"నమస్కారం మాష్టారూ. " అంటూ సూర్యం మాస్టారి పాదాలకి నమస్కారం చేసిన ఆ వ్యక్తిని చూస్తూ ----
"పాదాలకి నమస్కారం చేస్తున్నారు. ఎవరు బాబూ మీరు ...."
"అయ్యో. నన్ను మీరు అంటారేమిటి మాష్టారూ. నేను ‘ఆంజనేయులు’ ని."
"అంటే.... …. …"
"ఎనిమిదో తరగతిలో, ఆఖరి బెంచీలో కూర్చోనే ఆంజనేయులు ని.”
"ఎన్నో ఏళ్లైపోయింది. అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నీ పేరు, ఆఖరి బెంచీ, ఎనిమిదో తరగతి - అంటే గుర్తొచ్చింది. నువ్వు గుర్తుకు రాగానే, ఏకవచనంలోకి వచ్చేసేను. ఏమనుకోకేం. నిలబడే ఉన్నావు. కూర్చో బాబూ." అని కుర్చీ లాగి, ఆంజనేయులుని అభిమానంగా తన పక్కన కూర్చో బెట్టుకున్నారు, మాష్టారు.
"మీరు ఏకవచనంతో పిలిస్తేనే, బాగుంటుంది మాష్టారూ."
“పెద్దవాడివైపోయావు… ఎక్కడ ఉంటున్నావు"
"ఇక్కడ నా స్కూల్ చదువు అయ్యేసరికి, నాన్నగారికి ప్రమోషన్ వచ్చి మేము విజయవాడ వెళ్లిపోయిన సంగతి మీకు తెలిసిందే. మరో నాలుగేళ్లకు, అక్కడనించి నాన్నగారి బదిలీతో హైదరాబాద్ వెళ్లి, అక్కడ నా చదువు ముగించుకున్నాను. నేనిప్పుడు శ్రీకాకుళంలో ఉంటున్నాను.”
“మిమ్మల్ని నా పెళ్ళికి పిలవడానికి వచ్చాను మాష్టారూ. పెళ్లి ‘పలాసా’కి దగ్గరే, ‘బరంపురం’లో. మీరు అమ్మగారు పెళ్ళికి తప్పకుండా రావాలి. పెళ్లికి మీరు వచ్చే ఏర్పా ట్లు నేనే చేస్తాను. అమ్మగారిని ఒకసారి పిలిస్తే …"
"చాలా సంతోషం బాబూ. "ఇగో, ఈశ్వరీ….. ఈశ్వరీ….. ఓ సారి ఇక్కడికి రా. ఎవరొచ్చారో చూడు."
"వస్తున్నా.. .. ఎవరండీ వచ్చింది"
"చెప్పుకో చూద్దాం."
" వీరెవరో నాకు గుర్తుకి రావడం లేదు….. ఎవరు బాబూ మీరు"
"నేనమ్మా. మాష్టారి శిష్యుడిని, ఆంజనేయులుని. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటినించి నా చదువు అయిపోయేవరకు, మాస్టారు దగ్గరకి తరచుగా వచ్చేవాడిని. ఎన్నోసార్లు మీ చేతి భోజనం కూడా చేసేను. గుర్తొచ్చేనా" అంటూ లేచి –
--పళ్ళ సంచీ ఆమె చేతిలో పెట్టి, ఆవిడ పాదాలకి నమస్కారం చేసేరు ఆంజనేయులు.
"ఆ ఆంజనేయులువా !!! నువ్వు అని తెలియగానే, ఏకవచనంలోకి వచ్చేసేను. ఇప్పుడు ఏం చేస్తున్నావో, ఏ హోదాలో ఉన్నావో. ఏమీ అనుకోకేం.”
“మీరు మాస్టారు నన్ను ‘ఏరా ఆంజనేయులు’ అని, ఏకవచనంతో పిలుస్తేనే, తృప్తిగా ఆత్మీయంగా ఉంటుంది. మిమ్మల్ని నా పెళ్ళికి పిలవడానికి వచ్చాను. మీరిద్దరూ తప్పకుండా రావాలి."
"నువ్వు మాస్టారుగారితో మాట్లాడుతూ ఉండు. కాఫీ తెస్తాను. భోజనం చేసి వెళ్ళాలి మరి" అని ఆప్యాయంగా చెప్పి, వెళ్ళబోతున్న ఆవిడ చేతులు, పూర్వపు చనువుతో పట్టుకొని, తీసికొనివచ్చి, మాస్టారి ప్రక్కన కుర్చీలో కూర్చోబెట్టేరు ఆంజనేయులు.
"మీ మాట కాదంటున్నందుకు క్షమించండమ్మా. ఇంకా చాలా చోట్ల శుభలేఖలు ఇవ్వాలి. పెళ్లి అయినతరువాత, భార్యతో కలిసి వచ్చి, మీ చేతి వంట తప్పకుండా తిని వెళ్తాను.” అంటూ – ---మాష్టారు చేతికి శుభలేఖ ఇచ్చి -- ---తనతోపాటు తెచ్చిన బాగ్ లోంచి తీసి, మాష్టారు దంపతులకి, చెరో కాశ్మీరీ శాలువా కప్పి, ఇద్దరి చేతిలో చెరో ప్యాకెట్ పెట్టి ---
-- ఆ దంపతుల పాదాలకి నమస్కారం చేసేరు ఆంజనేయులు.
“శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
శతమానం భవతి శతాయుః పురుషః శతేంధ్రియ ఆయుఃశ్శ్యేవేంధ్రియే ప్రతితిష్ఠతి”
అని మాస్టారు ఆశీర్వచనం చదువు తూండగా –
---దంపతులిద్దరూ ఆంజనేయులు తలమీద చేయివేసి, మనఃపూర్తిగా ఆశీర్వదించారు.
“ఈ ప్యాకెట్లు ఏమిటి బాబూ ? ఎందుకివన్నీ?”
“పెద్దగా ఏమీ లేదు మాస్టారూ. ఇన్ని సంవత్సరాల తరువాత వచ్చేను. ఉత్తి చేతులతో మీ దర్శనం ఎలా చేసుకుంటాను. పైగా ఈరోజు గురు పౌర్ణిమ కూడా.
దంపతులిద్దరూ ఆ ప్యాకెట్లు తెరిచి చూసి – "ఏమిటి బాబూ, పట్టు బట్టలెందుకు ? మామూలు బట్టలు తెస్తే సరిపోయేది కదా. అసలు నువ్వు ఇవన్నీ తేవలసిన అవసరమేముంది ?" అన్నారు మాస్టారు, అభిమానంగా.
“వెనక బెంచీలో కూర్చునే నాకు చేయూతనిచ్చి, ప్రోత్సహించి, తీర్చిదిద్దిన మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు నాకు చేసిన సహాయం ముందర, ఈ బట్టలు ఏపాటి మాస్టారు.”
"ఇన్నాళ్ళకి ఇంతటి శుభవార్తతో వచ్చిన నీ నోరు తీపి చేయకుండా ఎలా వెళ్లనిస్తాను చెప్పు. ఇప్పుడే వస్తాను." అని –
ఈశ్వరిగారు లోపలికి వెళ్లి వచ్చి – ఆంజనేయులు నోటికి "నీకెక్కువ ఇష్టమైనదే" అంటూ పాలకోవా అందించేరు.
"మీరింకా నా ఇష్టం గుర్తుంచుకున్నారా అమ్మగారూ" అంటూ, ఆనందంతో కళ్ల నీళ్లు పెట్టుకున్నారు ఆంజనేయులు.
"నాన్నగారెక్కడున్నారు. ఎలా ఉన్నారు." పూర్వ పరిచయాలు గుర్తు చేసుకుంటూ అడిగేరు మాస్టారు.
“నాన్నగారు కులాసాగా ఉన్నారు. మీ ఇద్దరినీ మరీ మరీ అడిగినట్లు చెప్పమన్నారు. నేను అమ్మ నాన్న తోనే ఉంటున్నాను.
“భేష్. 'అమ్మా నాన్న, నా దగ్గరే ఉంటున్నారు' అనకుండా’ – ‘నేను, అమ్మ నాన్న తోనే ఉంటున్నాను ‘ – అన్నావు చూడు, అదీ సంస్కారమంటే.”
“మీరు నేర్పిన పాఠాలు, సంస్కారమే, మాస్టారూ.”
“ఆ రోజుల్లో నిన్నేదో పేరుతో పిలిచేవారు కదూ అందరూ -- ఏమిటది ?"
“ ' ఎడారి ఓడ ' అని పిలుస్తుండేవారు, మాస్టారు" ---నవ్వుతూ చెప్పేరు ఆంజనేయులు.
"అవునవును. ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఆ రోజులు, ఆ సరదాలు వేరు.” నవ్వుతూ అన్నారు మాస్టారు.
“నువ్వేం చేస్తున్నావో చెప్పేవుకాదు."
“ఇరవై రోజుల క్రిందటే, జిల్లా అధికారిగా పనిలో చేరెను.”
“జిల్లా అధికారి అంటే, కలెక్టర్ గా నా ?
“అవును మాష్టారూ ---
--జీవితంలో పైకి రావాలంటే పాఠాలు చదువుకోవడం ఒక్కటే సరిపోదురా అని –
--వ్యాసరచన , రెసిటేషన్, వక్తృత్వ పోటీలన్నిటిలో నేను పాల్గొనేలా మీరు తగిన తర్ఫీదు ఇచ్చేవారు. వాటిలో నెగ్గడానికి కావలసిన --- సమయపాలన, పోటీతత్వం, క్రమశిక్షణ --- మీరు నేర్పబట్టే -- ఐఏఎస్ పరీక్షలో, మొదటి ప్రయత్నంలోనే, దేశం మొత్తం మీద, మొదటి పదిమందిలో ఒకడిగా, ఉత్తీర్ణుడనవగలిగేను.
ఒక శిష్యుడిని గురువు చేరదీసి, ప్రోత్సహించి, మార్గదర్శనం చేస్తే – ఆ శిష్యుడు ఎంతగా ఎదగగలడో నిరూపించడానికి -- మీరు ఒక ప్రమాణంగా నిలబడ్డారు.
మీరు పెట్టిన ఈ బిక్ష, మీకు ఉత్తరం ద్వారానో ఫోన్ ద్వారానో చెప్పడం ఇష్టంలేక, స్వయంగా విన్నవించుకోవాలని,
ఈ రోజు వరకు ఆగేను.
ఈ ఆలస్యానికి నన్ను క్షమించండి, మాస్టారూ"
“వజ్రం లాంటి నీకు -- కొంత సాన పెట్టేనేమో తప్పించి –
--నేను ప్రత్యేకంగా చేసిందేమీలేదు. నా వృత్తి ధర్మం నేను నిర్వర్తించేను.
--జీవితంలో పైకి రావాలనే నీ పట్టుదల, కృషి, అన్నిటికి మించి, నీ తల్లి తండ్రుల ఆశీర్వాదం నిన్నింతటి వాడిని చేసేయి.
--అంత పెద్ద పదవిలో ఉండి, ఇంత వినయంగా ఉన్న నిన్ను, నా శిష్యుడిని –
--జిల్లా కలెక్టర్ గా వచ్చిన నిన్ను - చూస్తుంటే, గుండె గర్వంతో నిండిపోతోందయ్యా.
--ఆనందభాష్పవాలు ఎలా స్రవిస్తున్నాయో చూడు.
--ఆనందంతో నిన్ను కౌగిలించుకోవాలనిపిస్తోంది” అని ---
--కుర్చీలోంచి లేచి శిష్యుడ్ని ఆలింగనం చేసుకున్నారు, మాస్టారు.
వారిద్దరి నీ అలా చూసి హాయిగా నవ్వుతున్నారు ఈశ్వరిగారు.
“ఇక నేను బయలుదేరతాను మాస్టారూ.”
“ క్షేమంగా వెళ్లిరా " అని సాగనంపేరు మాస్టారు దంపతులు, ఆంజనేయులుని.
ఇంట్లోకి వెళ్తూ ఈశ్వరిగారు " 'ఎడారి ఓడ ‘ అంటాడేమిటండీ."
"కూర్చో." అని, మాస్టారు – ‘జంధ్యాల’ సినిమాలోలాగ, మనసులో సైకిల్ టైర్ వెనక్కి తిప్పుతూ, గతంలోకి జారుకున్నారు.
అవి ఆంజనేయులు ఎనిమిదో తరగతిలో చదువుకొనే రోజులు.
ఒక రోజు లెక్కల పాఠాలు అవుతుండగా -- హెడ్ మాస్టరు గారు పంపిన నోటీసు వచ్చింది.
లెక్కల మాస్టరు ఆ నోటీసు చదివి తరగతిలో పిల్లలకి వినిపిస్తున్నారు.
"రేపు స్కూళ్ల ఇన్స్పెక్టరుగారు వస్తున్నారు. కనుక, పిల్లలందరూ మంచి బట్టలు వేసుకొని, పాఠాలు క్షుణ్ణంగా
చదువుకొని రావలెను. స్కూళ్లఇన్స్పెక్టరుగారు ఏ అబ్బాయినేనా ఏ విషయంలోనైనా ప్రశ్నవేయవచ్చు.
ఇంటర్వెల్లో తప్పించి, తక్కిన సమయంలో, పిల్లలు వారి వారి తరగతుల్లోనే నిశ్శబ్దంగా ఉండవలెను."
ఆ నోటీసు చదివిన లెక్కల మాస్టరు : ఈ పూటకి క్లాస్ అయిపొయింది. ఇంటికి వెళ్లి, భోజనాలు చేసి, రెండు గంటల క్లాస్ వేళకి రండి." అని – --పిల్లలని అప్పటికి వదిలేసేరు.
మరునాడు, పన్నెండు గంటలు అవుతూండగా వచ్చిన స్కూళ్ల ఇన్స్పెక్టరుగారు -
హెడ్ మాస్టారుగారి తో : “మీ స్కూల్ లో ప్రతీ తరగతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి"
హెడ్ మాస్టరు : "రెండేసి -- A & B"
స్కూళ్ల ఇన్స్పెక్టరు : "అయితే, ముందుగా – ఎనిమిదో తరగతి B సెక్షన్ కి వెళదాం."
ఆ విధంగా, హెడ్ మాస్టారుగారు స్కూళ్ల ఇన్స్పెక్టరు ని తీసుకొని ఎనిమిదో తరగతి B సెక్షన్ కి వచ్చేసరికి, సూర్యం మాస్టరు పాఠం చెప్తున్నారు.
సూర్యం మాస్టరుని, హెడ్ మాస్టారు స్కూళ్ల ఇన్స్పెక్టరుకి పరిచయం చేసేరు.
స్కూళ్ల ఇన్స్పెక్టరు : "సూర్యం గారూ, ఏమిటి చెప్తున్నారు."
సూర్యం మాస్టరు : "'సోషల్ స్టడీస్' చెప్తున్నాను సర్."
స్కూళ్ల ఇన్స్పెక్టరు సూర్యం మాస్టరు తో: "నేనొక పిల్లడిని నిలబడమంటాను. మీరు ప్రశ్నఅడగండి.”
సూర్యం మాస్టరు : “అలాగే, సర్.”
స్కూళ్ల ఇన్స్పెక్టర్ క్లాస్ అంతా కలయచూసి, ఆఖరి బెంచీలో కూర్చున్న ఆంజనేయులుని నిలబడమన్నారు.
సూర్యం మాస్టరు : “ EXPLAIN ‘SHIP OF THE DESERT’ ”
స్కూళ్ల ఇన్స్పెక్టరు ఆంజనేయులికి ఆగమని చేయి చూపించి ---
సూర్యం మాస్టరు తో : మీరు ప్రశ్న ఆంగ్లం లో ఎందుకు వేసేరు ?
సూర్యం మాస్టరు : పిల్లలకి పాఠాలు తెలుగులోనే చెప్తాం. కానీ, ఈ ఎనిమిదో క్లాస్ నుంచి,
పరీక్షలలో ప్రశ్నలు ఆంగ్లంలో ఉంటాయి. పిల్లలు జవాబులు తెలుగులోనే వ్రాస్తారు."
స్కూళ్ల ఇన్స్పెక్టరు ''అలాగా" అని, ఆంజనేయులికి జవాబు చెప్పమని చేయి చూపించేరు.
ఆంజనేయులు వెంటనే, ఏమాత్రమూ తడుముకోకుండా, :
“ ‘SHIP OF THE DESERT’ అంటే, 'ఎడారి ఓడ' అని అర్ధం.
నీటి మీద ప్రయాణం చేయడానికి ‘ఓడ’ ఎలా సాధనమో, ఎడారిలో ప్రయాణం చేయడానికి ‘ఒంటె’ అలా
సాధనంగా పనికొస్తుంది. అందుకు, ఒంటెని 'ఎడారి ఓడ' అని అంటారు.”
అని, స్పష్టంగా జవాబిచ్చేడు. స్కూళ్ల ఇన్స్పెక్టరు 'శభాష్' అని, గట్టిగా చప్పట్లు కొట్టేరు.
స్కూళ్ల ఇన్స్పెక్టర్ ఆంజనేయులుని తన దగ్గరగా రమ్మని పిలిచి,
ఒక కొత్త పెన్నుని బహుమతిగా ఇచ్చి, భుజం తట్టి, పంపించేరు.
అంతేకాదు – క్లాసులో అంతమందిలో – సూర్యం మాస్టరుని :
"మీరు పాఠాలు చాలా బాగా చెప్తున్నారు అని తెలుస్తూంది. చాలా సంతోషం"
అని ప్రశంసల వర్షం కురిపించేరు.
అప్పటినించి -- ఆంజనేయులుని, స్కూల్ లో అందరూ -- 'ఎడారి ఓడ' – అని, నవ్వుతూ పిలుస్తూండేవారు.
ఆంజనేయులు వలన క్లాస్ కి, స్కూల్ కి, తనకి, మంచి పేరొచ్చిందని –
సూర్యం మాస్టరు -- ఆ రోజునించీ -- ఆంజనేయులుని చాలా అభిమానంగా చూసుకునేవారు.
*****************
పూజ్యులు పితృసమానులైన నా గురువులు - కీ.శే. ధర్మపురి కృష్ణమూర్తి మాస్టారు - దివ్య స్మృతులతో.
ఈ కధలో ( 'ఆంజనేయులు ' అంత ఎత్తుకి, ఎదగలేకపోయినా ) అరవై వసంతాల వెనుకటి అదృష్టవంతుడైన
'ఎడారి ఓడ' -- ఈ కథకుడే అని -- నా జీవితంలో ఈ మాత్రమేనా ఎదిగేనంటే, అది మాస్టారిగారి ఆశీర్వాదమే అని -- సవినయంగా విన్నవించుకుంటున్నాను.