అమ్మా... అమ్మా... ఎక్కడున్నావ్ అమ్మా..? అని గట్టిగా అరుస్తూ బయటినుండి పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు అశోక్. ఏంట్రా..? అలా అరుస్తున్నావ్..? ఏమైంది నీకు..? అని కోపంగా అడిగింది అశోక్ ని వాళ్ల అమ్మ లక్ష్మి. అమ్మా.. బయట వర్షం జోరుగా పడుతోందే.. వాతావరణం అంతా చాలా చల్లగా మారిపోయింది.. అని చెప్పాడు అశోక్. ఐతే ఇప్పుడు నేనేం చేయాలి రా..? అని అడిగింది లక్ష్మి. ఈ వర్షంలో..ఇంత చల్లటి వాతావరణంలో..ఒక వేడి టీ తాగితే చాలా బాగుంటుందమ్మా...అన్నాడు అశోక్. సర్లే ఆగరా.. ఇప్పుడే పెట్టిస్తాను.. అని చెప్పి లక్ష్మి వంటింట్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ తీసి చూస్తే పాలు లేవు. ఒరేయ్ అశోక్.. పాలు అయిపోయాయి రా.. నువు అంగడికి వెళ్లి పాల ప్యాకెట్ పట్టుకురా.. అని చెప్పింది లక్ష్మి. నేను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తానమ్మా...అని చెప్పి వర్షం పడుతుండడంతో ఇంట్లో ఉన్న గొడుగు తీసుకొని పాల ప్యాకెట్ తేవడానికి అంగడికి బయలుదేరాడు అశోక్. బయట వర్షం జోరుగా పడుతోంది. అడుగు బయట పెట్టడానికి కూడా వీలు లేనంతగా, ఎడతెరిపి లేకుండా చాలా గట్టిగా కురుస్తోంది వాన. అయినా సరే టీ ఎలాగైనా తాగాలన్న ఆశతో అతి కష్టం మీద ఆ జోరువానలోనే గొడుగుతో అంగడికి బయల్దేరాడు అశోక్. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. దారులన్నీ కూడా సముద్రాలని తలపిస్తున్నాయి. అయినా వాటన్నింటిని దాటుకొని అంగడి దగ్గరకు చేరాడు అశోక్. అంగట్లో పాల ప్యాకెట్, రెండు బిస్కెట్ ప్యాకెట్లను తీసుకొని తిరిగి ఇంటికి బయల్దేరాడు. ఇంటికి వస్తూ వస్తూ రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా వాహనాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయ్.కానీ అశోక్ మాత్రం నెమ్మదిగా ఎలాగోలా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.ఇంతలో ఆ పక్కనే ఒక కుక్క మరియు దాని పిల్ల, రెండూ కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండడం గమనించాడు అశోక్. అది చూసి దయాహృదయంతో వాటిని కూడా రోడ్డు దాటించాలని నిశ్చయించుకొని ఆ రెంటినీ కూడా వెంటపెట్టుకొని రోడ్డు దాటించడానికి ప్రయత్నించాడు అశోక్. జోరుగా కురుస్తున్న వర్షంలో వేగంగా అటూ ఇటూ వస్తున్న వాహనాలని దాటుకుంటూ వస్తున్నాడు అశోక్ ఆ రెంటినీ వెంటపెట్టుకొని. కుక్క మరియు దానిపిల్ల రెండూ కూడా అశోక్ వెనుకనే వస్తున్నాయి. ముగ్గురూ ఒకరి వెనక ఒకరు నెమ్మదిగా రోడ్డు దాటుకుంటూ వస్తున్నారు. అశోక్ జాగ్రత్తగా ఆ రోడ్డు దాటేసాడు. ఆ రెండూ కూడా దాటేసాయో లేదోనని రోడ్డు దాటిన వెంటనే వెనక్కి తిరిగి చూసాడు. ఇంతలోనే అశోక్ కి ఒక భీకరమైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం చూసి కాళ్ళుచేతులు ఆడక కరెంటుస్తంభంలా అలాగే నిల్చుండిపోయాడు. ఇంతకీ ఆ దృశ్యం ఏంటంటే.. "రక్తపు మడుగులో ఉన్న కుక్క మరియు దాని పక్కన ఏడుస్తూ ఉన్న కుక్కపిల్ల". రోడ్డు దాటేటప్పుడు వేగంగా వెళ్తున్న వాహనం ఒకటి ఆ కుక్కను ఢీ కొట్టడంతో అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుక్కపిల్ల మాత్రం తన తల్లి శవం వద్ద ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. ఎటు వెళ్లాలో, ఏం చెయ్యాలో దిక్కు తోచక ఏడుస్తూ ఉన్న ఆ కుక్కపిల్లను చూసి అశోక్ చలించిపోయాడు. తనకు తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. అశోక్ గుండె కరిగిపోయింది. ఆ స్థితిలో ఉన్న కుక్కపిల్లను చూసి చాలా బాధ పడ్డాడు. "ఇలాంటి పరిస్థితే మనుషులకు ఎదురైతే..."అని తలుచుకుంటూ ఆ కుక్కపిల్లను చూసి చాలా కృంగిపోయాడు అశోక్. వెంటనే అశోక్ ఆ కుక్కపిల్ల దగ్గరకి పరుగెత్తుకుంటూ వెళ్లి దాన్ని ఎత్తుకొని రోడ్డు పక్కకు వచ్చేసాడు.తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లోంచి రెండు బిస్కెట్లను తీసి ఆ కుక్కపిల్లకు తినిపించాడు. ఆ కుక్కపిల్ల కృతజ్ఞతతో ఎంతో ప్రేమగా అశోక్ వైపు దీనంగా చూసింది.అశోక్ కి ఆ కుక్కపిల్ల మీద తీవ్రమైన జాలి కలిగింది. దాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసు రాలేదు. ఏం చెయ్యాలో తెలియక కుక్కపిల్లను ఇంటికి తీసుకుని వచ్చేసాడు. కుక్కపిల్లతో ఇంటికి వచ్చిన అశోక్ ని చూసి వాళ్ళ అమ్మ లక్ష్మి.. "ఏంట్రా..? ఏంటిది..? ఈ కుక్కపిల్ల ఎవరిది..? ఏం చేసావ్ నువ్వు..? అసలేం జరిగింది..? అని కోపంగా చిర్రుబుర్రుమంటూ అడిగింది. అశోక్ దారిలో జరిగిందంతా వివరంగా చెప్పాడు లక్ష్మి కి. "ఒరేయ్..! నీకు తిండి వేయడమే ఎక్కువ.. నువ్వు చాలదన్నట్టు నీకు తోడుగా దీన్ని తీసుకొచ్చావా..? అని కసిరింది లక్ష్మి కోపంగా. " అమ్మా.. ఏంటే అలా అంటావ్..దీనికి జరిగినట్టే నాకు జరిగివుంటే అప్పుడు నువ్వు ఏం చేసే దానివమ్మా..? నన్ను కూడా అక్కడే అలాగే వదిలేసేదానివా..? ఒంటరిగా..? అది తన తల్లిని కోల్పోయి ఏడుస్తూ ఉందమ్మా.. అది చూసి నాకు చాలా జాలేసింది. అందుకే దాన్ని ఇంటికి తీసుకొచ్చేసాను.." అని చెప్పాడు అశోక్. అశోక్ మాటలు విని లక్ష్మికి మనసులో ఎక్కడో ఓ మూల చాలా బాధగా అనిపించింది. "సర్లేరా.. ఈ రోజు నుంచి మనం ఈ కుక్కపిల్లను పెంచుకుందాం.." అని చెప్పగానే అశోక్ సంతోషంతో దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేసాడు. ' అమ్మా.. ఈ కుక్కపిల్లకి ఏం పేరు పెడదామే..? జిమ్మీ..స్నూఫీ..టింకూ..లక్కీ..' అని అశోక్ పేర్లు చెబుతుండగానే.. " ఒరేయ్..! ఇంగ్లీష్ పేర్లు వద్దురా.. ఏదైనా తెలుగులో మంచి పేరు పెట్టుకుందాం.. " అని చెప్పింది లక్ష్మి. అయితే దీనికి ' బాలు ' అని పేరు పెట్టుకుందాం అమ్మా...అన్నాడు అశోక్. "బాలు..పేరు చాలా బాగుందిరా ముద్దుగా.." అని వెంటనే బదులిచ్చింది లక్ష్మి. అలా అశోక్ తో పాటు ఆ ఇంట్లోకి వచ్చిన కుక్కపిల్ల అతి తక్కువ రోజుల్లోనే వాళ్లకి చాలా దగ్గరైపోయింది. ఎంత దగ్గర అంటే తను కూడా కుటుంబసభ్యుల్లో ఒకటిగా అయిపోయింది. అశోక్ అయితే ఆ కుక్కపిల్లను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ఇంక అశోక్ వాళ్ళ అమ్మ లక్ష్మి అయితే తన రెండవ కొడుకు లాగా చూసుకునేది. అలా ఆ కుక్కపిల్లకు ఆ కుటుంబసభ్యులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. చూస్తుండగానే ఆ కుక్కపిల్ల ఇంట్లోకి వచ్చి నాలుగేళ్లు గడచిపోయాయి. సుమారుగా పెద్దోడు అయిపోయాడు బాలుగాడు(కుక్కపిల్ల ).ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా బాలు సుపరిచితుడైపోయాడు. అశోక్ వాళ్ళ వీధిలోని పిల్లలకైతే బాలుతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. బాలు కూడా ఆ వీధిలోని పిల్లలతో రోజూ ఆడుకునేవాడు. అశోక్ రోజూ ఉదయం లేవగానే బాలుని వెంటబెట్టుకొని పాలు తీసుకురావడానికి అంగడికి వెళ్లేవాడు.రోజూ బాలుని వెంటబెట్టుకొని వెళ్లడంతో ఆ అంగడి బాబాయ్ కి కూడా చాలా దగ్గరైపోయాడు బాలు.అలా అంగడి బాబాయ్ కూడా బాలు ఎప్పుడు కనపడినా ఎంతో ప్రేమగా తల నిమరడమే కాకుండా తినడానికి కూడా ఏదోఒకటి ఇచ్చేవాడు. బాలు కూడా ఎంతో సంతోషంగా బాబాయ్ ఇచ్చింది తిని మళ్లీ అశోక్ తో పాటు తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. ఆ విధంగా అంగడి బాబాయ్ కే కాదు అశోక్ స్నేహితులకి కూడా చాలా దగ్గరైపోయాడు బాలు. ఓ రోజు ఉదయం అశోక్ ఏదో పనిమీద హడావుడిగా, తన మొబైల్ మర్చిపోయి స్నేహితుడితో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. అశోక్ వాళ్ళ నాన్న కూడా ఆఫీసుకి వెళ్ళిపోయాడు. అశోక్ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇంక బాలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. లక్ష్మి వంటింట్లో తన పనిలో తాను నిమగ్నమైపోయింది. బాలు కూడా లక్ష్మి వెంటే తిరుగుతున్నాడు. వంటింట్లో శ్రద్దగా పని చేసుకుంటున్న లక్ష్మికి ఏమైందో ఏమో తెలీదు..హఠాత్తుగా ఉన్నచోటే కింద పడిపోయింది.కళ్ళు తెరవడానికి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది.తను ఉన్నట్టుండి చిన్న గుండెపోటుతో స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో బాలు తప్ప ఎవరూ లేరు. అశోక్ ఏమో ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు. అశోక్ వాళ్ళ నాన్నేమో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. బాలుకి లక్ష్మి స్థితి చూసి ఏదో ప్రమాదం జరుగుతోందన్న అనుమానం వచ్చింది. పాపం మూగ జీవి కదా..! తనకి ఏం చెయ్యాలో ఎవరిని పిలవాలో తెలియట్లేదు. చాలా కంగారు పడిపోయాడు బాలు. తనకు ఏం చెయ్యాలో తెలియక ఇంట్లోకి వీధిలోకి పదేపదే తిరుగుతున్నాడు. కానీ ఎవ్వరూ కనపడలేదు. లక్ష్మి ఏమో పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. బాలు కంగారుగా ఏదో చెయ్యాలని అటూ ఇటూ తిరుగుతున్నాడు.అయినా ఏమీ తోచట్లేదు.అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి కింద పడి ఉన్న లక్ష్మి వైపు చూస్తుండగా, లక్ష్మి పక్కన పడి ఉన్న పాల ప్యాకెట్ ని గమనించాడు బాలు.ఆ పాల ప్యాకెట్ ని చూడగానే బాలుకి,అశోక్ తో పాటు రోజూ ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్ళినపుడు అంగడిలో ఉండే బాబాయ్ గుర్తొచ్చాడు. బాలు వెంటనే అంగడి బాబాయ్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంగడి బాబాయ్ బాలుని చూడగానే.. " హే..బాలు.. ఏంటి ఒక్కడివే వచ్చావ్..? తినడానికి ఏమైనా కావాలా.."? అని అడిగి రెండు బిస్కెట్లను బాలుకి తినడానికి ఇస్తాడు. అయినా బాలు ఆ బిస్కెట్లను తినలేదు. బాలు పదేపదే బాబాయ్ చుట్టూ తిరుగుతున్నాడు. బాబాయ్ కి అర్థం కావట్లేదు. బాబాయ్ చొక్కాని నోటితో పట్టుకొని అంగడి నుండి బయటికి లాక్కొచ్చాడు బాలు. బాబాయ్ కి ఏదో తేడాగా అనిపించింది. ఎందుకు బాలు అలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. బాలు మళ్లీ బాబాయ్ చొక్కాని నోటితో పట్టుకొని.. లాక్కుంటూ తన ఇంటి వైపు వెళ్తున్నాడు. ఈ సారి బాబాయ్ కి అనుమానం వచ్చి, ప్రమాదం ఏమైనా జరిగిందా..?అని ఆలోచించుకుంటూ బాలుతో పాటు నేరుగా అశోక్ వాళ్ల ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ వంటింట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న లక్ష్మి ని చూసి షాక్ కి గురయ్యాడు బాబాయ్. వెంటనే అంబులెన్సుకి ఫోన్ చేసి లక్ష్మిని ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రిలో వైద్యులు త్వరగా స్పందించి లక్ష్మిని ఐ.సీ.యూ గదిలోకి తీసుకెళ్లి తన ఆరోగ్యాన్ని బాగు చేసారు. ఐ.సీ.యూ గది నుండి బయటికి వచ్చిన వైద్యులు, బాబాయ్ తో.. " మీరు ఏ మాత్రం ఒక్కనిమిషం ఆలస్యం చేసి ఉన్నా, ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. సరైన సమయంలో తీసుకురావడం వల్ల ప్రాణాలు నిలబడ్డాయి" అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు బాబాయ్. అశోక్ బయటినుండి ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో ఎవరూ లేరు. బాలు కూడా కనపడలేదు. కంగారుగా "అమ్మా.. అమ్మా.." అని అరుస్తూ ఇల్లంతా వెతికాడు. ఎవరూ పలకలేదు. "అమ్మ ఎక్కడికి వెళ్లిందబ్బా.."? అని ఆలోచించుకుంటుండగా.. ఇంతలో పక్కింటి ఒకావిడ వచ్చి..." మీ అమ్మని అంబులెన్సులో ఆసుపత్రి కి తీసుకెళ్లారు బాబూ.. " అని చెప్పగానే అశోక్ వెంటనే అమ్మకు ఏమైందో ఏమో అన్న భయంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రిలో బాబాయ్ ని చూసిన వెంటనే అశోక్.. బాబాయ్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి కంగారుగా.. "అమ్మకి ఏమైంది బాబాయ్.."? అని అడగ్గా.. బాబాయ్ జరిగిందంతా చెప్పాడు. " బాలుగాడే లేకపోతే ఇవాళ మీ అమ్మ ప్రాణాలతో ఉండేది కాదురా.. " అని అశోక్ కి చెప్పి,ఆసుపత్రి నుండి వెళ్ళిపోయాడు బాబాయ్. అమ్మను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువచ్చిన అశోక్.. గుమ్మంలో కూర్చున్న బాలుని చూడగానే..అశోక్ కళ్ళవెంబడి కన్నీళ్లు ఆగకుండా వచ్చేసాయ్. తన తల్లి ప్రాణాలను కాపాడిన బాలుని చూసి అశోక్.. బాలు దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి ఎంతో ప్రేమగా, కృతజ్ఞతగా హత్తుకున్నాడు.బాలుకి ఎలాగ కృతజ్ఞతలు చెప్పాలో తెలియక ఎంతో ఇష్టంతో, ఆనందంతో బాలుని ముద్దాడాడు. బాలు కూడా తనకు ఏమీ తెలియదన్నట్లుగానే.. అశోక్ వైపు ఎంతో ప్రేమగా, జాలిగా చూస్తూ అశోక్ ఒడిలో వినయంగా ఒదిగిపోయాడు. " ఆ రోజు వర్షంలో నడిరోడ్డు మీద తన తల్లిని కోల్పోయి ఏడుస్తూ ఉన్న తనలాంటి పరిస్థితి అశోక్ కి రాకూడదని బాలు అనుకున్నాడో ఏమో కానీ.. ఈ రోజు ఎంతో బాధ్యతగా, విశ్వాసంతో అశోక్ తల్లి ప్రాణాలు కాపాడాడు బాలు ". గతంలో అశోక్ తనకు చేసిన మేలుకి బదులుగా.. బాలు సరైన సమయంలో సమయస్ఫూర్తితో,ఎంతో విశ్వాసంతో అశోక్ యొక్క ఋణం తీర్చుకున్నాడు. తిన్నింటివాసాలు లెక్కపెట్టే మనుషులు ఉంటారు కానీ.. మన ఉప్పు తిన్న జంతువులు మాత్రం ద్రోహం చెయ్యవు. " మనుషులు చూపించే విశ్వాసం కన్నా జంతువులు చూపించే విశ్వాసం ఎంతో స్వచ్ఛమైనది మరియు ఎంతో విలువైనది.. " అని అశోక్ పట్ల బాలు చూపిన విశ్వాసం ద్వారా మనకు స్పష్టమవుతోంది. దయచేసి మూగజీవాలను హింసించకండి.వాటికి కూడా మనసుంటుంది. మన బాధను మనం ఎవరితోనైనా పంచుకోగలం.కానీ అవి తమ బాధను ఎవరితోనూ పంచుకోలేవు, చెప్పుకోలేవు. కాబట్టి మూగజీవాలను ఆదరిద్దాం.. వాటి పైన కాసింత జాలిని చూపిద్దాం.