రవి, హరి, గిరి ముగ్గురు ఒకే పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నారు. రవి చాలా పేద వాడు. అతని తండ్రి రాజయ్య బడి ముందు ఒక చెట్టు కింద చెప్పులు కుడుతుంటాడు. హరి వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. హరి నాన్న చిన్న కిరాణా షాపు నడుపుతుంటాడు. గిరి సంపన్న కుటుంబీకుడు. గిరి నాన్నకు స్టీలు పాత్రలు తయారు చేసే చేసే పెద్ద పరిశ్రమ ఉంది.
రాజయ్య ప్రతీ రోజు సైకిలు మీద రవిని బళ్ళో దింపి తన పనిలో నిమగ్నమవుతాడు. హరి స్కూటీ మీద, గిరి కార్లో బడికి వస్తుంటారు.
ఒక రోజు రాజయ్య రవిని తీసుకొని సైకిలు మీద బడికి బయలుదేరాడు. దారిలో.. ఒక కారు అత్యంత వేగంగా వీరిని అధిగమించి అదుపు తప్పింది. ప్రక్కనే ఉన్న చెట్టుకు బలంగా గుద్దుకుంది. కారును రవి గుర్తించాడు. “నాన్నా! అది నా స్నేహితుడు గిరి వాళ్ళ కారు” ఆందోళనగా అన్నాడు. రాజయ్య సైకిలు వేగం పెంచి కారును చేరుకున్నాడు. కార్లో డ్రైవరు, గిరి అపస్మారక స్థితిలో కనిపించారు. సీటు బెల్టులు ఎవరూ పెట్టుకోలేదు. రాజయ్య వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. పది నిముషాలలో అంబులెన్స్ వచ్చింది. డ్రైవరును, గిరిని అంబులెన్స్ స్ట్రెచర్ లో పడుకో పెట్టారు. రవిని తీసుకొని రాజయ్య గూడా అందులోనే బయలుదేరాడు.
రాజయ్య ఆరోజు బ్యాంకులో వేద్దామనుకున్న డబ్బులు హాస్పిటల్లో కట్టాడు. రవికి రక్తం అవసరం పడింది. అతని గ్రూపు రక్తం అరుదైనది. ఎక్కడా అందుబాటులో లేదు. అదృష్టవశాత్తు రాజయ్య రక్తం గ్రూపు సరి పోయింది.
“నాన్నా.. మనది అంటరాని కులం కదా!. నీ రక్తం గిరికి ఇవ్వడం బాగుండదేమో!” సందేహంగా అడిగాడు రవి.
“ఇప్పుడు గిరి ప్రాణం కాపాడ్డం ముఖ్యం బాబూ. ఈ విషయం రహస్యంగానే ఉంచుదాం” అన్నాడు రాజయ్య.
వారి మాటలు విన్న డాక్టర్ “రవీ..! రక్త నిధి (బ్లడ్ బ్యాంక్) నుండి తెప్పించిన రక్తం బాటిల్ మీద బ్లడ్ గ్రూప్ మాత్రమే ఉంటుంది. కాని కులం పేరు ఉండదు. ఇప్పుడు మీ నాన్న గారు అన్నట్టు రోగి ప్రాణాలు కాపాడ్డం ముఖ్యం. అది ఒక డాక్టరుగా నా ధర్మం” అన్నాడు.
రాజయ్య రక్తం గిరికి ఎక్కించారు. ఇంతలో గిరి తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చారు. విషయం తెలుసుకున్నారు. రాజయ్యను చూసి ఇరువురూ రెండు చేతులు జోడించి మొక్కారు. గిరి నాన్న డబ్బు తిరిగి ఇవ్వబోతే రాజయ్య తీసుకోలేదు.
ఆరోజు గిరిని డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసి.. రవి, హరి రోజటి కంటే ముందుగా వచ్చారు. రవి, రాజయ్యలు చేసిన సేవలు గిరికి వివరించాడు హరి. గిరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“రవీ.. సారీరా.. నువ్వు అంటరాని వాడవని అసహ్యించుకుంటూ.. నిన్ను మాపక్కన కూర్చోనిచ్చే వాణ్ణి కాదు. నువ్వు క్లాసులో ఫస్ట్ వస్తున్నావని ఈర్ష్య పడే వాణ్ణి. నా పుట్టినరోజున హరిని పిలిచాను కాని నిన్ను పిలువలేదు. అయినా నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా నన్ను కాపాడావు” అంటూ.. దగ్గరికి రండి అన్నట్టుగా గిరి చేతులు చాచాడు.
“కులం కాదు బాబూ.. గుణం ప్రధానం” అంది గిరి తల్లి. త్రీమూర్తుల్లా హత్తుకు పోయిన వారిని చూస్తూ ముచ్చట పడింది. అటు గిరి నాన్న రాజయ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.*