ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగింది .. ఇదేంటి కావ్య అక్క నుంచి ఇప్పుడు ఫోన్ వచ్చింది ??అని మురళి అనుకోని ఫోన్ ఎత్తాడు,
అక్క చెప్పు ..
మురళి బిజీ గా ఉన్నావా ?
అదేం లేదు అక్క … చెప్పు
ఎం లేదు మురళి … ఒక చిన్న సహాయం కావాలి ఈ రోజు మా ఇంట్లో ఏసీ ఫిక్స్ చేయడానికి మనుషులు వస్తున్నారు. బావ ఇంట్లోనే ఉన్నారు కాకపోతే ఆయనకు ఇలాంటి విషయాల్లో పెద్దగా అవగాహన లేదు, నువ్వు పక్కనే ఉండి ఏదన్నా సహాయం చేస్తావేమో అని ఫోన్ చేస్తున్నాను…
తప్పకుండా అక్క, ఏసీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్తే నేను మీ ఇంటికి వెళ్తాను… అని చెప్పి మురళి ఫోన్ పెట్టేసాడు..
ఫోన్ పెట్టేసాక.. మురళి ఒక నిమిషం కుర్చీ లో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. రెండేళ్ల కిందట నేను బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి సెలవల్లో వచ్చాను. ముఖ్యంగా మేము కొత్తగా కట్టుకున్న ఇంటి గృహ ప్రవేశానికి అందరినీ పిలవడానికి వెళ్తూ, అప్పటికే 3 నెలల కిందట మా లక్ష్మి అపార్ట్మెంట్స్ లో దిగిన కావ్యక్క అమ్మకి పరిచయం అయ్యి సహాయపడుతుంది అని తెలుసుకొని, నేను తన మీద అభిమానం పెంచుకొని తనకి ప్రేత్యేకంగా కార్డు ఇవ్వడానికి వెళ్లాను. కావ్యక్క ఇంటిని చూసాను, దగ్గెరలొ ఒక చిన్న క్లినిక్ లో నర్స్ గా చేస్తున్న కావ్యక్క ఎంతో కష్టపడి ఇద్దరు ఆడపిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నది. కావ్యక్క భర్త అయిన శ్రీనివాస్ ఉద్యోగం మీద దృష్టి పెట్టకుండా జల్సాలు చేస్తూ ఉండేవాడు. ఇంట్లో, అన్ని పాత సామానులే, ఇల్లు చాలా బీదగా అనిపించింది. బహుశ బీదరికం అంటే ఇలా ఉంటుందేమో అని నాకు అనిపించింది. కానీ కావ్యక్క ముఖములో ఏదో తెలియని అమాయకత్వం, తాను వేసుకున్న బట్టల్లో బీదరికం కనిపించింది, కానీ తన కళ్ళల్లో మటుకు ఒక తెలియని కాంతి, భవిషత్తు మీద ఆశ, ముఖ్యంగా తనలో ఒక తెలియని ఆప్యాయత సంతృప్తి, కనిపించాయి. వీటి ముందర తన బీదరికం అసలు కనపడలేదు. ఇలా ప్రతి మనిషి జీవించగలిగితే అసలు ప్రపంచంలో సమస్యలే ఉండవు అన్న భావన నాకు కలిగింది.
మా ఇంటి గృహ ప్రవేశం బాగా జరిగింది, నేను తిరిగి బెంగళూరు వెళ్ళిపోయాను. నేను ఒక సంవత్సరంన్నర తరువాత లక్ష్మి అపార్ట్మెంట్స్ కి మళ్ళీ వచ్చాను. ఈ సార్ అక్కని కలవాడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడు తన ఇల్లు పూర్తిగా మారిపోయింది. మహారాజ రేంజ్ లో ఒక పెద్ద మంచం ఉంది, దాని ధర 40,000 వేలు, కొత్త TV, సోఫా సెట్, హాల్ లో దీవాన్, కావ్యక్క రెండు సెల్ల్ఫోన్స్ మార్చింది, అప్పుడే మార్చిన డైనింగ్ టేబుల్, అన్నీ కొత్తగా ఉన్నాయి. ఎలా అని అనిపించింది ? కావ్యక్క కొత్త ఉద్యోగంలోకి చేరి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి మారబోతున్నారు అని తెలిసింది, దానితో పాటు బావ పాత బండిని మార్చి కొత్త బండి కొనుక్కున్నాడు. అక్క ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అన్న ఆలోచన లో ఉంది. ఒక సంవత్సరంనర లో అక్క సంపాదించే పదిహేను వేల జీతానికి, బావ సంపాదించే మరో 15000 జీతానికి ఇంత మార్పా ? నమ్మశక్యం గా లేదే అని అనిపించింది. ఈ మార్పు మా జీవితాల్లో చూడటానికి మాకు 15 ఏళ్ళు పట్టింది , అక్కకు ఇంత మార్పు 1.5 సంవత్సరంలో ఎలా సాధ్యం అయింది ?? వెనక కూడా ఏమి ఆస్తులు లేవే ?? ఇప్పడు AC కూడా పెట్టిస్తుంది.. ఈ ప్రశ్నలు నన్నువేధించింది. ఇంటికి వెళ్ళాక అమ్మని ఇదే విషయం అడిగేసరికి..
"ఎందుకు అడుగుతావు లే .. పైన ఉన్న వేణు గోపాల్ గారు ఉన్నారు కదా .. మీ అక్కకు లక్షలు ఇవ్వడానికి " అనేసరికి మురళికి ఆశ్చర్యం వేసింది.
వేణుగోపాల్ అనే ఆయన ఒక రిటైర్డ ప్రభుత్వ ఉద్యోగి, ఒకప్పుడు ప్రాసిక్యూటర్ గా పని చేసాడు. చాలా ఏళ్ళ కిందట తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడం వలన వీఆర్ఎస్ తీసుకొని ఇంటి బాధ్యతలను చూసుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఇద్దరు కొడుకులు, కాకపోతే ఇద్దరూ వృతి రీత్యా బెంగళూరు లో ఉంటారు, వారు ఆయన వ్యవహారాల్లో తల దూర్చరు. అనారోగ్య కారణ0 వలన ఆయన భార్య చనిపోయింది. ఆ తరువాత ఒంటరిగా మిగిలిపోయిన వేణుగోపాల్ బ్రతుకు ఎలా వెళ్లతీయాలా అని బాధ పడుతూ ఉన్నాడు. అట్లా చాలా ఏళ్ళు గడిచిపోయాయి, బ్యాంకు నిండా డబ్బు ఉంది, కానీ జీవితం మీద ఆసక్తి లేదు. తిన్నావా ? అని అడిగే నాధుడు లేడు . మాసిపోయిన గడ్డం, నలిగిన లుంగీ, వెలిసిపోయిన ఒక చొక్కా వేసుకొని, మిర్చి బజ్జిలు కొనుకొని తింటూ అదే రాత్రి భోజనం గా నెట్టుకొస్తున్న వేణుగోపాల్ గారి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. అట్లాంటి సమయంలోనే కావ్య ఇంకా శ్రీనివాస్ ఇద్దరూ వేణుగోపాల్ గారి తలుపు కొట్టారు.
వారి పరిస్థితిని వివరించి " అంకుల్ నేను మీ కింద ఫ్లోర్ లో ఉంటాను, రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మీకు తెలిసే ఉంటుంది…. కొన్ని ఏళ్ళ కిందట మేము ప్రేమించుకొని ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చేసాము. సరైన చదువు, ఉద్యోగాలు లేక ఇప్పుడు మేము సంపాదించేది మాకు సరిపోడం లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మాకు.. ఇప్పుడు మా అమ్మ గారికి వైద్యం చేయించాల్సిన అవసరం వచింది.. చేతిలో చిల్లి గవ్వ లేదు, ఎం చేయాలో మాకు తోచడం లేదు. మీరు సహాయం చేయడంలో ముందు ఉంటారని వడ్డీని అప్పు ఇస్తారని విని వచ్చాము. మీరు వడ్డీకి ఒక 30,000 రూపాయలు ఇస్తే ఒక ఆరు నెలల్లో తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తాము" అని చెప్పారు..
వేణుగోపాల్ కు జాలి వేసింది, సరే బాగా కష్టాల్లో ఉన్నారు, 30,000 రూపాయలే అడిగారు కదా అని వాళ్ళను నమ్మి, డాకుమెంట్స్ మీద సంతకం పెట్టించి డబ్బులు ఇచ్చాడు
కావ్య ఎంతో సంబరపడింది.
రోజు వేణుగోపాల్ కి కావ్య టిఫిన్, భోజనాయాలు వండుతూ, ఇద్దరు దంపతులు ఆయనకు సరుకులు అవి తెచ్చి ఇవ్వడంలో సహాయం చేయడం మొదలుపెట్టారు. కాకపోతే ఆ ఇచ్చిన 30,000 చిన్నగా లక్ష అయ్యాయి… ఒకటి 3 అయింది, ఆ తరవాత అయిదు అయింది, కావ్య అవసరాలు పెరిగి చివరకు పది లక్షలు అయింది. ఇంత డబ్బు తీసుకొని కావ్య జల్సాలు చేయడం మొదలుపెట్టింది. కావ్య చుట్టుపక్కల అపార్ట్మెంట్ వారు మంచి పోసిషన్ లో చూసి సెటిల్ అయి ఉండటం చూసి, అత్యాశకు వెళ్లి నేను కూడా చాలా తొందరగా ఎదగాలి అని అనుకుంది. కాకపోతే వారందరికీ ఎదగడానికి 15 - 20 ఏళ్ళు పట్టింది . కావ్యకు అంత సహనం లేదు.
“పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు” వేరే వారిని చూసి అన్ని వస్తువులు తాహతును మించి కొనడం మొదలుపెట్టింది. కావ్యలో ఇంతకు ముందు ఉన్న అమాయకత్వం, సంతృప్తి, కాంతి పూర్తిగా మాయం అయ్యాయి. ఆ కళ్ళలో కేవలం కపటమే కనిపిస్తుంది.
ఒక రోజున కావ్య పక్కింట్లో ఉంటున్న 70 ఏళ్ళ పెద్దావిడ వేణుగోపాల్ పని మనిషితో, కావ్య వాళ్ళ కుటుంబంతో జాగ్రత్త అని మీ సర్ కి చెప్పు.. కావ్య మీ సర్ ని ఏదో ఒకరోజు ముంచుతుంది అని ఆయనకు చెప్పు అని జాగ్రత్త చెప్పింది. ఇది తెలుసుకున్న కావ్య ఆయన దెగ్గరకు వెళ్ళి, తాను వేణుగోపాన్ని మోసం చేసే అంత సాహసం ఎప్పుడూ చేయను అని చెప్పి కనిళ్ళు పెట్టుకుంది. వేణుగోపాల్ స్వతః ఒంటరి మనిషి చిన్ని చిన్ని భావాలకు ఊరినే ఉద్రేక పడే వ్యక్తి అవ్వడం చేత.. ఇదంతా విన్న వేణు గోపాల్ వెంటనే తన దెగ్గర ఉన్న డాక్యూమెంట్లు చింపేసి
" మీరు నాకు 10 లక్షల అప్పు తిరిగి ఇవ్వకపోయినా పర్లేదు " అని ధైర్యం చెప్పాడు.
అలా కొద్దీ రోజులు గడిచాక ఒక రోజు శ్రీనివాస్, వేణుగోపకి టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో పడిపోయాడని గ్రహించాడు. వెంటనే కావ్యను పిలిచాడు. కావ్య హుటాహుటిన వచ్చి, ఆయనకు ఊపిరి ఆడుతుందో లేదో చూసింది. వేణుగోపాల్ పోయాడని తెలుసుకుంది. అందరినీ పిలిచి హాస్పిటల్ కి తరలించమని చెప్పింది. వేణుగోపాల్ పోయాడు అని డాక్టర్స్ కూడా నిర్ధారించాక కొడుకులు వచ్చి అంత్య క్రియలు అన్ని పూర్తి చేసారు. శ్రీనివాస్, కావ్య కళ్ళలో ఎక్కడ లేని ఆనందం. వారు అనుభవిస్తున్న వైభవం మొత్తం వేణుగోపాల్ ఇచ్చిన డబ్బు వల్లనే అని వారికి తెలుసు. ఆయన ఇప్పుడు పోయాడు, ఆయనతో పాటు ఆ అప్పు అన్న మాట కూడా పోయింది. డాకుమెంట్స్ ఆయన స్వహస్తాలతో చింపేసాడు, ఇంక సాక్ష్యం లేదు. మాకు ఎదురు లేదు అని మురిసిపోతున్నారు.
బెంగుళూరు నుంచి దిగిన మొదటి కొడుకు అయిన రాహుల్ తండ్రికి అంతక్రియలు చేసి 12 రోజులు అయ్యాక కావ్య ఇంటికి వచ్చాడు. కావ్య తన కపట మాటలతో ఓదార్చే ప్రయత్నం చేసింది. రాహుల్ ఒక రెండు నిమిషాలు ఆగి .
“10 లక్షలు వడ్డీ తో సహా మీరు ఎప్పుడు ఇస్తారో నాకు చెప్పండి?” అని అడిగాడు.
కావ్య ఒక్కసారిగా ఖంగారు పడి .. మీ నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడే మేము అప్పు తీర్చేసాము అని బుకాయించింది.
రాహుల్ వెంటనే డాకుమెంట్స్ తీసి వారి ముందర ఉంచాడు. కావ్య ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది. ఇది ఎలా వచ్చింది అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
రాహుల్ " మీరు ఒకటి మర్చిపోయారు మా నాన్న ఒక లాయర్ గా పని చేసాడు. ఆయన ఏ పని చేసిన పకడ్బందీగా చేస్తాడు. ఆయన ఇచ్చిన అప్పులన్నీ నాకు డాకుమెంట్స్ రూపం లో స్కాన్ చేసి పంపాడు. అంతే కాదు, ఒరిగినల్స్ అలానే ఉంచేసి, కలర్ జిరాక్స్ అన్ని తీయించి, ఒరిగినల్స్ లోపలే దాచి, కేవలం రిఫరెన్స్ కోసం కలర్ జిరాక్స్ తీసిన పేపర్స్ ఆయన బయట వాడుతారు. మీ ముందర ఆయన చించింది కూడా అవే. మీ స్వహస్తాలతో రాసిన నోట్ ఇదిగో " అని రాహుల్ చూపించాడు . అవ్వని ఇప్పుడు వసూల్ చేస్తున్నాను. ఇది చుసిన కావ్యకు బుర్ర తిరిగిపోయింది
“అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు... అట్లాంటిది మిమల్ని నమ్మి ఆయన డబ్బు ఇస్తే మీరు మోసం చేయడానికి చూసారు. మాములుగా అయితే ఆయన మీద దగ్గెర నుంచి డబ్బు ఆశించలేదు. కానీ మీలాంటి కృతజ్ఞత లేని వాళ్ళ దగ్గెర డబ్బు వదలడం నాకు ఇష్టం లేదు. అప్పుకి వడ్డీ కలిపి పన్నెండు లక్షలు అయింది. మీకు వారం టైం ఇస్తున్న నాకు ఇస్తే సరేసరి లేకపోతె మీరు ఊచల లెక్కపెడతారు “అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఇంకా ఏమి చేసేది లేక అప్పడి దాకా కొన్న బండి, వస్తువులు, మంచం అన్ని కావ్య శ్రీనివాసులు అమ్మేశారు. వారికి ఇంకో 5 లక్షలు తక్కువ అయ్యాయి. కావ్య తల్లి ఇచ్చిన బంగారం మొత్తం అమ్మేసి చివరకు అప్పు తీర్చి అపార్ట్మెంట్ ఖాళీ చేసి, బయటకు వెళ్లిపోయారు.
ఇదంతా చూసిన మురళి “పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అని” అనుకున్నాడు. “వేరే వారిని చూసి సుఖాల కోసం పరుగులు పెట్టి, తాహతుకు మించి అప్పు చేసింది. ఏ మనిషైనా అప్పులు చేసి వైభవం అనుభవించినా కూడా దురాశ ఆ మనిషిని ఏదో ఆకాశం నుంచి నెల మీద చేతికిల పడేలా చేస్తుంది “ అని అనుకోని మురళి నవ్వుకున్నాడు…
లాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ వారు తనకు ఇచ్చిన పనిలో మునిగిపోయాడు..