మాతృ బంధం - బోగా పురుషోత్తం

Matru bandam
అన్నవరంలో అన్నపూర్ణ అనే ఓ వృద్ధురాలు ఉండేది. ఆమె ఇడ్లీ అమ్ముతూ జీవనం సాగించేది. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ ముగ్గురూ ఉదయం నిద్ర లేచి టిఫన్‌ బాక్సులు పట్టుకుని సమీపంలోని పట్టణానికి చదువుకోవడానికి వెళ్లే వారు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. దీని వల్ల ఇంట్లో ఏమి జరుగుతోందో వారికి తెలిసేది కాదు. ఇలాగే వారు ఉన్నత చదువులు పూర్తయి గొప్ప గొప్ప ఉద్యోగాలలో చేరారు. వారి భార్యలు కూడా ఉద్యోగులే కావడంతో వారు కూడా నివాసాన్ని పట్టణానికి మార్చి వేశారు.
ఇక ఆ ఇంట్లో అన్నపూర్ణ మాత్రమే మిగిలింది. ఆమె భర్త చాలా కాలం క్రితమే ఓ ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారులను పెంచి ఉన్నత చదువులు చదివించింది. ఇప్పుడు వాళ్లు జీవితంలో స్థిరపడి దూరంగా వెళ్లడంతో అన్నపూర్ణ ఒంటరిగానే మిగిలింది. తను ఎంతో కాలంగా నడుపుతున్న ఇడ్లీ కొట్టును కొనసాగించింది. కొడుకులు తనను చూసుకోలేదన్న బాధ అన్నపూర్ణకు లేదు. తను టిఫన్‌ దుకాణం నడుపుతున్నప్పుడే పైసాపైసా కూడబెట్టి లక్షలు దాచి పెట్టింది.
ఓ రోజు అన్నపూర్ణ వద్దకు చింపిరి జుట్టు.. చిరిగిన దుస్తులు ధరించిన తొమ్మిదేళ్ల బాలుడు వచ్చాడు. బాగా ఆకలితో వున్న బాలుడు తనకు ఆకలిగా వుందని రెండు రూపాయలు ఇచ్చి ఇడ్లీలు ఇవ్వమని కోరాడు. అన్నపూర్ణ విసుక్కోలేదు. బాలుడికి రెండు ఇడ్లీలు ఇచ్చింది. బాలుడు అవి తిని వెళ్లలేదు. ఇంకా ఆకలి అన్నట్లు అన్నపూర్ణ వైపు చూశాడు. అన్నపూర్ణకు బాలుడి ఆకలి అర్థమైంది. ఓ ప్లేటు నిండా పెట్టి తినమని చెప్పింది. నాల్గు రోజులుగా బాధిస్తున్న క్షుద్బాధను తీర్చుకున్నాడు బాలుడు. ఆకలి తీరి నందుకు కృతజ్ఞతలు తెలిపి తన వద్ద డబ్బులు లేవని అమాయకంగా ముఖం పెట్టాడు. అన్నపూర్ణ జాలితో బాలుడిని దగ్గరకు తీసుకుని ‘‘ ఎవరు బాబూ నువ్వు.. ఏ ఊరు? అమ్మానాన్న ఎవరు?’’ ప్రశ్నించింది.
బాలుడు తనకు ఎవరూ లేరని, అనాథ అని ఊరూరు తిరిగి ఎవరైనా దయతలచి పెడితే కడుపు నింపుకుంటానని, లేదంటే పస్తులతో గడిపేస్తానని తన దీన గాథను చెప్పాడు. అన్నపూర్ణమ్మ బాలుడిని తన వద్దే వుండి తనకు చిన్నచిన్న పనులు చేసి పెడితే ఏ లోటూ రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చింది. బాలుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణకు మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చి, టిఫన్‌ దుకాణంలో పాత్రలు తోముతూ సాయం అందించే వాడు. వృద్ధాప్యంలో వున్న అన్నపూర్ణకు బాలుడు సాయం ఎంతో మేలు చేకూర్చింది. టిఫన్‌ వ్యాపారం క్రమక్రమంగా విస్తరించింది. అబ్బాయిని క్యాషియర్‌గా నియమించింది. బాలుడికి లెక్కలు తెలియకపోవడంతో పాఠశాలలో చేర్చింది. బాగా చదివాడు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో ప్రభుత్వ అధికారులు అతడిని గుర్తించి ప్రభుత్వ ఖర్చులతో చదివే అవకాశం కల్పించారు.
అన్నపూర్ణకు బాలుడు లేని లోటు కనిపించింది. ఆమెను వృద్ధాప్యం కృంగదీసింది. ఆరోగ్యం క్షీణించింది. మంచం పట్టింది. పక్కింటి వారు ముగ్గురు కుమారులకు ఫోను ద్వారా సమాచారం అందించారు. ఉలుకుపలుకు లేదు. అన్నపూర్ణకు రోజురోజుకు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. తనను చూసేందుకు కొడుకులెవరూ రాలేదు. ఆందోళన అధికమైంది. ఎదురింట్లో ఉన్న ఓ డాక్టరు వైద్య పరీక్షలు చేసి మందులు అందించాడు. ఆమె కొంత కోలుకుంది. ఎంతకీ తనను చూసేందుకు ఎవరూ రాలేదు. ఆమె మనసు తీవ్రంగా కలత చెందింది. ఆందోళన అధికమై పక్షవాతంకు గురైంది. కొడుకుల మీద బెంగ పెట్టుకుని కలవరించసాగింది.
నెల తర్వాత పెద్ద కొడుకు చూసేందుకు వచ్చాడు. ఆమె ఆరోగ్యం గురించి అడగలేదు. ‘‘ అమ్మా..! నాకు ఆఫీసు పని వుంది.. పిల్లలు టూర్‌కు వెళ్లాల్సి వుంది.. జీతం ఇంకా రాలేదు.. ఓ పది వేలు వుంటే ఇవ్వు..’’ అని అడిగాడు.
అన్నపూర్ణ ఆలోచించలేదు.. బిడ్డమీద మమకారంతో తాను వైద్యం ఖర్చులకు దాచుకున్న పదివేలు అతని చేతిలో పెట్టింది. ‘ ఇక వస్తానమ్మా.. చిన్న తమ్ముడిని రెండు రోజులు చూసుకోమని కబురుపెట్టి పంపిస్తాను..’’ అని చెప్పి ఇంటి గుమ్మం దాటి బయటపడ్డాడు.
నాల్గు రోజులైంది.. తనను చూడటానికి ఎవరూ రాలేదు. తీవ్ర మానసిక ఒత్తిడితో పక్షవాతం ఎక్కువై కాలు, చేయి రాలేదు. అన్నపూర్ణమ్మ పైకి లేవలేని పరిస్థితి ఏర్పడిరది. ఎందరికో అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్నపూర్ణకు ఇప్పుడు తిండిపెట్టే వారే కరువయ్యారు. ఆమె దీన స్థితికి చలించిపోయిన ఇరుగుపొరుగు ఆమె కొడుకుల వద్దకు వెళ్లి ముగ్గురు కుమారులను తీసుకొచ్చారు. వారు రావడంతో అన్నపూర్ణకు ప్రాణం లేచి వచ్చినట్లు ఆనందపడిరది. వచ్చిన వారు అన్నపూర్ణమ్మ ఆరోగ్య స్థితిని పట్టించుకోలేదు.. ‘‘ సరే అమ్మా.. అదేమీ కాదులే.. మంచి వైద్యం చేయిస్తాము.. రెండు రోజులు ఆగు.. ఇంట్లో సరుకులు కొనాలి..పండుగకు పిల్లలకు దుస్తులు కొనాలి.. వుంటే ఓ 20 వేలు ఇవ్వు..’’ అడిగాడు రెండో కొడుకు.
ఆమె మోములో కన్పిస్తున్న ఆనందం ఒక్క నిమిషం కూడా నిలువలేదు.. ఆవిరైంది. దు:ఖం ఉప్పొంగింది. కంట్లో కన్నీళ్లు రాకుండా మనసులోనే దాచుకుంది. .ఉన్న 20 వేలు అతని చేతిలో పెట్టింది. మూడో కుమారుడు అక్కడి నుంచి కదలలేదు.. అమ్మ దగ్గర కూర్చున్నాడు. ‘‘ అమ్మా.. నీకొచ్చిన జబ్బు పెద్ద ప్రమాదం ఏమీ కాదు.. దిగులుపడొద్దు.. నువ్వు దాచిన డబ్బంతా ఇలా ఇవ్వు.. నా స్నేహితుడు డొకడు మంచి డాక్టరు వున్నాడు. అతని వద్ద మంచి వైద్యం చేయిస్తాను.. నువ్వు మాములుగా పైకి లేచి నడుస్తావు.. ’’ అన్నాడు.
అన్నపూర్ణమ్మ నిజమేనని నమ్మింది. బ్యాంకులో దాచుకున్న నాల్గు లక్షల డిపాజిట్ల బాండ్లు చేతిలో పెట్టింది. అవితీసుకున్న మూడో కుమారుడు అక్కడి నుంచి లేచి బయటకు నడిచాడు. అతని పక్కనే మొదటి కొడుకూ నడిచాడు. అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేదు.. వారం రోజులు దాటింది. అన్నపూర్ణమ్మకు జబ్బు మళ్లీ అధికమైంది. ఈ సారి ఇంకో కాలు పైకి రాక పూర్తిగా పైకి లేవలేకపోయింది. దీన్ని గమనిస్తున్న ఎదురింటి రైతు తన వద్ద వున్న ఎద్దుల బండి తీసుకొచ్చాడు. అతని భార్య, మరో ఇద్దరు సాయంతో అన్నపూర్ణను పట్టుకుని ఎద్దుల బండి ఎక్కించారు. బండి నెమ్మదిగా నడుస్తుంటే తన ఆలోచనలు ఒక్కొక్కటిగా ఆగిపోయాయి.
ఓ గంట తర్వాత టౌన్‌లోని పెద్ద ఆస్పత్రి వద్ద దించారు. రైతు, ఆమె భార్య కాళ్లుచేతులు పట్టి కిందికి దించారు. చక్రాల బండి తెచ్చి ఎక్కించి ముందుకు తోస్తుంటే కన్నీళ్లు పొంగుతున్నాయి.
‘‘ ఎందుకమ్మా.. ఏదుస్తావ్‌.. నీకు మేమంతా వున్నాముగా ఏమీ కాదులే..’’ ధైర్యం చెబుతుంటే ఆమె గుండె లోతుల్లోంచి అందరూ ఉన్నా అనాథగా మిగిలాన అనే ఆవేదన ఉప్పొంగింది.
రెండు గంటల తర్వాత వైద్యుడు ఆమెను పరిశీలించాడు.. పరిస్థితి సీరియస్‌గా వుంది.. ఈ ముందులు వాడండి..’’ అని ఓ ఠావు పేపరు నిండా రాసిన మందుల చీటిని పట్టుకెళ్లాడు రైతు. మొత్తం 20 వేలు అయ్యింది. ఆమె వద్ద ఐదు వేలు మాత్రమే వున్నాయి. రైతు వద్ద కూడా వెయ్యి రూపాయలే ఉన్నాయి. ఏమి చేయాలో దిక్కుతోచలేదు. ఐదువేలుకు సరిపడా మందులు తీసుకుని డాక్టరు వద్దకు నడిచాడు. వాటిని పరిశీలించి ‘‘ ఇలా అయితే జబ్బు ఎలా నయమవుతుందయ్యా..?’’ ప్రశ్నించాడు డాక్టరు.
‘‘ సార్‌.. ఆమె చాలా పేదరాలు..ముగ్గురు కొడుకులు వున్నా ఎందుకూ లాభంలేదు. మొన్న వచ్చి ఆమె వద్ద ఉన్న నాల్గు లక్షలు లాక్కెళ్లారు.. ఇక ఆమె వద్దకు రాలేదు. ఎదురింట్లో వున్న మేమే ఎద్దుల బండి మీద తీసుకొచ్చాము.. మా దగ్గర వున్నా ఖర్చు పెట్టేవాళ్లం’’ చెమర్చిన కళ్లతో అన్నాడు రైతు. అతని దీన అవస్థను చూసి డాక్టరుకు జాలేసింది. ‘‘ నేను కూడా ఏమీ చేయలేను.. మా ఆస్పత్రి అధినేత ఆ గదిలో కూర్చొని వుంటారు.. మీ బాధ విన్నవించుకోండి.. ఆదుకుంటారేమో చూడండి..’’ అన్నాడు. చిన్న డాక్టరు.
అది విన్న రైతు ఆశతో పెద్ద డాక్టరు వున్న గదిలోకి అడుగు పెట్టాడు. అది పెద్దపెద్ద అద్దాలతో వుంది. లోపల చల్లగా ఏసీ వుంది. తలుపు కాస్త బలంగా తోశాడు. కిర్రుకిర్రు అంటూ శబ్దం వస్తూ లోనికెళ్లింది తలుపు. ఎదురుగా ఎత్తైన కుర్చీపై కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు డాక్టరు శ్యాంప్రసాద్‌. ‘‘ ఏంటీ.. ప్రాబ్లం..’’ కాస్త నెమ్మదిగా అడిగాడు.
‘‘ సార్‌.. దండాలు.. మేము పేదోళ్లం.. మీతో మాట్లాడడానికి కూడా అర్హత లేని వాళ్లం.. ఓ చిక్కొచ్చి పడిరది.. మా పక్కింటి అన్నపూర్ణ ఒకప్పుడు ఇడ్లీలు అమ్మి అందరికీ అన్నం పెట్టింది. ఇప్పుడు ఆమె ఆకలితో అలమటిస్తోంది. నెల రోజుల క్రితం పక్షవాతం వచ్చి మంచం పట్టింది. ఆమెకు వున్న ముగ్గురు కొడుకులు వచ్చినా వైద్యం గురించి పట్టించుకోలేదు..నాల్గు లక్షలు డబ్బు లాక్కెళ్లారు.. ఇంత వరకూ రాలేదు.. ఆమెకు జబ్బు ఎక్కువైంది.. చూస్తూ మనసు చంపుకోలేక ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాం..మందులు కొనడానికి కూడా డబ్బులేదు.. దయచేసి ఆమెకు జబ్బు నయం చేసేలా మంచి చికిత్స ఇవ్వండి సారూ..’’ చేతులెత్తి దండం పెట్టాడు.
అన్నపూర్ణ మాట వినగానే పైకి లేచాడు పెద్ద డాక్టరు ‘‘ ఆమె ఇప్పుడెక్కడ వుంది..?’’ ప్రశ్నించాడు.
బయటకు వచ్చి ఆమె వద్దకు తీసుకెళ్లాడు రైతు.
అన్నపూర్ణ వద్దకు వెళ్లి ‘‘ అమ్మా..అమ్మా..అమ్మా..’’ అంటూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు అప్యాయంగా..
అన్నపూర్ణకు అతను ఎవరో గుర్తుకు రాలేదు.
‘‘ నువ్వు అందరూ ఉన్నా అనాథ కాదమ్మా.. నీకు నేనున్నాను... ఒకప్పుడు అనాథగా వున్న నన్ను చేరదీసి అన్నంపెట్టి చదివించావు.. ప్రభుత్వం నన్ను చదివించడంతో మంచి డాక్టర్ని అయ్యాను.. ఇదంతా మీ దీవెనతోనే సాధ్యమైంది..!’’ అంటుంటే అన్నపూర్ణ అయోమయంగా చూసింది.
‘‘ ఇక ఈ ఆస్పత్రే నీ ఇల్లు.. ఇక్కడే నిశ్చింతగా వుండొచ్చమ్మా.. ఇది మనదే..’’ అంటుంటే ఇంత ప్రయోజకుడైనా తన సాయం మరవకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
అన్నపూర్ణకు మంచి వైద్యం అందింది. పెద్ద డాక్టరు మాతృమూర్తికి సేవలు చేశాడు.
‘‘ నేనున్నాను అమ్మా..నీకేమైనా అయితే చూసుకోవడానికి నువ్వేం దిగులు పడకు..’’ అని ఓదార్చసాగాడు డాక్టర్‌.
నేనూ నీ కొడుకునేగా..’’ అంటుంటే అన్నపూర్ణమ్మ కళ్లు చెమర్చాయి. ఆ తర్వాత తన ముగ్గురు కొడుకులు వస్తారని పరితపించింది అన్నపూర్ణ. వారు రాలేదు.
ఈ సారి విషయం తెలుసుకున్న ముగ్గురు కొడుకులు ఆస్పత్రివద్దకు వచ్చారు. ‘‘ అమ్మా నువ్వీ స్థితిలో ఉన్నావని తెలియక రాలేదు..నువ్వు ఒక వేళ పోతే ఆస్తి అంతా పరుల పాలవుతుంది. వెంటనే మా ముగ్గురిపై వీలునామా రాసివ్వు..’’
అని ఒత్తిడి తెచ్చారు. అయితే అన్నపూర్ణ అంగీకరించలేదు. నా కసలు కొడుకులే లేదు.. నాకున్నది ఒకడే అనాథ.. వాడే నన్ను ఆదరిస్తాడు.. మీరెవరూ అవసరం లేదు..వాడికే నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను..’’ అని దుఖా:న్ని దిగమింగుకుని చెప్పింది అన్నపూర్ణ.
అదే సమయానికి అక్కడికి వచ్చిన డాక్టరు ఆమెను ఒడిలోకి తీసుకుని ఓదార్చుతూ ‘‘ అమ్మా కాసేపు విశ్రాంతి తీసుకో.. ఇదిగో ఈ మాత్రలు వేసుకో..’’ అంటూ వైద్య పరీక్షలు చేశాడు. అతని వెనుకే అతని వైద్య బృందం కదిలింది.
అన్నపూర్ణకు సేవలు చేయసాగారు. అది చూసి ముగ్గురు కొడుకులూ ముక్కున వేలేసుకున్నారు. తాము మాతృమూర్తిని ద్వేషంతో విస్మరించి ఎలా దూరమయ్యిందీ గ్రహించారు. అప్పటికే ఆమె ఆరోగ్యం మెరుగై అడుగులు వేయసాగింది..డాక్టరి ఆదరణ చూపుతూ వెన్నంటి అన్నపూర్ణమ్మను అడుగులో అడుగు వేయించాడు. అతని కరుణతో నెల రోజుల్లోనే ఇంటి ముఖం పట్టింది. ఆ తర్వాత అన్నపూర్ణను కంటికి రెప్పలా చూసుకున్నాడు డాక్టరు. అది కళ్లారా చూశారు ఆమె ముగ్గురు కొడుకులు.. ఆదరణ, కరుణ పేగు బంధాన్ని తెంచి మాతృ బంధాన్ని ఎలా దగ్గర చేసిందో గ్రహించారు. జీవిత చరమాంకంలో మాతృమూర్తిని నిర్లక్ష్యం చేసి క్షోభ పెట్టినందుకు వారికి జీవితాంతం ఆవేదన మిగిలింది.

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి