ఇదే - Ramesh bodapati

Ide

" ఏమిటండీ సరిగా భోజనం చేయలేదు. వంట్లో బాగా లేదా "ఆతృతగా అడిగింది సుమ.

"వంట్లో బాగానే ఉంది. వంటే బాగా లేదు."

"ఏమయింది నేను కూడా మీతోనే తిన్నాను కదా. నా కేమీ తేడా అనిపించ లేదు. అన్నీ బాగానే ఉన్నాయి కదా?"

"అని నువ్వనుకుంటే సరిపోతుందా. అవునులే నీ వంట నువ్వే మెచ్చుకోవాలి."

"నేనేమీ ఖాళీగా కూర్చోటం లేదు. మీ కంటే అరగంట ముందే ఇంటికి వచ్చాను.

మీరు కూడా ఆకలితో నకనకలాడుతూ వస్తారని లేని ఓపిక తెచ్చుకుని ఈ పూట వంట చేసాను.అసలు మీరు రావటమే ధుమధుమలాడుతూ వచ్చారు. ఆఫిసులో ఏమైనా చికాకులుంటే అవి అక్కడే మర్చిపొండి. ఇంటికి తీసుకురాకండి. "

"చాల్లే చేసావులే మహలావు వంట..అన్నీ తరిగి కుక్కర్లో పడేయటమే కదా:"

"మీరు చేసి చూడండి ఒక్కరోజు.. వంట చేయటం రాదు కానీ వంకలు పెట్టటం మాత్రం బాగా వచ్చు. అయినా మాకూ ఉంటాయి ఆఫిసులో చికాకులు. మీకు కేవలం పనిలోనే. మాకయితే మగవాళ్ళతో

"అవునులే నువ్వుకూడా ఉద్యోగం చెస్తున్నావు కదాని అహంకారం"

ఉడుక్కుంటున్నాడు సుధాకర్.

"నేను ఇంటా బయటా కూడా పని చేస్తున్నాను. మీకయితే బయటే ఉద్యొగం..

ఇంట్లో పూచిక పుల్లయినా తీసి అవతల పడేయరు. కబుర్లు మాత్రం…......"

" ప్రపంచం లో నువ్వొక్కదానివే ఉద్యోగం చేస్తున్నట్లు గొప్పలు పోతావేం. మా

చిన్నప్పుడు మా అమ్మ మా అందరినీ ఎంత ఆప్యాయంగా చూసేదో తెలుసా. ఇప్పుడయితే

కుక్కర్లూ గాస్ స్టొవ్లూ ఉన్నాయి మా అమ్మయితే కుంపటి మీదే వంట అయినా ఆ రుచి నీకు

చేతకాదు. పేరు పేరునా ఎవరికి ఏంకావాలో కనుక్కుని పెట్టేది. "

చనిపోయిన తల్లిని తలుచుకున్నాడు.

ఎవరి తల్లిని వారు పొగుడుకోవటం సహజమే కదా అని సరిపెట్టుకుంది.

" మీరూ సరిగ్గా తినటంలేదు .నా వంట మీకు కూడా నచ్చటంలేదా? అన్నది కొడుకు,,కూతుర్ని చూసి . ఆక్రోశంగా.

"అదేం లేదమ్మఆకలి లేదు"అన్నది కూతురు.

""అమ్మ వంట బాగానే చేస్తుంది"అన్నాడు కొడుకు.

మెచ్చుకోలుగా చూసింది సుమ.

"ఎంతయినా అమ్మ కొడుకువి కదా. అందుకే బాగుందంటున్నావు"అన్నాడు

సుధాకర్ కొడుకుని ఉడికిస్తూ..

"అదేంకాదు. అమ్మ అన్నీ బాగానే చేస్తుంద"" అన్నది కూతురు వత్తాసుగా

"మీ అమ్మ వంటను మీరే మెచ్చుకోవాలి"

"నువ్వు మాత్రం మీ అమ్మ వంట బాగా చేస్తుందనలా."అన్నాడు కొడుకు.

"అమ్మ మనకే గానీ నాన్నకు కాదు కదా" అన్నది కూతురు ఆరిందలా.

సుమ కళ్ళు మిలమిలా మెరిసాయి.

"పోనీలే మీరయినా మెచ్చుకున్నారు "అని మురిసిపోయింది. ఆ సంతోషం లో తను ఆ ఫూట సరిగా తినలేదనే విషయం కూడా మరిచిపోయింది.

కానీ తన భర్త.......

అతను కూడా తనను మెచ్చుకుంటే బాగుంటుందని చాలా సార్లు అనుకుంటుంది.

అయితే అతను ప్రతిదానికీ సణగటం,వంకలు పెట్టటం అమెకు చికాకు తెప్పిస్తోంది.తనకు వంట చేయటమనేది పెళ్ళికి ముందు రాదు. పుట్టింట్లో అమెకు పెద్దగా పనులు చెప్పేవారు కాదు. అదీ కాక తనకు చదువుతోనే సరిపోయేది. అమ్మ అక్కడికీ సణుగుతూనేఉండేది 'కాస్త వంటా వార్పూ నేర్చుకోవే అని. పేళ్ళయిన తర్వాత మీ అత్తారింట్లోనన్నాడిపోసుకుంటారు., పిల్లకి ఏ పనీ నేర్పలేదని 'అని వాపోయేది.

తను తల ఎగరేసేది.

ఎందుకంటే నాన్నగారు ఈ విషయంలో తనకు మద్దతు పలికేవారు.'మనమ్మాయి నీ లాంటిది కాదు. ఏ విషయమైనా చిటికలో నేర్చేసుకుంటుంది అయినా ఇక్కడున్నంత వరకే అమ్మయికి నిశ్చింత' అని వకాలతు పుచ్చుకునేవారు. తను కూడా తండ్రిమాటలకు మురిసిపోయేది అప్పట్లో తండ్రి తల్లిని ఎద్దేవా చేస్తున్నాడని తట్టేది కాదు.

ఇప్పుడనిపిస్తోంది ఈ మగాళ్ళంతా ఇంతే, భార్యని చులకనగా చూస్తారూ అని . ఈ రోజుల్లో కుడా ఇలాగే ఉంటుందా తనకు మంచి భర్త వస్తాడని ఆశ పడింది.

నిజానికి సుధాకర్ కు ఎటువంటీ దురలవాట్లూ లేవు. తను కూడా ఉద్యోగం చేయటంతో ఆర్ధిక సమస్య లేదు. ఉన్నంతలో జీవితం సాఫీగానే సాగిపోతోంది.

అతనికున్న దుర్వ్యసనం ఒక్కటే తను చేసే ఏ పనీ మెచ్చుకోడు. ప్రతి దానినీ తన తల్లితో పోల్చుకుంటాడు. అదే తనకు నచ్చదు.

పెళ్ళయిన కొత్తలో అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ వంటను గమనించేది.

కొత్త కోడలని తనకు మొదట్లో ఏ పనీ చెప్పేవారు కాదు. తర్వత్తర్వాత పిల్లల తల్లివి నువ్వేం చేస్తావు అనే వాళ్ళు.

అత్త గారికి ఎదురు చెప్పాలంటే మొదట్లో కాస్త బెరుగ్గా ఉండేది అయినా ఆవిడఇల్లు ఆవిడ ఇష్టం అని సరి పెట్టుకునేది.

కానీ ఆవిడ 'కోడలు వ చ్చిందన్నమాటేకానీ ఇటు పూచికపుల్ల తీసి అటు పెట్టదు. ఈ వయసులో కూడా అన్నీ నేనే చేసుకోవాలి' అని ఇంటికి వచ్చిన వాళ్ళతోవాపోయినప్పుడు మాత్రం బాధ పడేది

ఆవిడ కూడా అన్ని పనులూ తనే చేసుకోవాలి, తన పిల్లలకు కావలసినవి తనే చూసుకోవాలని ఆరాట పడుతుండేది. కానీ పని వత్తిడి వల్ల హడావుడి పడిపోయి కుక్కర్ ఆవిరి ఆరకుండా మూత తీసేయటం, వంటకాలు మాడటం లాంటివి తను చాలా సార్లు గమనించింది.

సుధాకర్ తల్లిని అంతగా ఎందుకు మెచ్చుకుంటాడోనని ఆశ్చర్యపోయేది. అయినా ఆవిడ ఇంటి బాధ్యతలే చూసుకునేది. చదువు తక్కువ కావటంతో ఉద్యొగం చేయలేదు.

మరి తనేమో చదువుకు తగ్గ ఉద్యోగంచేస్తోంది. ఇంటి పని బయట పని కుడాసమర్ధవంతంగా చేస్తోందని సగర్వంగా చెప్పుకోగలదు.

కేవలం వంట విషయం లోనే కాదు. ఏ విషయం లో కాస్త లోపం(?) కనబడ్డా ఊరుకోడు. వెంటనే ఇదే మా అమ్మయితేనా అంటాడు. దానితో తనకు చి ర్రె త్తుకొస్తుంది..

ఒక్కోసారి మాటకు మాట .బదులివ్వటం,చికాకు పడి అరవటం,పిల్లలు బిక్కుబిక్కు మంటూ తమ వంక చూడటం ఆమెకు దుర్భరంగా ఉంటొంది.

అక్కడికీ ఉండబట్టలేక ఒకసారి భర్త తో అన్నది 'ప్రతిదానికి మీ అమ్మగారితో పోల్చకండి. ఆవిడ తీరు వేరు నా తీరు వేరు. అయినా అమ్మ అమ్మే ఆలి ఆలే,అని నవ్వేసేది.

సుధాకర్ లో ఉలుకు పలుకూ లేదు.

ఎంత చిరాగ్గా ఉన్నా భర్త కోరికను ఆమె ఎప్పుడూ కాదనదు,,మనసుసహకరించకపోయినా.

అలాంటి ఒక సందర్భం లో

"అమ్మయ్యా ఈ విషయంలో మాత్రం నన్నెవరి తోనూ పోల్చుకోలేరు."అన్నది మత్తుగా నవ్వుతూ , భర్త వీపు నిమురుతూ.

****

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి