ఆ.. నలుగురు స్నేహితులు యధావిధిగాబంగాళా మీదికెక్కి వరండా లోని బాల్కనీ వద్ద నిలబడ్డారు ఈమధ్యఇంటికి ఎదురుగా వున్నఖాలీస్థలంలోషటిల్ ఆడటానికి గుమికూడిన అమ్మాయిలను చూసి ఆనందించడం వాల్లకు నిత్యకృత్యంగామారింది.
వాల్లందరినీ అప్సరసలుగా ముద్రవేసుకున్నారువాల్ల
లేతమనసుల్లో
నిజానికి వాళ్ళు నలుగురు మంచి స్నేహితులు . ఇంజనీరింగ్ కాలేజీ లో ఫైనల్ ఇయర్ చదువుతు న్నారు. రోజూ కాలేజీ అయిపోగానే ఆ ఇంటికి రావడం మామూలు విషయం అయిపొయింది.
ఆ నలుగురు , అంటే రాజు, రమేష్, తరుణ్, వాసు లు, చదువులో మంచి తెలివైన వారే కాకపోతే ఉసిగొలిపే యవ్వనం వాళ్ళనూ బానిసలుగామార్చివేసింది.
ఆఇల్లు తరుణ్ వాల్లది. ఆ ఇంటి ముందు హాయిగా నవ్వుతూ షటిల్ ఆడుకుంటున్న అమ్మాయిలను చూస్తూ మైమరచిపోయి మరో లోకం లో తేలిపోవటం , చిన్నగా వారిగురించి చర్చించుకోవటం కాసేపటికి అవన్నీ వదిలేసి చదువుల్లో మునిగి పోవటం ఆ నలుగురి కి రోజూ జరిగే కార్యక్రమం.
" అదుగో ఆ ఎరుపు రంగు డ్రెస్ అమ్మాయి చాలా బాగుంది. ఏమి అందం ?! "అన్నాడు రమేష్ ,అర మోడ్పు కళ్ళతో .
" సరే కానీ ,,ఆ మెరూన్ డ్రెస్ అమ్మాయిని మాత్రం ఎవరూ చూడకండి ..నేను సెలెక్ట్ చేసుకున్నా " అన్నాడు రాజు నవ్వుతూ కొంటెగా .
" అందరి కంటే పసుపు డ్రెస్ అమ్మాయి సూపర్ , మీకు వదిన లాంటిది అటు మాత్రం చూడకండి ", అని పకపకా నవ్వాడు వాసు.
" వాళ్ళ పేర్లు కిరణ్మయి, రమ ,రాణి అని మీకుతెలుసా ?"అన్నాడు తరుణ్.
ఇంతలో లోపలి నుండీ తరుణ్ తల్లి శాంత బయటకు వచ్చి " అలా ఎంత సేపుంటారు బయట, లోపలికివచ్చి కూర్చోండి " అని చిన్న గా గద్దించింది .
" ఇదుగో పిన్ని, వస్తున్నాం " అంటూ స్నేహితులందరూ తరుణ్ వెనకాల మెల్లగాఅడుగులు వేశారు.
మరుసటి రోజు సాయంకాలం తరుణ్ బంగాళా మీద నుండీ తమనే చూస్తున్న ఆ నల్గురు స్నేహితులను గమనించ సాగింది కిరణ్మయి. తాముఆడుకుంటున్నంత సేపూ వాళ్లక్కడే నిలబడి తమను నఖ శిఖ పర్యంతం చూస్తున్నారని వాల్లందరికీ అర్థం అయ్యింది .
" అబ్బా..వాళ్లలా గుచ్చి గుచ్చి చూస్తుంటే , ఆడటం ఇబ్బందిగా వుందే " అంది రమ , కిరణ్మయి వేపు చూసి.
" అవును "అంది రాణి ఇబ్బందిగా మొహం పెడుతూ.
" పర్వా లేదు ..చూస్తే మనకేంటి బాధ . నువ్వటు చూడకుండా ఆట మీద దృష్టి పెట్టు " అంది బ్యాట్ బాల్ తీసుకుంటూ కిరణ్మయి.
తరుణ్ ఇంటి బాల్కనీ లో నిలబడ్డ ఆ..నల్గురు ఎదురుగా ఆడుతున్న ఆడపిల్లల్నిచూసి ఎప్పటిలాగా మౌనంగా ,గమనించీ గమనించ నట్లుగా నవ్వులు రువ్వుతున్నారు.
అంతలో రమేష్ అన్నాడు " మనమి లా నిలబడి వాళ్ళను చూపులతో తినేయటం బాగా లేదురా , లోపలికెళదాం పదండి "
అది విని చిరాకుగా మొహాలు పెట్టి రమేష్ కేసి చూసారందరూ.
" ఒరేయ్ నువ్వో ప్రవరాఖ్యడిలాగా పోజు దొబ్బకు ..కావాలంటే నువ్వెళ్లు లోనికి " అన్నాడు విసుగ్గా వాసు.
దాంతో మిగతా అందరూ పెద్దగా నవ్వేశారు.
వీళ్ళ నవ్వులు విని ,తననే ఎవరో చూస్తున్నట్లనిపించి ఆడుతున్నదల్లా వీరి వేపు ఒక సారి తీక్షణంగా చూసింది కిరణ్మయి.
కిరణ్మయి వీళ్ళను చూడగానే నవ్వు ఆపేసి మౌనంగా నిలబడి పోయారు తరుణ్,వాసు, రాజు.
" మనం తననే చూస్తున్నట్లుగా ఆ అమ్మాయి కి ఎలా తెలిసిపోయిందిరా !" అడిగాడు తరుణ్. అతడి మొహం లో కంగారు,ఆశ్చర్యం కనపడుతూ వుంది. .
అప్పుడు ,కొద్దిగా నవ్వి అన్నాడు రమేష్ " అదే దేవుడు ఆడవారికి ఇచ్చిన ప్రత్యేకమైన నైపుణ్యం. వేయి మందిలో ఉన్నప్పటికీ తనను ఎవరు ఎటువేపు నుండీ చూస్తున్నారో కనిపెట్ట గలరు. వెనక నుండీ చూస్తున్నా సరే . మగాడి చూపులు శరీరం లో ఏ భాగాన్ని చూస్తున్నాయో తెలుసుకుని , అక్కడ కొంగును సరి చేసుకుంటారు. " .
" అవునురా నిజమే ! భలే ? నీకెలా తెలుసు ?" అని ఆశ్చర్యంగా చూసాడు రమేష్ వేపు తరుణ్.
" ఎక్కడో చదివాను..అంతే కాదు ఆ వరం మగాడికి లేదు " నవ్వుతూ అన్నాడు రమేష్.
" మనకక్కర లేదు, వున్నవి చాలు " అన్నాడు కిలకిలా నవ్వుతూ వాసు. దాంతో మళ్ళీ పగల బడి నవ్వారందరూ.
మళ్ళీ ఆట మొదలు పెట్టారు అమ్మాయిలు. అక్కడ ఆడుతున్న అమ్మాయిలందరూ కాస్త చిరాకుగా వీళ్ళనే చూస్తున్నట్లు అనిపించి కాసేపటికి నలుగురు స్నేహితులు మొహాలు చూసుకుని , ఇహ చాలు అని ఇంట్లోకి వెళ్లి సోఫాలో వాలి పోయారు.
"అందరిలోకి కిరణ్మయి అనే అమ్మాయి భలేగా వుందిరా " అన్నాడు రాజు.
" ఎవరూ ? మనవైపు ఎక్కువగా చూస్తూ వుంది ఆ అమ్మాయేనా ? " .ఉత్సాహంగా అడిగాడు వాసు.
" అవును ఆ అమ్మాయే , కానీ ఆ అమ్మాయి నన్ను చూస్తూ వుంది . మిమ్మల్ని కాదు " అన్నాడు తరుణ్.
" ,ఏడ్చినట్లుంది.... మీ మొహాలుమీరూనూ. తాను ఎవరినీ చూడటం లేదు . మన నవ్వులూ అవీ చూసి భరిస్తూ వుంది , పట్టించుకోకుండా " అన్నాడు విసుగ్గా రమేష్.
మరుసటి రోజు కిరణ్మయి ఆటలో పాయింట్ కొట్టగానే "నైస్ " అని , కిరణ్మయి ఇటు చూడగానే బొటన వేలు చూపాడు తరుణ్.
అది చూసి సంతోషంగా కిరణ్మయి కూడా చిరు నవ్వు నవ్వి తరుణ్ కేసి చూసి చేయి ఊపి , తిరిగి ఆటలో మునిగి పోయింది.
వెంటనే మిగిలిన ముగ్గురు తరుణ్ వేపు ఈర్ష్యగా చూసి " దొంగ వెధవ ..నీ అదృష్టం పండిన్ది" అంటూ తరుణ్ వీపు మీద చేతులతో టపటపా బాదేశారు.
వారం రోజులతర్వాత ఒక రోజు ,ఆటలో,రమ మాంచి షాట్ కొట్టగానే వాసు ధైర్యం చేసి "ఎక్సలెంట్ " అంటూ అరిచాడు .
ఆడుతున్న రమ ఒక సారి వాసు ను చూసి నవ్వుతూ బొటన వేలు పైకిచూపిన్చిన్ది.
అది చూసి మిగిలిన స్నేహితులందరూ సంతోషం తో వాసు కి చేతులు కలిపి "కంగ్రాట్స్ ! లైన్ కలిసింది ,మొత్తానికి మంచి గర్ల్ ఫ్రెండ్ ను కొట్టేసావు !" అన్నారు.
" మీరు తొందర పడి సంతోషించకండి..వాళ్ళేదో ఆటలో మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు. అంతే ,అనవసరంగా అతిగా ఊహించుకోకండి " అన్నాడు రమేష్ సీరియస్ గా.
" అబ్బా వీడొకడు ,అన్నింటికీ అనుమాన పక్షి " అన్నాడు వాసు
"కిరణ్మయి మాత్రం నాకు లైన్ వేస్తోందని అనుమానం ." అన్నాడు తరుణ్ గోర్లు కొరుక్కుంటూ.
"నాకూ అంతే , రమకు నేనంటే ఇష్టం లాగుంది " అన్నాడు వాసు మునిగడ్డం తడుముకుంటూ.
" అయితే మీరిద్దరూ పార్టీ బాకీ " అన్నాడు రాజు. సంతోషంతోఎగిరిగంతేస్తూ.
నిరాసక్తతో చూసాడు వాళ్లందరినీ రమేష్.
ఆ రాత్రి చాలా సేపటి వరకూ రమ , కిరణ్మయి ల గురించే మాట్లాడుకుంటూ పడుకున్నారు ఆ.. స్నేహితులు . వాసు, తరుణ్ మాత్రం ఆ రోజు సరిగ్గా నిద్ర పోలేదు.
మరుసటి రోజు సాయంత్రం యధావిధిగాచాలా ఉత్సాహంగా బాల్కనీ చేరారు నలుగురు స్నేహితులు.
ఎప్పటి లాగే అమ్మాయిల ఆటనువాల్లు ఆత్రంగా,సంతోషంగా చూస్తున్నారు. అప్పుడే అక్కడికి స్కూటీ నడుపుకుంటూ వచ్చింది రాణి
కాస్త దూరంగా వున్నప్పుడే కాళ్ళు కింద రోడ్ మీద ఆనించి స్కూటీని ఆపడానికి ప్రయత్నిస్తూ షటిల్ గ్రౌండ్ వరకూ అలాగే కాళ్లతో ఆపుతూ వచ్చేసింది.
అది గమనించిన రాజు " ఆ రాణి ని చూడండి , స్కూటీకి బ్రేకులు లేనట్లుంది ,స్కూటీని ఎలా ఆపుతుందో కాళ్లతో ...పాపం ,గమనించారా ?" అన్నాడు.
" రాణి మాత్రమే కాదు, చాలా వరకు అమ్మాయిలు అంతే. అదే కాదు ,స్టార్ట్ చేసిన తర్వాత కూడా కాళ్లతో ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు, అంతే కానీ ఆక్సిలేటర్ ఎక్కువ ఇవ్వరు. దానికి కారణమేంటో అర్థం కాదు ఎవరికీ " అని నుదురు కొట్టుకుంటూ నవ్వసాగాడు రమేష్.
అందరూ అవునంటున్నట్లుగా రమేష్ వేపు చూసి నవ్వి " నిజమేరోయ్ " అని వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. .
ఆ రోజు రాత్రి తరుణ్ ఇంట్లో భోజనాలు చేశారు స్నేహితులందరూ.
" అంతా బావుంది కానీ మన ప్రేమలు ముందుకు సాగటం లేదు " తల గోక్కుంటూ నిరాశగా అన్నాడు వాసు.
" అవును , మనం వారి సెల్ నెంబర్ సంపాదించాలి." ఒక నిశ్చయానికొచ్చినట్లుగా అన్నాడు రాజు.
"లేదా వాళ్ళ కు మన నంబర్లు ఇవ్వాలి " నింపాదిగా అన్నాడు తరుణ్
ఈ విధంగా భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకుని తృప్తిగా నిద్ర పోయారు అందరూ.
ఆ రాత్రి స్వప్న లోకాలలో విహరించారు. మొత్తానికి నలుగురు స్నేహితులు ప్రతిరోజూ అల్లా నిలబడి అమ్మాయిలతో నవ్వుతూ , చిన్న చిన్న మాటలు కలపడం మొదలుపెట్టారు.
దూరంగా వస్తున్న వాసు, తరుణ్ ను చూసి అంది రమ " ఈ అబ్బాయిలందరూ మనల్ని చూడగానే తల దువ్వుకోవడం, టక్ సర్దుకోవటం ఎందుకో "
" అంతే కాదు కొంకర్లు తిరిగి పోతారు కూడా " అని పకపకా నవ్వింది కిరణ్మయి
స్నేహితులు నలుగురు ,మరి కొద్దీ రోజుల్లో డాబా నుండీ కిందకు దిగి వారి దగ్గరలో నిలబడి స్నేహం పెంచుకోసాగారు. అలా కొద్దీ రోజుల తర్వాత వారితో కలిసి గేమ్స్ కూడా ఆడటం మొదలు పెట్టారు. సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిల తో కలిసి ఆడుతుంటే వారికి జీవితం రంగుల కల లా గా అనిపించింది .
" పరీక్షలు అయిపోయిన తర్వాత సమయం చూసుకుని నేను ప్రపోస్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులైనప్పటికీ రాణి ఎక్కడా బయట పడటం లేదు ..ఏమంటార్రా ?" స్నేహితులందరి ని చూసి అన్నాడు రాజు.
అది విని నవ్వి మిగిలిన అందరూ రాజు కి సమాధానంగా " మాకూ అదే జరుగుతోంది , వాళ్ళు సిగ్గు పడి అసలు విషయం ఏ మాత్రం బయట పెట్టటం లేదు. కాబట్టి మేమూ అదే చేస్తాం లేవోయ్ , కంగారు పడకు " అని నవ్వాడు తరుణ్.
" మగవాళ్లకంటే ఆడవాళ్ల మెదడు పది శాతం చిన్నది కానీ తెలివి లో సమానం తెలుసా ? జాగ్రత్తగా వుండండి. తొందర పడి బయట పడకండి " అన్నాడు రమేష్.
అది విని అందరూ రమేష్ వేపు చూసి ఆలోచనలో పడ్డారు.
ఒక రోజు సాయంత్రం గేమ్ ఆడి అలసి పోయి కూర్చున్న తరుణ్ ను చూసి అడిగింది కిరణ్మయి " రేపు ఇంట్లో వుంటారా మీరు ?"
అది విని ఏమంటారు అన్నట్లుగా మిగిలిన ముగ్గురు స్నేహితుల వేపు చూసి , వాళ్ళు సరేనని తలలూపగానే మళ్ళీ కిరణ్మయి వేపు చూసి " ఓకే. ఉంటాము " అన్నాడు చిరునవ్వుతో.
మరుసటి రోజు టిఫిన్లు చేసేసి అందరూ తరుణ్ ఇంటికి చేరి లోపలి గదిలో వున్న పెద్ద మంచం మీద ఒకరి మీద మరొకరు ఒరిగి పడుకుని కాలేజీ విశేషాలు చెప్పుకుంటూ నవ్వుకోసాగారు.
ఇంతలో ముందు గది లో అమ్మాయిల గాజుల,గజ్జెల చప్పుడ్లు వినిపించాయి.
దాంతో వీరి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అందరూ ఉలిక్కిపడి లేచి కూర్చొని సంతోషం తో ఉప్పొంగి పోయారు.
"మొత్తానికి మన ఇంట్లోకి మనల్ని వెతుక్కుంటూ వచ్చేసారు. అదీ మన స్పెషలిటీ." గుసగుసగా అన్నాడు రాజు.
ఆడపిల్లలరాకనుగమనిన్చి-
బయట గదిలో కూర్చున్న తరుణ్ తల్లి శాంత . " ఆఁ ...కిరణ్, రాణి, రమా.. రండి రండి లోనికి. ఏవిటి ఈ రోజు అమ్మాయిలందరూ మా ఇంటికి వచ్చేసారు." అనిగల గలా నవ్వుతూ లోనికి ఆహ్వానించింది శాంత.
లోపల స్నేహితులందరూ కంగారుగా లేచి నుంచొని వొంటి మీది బట్టలు సర్దుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో చూసుకుంటూ తల వెంట్రుకలు దువ్వుకొని, అక్కడున్న పెర్ఫ్యూమ్ స్ప్రే కొట్టుకున్నారు.
" కంగారు పడకండి వెధవల్లారా , మనం చాలా డిగ్నిఫైడ్ గా ప్రవర్తించాలి." అన్నాడు మెల్లిగా వాసు.
" నచ్చింది మల్లె చెండు ,వచ్చింది గర్ల్ ఫ్రెండ్ " అంటూ పాటపాడ సాగాడు తరుణ్ .
అందరూ సంతోషం తో శృతికలిపి,గంతులు వేయ సాగారు.
"ముందుగా నే వెళతాను "అన్నాడు వాసు మొహానికి పౌడర్ అద్దుకుని .
" నీ మొహం , ముందు నే వెళ్లి పలకరిస్తాను ఆ తర్వాత మీరు రండి " అన్నాడు రాజు తన కాలర్ సరి చేసుకుంటూ
ముందు గది లో అమ్మాయిలందరూ కూర్చోగానే " ఏంటి సంగతి " అంది శాంత వారి చేతుల్లో వున్న డబ్బాలు చూసి, ఉక్కిరి బిక్కిరి అవుతూ.
" అవునండీ పిన్ని గారు..అన్నయ్యలు లేరా ?ఎక్కడున్నారు, లోపలున్నారా?, ఒకసారిపిలవరూ.." అన్నారు కిరణ్, రమ, రాణి ఒక్కటేమారు.
అది విన్న శాంత, లోపలి గది వేపు చూసి ", ఒరేయ్ బయటికి రండి, ఏం చేస్తున్నారు లోపల ,మీ కోసం ఎవరొ వచ్చారు."అంది
లోపలనుండి సమాధానం రాలేదు . లోపలి గది లో భయంకర మైన నిశ్శబ్దం తాండవించింది .
రమేష్ చేత్తో నోరు మూసుకుని నవ్వసాగాడు. ఏవరి మొహాల్లో నూ నెత్తురు చుక్క లేదు. అందరూ కొయ్య బొమ్మల్లాగా ,మాటలు లేకుండా మ్రాన్పడి నిలబడి పోయారు .
కొద్దినిముషాల్లో ఆనలుగురు అబ్బాయిల ముంజేతులకు రంగురంగుల రాఖీలు వెక్కిరిస్తూకనిపించాయి.
బయట రేడియోలో " అన్నా నీ అనురాగం, ఎన్నో జన్మల పుణ్య ఫలం " అన్నపాటకడుశ్రావ్యంగా
వినిపిస్తోంది !!