చెలిమి - రాము కోలా.దెందుకూరు

Chelimi

అభివృధ్ధికి నోచుకోని ఎన్నో గ్రామాల్లో రామాపురం ఒకటి. నివాసాలకు దూరంగా! విసిరేసినట్లుగా, ముప్పై నలభై ఇండ్లతో ఏర్పడిన చిన్న ఊరు రామాపురం.. విద్య, వైద్య ,రవాణా, సౌకర్యాలకు ఏమాత్రం నోచుకోని పల్లెటూరు. అలా అభివృద్ధికి నోచుకోని గ్రామంలో,శ్రమను నమ్ముకున్న కుటుంబాలు కొన్ని. వాటిపై ఆధారపడి,వారి శ్రమను దొచుకునే భూకామంధులు కొందరు . వారు చూపించే కుల అహంకారం ఇంకా అక్కడక్కడా కొన్ని పసి హృదయాలను గాయపరుస్తూనే ఉండేది . అలా తాకిడికి గురైన వాడే ఓబులేసు. ఓబులేసుకు చిన్నతనం నుండి బాగా చదువుకోవాలని ఆపేక్షగా ఉండేది. కానీ! చదువుకునేందుకు తన ఊరిలో, పాఠశాల లేక పోవడంతో, పొరుగన ఉన్న మాధవాపురంలో చదువుకోవాలనే కోరికను, తన తండ్రికి పదేపదే గుర్తు చేస్తుండేవాడు. తన బిడ్డలోని చదువు పట్ల ఉన్న మక్కువను అర్దం చేసుకున్న మల్లన్న,ఒక మంచి రోజు చూసుకుని, ఓబులేసుని తీసుకు వెళ్ళి మాధవాపురం పాఠశాలలో చేర్పించాడు . రామాపురం నుండి మాధవాపురం రోజు నడచి వెళ్ళి చదువుకుని తిరిగి వస్తూ ఉండేవాడు ఓబులేసు.. ఊరిలోని ఉన్నత కుటుంబానికి చెందిన విష్టూ,ఓబులేసును చాలా చిన్న చూపు చూసేవాడు.దానికి ప్రధాన కారణం,చదువులో తనకు పోటీగా ఓబులేసు నిలవడమే. "నీకు చదువు అవసరమా? "అంటూ చులకనగా మాట్లాడేవాడు. ఎవరితోనూ కలవనిచ్చేవాడు కాదు. అయినా! ఏరోజు ఓబులేసు బాధపడలేదు. "అవమానాలు ఎదురు అవుతూనే ఉంటాయ్. లెక్కచేయక ముందుకు సాగితేనే నీలక్ష్యం నీముందు నిలుస్తుంది". అనే తండ్రి మాటను పదేపదే గుర్తుచేసుకునే వాడు ఓబులేసు. రామాపురానికి మాధవాపురానికి మధ్యలో వాగు ఉండేది. అది ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయినా! వానాకాలం లో పొంగుతూ ప్రవహించేది. అలా ప్రవహించే వాగును చూస్తూ ,గడపడం పిల్లలకు బలే సరదాగా ఉండేది. అందరితో పాటుగా ఓబులేసు కూడా వాగును చూసేందుకు వెళ్ళేవాడు. నీటి ప్రవాహం చూస్తూ ఆనందించేవాడు. తన తోటి పిల్లలు" వీడికి నీళ్ళంటే చచ్చేంత భయం. అందుకే వాగులో కి దిగడంలేడు,పిరికి సన్నాసి"అని గేలిచేస్తూ ఉండేవారు. అలా అని ఎవ్వరు తమతో కలవనిచ్చేవారు కూడా కాదు. అందరూ వాగులో దిగి స్నానం చేస్తూ,గడుపుతుంటే,తనకు కూడా అలా చేయాలనిపించేది... ఎవ్వరూ తనని కలవనివ్వక పోవడంతో దిగువ ప్రాంతంలో తన సరదా తీర్చుకునే వాడు ఓబులేసు. అలా ఒకరోజు చేస్తుండగానే ,ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం వలన ,వరద ఉధృతి క్రమంగా పెరగసాగింది. అది గమనించి అందరికీ తెలియచేసె ప్రయత్నం చేసాడు ఓబులేసు . ఓబులేసు మాట ఎవ్వరు వినిపించుకోకపోగా!అవహేళన చేస్తూ,పిరికివాడు అని ఎద్దేవా చేసేవారు. విష్ణు తన తోటి మిత్రులు ముందు ఓబులేసును మరింత చులకన చేయాలని చూస్తూనే,వరదకు ఎదురుగా ఈదుతూ వెళ్ళసాగాడు. "వద్దు !అటుగా వెళ్ళవద్దు. లోతు ఎక్కువగా ఉంటుంది.నీటి ప్రవాహం పెరిగింది." "వరద సుడితిరుగుతూ వస్తుంది. దయచేసి వెనక్కి వచ్చేయ్" అంటూ పెద్దగా అరుస్తూ విష్ణు ను అనుసరించే ప్రయత్నం చేస్తున్నాడు ఓబులేసు. తను నేస్తానికి దరిదాపుల్లో ప్రమాదం పొంచి ఉందని తెలిసి. ఓబులేసు అన్నట్లుగానే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది.. అది విష్ణు ఊహించనిది. విష్ణు అయోమయంగా చూస్తూ,నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ!తను ఉన్న ప్రాంతం మరింతగా లోతు ఉండడంతో కాళ్ళు నేలకు అనడం లేదు. వరదకు శరీరం తట్టుకోలేక పోతుంది. వరద పెరుగుతూనే ఉంది. విష్ణు తన భుజాల వరకు మునిగిపోసాగాడు.. చేతులు కదిలించలేని పరిస్థితి. ఇక తను వరదలో కొట్టుకు పోవడం తప్పదు అనుకుంటూ, ఓబులేసును పిలిచే ప్రయత్నం చేస్తుండగానే,వరద నీరు నోట్లోకి చేరుకుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది ,అనేది తనకు తెలుస్తుంది. తను నీటిలో మునిగిపోతున్నాడు , మెళ్లిగా. ****** కళ్ళు తెరిచి చూట్టూ చూసాడు విష్ణు. తను వాగులో లేడు.తన ఇంట్లో మంచం మీద ఉన్నాడు. దగ్గర్లో తల్లి దండ్రులు కన్నీరు తూడ్చుకుంటూ కనిపిస్తున్నారు. దూరంగా చేతులు కట్టుకుని తననే చూస్తున్నాడు ఓబులేసు. విష్ణు కు అర్థమైంది. ఎప్పుడూ ఓబులేసును తన ఇంటి వైపు కూడా రావడానికి ఇష్టపడని తన తల్లిదండ్రులు, ఓబులేసును ఇంట్లోకి రానిచ్చారంటే! తనని రక్షించింది ఓబులేసు అని గ్రహించాడు. చిన్నగా!తన వద్దకు రమ్మంటూ సైగ చేసాడు విష్ణు. ఓబులేసు పాదాలు విష్ణు మంచం వైపు సాగుతున్నాయి. విష్ణు చేయ్యి, ఓబులేసు చేతిని అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఇరువురి కన్నుల్లో కృతజ్ఞతా భావం లీలగా కనిపిస్తుంది. #శుభం#

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి