంద్రకాంత కూడా వెంట వచ్చింది. బాటసారులుగా మారు వేషాల్లో రామయ్య ఇంటికి వచ్చింది తామేనని రాజు, మంత్రులు చెప్పారు. తమకు విమల గుణగణాలు నచ్చాయని యువరాజుకు విమలనిచ్చి పెళ్ళి చేసి, తమ కోడలుగా చేసుకుంటామని, అంగీకరించమని రాజు వేడుకున్నాడు. కళ్ళలో నిప్పులు పోసుకుంది చంద్రకాంత. తన చిన్న కూతురు కమల చాలా సౌందర్యవతి అని, విమలకంటే మంచి గుణవంతురాలు అని అంది. "ఔను! చాలా గొప్ప గుణవంతురాలు. మమ్మల్ని చుర చురా చూడటమే కాక ఎప్పుడు వెళ్తారని ముఖాన్నే అడిగింది. రామయ్య అలా ప్రవర్తించడం తప్పని చెబితే కోపంగా మమ్మల్ని చూస్తూ లోపలికి వెళ్ళింది." అన్నాడు మంత్రి. చంద్రకాంతకు నోట మాట రాలేదు. విమలకు యువరాజుతో పెళ్ళి అయింది. గుణవతి అయిన విమల భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయి. ఆమె కష్టాలన్నీ తొలిగాయి. ‌

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి