మళ్లీ మొదలు : - సుధావిశ్వం

Mallee modalu

శశికాంత్, కమలిని ఇద్దరూ ఉద్యోగానికి వెళతారు. వారిద్దరిదీ ఒక ఇంచుక అన్యోన్య దాంపత్యమే. అలాగని అస్సలు గొడవ పడరని కాదు. కొన్ని సరిపడని అలవాట్ల వల్ల గొడవ పడుతూ వుంటారు, మళ్లీ సర్దుకుని కలిసిపోతూ వుంటారు. శశికాంత్ ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా చేస్తుంటే, కమలిని దగ్గర్లోనే ఉన్న ఓ ప్రయివేటు స్కూల్ లో టీచర్. సెకండరీ స్కూల్లో చదువుతున్న ఇద్దరు పిల్లలు. ఇంట్లో ఉండి, అందరికీ పెద్దదిక్కుగా ఉన్న శశికాంత్ తల్లి కామేశ్వరమ్మ. ఇదీ వీరి కుటుంబం. అద్దె ఇంట్లో కాపురం. "ఇదిగో! చూశారా! మళ్లీ మనింటిముందు వరకూ పడింది చెత్త. అందరూ చెత్త సంచులు అలా విసిరేస్తారు. అవి ఇలా వచ్చి, మనింటిముందు పడుతున్నాయి. ఈ ఓనర్ కి చెబితే పట్టించుకోడు. వాళ్లకు అద్దె ఠంచనుగా వస్తే చాలు. ఓ రోజు లేట్ అయిందంటే పది ఫోనులు చేస్తాడు. అందుకే మొత్తుకుంటు న్నాను, ఎలాగో ఒకలా బ్యాంక్ లోను తీసుకుని, సొంత ఫ్లాట్ కొనుక్కుంటే బావుంటుందని. కానీ నా మాట వినిపించుకోరు. విననట్టే వుంటారు. ఇప్పుడు మేనేజర్ అయ్యారుగా! జీతం పెరిగింది. ఇప్పుడైనా ఫ్లాట్ కొనడానికి మార్గం చూడండి. అపార్టుమెంట్లలో ఉంటే అంతా బాగుంటుంది. చక్కగా మెయింటైన్ చేస్తారు. వాచ్ మెన్ ఉంటాడు. ఎవ్వరూ ఇలా అడ్డదిడ్డంగా చెత్త వేయరు. రోజూ అన్ని ఫ్లాట్స్ దగ్గరకు వచ్చి, చెత్త తీసుకెళతారు మున్సిపాలిటీ వాళ్ళు. హాయిగా నీట్ గా ఉంటుంది" ఇలా వాక్ప్రవాహం సాగిపోతోంది "చూద్దాం లే! నాకు టైం అవుతోంది. నే వెళుతున్నా. వచ్చాక మాట్లాడదాం" అని అక్కడ్నుంచి జారుకున్నాడు శశికాంత్ కమలినికి నీట్ గా లేకుంటే నచ్చదు. ఇల్లును కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటుంది. ఎంత స్కూల్ వర్క్ వున్నా ఇంట్లో నీట్ నెస్ కి తేడా రానివ్వదు. జుట్టు దువ్వుకుంటే కూడా జాగ్రత్తగా ఒకేచోట పడేసి, తీసి డస్ట్ బిన్ లో వేస్తుంది తప్ప బయటకు గాలిలో వదిలేయదు, ఇంట్లో వారిని కూడా వేయనివ్వదు. అలా ఎవరైనా వేస్తే అస్సలు నచ్చదు. అటువంటి కమలినికి పెద్ద తలనొప్పిగా మారింది ఒక సమస్య. ఇంటికి పక్కనే చెత్తకుండీ ఉంది. దాంతో ఆ వీధిలో వాళ్లంతా అక్కడే చెత్త వేస్తారు. జాగ్రత్తగా తెచ్చి చెత్తకుండీలో వేయరు. దూరం నుంచి విసిరి వేస్తుంటారు. అది ఎగిరి కమలిని వాళ్ళ వాకిట్లో గేటు ముందు ఒకసారి, ఒక్కోసారి గేటు లోపలికి కూడా పడుతూ ఉంటుంది. పరుగున వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించరు. అందులో నుంచి పురుగులు గట్రా వస్తుంటాయి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎప్పుడు తీసుకెళతారో తెలియదు. అందరూ హడావుడిగా వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్న కామేశ్వరమ్మ ఒక్కతే చూడలేకపోతోంది. ఇంటి ఓనర్ కి ఆ చెత్తకుండీ చోటు మార్పించమని చెబితే, మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి, మార్పిస్తానని అంటాడు. కానీ అంతే! అది జరగదు. వాళ్ళు నగర శివారులోని కాలనీలో వుంటారు. వీళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. కానీ వాళ్లాయన కష్టపడి కట్టించుకున్న ఇల్లు అని మార్చడానికి కామేశ్వరమ్మ ఒప్పుకోలేదు. ఎలాగంటే ఆ ఇంటి ఓనర్ వీళ్లకు చుట్టమే. ఓ సారి శశికాంత్ చదువు కోసం అవసరపడి అప్పు చేయాల్సివచ్చింది. అది తీర్చలేక ఇల్లు ఆయనకు ఇచ్చేసాడు శశికాంత్ తండ్రి. ఇల్లు ఖాళీ చేయక్కర లేకుండా ఏదో నామమాత్రపు రెంట్ తీసుకుంటున్నాడు ఆయన. శశికాంత్ తండ్రి ఇక్కడే కాలం చేసాడు. ఆ ఇల్లు తన ఆఫీసుకి దూరంగా ఉన్నప్పటికీ రెంట్ తక్కువ, ఒకప్పటి తమ సొంత ఇల్లు అనే సెంటిమెంట్ తో అక్కడే ఉంటున్నాడు శశికాంత్. కానీ కమలినికి అపార్ట్మెంట్ లో ఉంటే బాగుంటుందని భావన. అది ఈ చెత్త సమస్య వలన రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. ***** ఎట్టకేలకు బ్యాంక్ లో హౌసింగ్ లోన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసాడు శశికాంత్. అవి ఫలించి లోన్ శాంక్షన్ అయ్యింది. తన ఆఫీసుకు ఓ మోస్తరు దూరంలో ఉన్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేసాడు. కమలిని ఆనందానికి అంతులేదు. మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేసుకున్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళను ఆహ్వానించారు గృహప్రవేశానికి. ఒక వీకెండ్ ముందు లీవ్ పెట్టుకుని షిఫ్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఓనర్ కు చెప్పేశారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళను బుక్ చేసుకున్నారు. వాళ్ళైతే చక్కగా ఉంటుంది. అన్నీ వాళ్లే ప్యాక్ చేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్తారని, కమలిని వాళ్ళ స్కూల్లో తనతో ఎక్కువ క్లోజ్ గా వుండే సుజాత టీచర్ చెప్పిందని, బుక్ చేయమని కమలిని అనడంతో అలాగేనని బుక్ చేశాడు. "మీరేమీ ప్యాక్ చేయక్కరలేదు మేడమ్! అన్నీ మేమే జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని తీసుకెళతాము. మీరు వర్రీ అవ్వొద్దు. ఒక్క పూచిక పుల్ల కూడా వదలము" అన్నాడు ముందురోజు మాట్లాడడానికి వచ్చిన ప్యాకర్స్ వాడు. ***** మరునాడు ఉదయమే లేచి, స్నానాదులు కానిచ్చి, టిఫిన్, టీలు అయ్యాక, కడిగేసి అక్కడ పెట్టేసింది. "మనం కొన్ని సర్ది పెట్టుకుందామా? కొన్ని ముఖ్యమైనవి, గాజువి మనం సర్దుకుంటే మంచిది కదే!" అన్న కామేశ్వరమ్మ మాటలను కొట్టి పడేసింది కమలిని "నాతో పనిచేసే సుజాత చెప్పింది. వాళ్ళామధ్య వేరొక చోటకు ఇల్లు మారారు. ఈ ప్యాకర్స్ వాళ్ళు, వాళ్లే అన్నీ, గాజు వస్తువులతో పాటుగా చక్కగా ప్యాక్ చేసి జాగ్రత్తగా తెస్తారట. వాళ్లకు డబ్బు ఇస్తూ మనం ఎందుకు సర్దడం! మీరలా కూర్చోండి. వాళ్ళు ఓ పది నిముషాల్లో వస్తారు" అంది. ఆవిడ చేసేదేమీలేక ఊరుకుంది. ప్యాకర్స్ వాళ్ళు మాత్రం చాలా లేట్ గా వచ్చారు. రాగానే హడావుడి. చకచకా తమతో తెచ్చిన బాక్సులు ఓపెన్ చేసి, ఒక్కో సామాను అందులో వేసేస్తున్నారు. "జాగ్రత్త బాబూ! అవి గాజు సామాన్లు" అంటూ ఏదో చెప్పబోతున్న కామేశ్వరమ్మ తో "అమ్మా! మీరు కంగారు పడకండీ! మేము ఏ ఒక్కటి వదిలి వేయము. అన్నీ సర్దుతాము. మాకు అలవాటే! అన్ని వస్తువులూ జాగ్రత్తగా తీసుకొచ్చి, ఆ ఇంట్లో అప్పగించే పూచీ మాది" అన్నాడు అలా కొన్ని పెద్దబాక్సుల్లో సర్దారు. వాటికి నంబర్స్ వేశారు. బీరువాలు, వాషింగ్ మెషిన్ కూడా ప్యాక్ చేసి నంబర్ వేశారు. "అమ్మా! చూసుకోండి! మీ సామాను 30 బాక్సుల్లోకి వచ్చాయి. 30 ఐటమ్స్! కొన్ని ఐటమ్స్ ఈ రెండు సంచుల్లో ఉన్నాయి. 32 మొత్తం. గుర్తుపెట్టుకోండి" అని లారీ ఎక్కబోతూ అక్కడ ఉన్న మరో రెండు సంచులు వేసాడు. అటు వచ్చిన కామేశ్వరమ్మ పిలుస్తుంటే.. "అన్నీ వదలకుండా వేశాం. ఇంకా ఏమైనా మిగిలాయా? చూసి, చెప్పండి" అన్నాడు "ఇక్కడ ఏమీ లేదు. అన్నీ సర్దేశారు. కానీ.." అంటూనే ఉంది "మేమంతేనమ్మా! మా సర్వీస్ బాగుంటుంది. ఏ ఒక్కటి వదలకుండా తీసుకొస్తాం" అని లారీ ఎక్కి బయల్దేరాడు మరో మాట వినకుండా ఆ తర్వాత కాసేపటికి వీళ్ళూ బయలుదేరారు. ***** అక్కడ సామాను దింపినప్పుడు లెక్క చూసుకోవడానికి దగ్గర్లోనే ఉన్న ఓ ఫ్రెండ్ ను రిక్వెస్ట్ చేసాడు శశికాంత్. ఆ తర్వాత కమలిని,కామేశ్వరమ్మలను ఆటో ఎక్కించి, పిల్లల్ని బైక్ పైన తీసుకుని బయలుదేరాడు. *** " 32 ఐటమ్స్ చూడండీ!" అంది రాగానే అత్తగారితో "అవును. ఉన్నాయే! కానీ.." అనగానే "మరింకేంటి? మా సుజాత చెప్పింది. అన్నీ వదలకుండా తెస్తారని" అంటూ ఒక్కో ప్యాకింగ్ ఓపెన్ చేయసాగింది కిచెన్ ఐటమ్స్ కోసం. అందులో ముందుగా ఉన్న రెండు మూటలు విప్పి.. "అమ్మో! మళ్లీ మొదలు!" అంటూ గట్టిగా అరిచింది. "ఏమైంది" అంటూ పరుగెత్తుకుని ఆ రూమ్ లోకి వచ్చారు అప్పుడే వచ్చిన పిల్లలు, శశికాంత్. అక్కడ.... "రెండు మూటల్లో పురుగులతో ఉన్న చెత్తమూటలు" ఆ పక్కనే చతికిలపడిన కమలిని "ఈ చెత్త మూటలు కూడా పెట్టి, ఆ మూటలకు కూడా డబ్బు వేసాడు వీడు. ఛా! ఎలా వచ్చాయి ఇవి" అంటూ తలకొట్టుకుంది. అప్పుడు కామేశ్వరమ్మ.. "నేను చెబుతూనే వున్నా. అవి అవసరం లేదు రా బాబూ! అది చెత్త అని. కానీ వాడు నా మాట వినిపించుకుంటేనా! అలాగే పరుగెత్తాడు. నీకూ చెప్పబోతే నువ్వూ వినిపించుకోలేదు. ఎవరిదో పడిన చెత్త మూట పక్కనే నువ్వూ పెట్టావు కదా! ఖాళీ చేస్తున్నాం కదా! ఎప్పుడన్నా తీసుకెళ్లని అంటూ. అవే ఈ మూటలు. పూచిక పుల్ల వదలము అన్నట్టుగానే చెత్తకూడా వదలకుండా తెచ్చాడు" అన్నదావిడ డస్ట్ బిన్ లో కిచెన్ వాష్ బేసిన్ కింద పెట్టింది. అందులోనుంచి బొద్దింక బయటకు వెళ్ళింది. అసలే అవంటే అసహ్యం కమలినికి. బయట ఎక్కడైనా పడేద్దామని చూసింది. ఎక్కడో అర్థం కాలేదు. అవి పట్టుకుని కిందకు వెళ్లి వాచ్ మెన్ ని అడిగితే ఓ ప్లేస్ చూపించాడు. అక్కడ పెద్ద చెత్తకుండీ ఉంది. అది నిండిపోయి బయట కూడా పడిపోయి ఉంది. అసహ్యం వేసింది. తను కూడా తెచ్చిన ఆ మూటలు వేసి, ఫ్లాట్ కి వచ్చింది. ఎలాగో కొద్దిగా సర్ది, వంట చేసేసింది దొరికినంతలో తీసుకుని. అలా డిన్నర్ చేసి విశ్రమించారు. *** మరునాడు లేచి ఫ్రెష్ అయి, కాఫీ తాగుతూ బాల్కానీ వైపు చూసింది. బాల్కానీ ఎదురు ఫ్లాట్ బాల్కనీ ఉంది. ఆవిడ ఏదో జాబ్ చేస్తుందట. ఆవిడ జుట్టు దువ్వుకుంటూ చేతికి వచ్చిన జుట్టును అలా గాలిలో వదిలేస్తోంది. అది గాలిలో ఇలా ఎగురుతూ వీళ్ళ బాల్కనీ లోకి వచ్చి పడింది. ఆమె కమలినిని చూసి ఓ చిరునవ్వు విసిరి, లోపలికి పోయింది. ఫ్లాట్ డోర్ పక్కనే ఉన్న పక్క ఫ్లాట్ వాళ్ళ డస్ట్ బిన్ నిండి, కనిపించింది. అది వీళ్ళ ఇంటి వైపే పెట్టి ఉంది. ఆవిడను అడిగితే " మా ఇంటి వద్దే కదా పెట్టుకుంది. ఎప్పుడూ ఇక్కడే పెడతాం. చెత్త తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు తీసుకెళ్తాడు" అందావిడ కొంచెం విసురుగానే "అయితే రోజూ రాడా?" అంది ఆందోళన గా "వస్తాడు. ఒక్కోసారి ఎగ్గొడతాడు" అని చెప్పింది చల్లగా "మళ్లీ మొదలు. ఈ వదలని సమస్య ఎలా వదిలించుకోవడం" అంటూ తల పట్టుకుంది కమలిని. "ఇంటి తాలూకా ఇ ఎమ్ ఐ లు వుండగానే మళ్లీ ఇల్లు మారుదామంటే ఎలా!" అని ఆలోచిస్తున్నాడు శశికాంత్. --–-***---

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి