చిన్ని ఆశ..! - ఇందుచంద్రన్

Chinni aasha

డాబా మీద బట్టలు ఆరేస్తున్నాడు గజిబిజి రావు , ఇంతలో పట్టీల చప్పుడు వినబడడంతో

అక్కడక్కడా చెప్పుకుంటుంటే విన్న అమ్మాయేమో అనుకుని ఎవరా

అందలా రాశి అని తలని 360 డిగ్రీలు తిప్పి చూడాలని ప్రయత్నించాడు మెడ కాస్త కలుక్కుమంది.

కుయ్ కుయ్ మని కుక్క పిల్లలా మూలుగుతూ

పట్టేసిన మెడని ఒక చేత్తో పట్టుకుని పక్క డాబా వైపు కి దండెం మీద కి వాలి ముందుకి వంగి చూసాడు.

శరీర బరువుని మోయలేక ఆ బట్టలదండెం కాస్త పుట్టుకుమని నేలకొరిగింది.

వెనక నుండి " ఓర్ని చేతులు పడిపోను , నీ దుంపదెగ నీకేం మాయరోగమొచ్చిందిరా , తెల్లార్ల

కాడ్నించి ఆ గుడ్డల్ని ఉతకలేక నా ఒళ్ళు ఊనమైతేను ముక్కి మూలిగి ఉతికి ఆరేస్తే తాడుతో పాటు

గుడ్డల్ని ఈ మట్టిలో పడేసినావ్ గదరా అంటూ ఎదురు ప్లాట్ లో ఉండే శాంతమ్మ లబోదిబో మని

మొత్తుకోసాగింది.

ఇంతలో ఆ అందల రాసి అదృశ్యమైపోయింది.

గజిబిజి రావు ఏమి ఎరగనట్టు మొహం పెట్టి " సారీ అన్నాడు మెల్లగా

శాంతమ్మ శాపనార్థాలు పెడుతూ మళ్ళీ అన్నీ బకెట్ లోకి వేసుకుని తీసుకెళ్ళింది.

గజిబిజి రావు కళ్ళు ఆ అందాల రాశి కోసం వెతకసాగాయి , ఈ సిటీలో పట్టీల చప్పుడా? అని మళ్ళీ

పట్టేసిన మెడని వొత్తుకుంటూ చుట్టూ చూసాడు

ఎక్కడ కనపడకపోయేసరికి కిందకి వెళ్ళిపోయాడు.

మన గజిబిజి రావు అసలు పేరు గంగాధర్ రావు , కంగారెక్కువ అలా అందరూ గజిబిజి రావని

పిలుస్తుంటారు.

సొంతంగా పుస్తకాలు షాప్ పెట్టుకుని ఉన్నాడు, ముప్పై ఐదేళ్ళు ఉండొచ్చు

చిన్నప్పటి నుండి అమ్మాయిలంటే ఆమడ దూరం పారిపోయేవాడు , పాతికేళ్ళొచ్చేసరికి తన కలల్లో

గీసుకున్న స్వప్న సుందరి లాంటి అమ్మాయే కావాలని పట్టుబట్టి వచ్చిన సంబంధాలన్ని వద్దన్నాడు

, ముప్పైలో బడ్డాక ఇతను చూడ్డానికి వెళ్ళిన అమ్మాయిలే వద్దనడం తో పెళ్ళి మీద ఉన్న ఆశలన్నీ

వదులుకున్నాడు.

కాని ఎప్పటి నుండో ఒక చిన్న ఆశ ఉండేది , తన మనస్సులో ఉన్న స్వప్న సుందరి లాంటి

అమ్మాయిని ఒకసారైనా చూడాలని ఆరాటపడేవాడు.

ఎక్కడ అమ్మాయిలు దర్శనమిచ్చినా వాళ్ళ ని ఆరాదిస్తూ చూస్తూ స్వప్న సుందరి

ఆనవాళ్ళున్నాయా? అని చూసేవాడు.

ఇన్నేళ్ళలో ఒకరు లేకపోవడమేమిటి ? అని ఆలోచిస్తూ ఉండేవాడు.

ఇప్పటికీ ఆడవాళ్ళంటే ఆమడ దూరం పారిపోయే గజిబిజి రావు బాగా మాట్లాడేది మాత్రం మంగ తో

మాత్రమే , మంగ ఇంట్లో పనులు చేయడానికి వస్తూ పోతు ఉంటుంది.

అలా అక్కడక్కడ విన్న మాటలన్ని మెదడులో పోగయ్యాక తెలిసింది పక్క ఇంట్లో అపురూప మైన

అందాల రాశి కొలువైందని , ఆమెని చూడ్డానికి గజిబిజి రావు వారం రోజులు గా ఆపసోపాలు

పడుతుండగా ఈ రోజు ఉదయం చేతికి అందినట్టే అంది చేజారిపోయింది.

ఆ అందాల రాశి గురించి మంగని అడిగితే చెప్పేస్తుంది , కాని ఒకరు చెప్పడం కన్నా చూడ్డం

బాగుంటుంది కదా? అని సినిమా రేంజ్ లో ఫీలయిపోయాడు

ఈ సారి ఆ స్వప్న సుందరి ఎలాగైనా చూడాలని గట్టిగా అనుకున్నాడు.

సాయంత్రం వంటగదిలో చపాతీలు పిండిని కలపబోతుండగా ఒక నవ్వు వినపడడంతో గిన్నె ని చేత్తో

పట్టుకుని బాల్కనీ వైపు కి పరిగెత్తాడు డాబా పైకి వెళ్ళడానికి వెళ్తూ ఉంది , దట్టంగా కమ్ముకున్న

పొగలా ఆ కురులు , ఎక్కు పెట్టిన బాణంలా ఉన్న నడుము , శంఖం లాంటి ఆ మెడ మొహం కూడా

కనిపిస్తే బావుండు అని నిక్కి నిక్కి చూస్తూ ఉండగా వేగంగా బలంగా వీస్తున్న గాలిజుయ్ మని బాల్కనీ

వైపు కి వచ్చి గిన్నెలోని పిండిని

గాల్లో కలుపుకుని కాస్త గజిబిజి రావు మొహానికి పులిమేసి వెళ్ళిపోయింది.

కళ్లు నులుకుంటూ మీద పడ్డ దుమ్ముని విదిలించుకుంటూ ఉండగా

"మళ్ళీ పై నుండి ఏం పోసి సచ్చావురా ఎదవా అని శాంతమ్మ అరుస్తూ ఎండ బెట్టిన మజ్జిగ

మిరపకాయల్ని తీసుకుని వెళ్తూ పైకి చూసి అరవసారింది.

వామ్మో అనుకుని మెల్లగా చప్పుడు లేకుండా హాల్లోకి జారుకున్నాడు గజిబిజి రావు.

మర్నాడు పుస్తకాల షాపు లో కూర్చుని వచ్చి పోయే వాళ్ళని చూస్తూ ఉన్నాడు

నిన్న వెనక వైపు నుండి చూసిన ఆ స్వప్న సుందరి గుర్తుకొచ్చింది.

తల్చుకుని మురిసిపోతు ఉండగా

"అంకుల్ 20 రూపీస్ అన్ రూల్డ్ నోట్స్ ఇవ్వరా అన్నాడు ఒక పిల్లాడు

అంకుల్ అన్న పదం వినగానే గజిబిజి రావు మొహం కాస్త మారిపోయి నోట్ బుక్ చేతికి ఇచ్చి

" అంకుల్ కాదు అన్న అని పిలువు అన్నాడు చిరునవ్వుతో

"ఒకే అంకుల్ అన్నాడు ఆ పిల్లాడు వెళ్తూ

"ఓర్ని పిల్ల పిచ్చుక ఈ సారి ఇటు రా నీ రెక్కలు కత్తిరిస్తా అన్నాడు గొణుక్కుంటూ

సాయంత్రానికి ఇంటికి వెళ్ళగానే పక్కింటి డాబా మీద అలికిడి విని బ్యాగ్ చెప్పుల స్టాండ్ దగ్గర పడేసి

విసవిసా మెట్లెక్కి పైకి వెళ్ళాడు.

ఆయాసంతో రొప్పుతూ పక్క డాబా మీదకి చూడగానే ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు అందులో ఆ

స్వప్న సుందరి కూడా ఉంది కాని అటు తిరిగి ఉంది.

ఈ చూసి తీరాల్సిందే అని పచార్లు చేస్తూ మాటి మాటికి అటు వైపు చూడసాగాడు.

విరబోసిన జుట్టు చెవులకి వేలాడే జుంకీలు తప్ప ఏమి కనబడటం లేదు ఏం చేయాలో తెలీక చిన్నగా

మనస్సులో ఉన్న పాటకి తగ్గట్టు విజిల్ వేస్తూ అప్పుడప్పుడు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు.

కళ్లు మధ్యలో ఉన్న ఆ అపరంజి బొమ్మ మీదే ఉంటే మరో పెద్ద ఆకారం అడ్డుకుని జూమ్ చేసినట్టు

దగ్గరికి వచ్చి " ఏవయ్య వయస్సు తగ్గ బుద్దండక్కర్లే , నీ కూతురంత వయస్సు ఉండదు దాన్ని చూసి

విజిల్ వేస్తున్నావు పదవే పోకిరి గాళ్ళు ఎక్కువైపోయారు అంటూ ఆ అపరంజి పక్కనున్న

పద్నాలుగేళ్ళ పాప చేయి పట్టుకుని లాకెళ్ళింది ఆ పెద్ద ఆకారం

బిక్క మొహం వేసుకుని ఆ స్వప్న సుందరి వైపు చూస్తూ మొహాన ఉన్న చెమటని తుడుచుకుని

కిందకి వెళ్ళాడు గజిబిజి రావు.

ఇలా కాదు రేపు నా గాత్రంతో కాకుండా మన గాన గంధర్వుల పాటలతో నా వైపు చూసేలా చేస్తా అని

పాత పాటలన్ని వెతుక్కుని ఏవి ప్లే చేయాలో ప్లే లిస్ట్ లో ఉంచుకున్నాడు.

పైకి వెళ్ళగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట " ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి పాటని ప్లే చేయాలి

అనుకున్నాడు.

కాసేపాగి నిన్నె పెళ్లాడతా లో " ఒక దేవత వెలసింది పాట ప్లే చేయాలి అనుకున్నాడు.

మర్నాడు రోజు లాగే షాప్ కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి డాబా మీదకి వెళ్ళాడు.

నిన్న లాగే ముగ్గురూ ఉన్నారు.

కాస్త తడబడుతూ అటు ఇటు తిరిగి డాబా మీదున్న పొగ గూటి పైన కూర్చొని జేబులో ఉన్న ఫోన్ తీసి

ప్లే లిస్ట్ ఓపెన్ చేసి పాట మీద క్లిక్ ఇవ్వబోయాడు చేతిలో ఫోన్ జారి పొరపాటున వేరే పాట క్లిక్

అయిపోయింది.

"ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది

ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది పాట హై వాల్యూమ్ లో ప్లే అయింది.

ఆ ఆంటీ అమాంతం మింగేసేలా , కళ్ళు పెద్దవి చేస్తూ వచ్చింది. బిక్క సచ్చిపోయి దిక్కులు చూస్తూ

ఉన్నాడు.

కంగారు లో పొగ గూటి పక్కనే ఉన్న ఎండు కొబ్బరి ముక్కల్ని పడేసాడు.

అప్పుడే వచ్చిన శాంతమ్మ " ఓరి నీ..నువ్వు ఎక్కడ దాపురించావురా అంటూ మొత్తుకుంటూ ఉండగా

ఫోన్ తీసుకుని గబగబా పరిగెత్తాడు గజిబిజి రావు.

ఇదంతా అయ్యే పని కాదు కాని మనకెందుకులే ఈ సోలో బ్రతుకే సో బెటర్ అనుకుని దుప్పటి తన్ని

పడుకున్నాడు.

రేపొక్కసారి ప్రయత్నిద్దాం కుదరకపోతే మంగ నే అడగాలి ఆ అపురూప సుందరి గురించి

అనుకున్నాడు మనస్సులో

మర్నాడు కౌసల్యా సుప్రజా రామా పూర్యా సంధ్యా ప్రవర్తతే..! చెవిలోకి వెళ్ళగానే బరువైన రెప్పల్ని

బలవంతంగా తెరిచి అరచేతుల్ని రుద్దుకుని మొహం మొహం మీద పెట్టుకుని అద్దం వైపు తొంగి

చూసాడు.

"నీ కేంట్రా వయస్సు తో పాటు అందం కూడా పెరుగుతుంది రా గంగాధర్ అనుకుని మురిసిపోయి

కాఫీ కలుపుకుని తాగుతూ పక్కింటి వైపు చూసాడు.

గాజులు , పట్టీల సవ్వళ్ళతో పాటు కిలకిల మని ఆ నవ్వు మనస్సులో చూడాలన్న ఆశని

రేకెత్తిస్తుంటే కాఫీ చల్లారిపోతుందేమో అన్న దిగులు ఒక వైపు చూడాలన్న ఆశ మరో వైపు ఏం

చేయలేక వేడి కాఫీని ఆబలాగా నోట్లో పోసుకున్నాడు. చెవులు ముక్కులోంచి పొగలొచ్చి ,

మొహంమంతా ఎర్రబడ్డది.

లుంగిని పైకెత్తి పట్టుకుని గబగబా మెట్ల వైపు కి వెళ్ళాడు , ఆ అమ్మాయి వరండాలో లేదు నిరశాగా

తిరగబోతుంటే ఆ అమ్మాయి డాబా మీదకి వెళ్తుంది వెనక నుండి చూస్తూ ఉన్నాడు.

పాచి రంగు చీరలో , జలపాతంలా జాలువారిన జుట్టుతో పాదాలు కందిపోతాయేమో అన్నట్టు పైకి

ఎక్కుతూ ఉంది.

"అమ్మాయిని ఇలా చూడ్డంతప్పు కదా గంగాధర్ అని మనస్సు హెచ్చరిస్తుంటే

"నా స్వప్న సుందరి ఈమేనేమో అని నవ్వుకుంటూ చూస్తూ ఉన్నాడు

తన మనస్సులో ఉన్న స్వప్న సుందరి ఈమనే అని మనస్సు గట్టిగా చెప్తున్నట్టు ఉంది.

మొహాన్ని చూడాలి అనికాస్త ముందుకి జరిగి దగ్గరగా చూడాలనుకున్నాడు కాని ముందు మెట్టు

ఉందన్న సంగతి మర్చిపోయాడు

జారి పడి ముక్కు కాస్త పచ్చడి అవడంతో పాటు దొర్లుకుంటూ కిందకొచ్చి

అక్కడే బట్టలు ఉతుకుతున్న శాంతమ్మని పీట మీద నుంచి నెట్టేస్తూ పడ్డాడు

"సచ్చాన్రా దేవుడో అంటూ శాంతమ్మ మరో వైపు కింద పడింది.

కాసేపటి " ముదనస్టపోడు అంటూ శాపనార్థాలు విని మెల్లగా కళ్ళు తెరిచాడు చుట్టూ జనం చుట్టు

పక్కల వాళ్ళంతా పోగయ్యారు శాంతమ్మ మైక్ సెట్ వాయిస్ విని

ఒంటి మీద గీసుకు పోయిన గాట్లు నొప్పి పుడుతుంటే ఉఫ్ అంటూ ఊదుకుంటూ లేవబోయాడు.

ఇంతలో అందర్ని " జరగండెహే జరగండి ఏదో పప్పు బెల్లం పంచుతున్నట్టు ఇలా

ముసురుకున్నారు అంటూ అందర్ని నెట్టుకొస్తూ గజిబిజి రావు ముందు నిలబడి

" కాలు ఇట్ట ముందుకెట్టండి సారు ఈ మందేస్తా మంట సరుక్కుమని ఆగిపోద్ది అంది పక్కింట్లో పని

చేసే పనావిడ మంగ అదే పాచిరంగు చీర , ఎర్ర జాకెట్టు..

"మంగా నువ్వా అన్నాడు నోరెళ్ళ బెట్టొ చూస్తూ

"ఏవైనాది సారు ? అంది అమాయకంగా చూస్తూ

అందరూ ఒక్కొకరు గా వెళ్ళిపోతూ ఉండగా " నువ్వేనా ఇందాకా డాబా పైకి వెళ్ళింది అన్నాడు

గజిబిజి రావు

"ఆ అవును నేనే సారు , వడియాలు ఎండబెట్టినారు ఆ పాడుకాకులు ఉంటయా చెప్పండి పైకి

కిందకి తిరగలేక చస్తున్నా అంది మందు రాస్తూ

"ఈ అవతారం ఏంటి ? అన్నాడు కాస్త తడబడుతూ

మంగ కిసుక్కుమని నవ్వి " ఇయన్ని ఆ ఇంట్లో పిల్ల ఇచ్చింది , ఆయమ్మ సినిమాల్లో ఏసుకుంటారు

గదా ఈరోయినిలు అట్టాంటి మేకప్ లు చేస్తాది , నాకు చేసింది అంది నవ్వుతూ

ఎప్పుడు చెదిరిన జుట్టు , మాసిన చీర తో ఉండే మంగ అసలు గుర్తు పట్టలేనంత మారిపోయి ఉంది

పిచ్చోడిలాగా చూడాలని ప్రయత్నించిన ప్రతి సారి ఏదో ఒక అడ్డు పడటం , కన్న కలలని ,

ఆరాటాన్ని గుర్తు చేసుకుని నవ్వసాగాడు.

ఇంతలో రాసుకున్న చోట నొప్పు పుట్టడంతో ఉఫ్ అని ఊదుకుంటూ లేచి వెళ్లిపోయాడు.

కాస్త దూరం వెళ్ళ గానే ఆగి వెనక్కి తిరిగి " మంగా నిజంగా హీరోయిన్ లాగున్నావ్ అన్నాడు చూస్తూ

"ఊరుకోండి సారు మీరు మీ జోకులు అంది నవ్వుతూ

"జోక్ కాదు మంగ నిజం గా ఇదిగో శాంతమ్మ మీద ఒట్టు అన్నాడు శాంతమ్మని చూసి నవ్వుతూ

"దొంగ సచ్చినోడా నీ చేతులు పడిపోను నా ఆయుషుతో ఆడుకుంటావేందిరా అంటూ తిట్ట సాగింది.

శాంతమ్మ బుగ్గల్ని పట్టుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు.

మరిన్ని కథలు

Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి