దారి మారిన వ్యూహం - శ్యామ్ కుమార్ చాగల్

Daari maarina vyooham

ఆ రోజు కాలేజీ అంత కోలాహలంగా వుంది. కాలేజీ డే నాడు స్టేజి మీది కార్యక్రమాల గురించి అందరూ చర్చించుకుంటూ వున్నారు. ఎదురు వేపు గడ్డి మైదానం లో అక్కడక్కడా కొందరు విద్యార్థులు కూర్చొని వారి వారికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వున్నారు. కోఎడ్యుకేషన్ కాలేజీ కావటం మూలాన అమ్మాయిలతో కాలేజీ రంగుల హరివిల్లులా వుంది.

ఒక వేపు వున్న వేప చెట్టు కింద గడ్డి లో కూర్చున్న వారిలో ముందుగా " ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన బ్యాచ్ తో కాస్త తల నెప్పిగా వుంది. " మొదటి సంవత్సరం విద్యార్థులనుద్దేశించిఅంది . జ్యోతి

" అవును ..చదువు మీద చూపు లేదు . ఎంత సేపు అమ్మాయిలను చూడటమే" అంది రేఖ.

" మన సెక్షన్ వీరేందర్ తో తల నెప్పి ఎక్కువవుంది " అంది విజయ .

" అవును ..రోజూ నా వెనకాలే ఉంటున్నాడు . ఈ రోజు నా ఆటో ఎక్కి కూర్చొని, సాయంత్రం కాఫీ డే కు వస్తావా అని అడిగాడు. మొన్నొకసారి నా మొబైల్ నెంబర్ ఇవ్వమంటూ నా వెనకాల ఇంటి వరకూ వచ్చాడు. " అంది చిరాకుగా,నిస్సహాయంగా బిందు.

విసుగ్గా చూసింది జ్యోతి " మరేందుకు నాకు చెప్పలేదింత వరకూ .పద రఘు, రాకేష్ దగ్గ రకెళ్ళి చెబుదాం . వాళ్ళు, మన జోలికి ఇక రాకుండా చూసుకుంటారు " అంది.


రాకేష్,రఘు లను వెదుక్కుంటూ వెళ్లారు బిందు, జ్యోతి
కొద్దీ దూరం లో వరండా మెట్ల మీద కూర్చొని కనిపించారు రఘు , స్నేహితులు ముగ్గురు. వారిలో రాకేష్ కాస్త దుడుకు స్వభావం కల వాడు.
దగ్గరగా వస్తున్న ఇద్దరు అమ్మాయిలను చూసి ఆప్యాయంగా పలకరించాడు రాకేష్ " ఏంటి జ్యోతి అలా వున్నారు ?"

" ఇదుగో ..బిందు కు కాస్త ప్రాబ్లెమ్ మొదలైంది." అంది జ్యోతి, రఘు రాకేష్ లను చూస్తూ.

" ఎవరితో " అన్నాడు రమేష్ .

" వీరేందర్ ..న్యూ సెన్సు . రోజూ వెంటబడి వేధిస్తున్నాడు . పైగా ఈ అమ్మాయి మొదటి సంవత్సరం కదా . బాగా జడుసుకుంటోంది" అంది నవ్వుతూ జ్యోతి.

" ఈ సారి వాడిని వదల కూడదు రా ,చితక్కొట్టేయ్యాలి " అన్నాడు రఘు పళ్ళు బిగించి కసిగా.

"ఎక్కడ పట్టుకుందాం ?..వాడికి అనుమానం రాకూడదు." ఆలోచిస్తూ అన్నాడు రాకేష్ .

" మళ్ళీ వాడు మన బిందు జోలికి రాకుండా చేయండి " అంది జ్యోతి ఆవేశంగా .

"సరే మెం చూసుకుంటాం నువ్వింటికి వెళ్ళు" నిదానంగా చెప్పాడు రమేష్.

" జాగ్రత్త .." అని రఘు కి చెప్పి ,పక్కకు తిరిగి బిందు ని చూసి " పద..వాళ్ళు చూసుకుంటారు " అని బిందు తో కలిసి వెళ్ళిపోయింది జ్యోతి.

అది పట్టణం లో అతి పెద్ద పేరు మోసిన మంచి డిగ్రీ కాలేజీ. అక్కడ చదువుతున్న రఘు,రమేష్, రాకేష్ , కృష్ణ ,జ్యోతి నలుగురు మంచి స్నేహితులు. అందులో విద్యార్థి నాయకురాలు జ్యోతి.
ఏ అమ్మాయికి ఇబ్బంది వచ్చినా , తన స్నేహితులైన ఈ నలుగురి తో కలిసి విషయం చెప్పి , వారి సహాయం తీసుకోవటం ఎప్పుడూ జరిగేదే.

" ఇలా మనం అందరితో తగవు పెట్టుకుంటే పోతే ఆఖరికి మనకు స్నేహితులు ఎవరూ మిగలరు. ఈ అమ్మాయిల కు సహాయం ఏమిటో గానీ మనకు ప్రశాంతత లేకుండా పోయింది " అన్నాడు కృష్ణ నిర్లిప్తంగా.
నిజానికి కృష్ణ ఎవరితో తగాదాలు పెట్టుకోడు,. కానీ సమయం వచ్చిందంటే వెనక ముందు ఆలోచించ కుండా మొండి ధైర్యం తో పోట్లాటకు ముందుకు దూకేస్తాడు .

" అమ్మాయిలను వాడు అలా శృతి మించి టీజింగ్ చేస్తే ఎలా ? ఒక వేళ నిజంగానే మన చెల్లెలిని ఎవరైనా చేస్తే ఊరుకుంటామా?" అన్నాడు రాకేష్ ఆవేశంగా తన చేతికున్న స్టీల్ కడియాన్ని పట్టుకుని .

" ఊరుకునే సమస్య లేదు కానీ, ఎందుకైనా మంచిది హమాల్వాడి గ్యాంగ్ ను వెంట తీసుకె;ళ్లాలి " సీరియస్ గా మీసాలు దువ్వుకుంటూ చెప్పాడు రఘు. ఇతను ఒక పట్టాన నవ్వడు. తీక్షణమైన చూపులు ఎటువంటి వాడికైనా భయం కొల్పుతూ ఉంటాయి. నలుగురు వున్నప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం అతడి నైజం .

" నిజమే వాడు బాగా డబ్బులున్న
వాడు..వాడిని కొట్టిన వెంటనే ఒకేఒక మెసేజ్ తో వాళ్ళందరూ పరుగెత్తుకొస్తారు . మనం ముందే రెడీ గా ఉండటం బెటర్" అన్నాడు రమేష్ పెరిగిన తన గడ్డాన్ని రుద్దుకుంటూ . అన్ని పోట్లాటలకు సంబంధించి ప్లానింగ్ వేయటం ఇతడి వంతు.

" ఓకె ! సాయంత్రం ఎప్పటిలా చెరువు దగ్గర కలుద్దాం ...పదండి ." అని లేచాడు రఘు.

స్నేహితులందరూ లేచి ఇళ్లకు బయలుదేరారు.

ఆ రోజు సాయంకాలం చెరువు గట్టున కూచొని వీరేందర్ ను ఎక్కడ ,ఎలా ఒంటరిగా పట్టుకోవాలి అని చర్చించుకో సాగారు.

" ముందుగా వాడు రోజూ ఎక్కడికి వెళతాడు. ...వాడు ఇంటికి చేరే సమయం ఎప్పుడు. ...వాడు వెళ్లే
దారి ఏది , ఇవన్నీ చూసు కోవాలి " అన్నాడు రమేష్.

" కొట్టే ముందుగా ఒక సారి వాడికి వార్నింగ్ ఇవ్వటం బెటర్ " గడ్డం గోక్కుంటూ అన్నాడు రఘు.

" దాంతో వాడు అలెర్ట్ అయిపోయి , మనకిక దొరడు " అన్నాడు రాకేష్ నవ్వి , మీసం సరిచేసుకుంటూ.

" ఒక సారి మంచిగా చెప్పి చూద్దాం..వినకుంటే అప్పుడు వాడి పని బజ్జింగ్ "అన్నాడు కృష్ణ ముంజేయికున్న లావాటి స్టీల్ కడియాన్ని తిప్పుతూ.
" సరే అలాగే
" వాడు కామర్స్ సెక్షన్ అనుకుంటా ..లంచ్ సమయం లో కలుద్దాం." అన్నాడు రఘు ఆలోచిస్తూ.

పడమట సూర్యుడు అస్తమిస్తున్నాడు. చెరువు లోని కొంగలన్నీ ఆకాశం లోకి ఎగిరి పోసాగాయి.

రాబోయే తగాదా గురించి ఆలోచిస్తూ అందరూ ఉద్వేగంగా వున్నారు.

*****

మరుసటి రోజు కాలేజీ ముందు గడ్డి మైదానం లో కూర్చొని సైకిళ్ళ పై వస్తున్న అమ్మాయిలను చూస్తూ వున్నారు రాకేష్, రఘు, రమేష్, కృష్ణ .

దూరంగా వీరేందర్ వస్తూ కనిపించాడు . అది చూసి " వీడి మొహం అద్ధం లో చూసుకోమని చెప్పాలి...వీడు బిందు వెంట పడటం ఏంటి ?" పకపకా నవ్వాడు రమేష్.

" అటు వేపు ,వాడిని చూసి నవ్వకు . " అని చెప్పి , వీరేందర్ వేపు తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడు రాకేష్.

స్నేహితులతో కలిసి నవ్వుకుంటూ వస్తున్న వీరేందర్ కు తననెవరో చూస్తున్నట్లనిపించి ,రాకేష్ వేపు చూసాడు .
కోపంగా చూస్తున్న రాకేష్ని , మీసాలు దువ్వుతున్న రఘు ను గమనించాడు వీరేందర్.
వారి చూపులు తనను రెచ్చగొట్టుతున్నట్లుగా అనిపించి, వెంటనే అతడి దవడలు బిగుసుకున్నాయి
పక్కన తన తో నడుస్తున్న సుధాకర్ , రాజు ల తో అన్నాడు వీరేందర్ " అరేయ్..అటు చూడండి , ఆ నా కొడుకులు మనల్నే చూస్తున్నారు , ఎదో వుంది "

" వొళ్ళు కొవ్వేక్కినట్లుంది, ఎప్పుడు చూసినా పోరిల తో దోస్తాని కదా," అని గుర్రు మంటూ చూసారు సుధాకర్, రాజు.
ఇంతలో కాలేజీ గంట కొట్టారు. అందరూ తరగతి గదుల వేపు అడుగు లేస్తూ వెళ్లి పోయారు. కాలేజీ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఖాళి అయిపొయింది. కాలేజీ ఆవరణంతా నిశ్శబ్ధన్గా అయిపోయి,తరగతి గదుల్లోంచి పాఠాలు మాత్రమే వినపడ సాగాయి.

సాయంత్రం నాలుగు గంటలకు కాలేజీ వదిలేసరికి ఒక్కసారిగా విద్యార్థులందరూ బయటకి వచ్చి, సైకిల్, స్కూటర్ లు తీసుకుని ఇళ్ల వేపు పరుగులు తీశారు. కొందరేమో గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళ్తున్నారు.
అందరికంటే వెనకగా వస్తున్న రఘు , కృష్ణ వేపు చూసి " రాత్రి మనం ఒంటరిగా ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతీ సారి ఒకే దారి లో వెళ్ళటం మానేయాలి. ఇప్పటికే చాల మంది శత్రువులు అయిపోయారు. జాగ్రత్తగా ఉండాలి. ఒకో రోజు ఒక వేపు నుండీ మార్చి మార్చి వెళ్ళటం మంచిది."

" అవున్రా ..నిజమే ,అందరూ వెంట సైకిల్ చైన్ లాంటివి వుంచు కొండి . " అన్నాడు రాకేష్.

" నాకైతే ఇది చాలు " అన్నాడు కృష్ణ తన చేతికున్న స్టీల్ కడియాన్ని చూపిస్తూ.

" అవన్నీ వేరు.. ముందుగా ఏదైనా అనుమానం వస్తే , వెంటనే అక్కడనుండి పారిపోవాలి..ఒంటరిగా దొరికి పోయి
పెద్ద హీరోఇజం చూపించి తన్నులు తిన కూడదు." అన్నాడు రఘు హెచ్చరికగా .

" కరెక్ట్..ముందు తప్పించుకుని ,ఆ తర్వాత వాళ్ళ పని పట్టాలి." అన్నాడు రమేష్.
స్నేహితులందరూ ఒక సారి రమేష్ వేపు చూసి నడక కొనసాగించారు.

****

రాత్రి ఆలస్యంగా ఇంట్లోకి అడుగుపెడుతున్న కొడుకు రాకేష్ ను చూసి " ఒరేయ్ త్వరగా వచ్చేయి రా..రాత్రి ఆలస్యమయ్యే కొద్దీ, మాకు భయం ఎక్కువైపోతోంది. అందరితో గొడవలు , మనకెందుకు చెప్పు?' అంది రాకేష్ తల్లి దిగాలుగా మొహం పె ట్టి.

" ఏమీ కాదులే, ఊరికే అనవసరంగా భయ పడకు" అంటూ చిరాకుగా లోపలి వెళ్లిపోయాడు రాకేష్.

" ఏమోరా నాన్న, నీకేమైనా అయితే ఇంకేమన్నా ఉందీ , అసలు నీ ఫ్రెండ్స్ ను రమ్మను , నే చెప్తాను,మనకెందుకీ లేని పోనీ గొడవలు. కాలేజీ చదువు ఎప్పుడు ముగుస్తుందో, మాకీ ధడ ఎప్పుడు తగ్గుతుందో "అంది రాకేష్ తల్లి.

ఏమీ సమాధానం చెప్పకుండా స్నానాల గది లోకి వెళ్ళిపోయాడు రాకేష్.

మరుసటి రోజు కాలేజీ అయిపోయింతర్వాత కాలేజీ కాంటీన్ లో రఘు , ముగ్గురు స్నేహితులు, జ్యోతి, బిందు, మాధవి కూర్చొని. మిర్చీలు తింటూ రాబోయే కాలేజీ డే గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇంకో వేపు , దూరంగా కూర్చొని వీళ్ళనే చూస్తూ వున్న సత్యం , పక్కనున్న చందర్ ను చూసి " . ఈ వెధవలు అన్నింట్లో డామినెట్ చేస్తున్నార్రా , పైగా ఈ అమ్మాయిలు కూడా మరీను, ఎప్పుడు చూసినా వాళ్ళ చుట్టూ నే " అన్నాడు చిరాకుగా .

" స్పాట్ పెట్టు మరి, ఒక సారి అర్సుకుందాం " అన్నాడు చందర్ తన చేతికున్న మొన తేలిన పంచింగ్ రింగ్స్ ను సవరించుతూ.

" నల్గురు ఒక దగ్గర లేనప్పుడు, వొంటరిగా వాళ్లలో ఒక్కడు దొరికితే ఆ పని చేద్దాం ,అది ముఖ్యం " చెప్పాడు సత్యం , రఘు వేపు చూసి మీసం మెలి వేసుకుంటూ .
" అది కరెక్ట్ "అన్నాడు చందర్ . అతడి నరాలు ఉప్పొంగి, పిడికిలి బిగుసుకుంది.

సత్యం ,చందర్ కలిసి తమనే చూస్తున్నట్లుగా గమనించిన రఘు చటుక్కున లేచి , ఎవరూ ఊహించనంతగా వేగంగా సత్యం ముందుకొచ్చి నిలబడి " ఏం చూస్తున్నావ్, బాగా చూస్తున్నావ్ నన్ను ,. ఏం సంగతి " అని షర్ట్ చేతులను పైకి మడుస్తూ అడిగాడు.

విస్తుపోయిన చందర్ కూడా అంతే వేగంగా లేచి " మరి నువ్వెందుకు చూస్తున్నట్లు " అన్నాడు.
తేరుకున్న రాకేష్, కృష్ణ ,రమేష్ గబగబా వచ్చి వీరిద్దరి మధ్యన నిలబడి రఘు ను వెనక్కి నెట్టారు.. కాంటీన్ లో వున్న
విద్యార్థులందరూ లేచి టెన్షన్ తో చూడ సాగారు.

అంతలో పక్కనున్న సత్యం లేచి రఘు మీదకు వెళ్ళాడు. వెంటనే రాకేష్ ముందుకురికి తన రెండు చేతులతో సత్యాన్ని అడ్డుకున్నాడు.
అరుపులు కేకలతో కాంటీన్ మారుమోగి పోయింది.
వాతావరణం అంతా ఉద్రిక్తం గా మారి పోయింది. ఏం జరుగుతోందో తెలీక బయట వున్న విద్యార్థులందరూ కాంటీన్ లోకి పరుగెత్తుకొచ్చారు.
అటు వేపుగా వెళ్తున్న ప్రిన్సిపాల్ ఈ అరుపులు విని కాంటీన్ లోకి అడుగు పెట్టాడు. ప్రిన్సిపాల్ ను చూడగానే అందరూ సర్దుకుని , దూరంగా జరిగి నిలబడ్డారు. కాసేపు అందరిని చూసి " అందరూ బయటకు నడవండి " అని గుడ్లురుముతూ చూసారు ప్రిన్సిపాల్.
వెంటనే అందరూ నిశ్శబ్దం గా ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్లిపోయారు.

ఆ రోజు సాయంకాలం జ్యోతి ఇంట్లో రాకేష్, రమేష్, కృష్ణ , రఘు లు టీ తాగుతూ రాబోయే కాలేజీ డే విషయాలు మాట్లాడుతూ వున్నారు.
" ఫైనల్ ఇయర్ ఇంకొన్ని నెలల్లో ముగుస్తుంది..డిగ్రీ తర్వాత చెయ్యబోయే కోర్స్ ల గురించి మనం ఆలోచించటం మంచిది " అన్నాడు కృష్ణ .

" అబ్బా ఇప్పటినుండి దాని మీదెందుకురా బాధ.. ఈ రోజు ఏ సినిమా కెళదాం ? ముందది తేల్చు. " అన్నాడు రఘు.

" అవును సినిమా చూసి నెల దాటింది వెధవది " అన్నాడు రమేష్.

అందరూ కలిసి ఊరి చివరన వున్న కొత్త సినిమా హాల్ కెళ్ళారు. సినిమా బావుంది.. సినిమా అయిపోయాక బయటకు వచ్చి స్కూటర్ స్టాండ్ వేపు దారి తీశారు.
రఘు, రాకేష్ గేట్ దగ్గర కొచ్చేసరికి చందర్, సత్యం మరో నలుగురు నిలబడి వెంకీ ను కోపంగా చూసి , ముందుకు అడుగులు వేశారు.
అది చూసి కృష్ణ రమేష్ లు వేగంగా గేట్ దగ్గరకు వచ్చేసారు.

కాస్త దూరంగా ఆగిపోయిన చందర్, రాకేష్ ను చూసి." రేపు కలిసి మాట్లాడదామనుకుంటున్నాం ..ఎక్క డ కలుస్తారు? "
సీరియస్ గా మొహం పెట్టి అడిగాడు.
అక్కడే తాడో పేడో తేల్చుకుందాం అనుకున్న రాకేష్ కి వెనకాల వున్న జ్యోతి, బిందు, విజయ గుర్తుకొచ్చారు. సలసల కాగుతున్న రక్తం చల్ల బడింది.
ఏదో జరుగుతుందనుకుని బిగిసిన రమేష్ వొంట్లో నరాలు రిలాక్స్ అయ్యాయి. అందరికంటే రమేష్ కు కోపం ఎక్కువ, ధైర్యం కూడా ఎక్కువే.
దవడలు బిగించి చూడసాగాడు కృష్ణ. జిం లో రోజూ సాన పెట్టిన అతడి కండరాలు ఉద్రేకం తో ఊగిపోతున్నాయి.
పిడికిళ్లు బిగించి నిలబడ్డాడు రమేష్. ఏ క్షణం లో నైనా చందర్ దవడల మీద విసరటానికి రెడీ గా వున్నాడు.

ఒక సారి తన స్నేహితుల వేపు చూసాడు రాకేష్ ఏం చెప్పాలి అన్నట్లుగా .
ముందుగా తేరుకున్న కృష్ణ " నీ ఇష్టం ..ఎక్కడకు రమ్మంటావో చెప్పు , మేం రెడీ " అన్నాడు గడ్డాన్ని అర చెయ్యితో తడుముకుంటూ .

" అయితే పోచమ్మ సెంటర్ కు తొమ్మిది కి రండి " అని చెప్పి వెనక్కి తిరిగాడు చందర్ . అతడి వెంట కాస్త దూరంగా వున్న మరో పది మంది కూడా చందర్ తో కలిసి వెళ్లిపోయారు.

" ఏంటి ఏమంటున్నారు" నిబ్బరంగా అడిగింది బిందు.
" ఏదో మా గొడవలు ..మీరిక ఇళ్లకు వెళ్లిపోండి " అని నవ్వాడు రఘు. వీరితో కూడా వచ్చిన జ్యోతి, బిందు ,విజయ లు ఆటో ఎక్కి వెళ్లి పోయారు.
" ఇంతకూ మనం సినిమా కు వచ్చిన విషయం ఈ వెధవల కు ఎలా తెలిసింది?" సందేహం వెలిపుచ్చాడు కృష్ణ.
" ఏదో చేద్దామని వచ్చారు. కానీ ఊరికే వెళ్లి పోయారు . ఎందుకో అర్థం కావటం లేదు అన్నాడు " రాకేష్ సాలోచనగా తల కిందకు వేసి..

" మనకేం భయం లేదు ..కానీ ఈ అమ్మాయిలున్నారుగా మనతో. ఆ విషయం గా కొద్దిగాజంకాను " అన్నాడు కృష్ణ

" సరే..పద ఇక్కడనుండి ముందు ..ఏదైనా కేఫ్ లో చాయ్ కొడుతూ మాట్లాడుదాము. " అన్నాడు రమేష్ స్కూటర్ కిక్ కొడుతూ.

*****
థియేటర్ నుండీ కొద్దీ దూరం వెళ్ళాక అడిగాడు సత్యం " వాళ్లను ఉతుకుదామని అందరినీ తీసుకొచ్చి..తీరా అసలు సమయానికి ..మళ్ళీ టైం ఇచ్చావేంట్రా ? " చందర్ ను చూసి కోపంగా.
.
కాసేపు ఏమీ మాట్లాడ లేదు చందర్ . పెదాల మీద సిగరెట్ పెట్టుకుని ,అగ్గి పుల్ల గీసి అంటించి ,ఒక్క సారి పీల్చి ఊదుతూ

" నువ్ చూడ లేదా వెనకాల మన కాలేజీ అమ్మాయిలు కూడా వున్నారు " అన్నాడు సత్యం వేపు చూసి.

" ఉంటే ??" కన్ఫ్యూషన్ గ మొహం పెట్టి అడిగాడు సత్యం

" అమ్మాయిలు భయ పడిపోతారు. మనం అమ్మాయిలను ఆట పట్టించటం, వెంట పడటం వేరు, వాళ్ళను మన దెబ్బలాటల్లో దూరంగా ఉంచాలి.. వాళ్ళను ఇందులోకి లాగటం పద్ధతి కాదు . పైగా వాళ్ళు కూడా అమ్మాయిలున్నారని ధైర్యంగా పోట్లాడి లేని పరిస్థితి . అలాంటి సమయం లో మనం ఎటాక్ చేయటం మగతనం కాదు " అన్నాడు స్థిరమైన స్వరం తో.

" మరి ఈ గొడవంతా అమ్మాయిల గురించే కదా ?" విసుగ్గా అన్నాడు సత్యం .

" నిజమే కానీ గొడవ వాళ్ళతో కాదు..ఈ వెధవలతో..అర్థం చేసుకో .రేపు ఆ సుధాకర్ , రాజు గాడిని కూడా రమ్మను . రేపు చూసుకుందాం " అని చెప్పి చేయి కలిపి ఇంటికి బయలు దేరాడు చందర్.

*****
కాలేజీ సమయానికంటే ముందే కాంటీన్ లో అడుగు పెట్టారు రాకేష్ , కృష్ణ . వీరికంటే ముందే వచ్చి కూర్చున్న రఘు ,రమేష్ లు వీరిని చూసి చేయి ఊపారు.

అందరూ సీరియస్ గా కూర్చున్నారు.
కొద్దిసేపటికి " నువ్ ఆ హమాల్వాడి మల్లేష్ గాడి గ్యాంగ్ ని రమ్మను సాయంత్రం . మనలను కలవకుండా అక్కడ దూరంగా ఉండమని చెప్పు . అవసరం అయితే మనం పిలుద్దాం." కృష్ణ ను చూసి.అన్నాడు రాకేష్.

" వాళ్ళు కూడా పెద్ద ప్లాన్ వేసుకునే వుంటారు ...మన జాగ్రత్త లో మనం ఉండాలి " .ఊపిరి గట్టిగా పీలుస్తూ అన్నాడు రఘు.

" దీని వెనకాల అంతా కూడా ఆ సుధాకర్ గ్యాంగ్
వుంది. అయినా ఏదోకటి తేల్చేద్దాం ఈ రోజు. ఇంక వాళ్ళ పని పడదాం " ఒక నిశ్చయానికొచ్చి అన్నాడు కృష్ణ .
*********

ఆ రోజు రాకేష్ తో సహా అందరికీ ఉద్రేకం గా వుంది. ఒక కృష్ణ మాత్రమే కూల్ గా కూర్చొని టీవీ చూడసాగాడు.

అటు వేపు వీరేందర్, రాజు, చందర్, సత్యం కలిసి ఊరు చివరన పొలం గట్టున కూర్చొని సిగరెట్లు ఊదుతూ ఆలోచించసాగారు .
" అసలీ గొడవలన్నీ ఆ గర్ల్స్ మూలంగా వస్తున్నాయి" అన్నాడు రాజు .

" ప్రతీ అమ్మాయి తరఫున వీళ్లేందుకు వకాల్తా పుచ్చుకొని రావటం ,పైగా ఇలా ఎన్నో సార్లు అయ్యింది. వదిలేశాం. " అన్నాడు వీరేందర్.

"..ప్రతి సారి వాళ్ళేదో చెప్పి వెళ్లే వాళ్ళు, కానీ ఈ సారి కాస్త గొడవ పెద్దదయ్యేట్లుగా వుంది " అన్నాడు ఏదోఅలోచిస్తున్న సత్యం .

" పెద్దగా అయితే భయపడే వాళ్లెవరిక్కడ? మనం గాజులు తొడుక్కుని కూర్చోలేదు గా" అన్నాడు చందర్ . కాస్సేపు వీరేందర్ ను చూసి మళ్ళీ అన్నాడు " ఒకటి గమనించు..రోజు రోజు కి మనం విలన్స్ అవుతున్నాం, వాళ్లేమో అమ్మాయిల దృష్టిలో హీరోలు అవుతున్నారు."

అదివిని అక్కడ కూర్చున్న అందరూ ఆలోచనలో పడ్డారు.

కొద్దిసేపటి కి వీరేందర్ అడిగాడు " మరేం చేద్దాం?" అని.

ఒక క్షణం కళ్ళు మూసుకుని అన్నాడు చందర్ " ముందు మనం అన్నింటికీ రెడీ అయి పోవడమే. అన్నింటికీ సిద్దపడి మనవాళ్లను పక్క వీది లో ఉంచాలి. ఎవడూ మొబైల్ ఫోన్ లు తేరాదు. ఇంట్లోనే పెట్టి రావాలి. మనం పెట్టిన స్పాట్ లో సిసి కెమెరాలు లేవు. అందుకనే అక్కడికి రమ్మన్నాను. వాళ్ళను తోమాలి కానీ మనకెవ్వరికీ గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి." .
చందర్ మొహం చూసి , అందరి లో ఉద్వేగం ఎక్కువైంది .

" సరే ముందుగా మనం పాలస్ బార్ దగ్గర కలిసి అక్కడి నుండీ పోచమ్మ సెంటర్ వేపు వెళదాం '' అని చెప్పి లేచాడు రాజు.
ఏమీ మాట్లాడకుండా అందరూ లేచి ఇండ్ల వేపు అడుగులు వేశారు.

***

సమయం రాత్రి తొమ్మిది కావస్తోంది . ఆ రోజు పోచమ్మ సెంటర్ దగ్గర వున్న చిన్న కొట్లన్నీ మూయ సాగారు. వీధీ పక్కనున్న చిన్న తోపుడు బళ్ళ వాళ్ళు అందరూ ఇళ్లకు వెళ్లి పోవటం మొదలయ్యింది.
వీదంతా చెత్తతో నిండిపోయింది. వీధి కుక్కలు ఆ చెత్తలో ఆహరం వెతుక్కుంటున్నాయి. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యం గా అయ్యింది.

రాకేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ముందుగా చేరుకొని చుట్టూ చూసాడు. నడుముకున్న లావాటి తోలు బెల్ట్ బరువుగా వుంది.
" ఇంకా ఎవడూ రాలేదు " అన్నాడు రఘు ఒక చేత్తో మీసాలు , మరో చేత్తో జబ్బలను తడుముకుంటూ.

"అదిగో ఆ మల్లేష్ గ్యాంగ్ ను కాస్త దూరంగా ఉండమని చెప్పు అక్కడ నుండీ తొంగి చూస్తున్నారు ..అసలు వీళ్లకు శరీరం కండలు తప్ప బుర్రలుండవు " విసుగు తో అన్నాడు రమేష్.

" ముందు నేను డీల్ చేస్తా " అన్నాడు కృష్ణ

అంతలో పక్క వీధి లోనుండీ వస్తున్న సత్యం , వీరేందర్ , రాజు, ,చందర్ కనిపించారు.

అందరి శరీరాలు వేడెక్కి పోయాయి.

ఇబ్బందిగా నడుస్తున్నాడు వీరేందర్ . అతడి వీపు వెనకాల ఉంచుకున్న లావాటి హాకీ స్టిక్ ఒక వేపు కుచ్చుకుంటోంది. అది తీసి పక్కకు విసిరేసాడు

దూరంగా వీళ్ళనే చూస్తున్న మల్లేష్ ను ఉద్దేశించి ఇంకాస్త దూరం వెళ్ళమని సైగ చేసాడు రఘు.

ఇరు వైపులా నిల బడ్డారు అందరూ. చందర్ ముందుగా రాకేష్ ముందు కొచ్చి నిలబడి." చెప్పు రాకేష్ ఏంటి సంగతి అన్నాడు ''

" చెప్పడానికేముంది ... మీ వాళ్ళు అమ్మాయిలవెంట పడటం , మెం వచ్చి నీకు చెప్పటం కొత్తేమీ కాదు గా " అన్నాడు రాకేష్ తీక్షణంగా చూసి.

ఇంతలో మరో నలుగురు వచ్చి వీరేందర్ వెనక నించున్నారు. వాళ్ళందరూ మేడలో నల్ల దారాలు , చేతికి కడియాలు వేసుకుని , బలిష్ఠన్గా వున్నారు.

అది చూసిన రఘు వెనక్కి తిరిగి చేయి ఊపాడు . మల్లేష్ తన మనుషులతో పరుగెత్తుకుంటూ వచ్చి రఘు పక్కన నించున్నాడు.

' విషయం ఇరు వైపులా వారికి అర్థం అయ్యింది. ఎవరూ వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు.

" అసలు మీ ప్రాబ్లెమ్ ఏంటి ..డొంక తిరుగుడు లేకుండా చెప్పు " అన్నాడు రాజు ,రాకేష్ ను చూసి.

" ముందే చెప్పానుగా , బిందు వెంట పడటం మానెయ్యాలి " అన్నాడు కృష్ణ మీసాలు సరి చేసుకుంటూ ,ఖరాఖండిగా.

అది విని తెల్ల మొహం వేసాడు వీరేందర్ .

"బిందు కి మీకు ఏం సంబంధం " అన్నాడు చిరాకుగా చందర్.

రఘు,కృష్ణ మొహాలు చూసుకున్నారు. ముందుగా తేరుకున్నరమేష్ కరకుగా అన్నాడు " బిందు మా కజిన్ సిస్టర్ ''

అంతే అది వినగానే తల గోక్కున్నారు వీరేందర్ ,సత్యం. .
కజిన్ సిస్టర్ అనగానే ఏం చెయ్యాలో , ఏం మాట్లాడాలో ఎవరికీ అర్థం కాలేదు .

అప్పుడు చందర్ వారి వంక నిస్సహాయంగా చూసి , భుజాలు జార విడిచి , రెండు చేతులూ పైకి లేపి ఊపుతూ " అరేయ్ ఏందిరా రాకేష్ ఇది ? ఇలా ఎన్ని సార్లు! ..మన కాలేజీ లో వుండే ప్రతీ అమ్మాయి మీకు చెల్లెలంటే ఎలా చచ్చేది..అరే !! ప్రతీ అమ్మాయి మీ చెల్లెలేనా ? ఇలాగయితే మేమెటు పోవాలి.!! మీరేమో మీ సుట్టూ అమ్మాయిలను వేసుకుని తిరుగుతర్" అన్నాడు విసుగ్గా .

చందర్ ఆ మాటనగానే రాకేష్ కు నవ్వు ఆగ లేదు. ఆ మాట అంటున్నప్పుడు చందర్ మొహం చూడగానే అంత వరకూ వుండే ఉద్రేకం సడలి పోయి , కడుపులో నుండీ తన్నుకు వస్తున్న నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేసాడు కృష్ణ .

అది చూసిన , అటు వేపు సత్యం, రాజు, వీరేందర్ కు కూడా నవ్వు ఆగక చేతులడ్డం పెట్టుకుని కిసకిస నవ్వసాగారు.
విషయం అర్థం అయ్యి వీరి వెనకాల నిలబడ్డ అందరూ నవ్వసాగారు.

అంతే , చందర్ కూడా పెద్దగా నవ్వేసాడు. మరి అందరూ నవ్వటం మొదలెట్టారు. అంత వరకూ పగలతో నిండి పోయిన అక్కడి వాతాహవరణం నవ్వుల తో నిండి పోయింది.

ఆ నవ్వులతో మొత్తం గా అక్కడున్న కోప తాపాలు చల్ల బడిపోయి అందరూ రిలాక్స్ అయిపోయారు. కాసేపటిలో అంద
రి లో ఉద్రేకాలు తగ్గిపోయి చల్లబడి పోయాయి .

రెండడుగులు ముందుకేసి ,నవ్వుతూ తన అర చేయి చందర్ కేసి ముందుకు సాచాడు రఘు. తాను కూడా ఒకడుగు వేసి రఘు చేయి స్నేహ భావంతో పట్టుకున్నాడు చందర్ . ఇద్దరూ నవ్వుకో సాగారు.

"చందర్! నువ్ చెప్పింది నిజమే ..కానీ అమ్మాయిలను ఇబ్బంది పెట్టొద్దు..మీరు కూడా వాళ్ళతో స్నేహం చేయండి " అన్నాడు కృష్ణ నవ్వు ఆపుకుంటూ.

" కానీ మీ టెక్నిక్ మాకు రాదుగా " అన్నాడు కొంటెగా నవ్వుతూ రాజు.

" టెక్నిక్ ఏమీ లేదు గానీ ... మొదటగా మీరు మన కాలేజీ అమ్మాయిలకు సహాయం చేయడం మొదలు పెట్టండి, మమ్మల్ని వదిలి అందరూ మీ వెంట వుంటారు." అన్నాడు రఘు పకపకా నవ్వి .
" ఒరేయ్ , నువూరుకో ....అవన్నీ వీళ్లకు చెప్పేసావంటే మనకిక గర్ల్ ఫ్రెండ్స్ వుండరు" అన్నాడు రాకేష్ చప్పట్లు కొట్టుతూ

"ముందు వెళ్లి స్టేషన్ దగ్గరున్న కేఫ్ లో చాయి కొడదాం పదండి " అన్నాడు చందర్ స్నేహ పూర్వకంగా
.
పదండి పదండంటూ అందరూ బుజాల మీద చేతులు వేసుకుంటూ ,పెద్దగా నవ్వుతూ రైల్వే స్టేషన్ వేపు అడుగులు వేశారు.
.నిశ్శబ్ధన్గా వున్న ఆ వీధంతా వీరి అరుపులు నవ్వులతో నిండి పోయింది.

కాసేపటికల్లా ఆ సెంటర్ మళ్ళీ నిర్మానుష్యంగా , నిశ్శబ్ధంగా అయిపొయింది. వీరి పోట్లాట అల్లరికి జడిసి దూరంగా పోయిన వీధి కుక్కలు తిరిగి వచ్చి అక్కడ పడ్డ చెత్త లో తిండి వెదుక్కోసాగాయి.

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి