పాండు 5: బేటీ బచావ్ - కణ్ణన్

Betee bachaav

తెల్లారుఝాము తొమ్మిదయింది. నేలమీద పడుకుని సోఫాపైన కాళ్ళు పెట్టి నిద్రపోతున్న పాండు ఫోనులోనుంచి అణు బాంబులు పడుతున్న శబ్దాలు వెలువడడంతో ఉలిక్కిపడి లేచాడు. హైదరాబాదు నుంచి రాజిరెడ్డి ఫోన్. “పాండూ, ఒక సహాయం కావాలి“.

రెండు గంటల తరువాత పాల్వంచ పోలీస్ స్టేషనులో తనకుతానే పాండుకు మితగు, అంటే మిత్రుడు, తత్వవేత్త, గురువు (ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడుకు తెలుగు అనువాదం లేండి) అనుకునే సుందరమూర్తితో కలసి అడుగు పెట్టాడు. పాండును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజేష్. అతని కంగారు చూడగానే ఏదో పెద్ద విషయమే అని అనిపించింది పాండుకు. రాజేష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయ్. జుత్తు రేగి ఉంది. జీన్స్ ప్యాంటూ, ఒక తేనీటి చొక్కా వేసుకుని ఉన్నాడు. ఎర్ర బూట్లు చూడగానే అతనూ పోలీసనే విషయం సుందరమూర్తికి కూడా అర్థమైంది. మనిషి ఆరడుగులున్నాడు. కండలు తిరిగిన ఒళ్ళు. అంత ధృడకాయుడు కంగారు పడుతున్నాడంటే అది ఖచ్చితంగా కుటుంబ సభ్యులెవరి గురించో అయి ఉండాలి. రాజిరెడ్డి ఫోన్ చేశాడంటే ఇతను హైదరాబాదులో పని చేస్తుండాలి. పోలీసు స్టేషనులో అతను పరాయివాడిలా ఒక బల్ల మీద కూర్చోవడం చూస్తే అతని స్వగ్రామం పాల్వంచ కాదని అర్థమౌతుంది. బహుశా అత్తారిల్లు అయి ఉండాలి. లేకుంటే అతని సోదరుడో, సోదరో ఆ ఊళ్ళో ఉండి ఉండాలి. అతని పరిస్థితి చూస్తే బాగా ఆతృతలో ఉన్నట్లున్నాడు.

రాజేష్ నోరు తెరిచో లోపలే పాండు అడిగాడు “కేసు ఫైల్ అయిందా?“ అని. ఇంకా లేదన్నాడు రాజేష్. స్టేషన్ ఎస్సై కుమార్ కూడా అంతలోకి పాండు దగ్గరకొచ్చాడు. పాండు సుందరమూర్తితో “బాబాయ్, రాజేష్ ఏమీ తిన్నట్లు లేడు. తీసికెళ్ళి ఏమైనా తినిపించి, లేకుంటే టీ త్రాగించి తీసుకురా“ అన్నాడు. వివరాలు వినకుండా టీ త్రాగమంటున్న పాండును చికాకుగా చూశాడు రాజేష్.

నువ్వు ముందు టీ త్రాగి రా రాజేష్“ భుజంపై సుందరమూర్తి చేయి వేసి బయటకు తిప్పడంతో మారుమాట్లాడకుండా ఆయనను అనుసరించాడు రాజేష్.

వాళ్ళు బయటకు వెళ్ళగానే “అసలేంటి సార్ విషయం?“ మెల్లగా కుమారును అడిగాడు పాండు.

ఏమని బదులివ్వాలో అర్థంకానట్లు ముఖం పెట్టాడు కుమార్. నవ్వి “మీకు తెలిసింది చెప్పండి“ అంటూ అక్కడున్న బల్లమీద కూర్చున్నాడు పాండు. అతని ప్రక్కనే కూర్చున్నాడు కుమార్.

రాజేష్ చెల్లెలు గంగ మూడు రోజుల క్రింద ప్రసవించింది. కవలలు. ఇద్దరూ ఆడపిల్లలే. తల్లీ, బిడ్డలూ బాగానే ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలను కన్నదని భర్తకో, అత్తకో మనసులో ఉన్నా, బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. చెల్లిని చూడటానికని నిన్న వచ్చాడు రాజేష్. గంగ బాగానే మాట్లాడింది. ఉత్సాహంగానే ఉండిందట. చెల్లెలి కుటుంబంలో ఆమె, ఆమె భర్త, అత్తగారు మాత్రమే ఉంటారు. ఆమె భర్త శివుడు ఎలక్ట్రిషియన్. రాత్రి తొమ్మిదింటికే నైట్ డ్యూటీకి వెళ్ళాడు. పడక గదిలో పిల్లలతో పడుకుంది గంగ. అత్తగారూ, రాజేషూ హాల్లో పడుకున్నారు. అత్తగారికి ఆమె మంచం ఉంది కానీ, రాజేష్ నేల మీద చాప వేసుకుని పడుకున్నాడు. బావను రాత్రి డ్యూటీకి పంపిన తరువాత బయటకెళ్ళి రెండు పెగ్గులేసి వచ్చి దాదాపు పది గంటలకు పడుకున్నాడు రాజేష్. తెల్లారి ఏడింటప్పుడు బావ వచ్చి తలుపు కొడితే రాజేషే తలుపు తీశాడు. పెద్దామె ఇంకా పడుకునే ఉండింది. బట్టలు మార్చుకోడానికి తమ గదిలోకెళ్ళిన శివుడు అసహజంగా ఉన్న గంగనూ, కూతుళ్ళనూ చూసి కేకేసి రాజేషును పిలిచాడు. గంగా, పిల్లలూ ప్రాణాలతో లేరు. రాత్రి బాగున్న తల్లీ, పిల్లలు ప్రొద్దున్న చనిపోవడంతో రాజేషుకు సందేహం వచ్చింది. కానీ, ఏం జరిగిందో అతనికి తెలీదు. ఇంటిలో అతనూ, చెల్లెలి అత్తగారు సుగుణ మాత్రమే ఉన్నారు. మృతుల శరీరాలపై ఎలాటి గుర్తులూ లేవు. నిజం చెప్పాలంటే, ముగ్గురూ ఒక్క రాత్రే చనిపోవడం ఎంత యాదృచ్ఛికమన్న సంగతి తప్ప, కేసు ఫైల్ చేయడానికి కూడా ఎలాటి ఆధారాలు లేవు“.

ఒకసారి వెళ్ళి చూసొద్దామా“? పాండు లేచాడు, తనకు కుమార్ అనుమతితో అవసరం లేదన్నట్లుగా. “మనిద్దరమే పోదాంలే. రాజేషును ఇక్కడే ఉండనివ్వండి. లేకుంటే కుటుంబ పోరాటం మొదలవవచ్చు“. బయలుదేరుతూ “ఘటనాస్థలికి ఇన్స్పెక్టరుతో వెళుతున్నా. మీరు రాజేషుతో పాటు స్టేషనులోనే ఉండండి“ అని సుందరమూర్తికి సందేశం ఒకటి పంపాడు.

ఇద్దరూ కుమార్ బైకు మీద రాజేష్ చెల్లెలి ఇంటికి వెళ్ళారు. అప్పటికే ఇంటి ముందు చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిగూడారు. కొంతమంది బంధువులు కూడా వచ్చినట్లున్నారు. అంత్యక్రియల కార్యక్రమం మొదలైనట్లుంది. ఇంటి బయట చాపపై మూడు శరీరాలూ ఉన్నాయి. తల్లికి అటూ, ఇటూ చిన్నారుల శరీరాలు. తల దగ్గర దీపం. చూడడానికి చాలా గుండె దిటవు చేసుకోవాలి. సుగుణ గుమ్మం దగ్గర కూర్చుని ఉంది. శివుడు భార్యాబిడ్డల పక్కనే కూర్చుని మౌనంగా రోదిస్తున్నాడు. అసలే రాత్రి డ్యూటీ చేసి వచ్చాడాయె. ముఖం పీక్కుపోయి ఉంది.

పోలీసును చూడగానే అందరూ పక్కకు తప్పుకున్నారు. రాజేష్ పోలీస్ డిపార్టుమెంటే అయినా, అతను లేకుండా ఎస్సై ఇంకొకరితో రావడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కుమార్, పాండు నేరుగా శరీరాల దగ్గరకు వచ్చారు. ఒక నిముషం పాటు మూడు శరీరాలనూ పరీక్షగా చూశాడు పాండు. ఏమీ తేడాగా అనిపించలేదు.

రాత్రి ఏ గదిలో పడుకున్నారు?“ ఎవరినీ ఉద్దేశించినట్లు కాకుండా అడిగాడు పాండు.

శివుడు అసలు పట్టించుకోలేదు. సుగుణ మాత్రం తలెత్తి ఎందుకన్నట్లు చూసింది. ఆమె ఆలోచన గ్రహించినట్లు వాళ్ళ బంధువులలో ఒకరు “ఇప్పుడివన్నీ ఎందుకు సార్?” అన్నాడు.

అంటే సాధారణంగా ముగ్గురి ప్రాణాలు ఒకేసారి పోవు కదండీ. ప్రభుత్వపు బాధ్యతలు ప్రభుత్వానికి ఉంటాయి. ప్రభుత్వం ఏం చేసిందని రేపు మీరే అడుగుతారు“ కుమార్ జవాబివ్వడానికి ముందే కలుగజేసుకుని సర్ది చెప్పాడు పాండు. ప్రశ్న అడిగిన ఆయనకు ఏం జవాబివ్వాలో తెలీక గది చూపడానికి లోపలకు దారి తీసాడు. అతని వెనుకే వెళ్ళారు పాండు, కుమార్. హాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. హాలు కాకుండా ఇంకా రెండు గదులున్నాయి. హాలులోకి వెళ్లగానే ఎదురుగా ఆ రెండు గదుల తలుపులూ ఉన్నాయి. పాత కాలపు తలుపులు కాబోలు. బాగా దిట్టంగా ఉన్నాయి. కుడివైపున వంటగది. ఎడమవైపు పడకగది. హాలులో ఒక సోఫా, ఒక టీవీ, రెండు ప్లాస్టిక్ కుర్చీలూ ఉన్నాయి. ఒక మూలన వైరు మంచం నిలబెట్టి ఉంది. పడక గదిలోకి వెళ్ళాడు పాండు. పెద్దగా ఏమీ ఫర్నిచర్ లేదు. ఒక డబుల్ కాట్. ఒక బీరువా. గోడలకున్న అరల నిండా బట్టలు. పడకగదికీ, వంటగదికీ మధ్య ఒక పెద్ద కిటికీ ఉంది. ప్రస్తుతం తెరిచే ఉంది. దానికి ఎదురుగా పడకగదిలోనూ, వంటగదిలోనూ ఉన్న గోడలకు అలాటివే ఇంకా రెండు కిటికీలు - మూసి ఉన్నాయి. పడక గది తలుపుకు ఎదురుగా బయటకు వెళ్ళడానికి ఇంకో తలుపు ఉంది. వంట గదిలోనూ అలాగే ఉంది. ఆ తలుపు లోంచి బయటకు వెళితే బాత్రూమూ, లెట్రినూ. కొన్ని గులాబీ మొక్కలూ, ఒక కరివేపాకు చెట్టూ ఉన్నాయి. చిన్న తులసి కోట కూడా ఉంది. అన్ని తలుపులూ తెరచే ఉండడంతో పడకగది తలుపులోంచి బయటకు వెళ్ళిన పాండు, ఇంటి వెనుక నుంచే వంటగదిలోకి ప్రవేశించాడు. రెండు గదులకూ మధ్యనున్న కిటికీకి ఆనుకుని ఉన్న అరుగుపై గ్యాస్ పొయ్యి, దాని పక్కనే సిలిండరూ ఉన్నాయి. పక్కనే స్పేర్ సిలిండర్ కూడా ఉంది. రాత్రి వాడిన గిన్నెలూ, పళ్ళేలూ చిన్న సింకులో పడి ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచీ వంటగదిలోకి ఎవ్వరూ వచ్చినట్లు లేరు. టీ కూడా బయట నుంచే తెప్పించుకున్నారనడానికి నిదర్శనంగా సింక్ పక్కనున్న చెత్తకుండీలో ప్లాస్టిక్ కప్పులు పడున్నాయి. గ్యాస్ స్టవ్ ఎదురుగా నిలబడితే గదుల మధ్యన ఉన్న కిటికీ లోంచి గంగ తన కూతుళ్ళతో కలిసి ఆఖరి నిద్ర చేసిన మంచం కనపడుతూంది. వంటగదిలోని సామానులన్నీ దీక్షగా చూడడం మొదలెట్టాడు పాండు. కుమార్ బయటకు వెళ్ళి హాలులో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాడు. కుమారుకు ఏమీ అర్థం కావట్లేదు. ఉదయం నుంచీ రాజేషుతో తలనొప్పి. ఏదో జరిగిందంటాడు, ఏంటో చెప్పడు, అంటే చెప్పలేడు. ఒక విధంగా రాజేష్ పోలీస్ అవడం కూడా మంచిదే. ఇంకొకళ్ళయితే, ఏ విధమైన ఋజువూ, సాక్ష్యమూ లేకుండా కేసు ఫైల్ చేయమంటారు. రాజేష్ మాత్రం తను బాధపడుతూ కూర్చున్నాడే కాని, తమతో ఎలాటి వాగ్వాదమూ చేయలేదు. ఈ కుర్రాడిని హైదరాబాదు నుంచి పంపారు. సరే, ఇతనేం చేస్తాడో చూద్దాం. తను చేయగలిగేదేమీ లేదని నిశ్చయించుకున్నాక, ముందు రోజు పేపరు తీసుకుని చదువసాగాడు కుమార్.

దాదాపు పది నిముషాల పాటు వంటగదినీ, తరువాత ఇంకో పది నిముషాలు పడక గదినీ పరిశీలించిన తరువాత పాండు బయటకు వెళ్ళి ఇంటి చుట్టూ పరిశీలనగా చూడసాగాడు. గంగకు పూలంటే చాలా ఇష్టంలా ఉంది. ఇంటికి రెండు వైపులా మందారాలూ, నందివర్ధనాలూ, ఇంటి వెనుక జాజి తీగ, ఇంటి ముందు మల్లె తీగ. మూడు ప్రదక్షిణాలు చేసిన తరువాత కూడా అనుమానాస్పదంగా ఏమీ కనిపించక పోవడంతో ఇంటి ముందు ఉన్న అరుగుపై గంగ అత్తగారి పక్కన కూర్చుని కుటుంబ సభ్యులను పరిశీలించసాగాడు పాండు. గంగ, పిల్లల శరీరాలకు స్నానం చేయించారు. అప్పటికే పాడె కట్టి సిద్ధంగా ఉండడం వల్ల ఆమెను పడుకోబెట్టారు. ఎవరో తెల్ల గుడ్డ మడత తీస్తున్నారు కప్పడానికి.

అప్పుడొచ్చింది గ్యాస్ సిలిండర్ బండి. రాగానే అక్కడి పరిస్థితి చూసి రాకూడని సమయంలో వచ్చానని గ్రహించాడు ఆ బండి డ్రైవర్. బండి పక్కనున్న వ్యక్తితో రేపొస్తానని చెప్పి బండి తిప్పబోయేంతలో గంగ అత్తగారు లేచి “సిలిండర్ ఇచ్చెళ్ళమని చెప్పు బాబూ. రెండూ ఖాళీగా ఉన్నాయి“ అని పాండుతో అంది. ఆమె మాటలు వినగానే పాండుకు తాను వెదుకుతున్న తీగ దొరికినట్లు అనిపించింది.

ఏం మాట్లాడకుండా నేరుగా సిలిండర్ బండి వద్దకు వెళ్ళి “ఒక సిలిండర్ దించేయ్. ఖాళీది రేపొచ్చి తీసుకెళ్ళు“ అంటూ తన జేబులోంచి వెయ్యి రూపాయలు అతని చేతిలో పెట్టాడు. పాండుకు చిల్లర అడిగే ఉద్దేశ్యం లేదని గ్రహించిన డ్రైవర్ మారు మాట్లాడకుండా బండికి బ్రేక్ వేసి సిలిండర్ దించి అక్కడే ఒక పక్కన పెట్టాడు. సిలిండర్ బండి వెను తిరగగానే పాండు నేరుగా వంటగదిలోకి వచ్చి అక్కడ ఉన్న రెండు సిలిండరులనూ ఎత్తి చూశాడు. రెండూ ఖాళీనే. వెంటనే హాల్లోకి వచ్చి కుమారును వంటగదిలోకి పిలిచాడు. ఖాళీ సిలిండరులను చూపుతూ “నాలుగు రోజుల్లో సిలిండర్ రీఫిల్ డెలివరీ అయ్యే రోజుల్లో రెండు సిలిండరులూ ఒకేసారి ఎలా ఖాళీ ఔతాయి“? అన్నాడు.

కుమారుకు ఏమీ అర్థం కాలేదు “ఒక్కోసారి సిలిండర్ రావడం ఆలస్యం ఔతుంది. ఆలోపల రెండో సిలిండర్ తీరి పోవచ్చుగా“. జవాబిచ్చిన తరువాత అతనికే అనిపించింది, తాను చెప్పింది, ఏదో చెప్పాలని చెప్పినట్లు ఉందే కాని, ఆలోచించి చెప్పినట్లు లేదు. మౌనంగా ఉన్నాడు.

ఈ రోజు సిలిండర్ డెలివరీ అయ్యిందంటే, ఎంత లేటైనా వారం లోపలే సిలిండర్ బుక్ చేసి ఉండాలి. వారం రోజుల్లో నిండు సిలిండర్ ఖాళీ అవడానికి వీళ్ళింట్లో డజన్ల కొద్దీ జనాలు లేరు“. చేతిలో ఉన్న సిలిండర్ రసీదు కుమార్ చేతిలో పెట్టి, ఈ సిలిండర్ ఎప్పుడు బుక్ చేశారో కనుక్కోండి. గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేశాడు కుమార్. అడిగింది ఎస్సై అని తెలియగానే అర నిముషంలో సమాధానం వచ్చింది. ఫోన్ జేబులో పెట్టుకుంటూ “సిలిండర్ బుక్ చేసింది మొన్నే“ అన్నాడు.

కళ్ళు మూసుకుని ఒక్క నిముషం మౌనంగా ఉన్నాడు పాండు. కళ్ళు తెరచి, “పోస్టుమార్టెం అరేంజ్ చేయించండి - ముగ్గురికీ“. కుమార్ అభ్యంతరం చెప్పే లోపలే కారణం కూడా చెప్పాడు “గ్యాస్ పాయిజనింగ్ చేసి ముసలామె కోడలినీ, మనుమరాళ్ళనీ హత్య చేసింది“. తన జేబులోంచి ఫోన్ తీసి రాజిరెడ్డికి రింగ్ చేశాడు పాండు “రెడ్డిగారూ, గ్యాస్ పాయిజనింగ్ చేశారని అనుమానంగా ఉంది. పోస్ట్ మార్టెం చేయించమని కుమార్ గారికి, అదే ఇక్కడి ఎస్సై గారికి చెప్పాను. ఆయన ఆ ప్రయత్నం లోనే ఉన్నారు“.

కుమారుకు ఏమని బదులివ్వాలో తెలీలేదు. అంతలోనే పాండు మళ్ళీ చెప్పాడు “శవాలు తీయక ముందే విషయం చెప్పి, అంబులెన్సు పిలిపించండి. ప్రస్తుతానికి అరెస్టులేవీ అవసరం లేదు. ఇల్లు మాత్రం సీల్ చేసేయండి. పెద్దావిడ వేలిముద్రలు పోకూడదుగా“.

కుమార్ బయట ఉన్న శివుడి దగ్గరకు నేరుగా వెళ్ళాడు “మాకు ఇది సహజ మరణం కాదని అనిపిస్తుంది. మీ భార్యా పిల్లల శరీరాలను పోస్ట్ మార్టెం కోసం హాస్పిటలుకు తీసుకు వెళ్ళాలి“. శివుడు నిశ్చేష్టుడయ్యాడు. అతన్నే చూస్తున్న పాండుకు అతను నిరపరాథి అని అనిపించింది. “మీ భార్యకు అన్యాయం చేసిందెవరో మీరూ తెలుసుకోవాలనే అనుకుంటారుగా“. మౌనంగా కుమారుకు అంగీకారం తెలుపుతున్నట్లు తలూపాడు శివుడు. స్టేషనుకు ఫోన్ చేసి కానిస్టేబుల్సును రమ్మని, హాస్పిటలుకు ఫోన్ చేసాడు కుమార్.

కార్యక్రమం ఆగిపోవడం గ్రహించిన శివుడి తల్లి చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్ళడం చూసిన పాండు కుమారుతో “ఆమెను బయటకు రమ్మని చెప్పి ఇంటికి సీలు వేయించండి“ అన్నాడు.

* * *

సుందరమూర్తికి ఫోన్ చేసి రాజేషును తీసుకుని రమ్మన్నాడు పాండు. అంబులెన్సు కంటే ముందు పోలీసులతో పాటుగా మూర్తి, రాజేష్ వచ్చారు. కుమార్, రాజేష్, మూర్తిలను పక్కకు తీసుకెళ్ళి “నా లెక్క ప్రకారం పోస్టు మార్టెంలో బ్యుటేన్ పాయిజనింగ్ అని వస్తుంది. అదే గ్యాస్ పాయిజన్. రాత్రి నువ్వు పడుకున్నాక పెద్దావిడ పొయ్యి నుంచి ట్యూబ్ పీకేసి కిటికీ లోంచి అవతల గదిలోకి తోసేస్తే చాలు. ఈ గ్యాస్ బరువు కాబట్టి కిందకు వెళుతుంది. మెల్లగా పైకొస్తుంది. అందుకే హాలులో ఉన్న రెండు తలుపులూ రాత్రి మూసేసింది. రాజేష్ ఎటూ తాగి పడుకున్నాడు. ఆమె తెల్లారుఝామున శివుడు వచ్చే ముందు లేచి ట్యూబు మళ్ళీ పొయ్యికి తగిలించి అన్ని తలుపులూ తెరిస్తే చాలు పది నిముషాల్లో గ్యాస్ లీకైన విషయం కూడా తెలీదు. ఇక్కడ ఇళ్ళూ పెద్దగా లేవు. బయట చెట్లు ఉన్నాయి. ఆమె ఏ నాలుగింటికో, లేక అర్థరాత్రో తలుపులు తెరిస్తే తెల్లారే సరికి గ్యాస్ మొత్తం గాల్లో కలిసి పోతుంది. కాకపోతే, ఈ ప్లానులో శివుడు లేడు. అంతా ముసల్దాని పనే. బహుశా శివుడు తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా గంగను చేసుకున్నట్లున్నాడు.

ఔను. ఏదో పెళ్ళిలో గంగను చూసి చేసుకున్నాడు. కట్నం కూడా తీసుకోలేదు“ రాజేష్ వెంటనే చెప్పాడు. “అంతే కాదు. చేసుకుంటే శివుడినే చేసుకుంటానని అతని మేనమామ కూతురు ఇప్పటికీ పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయింది“.

ఈ మాత్రం చాలు, పోస్టుమార్టెం రిపోర్టు వచ్చేలోపలే కేసు ఫైల్ రెడీ చేస్తాను“ కుమార్ గొంతులో ఉత్సాహం. కుమార్ పాండు దగ్గరకొచ్చి “థాంక్స్ బాస్. నువ్వెవరో నాకు తెలీదుగాని, ఈ సహాయానికి చాలా థాంక్స్. అంటే, మా పోలీసోళ్ళకే అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోలేం కదా“.

నవ్వుతూ కారెక్కాడు పాండు. “పద బాబాయ్, పోతూ దోవలో ఏదైనా తినాలి. పొద్దుటి నుంచీ ఏమీ తినలేదు“.

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి