‘‘హలో రాధీ! ఏంటీ, బిజీగా వున్నావా, మాట్లాడొచ్చా!’’ శ్యామల ఫోన్ చేసి తన స్నేహితురాలు రాధికని అడిగింది .
‘‘ఫరవాలేదు చెప్పు. ఇప్పుడే లంచ్ అయ్యింది " అంది రాధిక.
" మీ ఇంటికి చుట్టాలెవరైనా వచ్చేరా?’’ అడిగింది శ్యామల.
‘‘ఏంటే ! సంబంధం లేకుండా ఏదో మాట్లాడ్తున్నావు? అసలు విషయమేంటో చెప్పు’’
‘‘నిన్న నేనూ, మా పక్కింటావిడ మ్యాట్నీషోకి వెళ్తే మా ముందు వరసలో, మన స్వాతి ఎవరో అబ్బాయితో సినిమా చూస్తూ కనబడింది .’’ చెప్పింది శ్యామల
‘‘వాట్’’ అదిరిపడింది రాధిక.
‘‘స్వాతి నన్ను చూడలేదు. వాళ్ళిద్దరూ పాప్‌కార్న్ షేర్ చేసుకుంటూ కొంచెం క్లోజ్ గా కూడా కనబడ్డారు. స్కూల్ టైంలో యిదిక్కిడ, ఎవరితో సినిమాకి వచ్చింది? అనుకుని ఎందుకైనా మంచిదని నీతో చెప్పాలని ఫోన్ చేశాను.’’
రాధిక గుండె ఝల్లుమంది.
‘‘లేదే! నేనెవరితో పంపలేదు. స్వాతి నాతో చెప్పకుండా అలా ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదే!’’
‘‘నువ్వు అనవసరంగా తొందరపడి దాన్ని ఏమీ అనకుండా, అసలు విషయమేంటో మెల్లిగా అడిగి తెలుసుకో. ఈ కాలం పిల్లలు చాలా సెన్సిటివ్. ఎప్పుడేమంటే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. నేను మళ్ళీ మాట్లాడ్తాను నీతో’’ అంటూ ఫోన్ పెట్టేసింది శ్యామల.
రాధిక మెదడు మొద్దుబారినట్లయిపోయింది. శ్యామల చెప్పినమాటలే చెవుల్లో గింగురు మంటున్నాయి. స్కూల్ మానేసి తన కూతురు ఎవరో అబ్బాయితో సినిమాకి వెళ్ళిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. యింక ఎక్కువగా ఆలోచించదలచుకోలేదు రాధిక. అర్జెంట్ పని వుందంటూ ఆఫీసులో పర్మిషన్ తీసుకుని యింటికి వచ్చింది. నేరుగా స్వాతి గదిలోకి వెళ్ళి ఫోన్ తీసింది. కొంత కష్టపడి ఫోన్ అన్‌లాక్ చేసి చూసింది. వాట్సాప్‌లో స్వాతి ఎవరో అబ్బాయితో చేసిన ఛాటింగ్‌లూ, యిద్దరూ కల్సి తీసుకున్న ఫోటోలూ చూసి చేష్టలుడిగినదైంది. తన కూతురు స్వాతి యిలా చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడ జరిగింది లోపం?
ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన స్వాతి - వస్తూనే ‘‘అరే! నువ్వు ఇంట్లో వున్నావేంటి? ఆఫీస్ కెళ్ళలేదా?’’ అంటూ తల్లినడిగింది.
‘‘పొద్దున్న వెళ్ళి, పనుండి మధ్యాహ్నం వచ్చేశాను గానీ, బల్లమీద టిఫెన్ పెట్టేను , తిని పాలు తాగు’’ అంది న్యూస్‌పేపర్ చూస్తూ!
ఓ అరగంట తర్వాత, స్వాతి గదిలోకి వెళ్ళి ‘‘స్వాతీ! నిన్న మధ్యాహ్నం నువ్వెక్కడికెళ్ళావు?’’ అనడిగింది.
తల్లి ప్రశ్నకి ఉలిక్కిపడిన స్వాతి తమాయించుకుని ‘‘అదేం ప్రశ్న? మధ్యాహ్నం ఎక్కడికెళ్తాను స్కూల్ వుంటే!’’ అంది.
‘‘అంటే స్కూల్‌లోనే వున్నావన్నమాట’’ రెట్టించి అడిగింది రాధిక
‘‘ఏంటమ్మా! అడిగిందే అడుగుతావు? స్కూల్‌లో కాక ఇంకెక్కడుంటాను ?" తల్లి మొహంలోకి చూడకుండా - బల్లమీద పుస్తకాలు సర్దుతూ అంది స్వాతి .
‘‘స్వాతీ! యిటొచ్చి నా పక్కన కూర్చో!’’ అంది రాధిక.
‘‘ఏంటి చెప్పు ! అంది మంచం మీద తల్లిపక్కన కూర్చుంటూ.
‘‘నిన్న మధ్యాహ్నం నువ్వు స్కూల్‌లో లేవు. సినిమాకి వెళ్ళావు. నీతో ఉన్న అబ్బాయి ఎవరు?’’ కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగింది రాధిక
‘‘ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అసలు నీకెవరు చెప్పారీ విషయం?’’ స్వాతి మొహంలో భయం, మాటల్లో తడబాటు కబడిందీసారి .
‘‘అడిగిన దానికి సమాధానం చెప్పు, బుకాయించకుండా’’
‘‘మా క్లాస్‌మేట్ మహేష్ తన పుట్టినరోజని రమ్మంటే వెళ్ళేను’’
‘‘నిన్నొక్కర్తినే పిలిచాడా !’’
‘‘క్లాస్‌నంతా పిలుస్తాడా మరి!’’
‘‘ఏంటా తిక్క సమాధానాలు. నిన్ను మాత్రమే ఎందుకు పిలిచేడు ?అదీ స్కూల్ టైంలో, క్లాసులెగ్గొట్టి" కోపంగా అంది రాధిక .
‘‘మేమేం క్లాసులెగ్గొట్టి వెళ్ళలేదు. నిన్న మధ్యాహ్నo రివిజన్ చేసుకోమని వదిలేసేరు’’ సంజాయిషీ ఇద్దామని ప్రయత్నించింది స్వాతి
‘‘అలాంటప్పుడు నేరుగా ఇంటికి రాకుండా అడ్డమైన వాళ్ళతో సినిమాలూ, షికార్లు ఏంటి?’’
‘‘నేనేం అడ్డమైన వాళ్ళతో వెళ్ళలేదు, మహేష్‌తో వెళ్ళాను. అతనికి నేనంటే యిష్టం. నాకూ అతనంటే ఇష్టం’’
స్వాతి సమాధానానికి నివ్వెరపోయింది రాధిక.
‘‘ఇష్టమా! అంటే?’’
‘‘ఇష్టమా అంటే ` ఏం చెప్పను? యిష్టమంటే యిష్టమే!’’
‘‘ఏంటా పొగరుబోతు సమాధానాలు? నువ్వెవ్వరితో మాట్లాడ్తున్నావో తెలుసా?’’ కోపం ఆపుకోలేకపోతోంది రాధిక .
‘‘మరేమని చెప్పను? ఒకబ్బాయితో సినిమా కెళ్తే తప్పా!’’
‘‘తప్పు కాకపోతే నువ్వెందుకు స్కూల్లోనే ఉన్నానని అబద్ధం చెప్పేవ్ ? ఒక అబ్బాయితో సినిమాకెళ్ళడం తప్పుకాదు. కానీ ఇంట్లో చెప్పక పోవడం, ఇందాకా నువ్వు చెప్పిన అబద్ధం రెండూ తప్పే ! ఈ రోజు నాకు తెల్సింది కాబట్టి సరిపోయింది . అయినా ఇలా ఎన్నిరోజులనుండి సాగుతోంది ఈ వ్యవహారం?’’
‘‘వ్యవహారమేంటీ, పుట్టినరోజని పిలిస్తే వెళ్ళేనని చెప్పేను కదా!’’
‘‘స్వాతీ! నన్ను దబాయించక, నేను నీ ఫోన్ తీసి మీ ఫోటోలు, ఛాటింగ్‌లు అన్నీ చూసేను.’’అంది రాధిక
తల్లి మాటలకి గాభరా పడింది స్వాతి. ’’నా ఫోన్ నువ్వెందుకు తీసేవు? సరే! నీకెలాగూ తెల్సింది కాబట్టి చెప్తున్నాను. నేను, మహేష్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము’’ ఎటువంటి జంకూ లేకుండా చెప్పింది స్వాతి
అదిరిపడింది రాధిక.
‘‘ఏంటీ! మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా! నీ వయస్సెంత, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో నీకు తెలుసా?’’
‘‘ఏం! ఎనిమిదో క్లాసు చదువుతున్న వాళ్ళు ప్రేమించకూడదని ఎక్కడైనా రాసి ఉందా!’’
తనకు ఎదురు సమాధానమిస్తున్న స్వాతి తెగువకి విస్తుపోయిన రాధికకి స్వాతిని లాగి లెంపకాయ కొట్టాలని అనిపించినా తమాయించుకుంది . కేకలేసి లాభంలేదనుకుని మెల్లిగా నచ్చచెప్పాలని నిర్ణయించుకుంది .
‘‘చూడు స్వాతీ! నీకు పట్టుమని పదమూడేళ్ళు కూడా లేవు. నీ వయసు వాళ్ళకి వాళ్ళకి అబ్బాయి మీద కల్గేది ప్రేమ కాదు, అది ఆకర్షణ. టీన్స్ (Teens ) లోకి యిప్పుడే వస్తున్న నీలో శారీరకంగా, మానసికంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి సహజంగా! అది హార్మోన్ల మార్పులవల్ల వస్తాయి. నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడినా, స్నేహం చేసినా నేను తప్పు పట్టను. కానీ దానికి ప్రేమ, దోమ అని పేర్లు పెట్టొద్దు . తెల్సిందా?’’ తల్లి మాటలకి సమాధానం చెప్పకుండా తల పక్కకి తిప్పింది స్వాతి
‘‘నీకే చెప్తున్నది . ఆ మహేష్‌కి ఫోన్ చేసి మన ఇంటికి పిలు’’ అంది రాధిక.
‘‘ఎందుకు, నువ్వు అతన్ని కూడా తిట్టడానికా ?’’ ఈ సారి కొంచెo భయపడింది స్వాతి.
‘‘అలాంటివేమీ నేను చెయ్యనుగానీ, అతనికి ఫోన్ చెయ్యి ముందు’’ ఆజ్ఞాపించింది రాధిక.
‘‘అతను రాడు. నేనే రేపు స్కూల్లో చెప్తాలే ! " బెదురుతూ చెప్పింది స్వాతి.
‘‘నువ్వు ఇప్పుడు అతన్ని ఫోన్ చేసి పిలవకపోతే రేపు నేను మీ స్కూల్‌కి వచ్చి మీ ప్రిన్సిపాల్ నుండి అతని నెంబర్, వాళ్ళ యింటి అడ్రస్ అడిగి తీసుకుంటాను’’ ఖచ్చితంగా చెప్పింది రాధిక.
‘‘అలాంటివేం చెయ్యొద్దు. యింకెప్పుడూ యిలా చేయను’’ అంది ఏడుస్తూ.
‘‘నిన్ను నేను ఏమన్నానని ఏడుస్తున్నావు? అతని నెంబరియ్యి, నేను మాట్లాడ్తాను’’ అంది రాధిక
‘‘వద్దు! నేనే చేసి రమ్మంటాను. కానీ నిజంగా అతన్ని ఏమీ అనకూడదు నువ్వు’’ ఏడుస్తూనే అంది స్వాతి
* * *
కాస్సేపటికి యింటికి వచ్చిన మహేష్‌ని తల్లికి పరిచయం చేసింది స్వాతి.
‘‘నమస్తే ఆంటీ’’ అన్నాడు మహేష్.
‘‘రా బాబూ! ఇలా కూర్చో!’’ అంటూ అతను కూర్చున్నాక వాళ్ళమ్మా, నాన్నగారు ఏం చేస్తూ వుంటారో, వాళ్ళింట్లో ఎవరెవరు వుంటారో అడిగి తెలుసుకుంది ముందు . ఆ తర్వాత ‘‘నిన్న నువ్వూ, స్వాతి సినిమాకెళ్ళేరట?’’
రాధిక అలా అడిగేసరికి భయపడ్డాడు మహేష్.
మహేష్ సమాధానం చెప్పకపోవడంతో, "వెళ్ళేరా, లేదా అని మాత్రమే నిన్ను అడుగుతున్నాను’’ అంది రాధిక.
‘‘వెళ్ళేం ఆంటీ! నిన్న నా పుట్టినరోజని చెప్పి తీసుకెళ్ళేను’’ భయపడుతూనే చెప్పేడు మహేష్
‘‘స్వాతిని ఒక్కర్తినే ఎందుకు తీసికెళ్ళావు? మీ క్లాస్‌లో నీకింకెవరూ ఫ్రెండ్స్ లేరా?’’
’’నేనెక్కువ క్లాస్‌లో ఎవరితోనూ మాట్లాడను ఆంటీ! స్వాతి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తుంది. చాలా ఏక్టివ్ గా వుంటుంది. అందుకని స్వాతి అంటే నాకిష్టం’’ అన్నాడు చేతులు నలుపుకుంటూ.
‘‘చూడు మహేష్! స్వాతి నాకన్నీ చెప్పింది. మీరిద్దరూ టీన్స్‌లో వున్నారు. ఈ వయస్సులో హార్మోనల్ ఇమ్‌బేలన్స్ (Imbalance) వల్ల మీ శరీరంలో జరిగే మార్పులకి మీరు ‘యిష్టం, ప్రేమ’ అని పేర్లు పెట్టుకోకండి. అది ఆపోజిట్ జెండర్ అంటే వచ్చే ఆకర్షణ తప్ప మరింకేమీ కాదు. దీన్ని
ఇన్ ఫాట్యూఏషన్ ( infatuation ) అంటారే తప్ప మరింకేం కాదు . మీ ఇద్దరిదీ చిన్నతనం. యింకెప్పుడూ మీ మనసులో ‘ప్రేమ’ ‘ఇష్టం’ అన్న మాటలకీ , వేరే ఆలోచనలకీ చోటివ్వక బుద్దిగా చదువుకోండి . ఇది మీ మొదటి తప్పుగా తీసుకుని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా ప్రేమా, దోమా అన్న మాటలు విన్నానంటే , ఇటు మీ ప్రిన్సిపాల్‌కీ, అటు మీ ఇంట్లోవాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తుంది’’ అంది రాధిక.
‘‘వద్దాంటీ! వాళ్ళెవరికీ మీరు చెప్పకండి. ఇంకెప్పుడూ ఇలా చేయను " అన్నాడు మహేష్ భయపడ్తూ .
‘‘నీకు కూడా చెప్తున్నాను స్వాతీ ! జరిగినదంతా మర్చిపోయి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. యిద్దరూ బాగా చదువుకోండి. సరేనా ! " అంది రాధిక.
‘‘అలాగే ’’ అన్నట్లు తలూపేరు యిద్దరూ!
‘‘యింక నువ్వు వెళ్ళొచ్చు’’ అని మహేష్‌ని సాగనంపింది రాధిక.
గేటుదాకా వెళ్ళిన మహేష్ మళ్ళీ వెనక్కి వచ్చి ‘‘ఆంటీ! దయచేసి ఈ సంగతి మా ఇంట్లోగానీ, స్కూల్‌లోగానీ చెప్పకండి. నేను ప్రామిస్ చేస్తున్నాను. యికముందు స్వాతిని ఒక మంచి ఫ్రెండ్ లాగే చూస్తాను’’ చేతులు రెండూ జోడిస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే అన్నాడు మహేష్ . రాధిక తో 'సరే' అని అనిపించుకుని మరీ వెళ్ళేడు.
* * *
వాళ్ళతో అయితే ఏదో మాట్లాడిందిగానీ తను చేసిన పని కరెక్టా, కాదా? అన్న మీమాంసలో పడింది రాధిక. రాత్రి భర్త ఆనంద్ ఇంటికి వచ్చేక అతని చేత చెప్పించాల్సిందా! లేదు. ఆనంద్‌కి ఈ విషయం చెప్తే ముందూ, వెనకా చూడకుండా ఏం చేస్తాడో తనకి తెలుసు.’’ అని తనలో తనే మధనపడుతూ వంట చేస్తున్న రాధికని రెండు చేతులతో వెనకనుండి చుట్టేసిన స్వాతి ‘‘సారి అమ్మా ! యింకెప్పుడూ ఇలా చేయను. నాన్నకి ఈ విషయం చెప్పొద్దమ్మా! ప్లీజ్ ´అంటూ బావురుమంది.
‘‘అలాగే! ఏడుపు మానెయ్యి ముందు. వెళ్ళి మొహం కడుక్కుని రా! భోంచేసి త్వరగా పడుకో’’ అంది రాధిక.
ఇంతలో ఆనంద్ ఫోన్ చేసి ప్రాజెక్టులో మేజర్ ప్రాబ్లెం వచ్చిందనీ, రాత్రంతా పని చేయాల్సి వస్తుందనీ, తన కోసం ఎదురుచూడకుండా డిన్నర్‌చేసి పడుకోమనీ చెప్పాడు.
ఆ రాత్రి స్వాతి , రాధిక దగ్గిరకి వచ్చి ‘‘అమ్మా! నాకు గదిలో నిద్రపట్టడం లేదు, భయమేస్తోంది. నీ దగ్గర పడుకుంటానంటూ వచ్చి తల్లి పక్కన పడుకుని బల్లిలా కరిచిపెట్టుకుంది రాధికని . ‘‘అమ్మా! నాన్నతో నిజంగా చెప్పవు కదూ! చెప్తే నాన్న మహేష్‌ని చంపిస్తారు . అప్పుడు నాన్నని జైల్లో పెడ్తారు. నాన్న చేసింది తప్పని తెల్సి ఆ తర్వాత నాన్న ఆత్మహత్య చేసుకుంటారు. అలా జరగకూడదమ్మా! నాకు నువ్వూ, నాన్న ఇద్దరూ కావాలి ’’ అంటూ వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
స్వాతి మాటలకి నివ్వెరపోయిన రాధిక ‘‘ఏం మాట్లాడ్తున్నావు ? నాన్న మహేష్‌ని ఎందుకు చంపిస్తారు? నాన్నని జైల్లో పెట్టడమేంటీ , నాన్న ఆత్మహత్య చేసుకోవడమేంటీ ? ఇలాంటి మాటలన్నీ ఎవరు చెప్పేరు నీకు?’’ విస్తుపోతూ అడిగింది.
‘‘ఈమధ్య 'పరువు హత్యలని' ఇలాంటివి చాలా టీవీ లో చూపిస్తున్నారట కదా ! మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను’’ వెక్కిళ్ళ మధ్య చెప్పింది స్వాతి.
రాధికకి మతిపోయినట్లయింది.
‘‘ఛ! అలాగేం జరగదు. నేను నాన్నకి చెప్పనని చెప్పేనుగా! నువ్వు ముందు ఏడుపు మానేయ్ ’’ అని స్వాతిని తన వైపు తిప్పుకుని కన్నీళ్ళు తుడిచి పడుకోమంటూ జోకొట్టసాగింది.
రాత్రంతా స్వాతి ఏవేవో కలవరింతలు. ‘‘మా నాన్నని చంపొద్దు. నాన్న చాలా మంచివాడు. నాకు అమ్మా, నాన్న యిద్దరూ కావాలి’’ అని కలవరిస్తూనే వుంది.
రాత్రంతా ఆలోచనలతో మధనపడుతూనే ఉంది రాధిక . 'అయినా జరిగిన దానిలో తన తప్పు కూడా ఉంది. ఈ మధ్య అటు ఆఫీసులో పని ఒత్తిడి, ఇటు ఇంట్లోపని, వీటిలో పడి, తనే స్వాతిని సరిగ్గా పట్టించుకోలేదు. రోజంతా స్వాతి ఏంచేస్తోంది అని గానీ , స్వాతి గదిలోకెళ్ళి తన ఫోన్, లాప్ టాప్ లాంటివి చెక్ చేయడం లాంటివి చేయాలని ఏనాడూ తనకెందుకు అనిపించలేదు ? 'ఆలోచనల మధ్య రాధికకి ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు. పాలవాడు కొట్టిన బెల్‌కి మంచం మీదనుంచి లేచిన రాధిక` స్వాతి ఒళ్ళు కొంచెం వెచ్చగా ఉండడంతో ఇటు స్కూల్‌కీ, అటు తన ఆఫీస్‌కీ కూడా లీవ్‌లెటర్ పంపింది.
టైమ్ పదవుతోంటే - బయటనుండి తాళం తీసుకుని లోపలికి వచ్చిన ఆనంద్ ‘‘అదేంటి? తల్లీ కూతుళ్ళిద్దరూ ఇంట్లోవున్నారు?’’ ఆశ్చర్యపోతూ అడిగేడు.
‘‘స్వాతికి జ్వరం వచ్చినట్లు అనిపిస్తే నేనే ఈరోజు స్కూల్‌కి వెళ్ళొద్దని, నేనూ శెలవు పెట్టేను "అంది రాధిక.
‘‘వాట్! నా స్వాతి బేబీకి జ్వరమా! ఎక్కడుంది నా క్యూటీపై’’ అని ఆనంద్ అంటోంటే వాష్‌రూంలోంచి బయటకి వచ్చిన స్వాతి, తండ్రిని చూడగానే ‘‘నాన్నా!’’ అంటూ కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది.
‘‘ఏంటమ్మా! ఎందుకేడుస్తున్నావు? జ్వరమొస్తే ఎవరైనా ఏడుస్తారా! ఏదీ నన్ను చూడనీ!’’ అంటూ స్వాతి నుదుటిమీద చెయ్యివేసి " జ్వరం లేదూ! ఏమీ లేదు! రగ్గు కప్పుకుని పడుకుంటే నీకలా అనిపించిందేమో! చీర్ అప్ బేబీ! లంచ్ అయ్యేక అలా బయటకెళ్ళి ఐస్‌క్రీం తినొద్దాం ! సరేనా ?" అన్నాడు ఆనంద్.
* * *
ఆ రాత్రి కూడా రాధికకి నిద్రపట్టలేదు. జరిగినది డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. అయినా తప్పు స్వాతిది కాదు. దాని వయసుది. పిల్లల ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా, అది తండ్రి తెలుసుకోలేడు గానీ, తల్లి సులభంగా పసిగట్ట గలదు. అలాంటిది స్వాతి ప్రవర్తన లో వచ్చిన మార్పు తనెందుకు కనిపెట్టలేకపోయింది ? తన పెంపకం మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోనా ?ఈ నాటి ప్రింట్ ఇంకా ఎలెక్ట్రానిక్ మీడియాలూ, రోజూ కొత్తగా పుట్టుకొచ్చే ఎలెక్ట్రానిక్ గేడ్జెట్స్ వల్ల పిల్లలకి ప్రపంచం అరచేతుల్లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఫోన్ లు లాగేసుకుని , ఇంటర్నెట్ తీయించేసి, ఇంట్లో కంట్రోల్ చేసినా బయటకెళ్ళేక వాళ్ళేం చేస్తారో తెలియని రోజులవచ్చేసేయి . పిల్లల్ని ఒక వయస్సు వచ్చేక, వాళ్ళ రోజంతా ఎలాగడిచిందో అడిగి తెల్సుకుని వాళ్ళకి మంచి చెడ్డలు చెప్తూ స్నేహితులుగా చూడాలన్న జ్ఞానం తనకే లేకుండాపోయింది. ఏది ఏమైనా ఈ కాలంలో పిల్లల్ని పెంచడం కత్తిమీద సాములాంటిది. కొన్నాళ్ళు తన ఉద్యోగానికి బ్రేక్ తీసుకుని స్వాతి ని జాగ్రత్తగా చూసుకోవాలి ' అని గట్టిగా నిర్ణయించుకుంది రాధిక .
లేప్ టాప్ మూసి మంచం చేరిన ఆనంద్ " ఏంటోయ్ ! ఇంకా పడుకోలేదూ ! స్వాతికి జ్వరం తగ్గిపోయిందిగా! ఇంకా దాని గురించేనా నీ ఆలోచన, లేక నా కోసమా ?" అంటూ రాధికని దగ్గిరికి తీసుకున్నాడు .
* * * * *