రత్నమంజూష - శింగరాజు శ్రీనివాసరావు

Ratnamanjoosha

"ఏంటమ్మా. నాన్న ఏది అడిగానా కాదని తప్ప, ఒక్కసారి కూడ అడిగింది కొనివ్వడు" విసుక్కుంటున్నాడు ఆర్య. "నువ్వు అడిగింది ఏమైనా పది రూపాయల వస్తువా. ఎనభైవేల మోటారుబైకు. నీ చదువుకే ఎంత ఖర్చవుతున్నదో తెలుసా. ఇంకా నువ్వు ఖరీదైన బట్టలు, బైకులు అంటే ఎక్కడ తేగలడురా. సైకిలు కొనిచ్చాడు కదా. చదువుకునే వాడికి చదువు మీద ధ్యాస ఉండాలి గానీ, ఇలా లగ్జరీల మీద కాదురా" కొడుకును మందలించాలని చూసింది జానకి " నీకు సెల్ ఫోను కావాలి. నాకు మాత్రం బైకు అక్కరలేదు. ఒక్కసారి కాలేజికి వచ్చి చూడు. అందరూ కార్లలో వస్తున్నారు. ఆఖరుకు నాలాంటి టికాణా లేని మధ్యతరగతి వాళ్ళు కూడ బైకుల మీద వస్తున్నారు. నేనే ఆ డొక్కు సైకిలు వేసుకుని వెళుతున్నాను" చిందులు తొక్కుతున్నాడు. "నీకు కాలేజి దూరం కాకూడదనే కదురా, శక్తికి మించిన అద్దె పెట్టుకుని నీ కాలేజికి దగ్గరలో ఇల్లు తీసుకున్నాడు మీ నాన్న" సర్ది చెప్పబోయింది. "ఇదుగో ఈ సంజాయిషీలు నాకు అనవసరం. వచ్చే నెలకల్లా నాకు బైకు కొనివ్వాల్సిందే. చేతిలో డబ్బులు లేకపోతే బ్యాంకులోను తీసుకుని కొనమను. ఈయనేమన్నా 'ఆ..నలుగురు' సినిమాలో రాజేంద్రప్రసాద్ అనుకుంటున్నాడేమో, అప్పులు చేయకుండా ఉండడానికి. అది సినిమా అనిచెప్పు. అందరు తండ్రులలా ఉండమను. అంత ప్రత్యేకంగా ఉండనక్కర లేదు. ఇదిగో లోను పెడతాడో, లేక నీ నగలే తాకట్టు పెడతాడో నాకనవసరం. నాకు వచ్చే నెలకల్లా బైకు కొనివ్వాలి. అంతే" "ఒరేయ్ నా మాట వినరా..." అంటున్న జానకి మాటలు చెవికెక్కించుకోకుండా విసురుగా వెళ్ళిపోయాడు ఆర్య. ఇదంతా స్పష్టంగా వినిపించింది అప్పుడే షాపునుంచి వచ్చి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్న భానుమూర్తికి. వంటగదిలో ఉన్న తల్లీకొడుకులకు అతను వచ్చిన అలికిడే తెలియలేదు. కొడుకు మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి భానుమూర్తి గుండెకు. పెళ్ళయిన పది సంవత్సరాల తరువాత పుట్టాడని ఎత్తుకెత్తుగా పెంచుకున్నాడు. చేసేది బంగారపు షాపులో మేనేజరు ఉద్యోగమైనా, ఉన్నంతలో అన్నీ సమకూరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆర్య ప్రవర్తన చూస్తుంటే అచ్చు చిన్నతనంలో తన ప్రవర్తన లాగే అనిపించసాగింది భానుమూర్తికి. ఇప్పుడిప్పుడే తండ్రి స్థానం అంటే ఏమిటో అర్థమవుతున్నది అతనికి. మనసు గతంలోకి జారింది. ***** "అమ్మా. ఎన్నాళ్ళు ఎదురుచూడమంటావే ఈయన కొనిచ్చే సైకిలు కోసం. చెప్పి ఆరునెలలయింది. ఇప్పటివరకూ అతీగతీ లేదు. నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళడం నాకు నామోషీగా ఉంది. నాకు చదువు వద్దు, పాడూ వద్దు. చదువు మానేసి ఆయనలాగే ఏదో ఒక కొట్లో గుమాస్తాగా చేరుతాను" తల్లితో బెదిరింపు రాయబారానికి దిగాడు భానుమూర్తి. అతనికి తెలుసు ఎక్కడ మీటనొక్కితే అక్కడ లైటు వెలుగుతుందో. వనజకు భయం వేసింది, కొడుకు ఎక్కడ అలిగి చదువు మానేస్తాడోనని. "భానూ. అంత హడావుడి చేస్తే మీ నాన్నగారు మాత్రం ఎక్కడ తెస్తాడురా. కొంచెం ఓపికబట్టు. నేనే ఏదో ఒకటి చెప్పి నీకు సైకిలు కొనేలా చేస్తాను. నువ్వు చదువు మానుకోకు" బ్రతిమలాడింది వనజ. "నీ మీద నమ్మకంతో వెళుతున్నా. నెలాఖరులోగా సైకిలు కొనివ్వకపోతే చదువు మానేసేది ఖాయం. బాగా గుర్తుపెట్టుకో" అని తల్లికి వార్నింగు ఇచ్చి వెళ్ళాడు భానుమూర్తి. ****** గతం గుర్తుకు వచ్చి మనసుకు బాధ అనిపించింది. కొడుకు స్థానంలో ఉన్నపుడు తండ్రి చేతకానివాడులా అనిపించాడు. అదే తండ్రి స్థానానికి వచ్చేసరికి కొడుకు మాట్లాడే మాటలు శూలాల్లా అనిపించాయి. ఆరోజు తను ఎలా తండ్రిని బాధపెట్టాడో, ఈరోజు తన కొడుకుకు కూడ అలాగే ప్రవర్తించాడు. తండ్రి పటం దగ్గరకు వెళ్ళాడు భానుమూర్తి. "నాన్నా. నా చిన్నతనంలో నిన్ను ఎంత బాధపెట్టానో ఇప్పుడు నాకు తెలుస్తున్నది. కానీ ఏంలాభం. నువ్వు బ్రతికివున్నంత కాలం నీ విలువ నాకు తెలియలేదు. నాకే కాదు నాన్నా ఏ బిడ్డకూ తెలియదు. తెలిస్తే ఏ కొడుకూ తన తండ్రిని క్షోభపెట్టడు. నన్ను క్షమించు నాన్నా" తండ్రి ఫొటోను చూస్తూ తన మనసులోని ఆవేదనను వెళ్ళగక్కాడు భానుమూర్తి. "ఏమండీ. ఎప్పుడొచ్చారు" అంటూ వచ్చిన జానకి భర్త కంట తడిచూసి చలించింది. "మామయ్య గారు గుర్తుకు వచ్చి బాధపడుతున్నారా" "లేదు. ఆయన మాకోసం పడిన శ్రమ గుర్తుకువచ్చింది" "ఆర్య నాతో అన్న మాటలు విన్నారా" మౌనంగా ఉన్నాడు భానుమూర్తి. "బాధ్యత తెలియని వాడి మాటలు పట్టించుకోకండి. ఆవేశంలో అలా అన్నాడు కానీ, వాడికి మాత్రం మన ఇబ్బందులు తెలియవా" "తెలియవు జానకీ. ఆ వయసు అలాంటిది. నేనుకూడ ఆ వయసును దాటి వచ్చిన వాడినే కదా" "అలాగని వాడు అడిగిందల్లా చేసుకుపోతామా. మన తాహతు చాలవద్దా" "అవన్నీ వాడికి పట్టవు. తనతోటి వాళ్ళలాగే తనూ ఉండాలని అనుకుంటాడు. అలా ఉండలేని పక్షంలో, చేతగాని తండ్రి కడుపున పుట్టాననే అనుకుంటాడు తప్ప, మన స్థితిని అర్థం చేసుకోడు. అది వయసు ప్రభావం. అంతే" "అయితే ఇప్పుడేం చేద్దామంటారు" "మా షాపు యజమానిని అడిగి అప్పు తీసుకుని, వాయిదాల పద్ధతిలో తీరుస్తానంటాను. ఆయన సామాన్యంగా కాదనడు" "అప్పు చేసే అలవాటు లేని మీరు ఇలా.." "అన్నీ ఉన్నవాడికే పద్ధతులు చెల్లుతాయి జానకీ. నాలాంటి దిగువ మధ్యతరగతి వాడికి కాదు. కట్టుకున్న నేరానికి నీకు తప్పదుకానీ, వాడికి నా పద్ధతులతో అవసరం ఏమిటి. వాడికి కావలసినది వాడికి సమకూర్చాలి. అంతే" "వద్దండీ. మీరు అప్పులు చేసి వాడి గొంతెమ్మ కోరికలు తీర్చవద్దు. నేను వాడికి ఎలాగోలా సర్ది చెబుతాను" "వద్దు జానకీ. ఇప్పటికే వాడి దృష్టిలో నేనొక అసమర్థుడిని. ఇలా వాడు అడిగిన ప్రతిదానిని కాదని, వాడి దృష్టిలో మరీ దిగజారిపోలేను" "ఏమండీ...మీరలా బాధపడకండి" జానకి మాటలు పూర్తి కాకముందే గడప దాటిపోయాడు భానుమూర్తి. ఇరవై సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పైసా అప్పు ఎవరినీ అడగకుండా కాపురాన్ని నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఈనాడు కొడుకు రూపంలో అతనికి వ్రతభంగం జరగబోతున్నది. ****** రాత్రి పదిగంటలు కావొస్తున్నది, కానీ భానుమూర్తి ఇంటికి రాలేదు. జానకికి కంగారు ఎక్కువయింది. 'అప్పుకోసం షాపు యజమాని దగ్గరకు వెళ్ళివుంటే ఇంతసేపు ఏంచేస్తున్నాడు. ఆయన ఇవ్వనంటే వేరే ప్రయత్నమేమైనా చేస్తున్నాడా, లేక ఎక్కడా అప్పు పుట్టకపోతే ముఖం చూపించలేక ఏదైనా.. ఛ.ఛ. అంతటి పిరికివాడు కాదు ఆయన..' ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు జోరీగల్లా మూగుతున్నాయి జానకి మెదడులో. ఇంతలో సెల్ ఫోను మ్రోగింది. ఈ సమయంలో ఎవరబ్బా...ఆయనేనేమో.. అనుకుంటూ వెళ్ళి ఫోను తీసింది. "హలో భానుమూర్తి గారి ఇల్లేనా..." అవతలి స్వరం. "అవునండీ. మీరు.." "భానుమూర్తి గారికి యాక్సిడెంటు జరిగింది. మనిషి పరధ్యాసగా నడుస్తూ వచ్చి నా కారుకు గుద్దుకుని క్రిందపడ్డాడు. అతని ఫోనులో నెంబరు చూసి మీకు ఫోను చేస్తున్నాను. అతనికి మోకాళ్ళ దగ్గర గాయమైంది. ప్రమాదమేమీ లేదు. నేనే ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించాను. మీరు వెంటనే బయలుదేరి రండి" అని ఆసుపత్రి అడ్రసు చెప్పి ఫోను పెట్టేశాడు అతను. కంటతడి తుడుచుకుంటూ కొడుకును తీసుకుని ఆసుపత్రికి బయలుదేరింది జానకి. ******* "మనిషి ప్రాణానికి ప్రమాదమేమి లేదమ్మా. కొద్దిగా మద్యం సేవించడం వలన, తనకు తెలియకుండానే వచ్చి కారుకు గుద్దుకున్నాడు. ఆ కారతను ఎవరో చాలా నెమ్మదస్తుడులా ఉన్నారు. జాగ్రత్తగా తెచ్చి ఆసుపత్రిలో చేర్చి, కొంత ఫీజు కూడ చెల్లించి వెళ్ళారు. మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి" అని చెప్పాడు డాక్టర్. "హలో డాక్టర్ యశ్వంత్. భానుమూర్తికి వైద్యం చేస్తున్నది ఎవరు?" అంటూ డాక్టరును పలకరించాడు ఇంతలో ఒకతను. "హలో ప్రభాకర్. ఏంటి మీరిలా వచ్చారు. భానుమూర్తి నా పర్యవేక్షణలో ఉన్నాడు. ఇంతకూ అతను మీకెలా తెలుసు" "అతను మా షాపు మేనేజర్. ఎవరో ఇప్పుడు ఫోనుచేసి అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆసుపత్రి అడ్రసిచ్చారు. వెంటనే బయలుదేరి వచ్చాను. ఇప్పుడెలా ఉన్నాడు? డబ్బుకోసం ఆలోచించకండి. ఎంత ఖర్చైనా నేను ఇస్తాను" "ఓకె. ఓకె. ఏమంత ప్రమాదం లేదు. ఏదో చిన్న చిన్న గాయాలు. అంతే. రేపటికల్లా తగ్గిపోతాయి. అయినా ఇంత చిన్నదానికి నువ్వు రావాలా.. జస్ట్ ఫోనుచేస్తే నేనే చూసుకునే వాడిని కదా" "అతను మామూలు మేనేజరయితే అలాగే చేసేవాడిని. కానీ అతను నా వ్యాపారానికి మూలస్తంభం. నిజాయితీ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. అతని వంటి మేనేజరు మరల నాకు దొరుకుతాడనే నమ్మకం నాకు లేదు. అతను నా కుటుంబంలోని వ్యక్తిలాంటి వాడు యశ్వంత్. అందుకే ఉన్నపళంగా వచ్చాను. సరే. ఇంతకూ ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పారా.." "ఆఁ. ఆ కారు యజమానే చెప్పారట వాళ్ళకు. వాళ్ళూ వచ్చారు. ఇదిగో వీళ్ళే.." అంటూ జానకి వాళ్ళను చూపించాడు డాక్టర్ యశ్వంత్. "ఓకే యశ్వంత్. నేను భానుమూర్తిని చూసి తరువాత నీ క్యాబినుకు వస్తాను" అన్న ప్రభాకర్ కు సరేనని చెప్పి వెళ్ళిపోయాడు యశ్వంత్. "ముందు మీరు వెళ్ళి చూసిరండమ్మా. తరువాత నేను, మీ అబ్బాయి వెళతాము" అని తనకు చేతులు జోడిస్తున్న జానకికి చెప్పాడు ప్రభాకర్. ఎమర్జన్సీ గదిలోకి వెళ్ళింది జానకి భర్తను చూడడానికి. ఎదురుగా ఉన్న భానుమూర్తి కొడుకును కదిలించాడు ప్రభాకర్. "నీ పేరు" "ఆర్య" "నువ్వొక్కడివేనా. తోడబుట్టినవారు ఎవరైనా ఉన్నారా" "ఒక్కడినే" "ఏం చదువుతున్నావు" "ఇంజనీరింగు మొదటి సంవత్సరం" "ఇంజనీరింగులో ర్యాంకు ఎంత" మౌనంగా ఉండిపోయాడు ఆర్య. "అంటే మెరిట్ స్టూడెంట్ కాదన్నమాట" సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు ఆర్య. "మీ నాన్నగారిని ఏదైనా కావాలని అడిగావా ఈమధ్య" తల పైకెత్తి మరల నేలవైపు చూడసాగాడు. "అడిగేది నిన్నే" ప్రభాకర్ కంఠంలోని గాంభీర్యానికి వణికిపోయాడు ఆర్య. "ఏమీ అడగలేదు" చప్పరించాడు. "నిజం చెప్పు" "మోటరుబైకు కావాలని అడిగాను" మెల్లగా చెప్పాడు ఆర్య. "మెరిట్ తెచ్చుకోని నిన్ను ఇంజనీరింగు చదివించడానికి నీ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా.. నా దగ్గర చేరినప్పటి నుంచి తనకు నేనిచ్చే జీతంలో నెలకు కొంతసొమ్ము పొదుపు చేసి, తను తినీ తినక నిన్ను చదివిస్తున్నాడు. అది తెలుసా నీకు.." నేలచూపులు చూస్తున్నాడు ఆర్య. "ఏం బిడ్డలురా మీరు. పాతికేళ్ళుగా నా దగ్గర పనిచేస్తున్న మీ నాన్న, రాత్రి నా దగ్గరకు వచ్చి ఎనభైవేలు అప్పు కావాలని అడిగాడు. ఏనాడూ నయాపైసా కూడ అప్పు అడగని మీనాన్న అలా అడిగేసరికి విస్తుపోయాను. కారణం చెప్పమని నిలదీశాను. అబద్దం చెప్పను చేతగాక, నిజం చెప్పాడు. నాకు కోపం వచ్చింది. అనవసర ఖర్చుకు అప్పు ఇవ్వడం ఇష్టంలేక ఇవ్వనని చెప్పాను. అతను మనసు నొచ్చుకుంటాడని తెలుసు. అయినా సరే ఇవ్వలేదు. ఎందుకో తెలుసా..నిన్ను చెడగొట్టడం ఇష్టంలేక. నీ ఆర్భాటం కోసం నీ తండ్రిని అప్పుల పాలు చెయ్యలేక. అయినా మీ స్తోమతేమిటో మీరు తెలుసుకోలేరా. అయినా కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికా, జల్సాగా తిరగడానికా. ఈరోజుకు నా కొడుకుకు నేను బైకు కొనివ్వలేదు. ఏం నాకు స్తోమతు లేదా. కొనిపెట్టి నా కొడుకును చెడగొట్టడం ఇష్టంలేక కొనివ్వలేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీ తండ్రుల మనసులు మీరు. తొమ్మిది నెలలు మోసిన తల్లికి మీరిచ్చే విలువ, పాతికేళ్ళు భుజాన మోసే తండ్రికి ఇవ్వలేరా? మీ పట్ల కఠినంగా ఉన్నాడని అనుకుంటారే గానీ, ఆ కఠినత్వం వెనుకు మీరు బాగుపడాలనే తపన మీకు కనిపించదా. తన రక్తాన్ని కరిగించి మీ కండలను పెంచుతాడు తండ్రి. తనకు ఉన్నంతలో మిమ్మల్ని గొప్పగా పెంచాలని తాపత్రయపడతాడు. మీకు మీరు గొప్పనుకుంటున్నారేమో. మీ విలువ 'సున్నా'. మీ ముందు మీ తండ్రి 'ఒకటి' గా నిలబడితేనే, మీరు పదిగానో, వందగానో, వేయిగానో కనిపిస్తారు. ఆ ఒకటి అనే అంకె లేనినాడు, మీ బ్రతుకులు శూన్యం. అది తెలుసుకోండి. నలుగురితో పోటీ పెట్టుకోవలసినది ఆడంబరాలలో కాదు, తెలివితేటలలో. ప్రక్కవాని కంటే నాకెందుకు ఎక్కువ మార్కులు రావు అని పోటీ పడండి. మీరు బాగుపడతారు, సమాజమూ బాగుపడుతుంది. నేను అప్పు ఇవ్వలేదని అవమానపడి, నీ తండ్రి పరధ్యానంలో పడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అతనికి జరగరానిది ఏదయినా జరిగివుంటే, మీ గతి ఏమిటి? ఆలోచించు. తండ్రి మనసు రత్నమంజాష. దానినుంచి రత్నాలు ఏరుకోవాలి గానీ, పగలగొట్టి ముక్కలు చేయకూడదు. అది ఎప్పుడూ తనమీద పడిన వెలుగును పెంచి, మీకు పంచాలి అనుకుంటుంది. వయసు మనసును కబళించకూడదు. మనసు, వయసును అధిగమించగలగాలి. అప్పుడే బంధాల విలువ తెలుస్తుంది. నీ తండ్రి నా దగ్గర మేనేజరే కాదు, నాకు తోడబుట్టిన అన్నలాంటి వాడు. అలాంటి వాడు వచ్చి డబ్బు కావాలని అడిగితే కాదనడానికి మనసు రాలేదు. కానీ నువ్వు దారితప్పకూడదనే డబ్బులు ఇవ్వనన్నాను. నా మనసు అర్థం చేసుకోలేక భానుమూర్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తప్పునాదే. ఇప్పటికీ నీకు బైకు కావాలనే అనిపిస్తే, రేపే వచ్చి డబ్బు పట్టుకెళ్ళు. అప్పుగా కాదు ఉచితంగానే. మీ నాన్నకంటే నాకు డబ్బు ముఖ్యం కాదు" ప్రభాకర్ మాటలు విన్న ఆర్యకు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన తండ్రి అంటే ఏమిటో అతనికి అర్థమయింది. ఎంత విలువైన వ్యక్తిని వ్యర్థుడిగా నిందించాడో అర్థమయింది. అవును నిజమే. తండ్రి అంటే రతనాల పెట్టె. అది పక్కన ఉంటేనే ఏ బిడ్డకయినా విలువ. లేకుంటే ఏముంది అంతా శూన్యమే. అనాథ బ్రతుకే. తప్పు తెలిసింది ఆర్యకు. ప్రభాకరం కాళ్ళమీద వాలాడు. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. "ఆర్యా. నా మాటలు నిన్ను బాధపెడతాయని తెలుసు. కానీ నీకు నిజాలు తెలియాలనే అలా మాట్లాడాను. నీది చదువుకునే వయసు. ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనయి జీవితాన్ని పాడుచేసుకోకూడదు. ఏ వయసులో చేయవలసింది ఆ వయసులో చేయాలి. బిడ్డల మీద ప్రేమతో తల్లిదండ్రులు ఈ విషయాలను అర్థమయేలా చెప్పలేక, మీరు నొచ్చుకుంటారని అడిగినదల్లా ఇస్తారు. దాని ఫలితంగా మీరు ఒక జీవితకాలాన్ని నష్టపోతారు. నీ విషయంలో అలా జరుగకూడదనే, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నీ మనసు కష్టపెట్టాను. ఏమీ అనుకోకు" ఆర్య భుజంతట్టి లేపాడు ప్రభాకర్. "తప్పు చేశాను అంకుల్. ఇక ఎప్పుడూ నాన్నను కష్టపెట్టను. ప్రామిస్" ప్రభాకర్ చేతిలో చెయ్యివేశాడు ఆర్య. "తండ్రి మనసు వెన్నరా. దాని మాధుర్యాన్ని చవిచూడండి. అంతేగానీ, మాటలతో కాల్చి కరిగి ఆవిరయ్యేలా చేయకండి" ఇంతలో జానకి బయటకు రావడంతో భానుమూర్తిని చూడడానికి లోపలికి వెళ్ళారు ప్రభాకర్, ఆర్య. కొడుకును చూసి కళ్ళు దించుకున్నాడు భానుమూర్తి. "నాన్నా..నాకు నువ్వు కావాలి. నీ అండకావాలి. అంతకన్నా ఏమీ కోరను. ప్రభాకర్ అంకుల్ కు మాటిచ్చాను. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని" అని చేతిమీద ముద్దుపెట్టుకుంటున్న కొడుకును తనివితీరా చూసుకున్నాడు భానుమూర్తి. "భానుమూర్తీ. అన్ని ఆలోచనలూ పక్కనపెట్టి విశ్రాంతి తీసుకో. బాగా తగ్గిన తరువాతే షాపుకు రా. అంతవరకు మీ ఇంటి పోషణ బాధ్యత నాది. నిశ్చింతగా ఉండు" అంటున్న ప్రభాకర్ వైపు కృతజ్ఞతతో చూశాడు భానుమూర్తి. అతని మనసుకు అర్థమయింది, ప్రభాకరం గారు తన కొడుకుకు ఏదో హితబోధ చేశాడని. మనసులోనే అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు భానుమూర్తి. ****** అయిపోయింది********

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి