రోజూ కొన్ని ట్విట్టర్ 'మిటూ' ప్రకటనలతో ' టాలీ వుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీ వుడ్లలో చాలా మంది పెద్దలు ఎప్పుడు ఎవరు తమని టార్గెట్ చేస్తారో అనే భయంతో ఉన్నారు. అయితే చాలా మటుకు ఈ ప్రకటనలు ఇంకా పరిశ్రమ లో ఇప్పుడు అవకాశాలు లేని వాళ్ళ దగ్గరనుంచే వస్తున్నాయి. వాళ్ళకి ప్రస్తుతం అవకాశాలు లేకపోయినా, ఎవరినయితే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా డేమేజ్ జరుగుతోంది. పరువు నష్టం దేవా వేస్తామని డాంబికాలు ఎన్ని పలికినా, నిప్పు లేకుండా పొగ రాదనీ అందరికీ తెలుసు కాబట్టి పరువు పోతోంది. ఈ నేపథ్యంలో - దేవ రాజన్, ఆ మరునాడు జరిగే తన తరవాతి సినిమా ముహూర్తం సందర్భంగా, వరసగా ఫోన్ కాల్స్ చేస్తున్నాడు. అతను ప్రముఖ డైరక్టర్ కాసీ పాండ్యన్ దగ్గర అసిస్టంట్ గా చేసి, స్వంతంగా పది దాకా సినిమాలు దర్శకత్వం చేసి తనకంటూ ఒక పేరు సంపాదించుకుని, ఇప్పుడిప్పుడే పెద్ద బడ్జట్ సినిమాలు చేపడుతున్నాడు. మరో కాల్ చేయబోతోంటే ఇన్ కమింగ్ వస్తే తీసుకున్నాడు. సినీ తార మంజరి. " ఇవాళో, రేపో మీ మీద కూడా 'మిటూ' ట్విట్టర్ రాబోతోంది. బయట పడకుండా ఆపాను. అది వస్తే మీకు చాలా నష్టం జరగవచ్చు, మీరు అర్జంట్ గా వచ్చి కలవండి" అని పెట్టేసింది. అతనికి తెలియకుండానే, వళ్ళంతా చెమటలు పట్టడం, ఫోన్ కింద పెట్టిన తరవాత చూసుకున్నాడు. తను అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పటినుంచీ మంజరి తెలుసు. ఆమెని తాను ఎప్పుడూ ఎ విధంగానూ వేధించలేదు. మంజరి కూడా హీరోయిన్ వేషాలు దాటి కేరక్టర్ వేషాలు ప్రారంభించింది. అటువంటప్పుడు ఎవరి తరపున అయినా చేసిందా? ఆమె స్నేహితురాలు సుగుణ మనసులో మెదిలింది. ఆమె చనిపోయి ఆరు సంవత్సరాలు పైనే అయింది. మిగతా తన అజాగ్రతలు ఆమెకి తెలిసే అవకాశం లేదు. ఏదయినా ఇప్పుడు ఏమన్నా బయట పడిందంటే చాలా డేమేజ్ అవుతుంది. " నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. తొందరపడి ఏమీ జరగ నివ్వకు" అని మంజరి కి మెసేజ్ పెట్టాడు. అతని మనసు పరి పరి విధాల పోతోంది. తను గతంలో కక్కుర్తి పడ్డ సంఘటనలు చాలా ఉన్నా చాలా జాగ్రత పడ్డాడు. నెల రోజుల క్రితమేగా మంజరి పుట్టిన రోజు పార్టీకి వెళ్ళింది? అప్పుడు మాట మాత్రమయినా ఏమీ చెప్పలేదు!. ఇప్పుడు కొత్త గా ఏమి జరిగిందబ్బా అనుకున్నాడు ? అయినా అన్నిటికీ తయారు గా ఉండడం మంచిది అనుకుని, తన లాయర్ ముకుందన్ కి ఫోన్ చేసి అర్జంట్ గా రమ్మన్నాడు. అతనితో చర్చించిన తరువాత అతని సలహా ఏమిటంటే, "ఇటువంటి ఆరోపణలు పరువు నష్టందావా వేసినప్పుడు వాళ్ళు నిరూపించడం కష్టం. అయినా, ఇప్పుడు మనకి జరిగే డేమేజ్ ఎక్కువ కాబట్టి, సాధ్యమయితే ఆపడం మంచిది. డైరక్ట్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేసేయకుండా ముందు చెప్పడం లో ఎదో ఉంది. వెళ్లి కలవండి. తరవాత ఆలోచిద్దాము" అని సలహా ఇచ్చాడు. ఆ సాయంత్రం దేవ రాజన్ కోసం ఎదురు చూస్తోంది మంజరి. అప్పటికే ఒక మాటు కాఫీ తాగినా, మరకతం ని మళ్ళీ ఇంకో కప్పు వేడి గా తెమ్మని పిలిచి, ఆలోచనలో పడింది. తనకీ సుగుణకీ చిన్నతనం నుంచీ ఉన్న స్నేహ బంధం గుర్తుకు వచ్చింది. *** వీరవాసరం లో చినప్పుడు వీధి బడి నుంచీ సుగుణ, మంజరి కలిసి చదివారు. ఇద్దరూ మంచి చలాకీ గా ఉండి, అన్ని పోటీల్లోనూ పాల్గొనేవారు. హైస్కూలు కు వచ్చిన తరువాత, స్కూల్ డ్రాయింగ్ మాస్టర్, వీళ్ళ టేలెంట్ గుర్తించి చాలా స్కిట్లు ఆయనే రాసి వీళ్ళ చేత వేయించేవాడు. అన్నింటిలోనూ సుగుణ, మగ వేషం వేస్తె, మంజరి ఆడ వేషం వేసేది. వీళ్ళిద్దరూ జూనియర్ కాలేజ్ లో ఉండగా, సూరప రాజు గారు,ఆ ఊరి వాడే, తను తీస్తున్న ఒక సినిమా షూటింగ్ వాళ్ళ ఊరి పరిసరాలలో ఏర్పాటు చేసి, ఆ సందర్భంగా ఆ ఊళ్లో చాలా రోజులు ఉండిపోయాడు. ఆ సందర్భంగా వీళ్ళు చదువుతున్న కాలేజీ ఫంక్షన్ కి ఆయన వచ్చి వీళ్ళ స్కిట్ చూడడం జరిగింది. ఫంక్షన్ అయిన తరువాత ఆయన చేతుల మీదుగా ఇద్దరూ బహుమతులు అందుకున్నారు. ఇంటర్ అయిన తరువాత కాలేజీకి పై ఊరు వెళ్ళడం వాళ్లకి కుదర లేదు. ఇద్దరి విషయంలోనూ కామన్ విషయం ఏమిటంటే, తల్లి తండ్రులు చిన్నప్పుడే పోవడం వల్ల, మంజరి మేన మామ దగ్గరా, సుగుణ అన్నగారి దగ్గరా పెరిగారు. వాళ్ళు దగ్గర అవడానికి అదొక ముఖ్య కారణమేమో. ఇంటర్ తరవాత నాలుగేళ్ళు సినిమాలే ప్రపంచంగా గడిపారు. ఆసమయం లో ఒక రోజు సడన్ గా ఇద్దరూ మద్రాసు వెళ్లి పోయి సినిమాలలో ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్న ఆలోచన రావడ మేమిటి, రెండు రోజులల్లోనే కొద్ది బట్టలు సద్దుకుని రైలు ఎక్కేశారు. ఊళ్లో సినిమాహాలు వాళ్ళని మాటలలో పెట్టి రాజుగారి అడ్రసు తీసుకున్నారు. టి నగర్లో రాజు గారి ఇల్లు అడ్రసు కనుక్కుని అక్కడికి చేరుకోవడం పెద్ద శ్రమ అవలేదు. ఆయన ఇల్లు, ఇంటిముందు ఒక పక్కగా ఆఫీసు రెండూ ఒక చోటే ఉన్నాయి. సెక్యురిటీ వాడు వీళ్ళని కాసేపు ఆపి, రాజు గారు ఆఫీసులోకి రాగానే, అయన తో చెప్పి లోపలికి పంపాడు. వీళ్ళని చూసి ఆయన ముందు గుర్తు పట్టలేదు. మంజరి, తాము ఎక్కడినుంచి ఎందుకు వచ్చిందీ వివిరించింది. స్కూల్ ఫంక్షన్ లో ఆయనని కలిసిన విషయం కూడా గుర్తు చేసింది. ఆయన గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్య పోయాడు.అంత ధైర్యంగా ఎలా వచ్చేశారా అని! ఆయనకి మొదట గా వచ్చిన ఆలోచన వీళ్ళని వెనక్కి ఎలా పంపడమా అని. కాని కాసేపు వాళ్ళతో మాట్లాడిన తరువాత వాళ్ళల్లో స్పార్క్ చూసి, వాళ్లకి సహాయం చేయాలనిపించింది. వివరాలు కనుక్కుని ముందు వాళ్ళ బంధువులకి కబురు పెట్టాడు 'తన దగ్గరికి వచ్చారు ఆందోళన పడ వద్దని" సినిమాలలో ట్రెండ్ మారిన తరువాత ఆయన సినిమాలు తీయడం తగ్గించేశాడు. అదివరకు సంపాదించినది, సినిమా అనుబంధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాడు. అవి ఇప్పుడు చాలా లాభాలు పండిస్తున్నాయి. అప్పుడే ఆఫీసుకి వచ్చిన మేనేజర్ చొక్కలింగం ని పిలిచి, అతనితో మాట్లాడి వాళ్ళని ఎక్కడ ఉంచాలో చెప్పి, వాళ్ళని మర్నాడు రమ్మన్నాడు. ఆయన తీసిన చాలా సినిమాలకి కాసీ పాండ్యన్ డైరక్టర్. ఆయనకీ ఫోన్ చేసి " ఇద్దరు అమ్మాయిల్ని పంపుతున్నాను. నాకుకావాల్సిన వాళ్ళు. స్క్రీన్ టెస్ట్ చేయించి ఎలా సూట్ అయితే అలా ఎక్కడేనా పెట్టండి" అని చెప్పాడు. మర్నాడు మంజరి, సుగుణ ఆయనని కలిసినప్పుడు, కాసీ పాండ్యన్ ఎక్కడ ఎ స్టూడియో లో ఉంటాడో చెప్పి వెళ్లి కలవ మన్నాడు. "టెస్టుల తరవాత ఆయన ఎలా చెబితే అలా చేయండి" అని చెప్పి పంపించాడు. ఆ మరునాడు విక్రం స్టూడియో లో కాసీ పాండ్యన్ ని కలిశారు. ఆయన తెలుగు, తమిళం లో ఒక ప్రేమ కథ ప్లాన్ చేస్తున్నాడు. ప్రేమ కథలు పాత వాళ్ళతో కంటే, కథా బలం ఉంటె, కొత్త వాళ్లతో హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే టాలెంట్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడం రిస్క్ అని ఆయనకీ తెలుసు. ఆ నేపధ్యంలో సుగుణ, మంజరి ఆయనని కలవడం జరిగింది. కాసీ పాండ్యన్ కి రాజు గారి మీద చాలా గౌరవం. అందుకే ఎలాంటి సహాయం వీళ్ళకి చేయాలా అన్న విషయం మీద ఆలోచనలో ఉన్నాడు. దర్శకుడిగా ఆయన ఇద్దరి నీ పరిశీలించాడు. సుగుణ ముఖం ఇద్దరి లొకీ ఎక్కువ కళ గా అనిపించినా, మంజరి సౌందర్యం కూడా సామాన్యం కాదని గ్రహించాడు. తన దగ్గర నాలుగయిదు సినిమాలనుంచి సహాయ దర్శకుడుగా చేస్తున్న దేవ రాజన్ ని పిలిచి వీళ్ళిద్దరికీ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేయమన్నాడు. దేవరాజన్ వీళ్ళిద్దరినీ చూడగానే, కాసీ పాండ్యన్ లాగానే ఒక అభిప్రాయానికి వచ్చేశాడు, అయితే అతని కోణం వేరు. చాలా మందికి తెలియనిది, కొద్ది మందికే తెలిసినది అయినది అతనికున్న స్త్రీల పట్ల బలహీనత. వయసులో ఉన్న ఎ స్త్రీని చూసినా అతను వెంటనే ఊహించేది పైకి రాయలేము. అటువంటి వాడు సుగుణ నీ, మంజరినీ చూడ గానే, సుగుణ పట్ల విపరీత మయిన ఆకర్షణ కి లోనయాడు. అందుకు కారణం ఆమె అవయవ సౌష్టవమే. దేవరాజన్ వీళ్ళని తీసుకు వెళ్ళబోతోంటే, కాసి పాండ్యన్ ఆపి, ద్రాయర్లోంచి రెండు పేపర్లు తీసి, ఇద్దరికీ చెరి ఒకటి ఇచ్చి చదువుకో మన్నాడు. ఒక అరగంట తరవాత అందులో సంబాషణలు మీరు నటించి చూపాలి. ఇతను తీసుకెళ్ళిన గది లో కూర్చుని చదువుకుని రండని పంపించాడు. వాళ్లకి కాఫీ టిఫిన్లు తెప్పించే ఏర్పాటు కూడా చెప్పి పంపించాడు. ఒక గంట తరువాత తన రూమ్ కి రప్పించుకుని " డైలాగులు చెప్పగలరా?" అన్నాడు వాళ్ళు వెంటనే 'రెడీ అన్నారు " ఆయన ఇచ్చిన కాగితాలలోని సంభాషణ ఇద్దరూ ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పేశారు. వాళ్ళు చెప్పిన తీరు, ఈజ్ , హావ భావాలు చూసి ఆయనే కాదు అక్కడ ఉన్న దేవరాజన్ కూడా ఆశ్చర్య పోయాడు. ఇద్దారూ ముఖ ముఖాలు చూసుకుని ఎదో కమ్యునికేట్ చేసుకున్నారు "ఇప్పుడు ఇద్దరికీ వేరు వేరుగ స్క్రీన్ టెస్ట్ చేయించు. మన కేమెర మాన్ లేడు, మరో సినిమాకి పాచ్ వర్క్ నాలుగో ఫ్లోర్ లో ' కణ్ణన్' చేస్తున్నాడు. అతని సహాయం తీసుకో" అని చెప్పి పంపేశాడు. నాలగవ ఫ్లోర్ లో పాచ్ వర్క్ షూట్ చేసుకుంటున్న కణ్ణన్, దేవరాజన్, సుగుణ, మంజరిలతో రావడం చూశాడు. దేవరాజన్ గురించి తెలిసిన కొద్ది మందిలో అతను ఒకడు. వీడి బారిన పడ్డారు ఎవరా అని కుతూహలంగా చూశాడు. సుగుణ ముఖంలో కనపడిన ఒక రకమయిన అమాయకత్వం అతణ్ణి కట్టి పడేసింది. దేవరజాన్ ద్రుష్టికి, కణ్ణన్ చూసినదానికి పూర్తి భిన్నం. మంజరి కూడా అతనికి నచ్చింది. కేమేరా కన్నులోంచి ఆమె ఇంకా బాగుంటుందని అప్పుడే గ్రహించాడు. రెండు రోజుల తర్వాత, కాసీ పాండ్యన్, దేవరాజన్, కణ్ణన్, ముగ్గురూ కలిసి రషస్ చూశారు. చూడగానే మంజరి స్టార్ మెటీరియల్ అని గుర్తించడానికి అట్టే సేపు పట్టలేదు . " మంజరిని మన సినిమాలో కే తీసుకుందాము. నేను రాజు గారితో మాట్లాదేదాకా వాళ్ళకు ఏమీ చెప్పకు.ఆయన రెండు రోజులు సేలం వెడుతున్నాడు. ఈ లోపులో ఇద్దరి తోనూ మరి కొన్ని షూట్ చేయండి. ఎల్లుండి కణ్ణన్ అవుట్ డోర్ షూట్ కి వెడుతున్నాడు కాబట్టి రేపటి లోపులో పూర్తి చేయండి" అని ఆయన వెళ్లి పోయాడు. మర్నాడు చేయబోయే షూట్ వివరాలూ, డ్రెస్ ల గురించీ వాళ్లకి బ్రీఫ్ చేయమని చెప్పి, దేవరాజన్ వేరే పనిమీద వెళ్లి పోయాడు తను పని చేస్తున్న ఫ్లోర్ లో రిహార్సల్ రూమ్ కి కణ్ణన్ వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి కూర్చో పెట్టాడు. టీ ఆర్డర్ చేసి వచ్చి తను కూడా వచ్చి కూర్చున్నాడు వాళ్ళు ఎలా, ఎక్కడినించి వచ్చిందీ, రాజు గారు ఎలా తెలుసుననీ మొదలయిన వివరాలు అడిగాడు కణ్ణన్ దేవరాజన్ కంటే అతను మాట్లాడే పద్ధతి, సభ్యత, మంజరికీ, సుగుణకీ కూడా బాగా నచ్చింది. అతని చూపులూ సుగుణ చూపులూ కలిసినప్పుడల్లా సుగుణకి, చెడుగా కాదు కాని అదోలా అనిపించింది. దేవరాజన్ లో కనపడిన అహంభావం, దర్పం లేకుండా అతనిలో స్నేహ భావం కనపడింది " రషస్ చూసిన తరువాత, కణ్ణన్ కి కాసీ పాండ్యన్ అన్న మాటలు నోటిదాకా వచ్చి ఆగి పోయాడు. రాజు గారితో మాట్లాడే దాకా దేవరాజన్ ని చెప్ప వద్దన్నాడంటే అది తనకీ వర్తిస్తుంది. పెద్ద వాళ్ళతో గొడవ ఎందుకు? అని ఊరుకున్నాడు. మర్నాడు ఎఎ డ్రెస్సులతో రావాలో చెప్పి వెళ్ళిపోయాడు. మరునాడు రెండో షూట్ చేసి, దేవరాజన్ కి అందించి, కణ్ణన్ తను పనిచేస్తున్న సినిమా అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లి పోయాడు. రాజు గారి సలహా మేరకు, కాసి పాండ్యన్ తో అగ్రిమెంట్ అవడం, వేరే అపార్ట్ మెంట్ లోకి మారడం జరిగిన కొద్దిరోజులకే కణ్ణన్ సుగుణ పెళ్లి చేసుకున్నారు. సుగుణ కొద్దిరోజులకే గర్భవతి అవడంతో ఆమె ఏక్టింగ్ కరీర్ స్టార్ట్ అవనే లేదు. మంజరి మాత్రం ఒక దాని తరువాత మరొకటి సినిమాలతో బిజీ అయిపొయింది. దేవరాజన్ దర్శకుడు గా మంజరి తో తీసిన సినిమా బాగా హిట్ అయింది. అతను దర్శకుడుగా, మంజరి తార గా, బాగానే గడించారు. కాని సుగుణ, కొడుకు పుట్టాకా మంజరి ప్రోత్సాహం తో కొన్ని వేషాలు వేసినా, అంతరాణించ లేక పోయింది. కణ్ణన్ బాగానే చూసుకున్నా ఎప్పుడూ ఎదో ఆలోచనలతో సతమత మవుతూ చలాకీ తనం పోయి రెండు సంవత్సరాల లోపే కేన్సర్ వ్యాధితో చనిపోయింది. ఒక ఏడాది తరవాత కణ్ణన్ ఇంకో చిన్న ఆర్టిస్ట్ కుముదం ని పెళ్లి చేసుకున్నాడు. అయినా కొడుకుని తీసుకుని తరుచు వచ్చి కలుస్తూనే ఉంటాడు. మంజరి దేవరాజన్ కి 'మిటూ' ట్విట్టర్ గురించి ఫోన్ చేయడానికి ఒక నెల ముందు, కణ్ణన్ కుటుంబం తో సహా మంజరి ఇంటికి లంచ్ కి వచ్చాడు. ఇద్దరూ బిజీ గా లేనప్పుడు, అప్పుడప్పుడు కలవటం మామూలే. కణ్ణన్ కేమెరమాన్ గా పెద్దగా ఎదగక పోయినా, సంపాదన సుమారు గా వస్తోంది. భాష భేదం లేకుండా చిత్ర పరిశ్రమని 'మిటూ' దుమ్ము రేపుతోంది. పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్నవాళ్లు రాత్రికి, రాత్రి విలన్ లు అయిపోతున్నారు. పేరు పోవడమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా దెబ్బ తగులుతోంది. పరిశ్రమలో ఏ ఇద్దరు కలిసినా సంభాషణ 'మిటూ' యే కాబట్టి వాళ్ళిద్దరి మధ్యా కూడా అదే ప్రారంభ మయింది. " ఇలాంటి వేమీ లేకుండా మేము బాగానే బయట పడ్డాము" అంది మంజరి కణ్ణన్ తో '" 'నేను' అంటే ఒప్పుకుంటాను 'మేము' అంటే ఒప్పుకోలేనేమో ! మీరు 'మేము' అని ఎప్పుడు అన్నా సుగుణ ని కూడా కలుపుతారు కదా ?" అన్నాడు కణ్ణన్ నర్మ గర్భంగా అని, పక్కనే కూర్చున్న భార్య కుముదం తో కొడుకు రామన్ ని బయటికి తీసుకుని వెళ్లి ఆడించ మన్నాడు. వాళ్ళు వెళ్లిన తరువాత " అదేమిటి సుగుణ అంటున్నారు. నాకు తెలియకుండా సుగుణకి ఏమి జరిగింది? మీరు ఏమన్నా దాస్తున్నారా?" అంది ఆత్రుత గా " నా చేత ఒట్టు వేయించుకుంది. కాని మనిషే పోయిన తరువాత దానికి విలువ ఏమిటి? ఇప్పుడు ఉన్న ఈ 'మిటూ' కలకలం అప్పుడుంటే తనకి అలా అయి ఉండేది కాదు" అన్నాడు విచార వదనంతో " విషయం పూర్తి గా చెప్పండి. అసలు ఏమి జరిగింది? నాకు తెలియకుండా దానికి ఏమిజరుగుతుంది. ఇద్దరం ఒకటే అన్నట్టు మెలిగాము. అటువంటిది నాకు ఎందుకు తెలియలేదు?" అంది చాలా ఆందోళన పడుతూ " మీరు ఇక్కడికి వచ్చిన కొత్తలో కాశీ పాండ్యన్ స్క్రీన్ టెస్ట్ షూట్ చేయమన్నారు గుర్తుందా? రెండో షూట్ చేసిన తరువాత నేను అవుట్ డోర్ కి పది రోజులు వెళ్లి పోయాను కదా? నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు కాసీ పాండ్యన్ గారి సినిమా షూటింగ్ రిహార్సల్ లో ఉన్నారు. అప్పటికే అగ్రిమెంట్ అవడం, మిమ్మలిని మూడు చిత్రాలకి కాసీ పాండ్యన్ దగ్గరే పనిచేసేలా అగ్రి మెంట్ అయింది కదా?. దానికి ముందు మీకు తెలియనిది చాలా జరిగింది. నేను తిరిగి వచ్చిన తరువాత మిమ్మలిని రిహార్సల్ లో చూసి సుగుణ గురించి అడిగితే " బస లోనే ఉంది. ఒంట్లో బాగోలేదనుకుంటా నాతో రానంది" అని మీరు చెప్పారు. నేను ఖాళీ దొరకగానే మీ బస కి వెళ్లాను. సుగుణ ఒక్కత్తి ఉంది. మీరన్నట్టు గానే చాలా నీరసం గా ఉంది. నేను చాలా సేపు కూర్చుని, గుచ్చి గుచ్చి అడిగితే, ముందు బావురుమని ఏడిచి 'ఘోరం గా మోసపోయానని అంది. ఆమెకి ధైర్యం చెప్పి విషయాలు అడిగాను. రాజు గారితో అగ్రిమెంట్ విషయం మాట్లాదేదాకా మీకు ఎ విషయమూ చెప్పవద్దని కాసీ పాండ్యన్ గారు చెప్పినది, దేవరాజన్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. " అవును నాలుగు రోజులు నాతో కూడా ఏమీ చెప్ప లేదు. కాని రిహార్సల్స్ చేయించ మన్నారని, ఎవరో వైజాగ్ నుంచి వచ్చిన నాటకాల ఎక్స్పర్ట్ తో నాకు సంబాషణల మామాడ్యులేషన్ నేర్చుకోవడానికి స్టూడియో లో వదిలేవాడు" గుర్తు తెచ్చుకుంటూ అంది " అప్పుడే నాటక మాడాడు. మీకు అవకాశం నిర్ణయం తన మీద పెట్టారనీ, అది జరగాలంటే సుగుణ సహకరించాలని చెప్పి లొంగ తీసుకున్నాడు. మూడు రోజులు విచ్చలవిడి గా వాడుకున్నాడు. స్నేహం కోసం ఆ మాత్రం చేయక పోతే ఎలాగ ? అని, అతి త్వరలో వివాహం చేసుకుంటానని, చాలా చెప్పాడు. దేవరాజన్ చేసింది ఏమీ లేదనీ, స్క్రీన్ టెస్ట్ మెరిట్ మీదే మీకు ఛాన్స్ ఇచ్చారన్న నిజం ఆ తర్వాత తెల్సుకుని, మోస పోయానని నా దగ్గర బాధ పడింది. అప్పటినుంచీ దగ్గర అయి నేనే పెళ్లి విషయం చెప్పి ఒప్పించాను. కాని మనిషి కోలుకో లేదు. వెంటనే గర్భం రావడం అన్నీ మీకు తెలుసుకదా? పెళ్లి చేసుకునే ముందు నా చేత ఒట్టు వేయించుకుంది మీకు చెప్ప వద్దని. ఇంకో విషయం లో అనుమానం ధృఢ పడి మనసులో చాలా ఒత్తిడి కి గురి అయి ప్రాణం మీదికి తెచ్చుకుంది" " అదేమిటి ? అంది మంజరి ఆత్రుత గా " మా పెళ్లి అయిన తేదీ అవీ లెక్క కట్టుకుని, మా అబ్బాయి రామన్, దేవరాజన్ కొడుకని మనసులో పెట్టుకుంది" అదివినగానే మంజరికి ఒక్క మాటు ఆపుకోలేని దుఖం వచ్చింది. చేతులలో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడిచింది. వెంటనే లేచి కణ్ణన్ కాళ్ళకి నమస్కరించి " అన్నీ తెలిసి దానిని ఎంత బాగా చూసుకున్నావు కణ్ణన్? నీలాంటి వాళ్ళు ఆరుదు. " భలే వారే, సుగుణ ని చూసిన మొదటి రోజే నేను నిర్ణయించుకున్నాను. ఆమె మోసపోవడం తో నా అభిప్రాయం ఏమీ మారలేదు" అన్నాడు కణ్ణన్ మంజరి లేచి సోఫాలో కూర్చుని ఆలోచనలో పడింది. తన ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ చేసింది. అయన తో మాట్లాడి పెట్టేసి, మానేజర్ ని పిలిచి రెండురోజుల్లో తన పుట్టిన రోజు ఉందనీ, పార్టీ ఒకటి ఆరెంజి చేయమంది. కొంత మంది పేర్లు చెప్పి వాళ్ళని పిలవమంది, ముఖ్యంగా దేవరాజన్ వచ్చేలా చూడమని చెప్పింది. అతనికి ఇష్టమయిన డ్రింక్ తెప్పించి ఉంచమని కూడా చెప్పింది. ******* ముందుగా ఫోన్ చేసి, సాయంత్రం ఏడింటికి దేవరాజన్ మంజరి ఇంటికి వచ్చాడు. హాలు లోనే సోఫాలో ఒక ఎనిమిది తొమ్మిదేళ్ల దేళ్ళ కుర్రాడిని కూర్చో పెట్టుకుని కూర్చుంది. దేవరాజన్ వచ్చి విష్ చేసి కూర్చున్నాడు. ఏమిటి ఈ ఫోన్ కాల్ మంజరీ ? నేను అసలే కొత్త పిక్చర్ లాంచ్ తో చాలా బిజీ గా ఉన్నాను అన్నాడు తెచ్చి పెట్టుకున్న గంభీరత తో. " అది సరే లెండి.మీ అబ్బాయి ని కాస్త దగ్గరగా తీసుకోండి" అని రామన్ ని ఆయన దగ్గరగా వెళ్ళ మంది " నా కొడుకా? ఏమన్నా మతి పోయిందా?" అన్నాడు కోపం గా " నాకు మతి పోవచ్చు. కాని ల్యాబ్ వాళ్ళకి మతి పోయి ఉండదు అని ఎదురగా సెంటర్ పీస్ మీద ఉన్న డిన్ఎ రిపోర్ట్ అతని ముందుకు తోసింది " దానిని ఆత్రంగా చూశాడు దేవరాజన్. ముఖం వేళ్ళాదేశాడు. ఓహో పార్టీ పెట్టింది సెలైవా శ్వాబ్ కోసమన్న మాట. అనుకున్నాడు మనసులో "ఎవరు సుగుణా?" అన్నాడు తెల తెల పోతూ. " ఇంకొకళ్ళయితే నాకెందుకు?" అయితే ఇప్పుడు ఏమిటంటావు? "ఏముంది ? వాడిని నీ కొడుకుగా ప్రకటించి, పబ్లిక్ గా క్షమాపణ చెప్పు" కోపం నిగ్రహించుకుంటూ అంది " నేను నాశన మయిపోతాను. ఆస్తులన్నీ మా ఆవిడవి. ఇదేమన్నా తెలిస్తే నేను రోడ్డున పడతాను" అన్నాడు దీనంగా " ఒక పది కోట్లు వీడి పేరన డిపాజిట్ చేసి రసీదు చూపించు. లేక పోతే చిన్న పిల్లలు కూడా 'మిటూ' చేస్తున్నారని పరిశ్రమ ఆశ్చర్య పోతుంది. నీ పరువు తీసి, కేరీర్ పాడు చేస్తే వాడికి ఏమి ఒరుగుతుంది?ఒక వారం లో అది జరగక పోతే, తరవాత జరిగే దానికి నన్ను బ్లేం చేయకు" అని లేచింది. . "సుగుణ కోసం దేని కైనా తెగిస్తుంది ఇది" అని మనసులో తిట్టుకుంటూ, పదికోట్లు ఎలా సేకరించాలన్నది ఆలోచిస్తూ బయట పడ్డాడు.
సమాప్తం