“అతివ”ర్జయేత్ - Dr PK.Jayalakshmi

Ativarjayet

గుళ్ళో పూజ అయ్యాక తోట లో కూచుని ప్రసాదం తింటూ “ఆస్ట్రేలియా లో చదువు పూర్తి చేసుకుంటున్న శ్రీవంశీధర్ కి , కాకినాడ లో ఫార్మసీ చదువుతున్న ఈఅందాల భరిణే కీ జాతకాలు కలవడం, ఆన్ లైన్ లో పెళ్ళిచూపులు చూడ్డం,తమరు ఇండియా రావడం, నాలుగు రోజుల్నించి పెద్దవాళ్ళ అనుమతి తో మనం ఇలా కలిసి విహరిస్తూ ఒకళ్లనొకళ్లు అర్ధం చేస్కోవడం, ఇంక త్వరలో నిశ్చితార్ధానికి ముహూర్త నిర్ణయం... తర్వాత పెళ్లి..ఎలా అన్పిస్తోంది వంశీ నీకు?” మురిపెంగా అడిగింది అనూహ్య. “మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఊరికే అన్నారా పెద్దలు? . అన్నట్టు మీ అక్క పెళ్లి నిరుడే అయినట్టుంది కదా?దగ్గర్లోనే నీ పెళ్లి. మీ పేరెంట్స్ కీ భారమే మరి”. అన్నాడు కన్సర్న్ చూపిస్తూ.

“తప్పదు మరి. ఆడపిల్లల్ని కన్నప్పుడు!. తనేమో డిగ్రీ చదువుకుంది. బావగారు కాలేజ్ లెక్చరర్ కావడంతో కట్నం బాగానే ముట్టచెప్పారు.ఇంక నా సంగతంటా వా.. నేను తన కంటే బాగుంటాను, పైగా ఫార్మసీ చదువుతున్నాను . మీ పేరెంట్స్ మన జాతకాలు కలవడంతో పిల్ల అందంగా ఉండి, బాగా చదువుకున్నదయితే చాలు కట్నకానుకలతో పనిలేదని కబురు చేశారు. చూశావా మా వాళ్ళకి కట్నం బాధ ఎలా తప్పించానో?” అంది భుజాలెగరెస్తూ.

తల్లిదండ్రుల సంస్కారానికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు. “మీ ఇల్లు చాలా చాలా బాగుంది ఇంటీరియర్స్ కే చాలా ఖర్చయ్యి ఉంటుంది. భాను గుడి దగ్గర ఇంకొక ఇల్లుందన్నారు. అది ఇంత అందం గానే ఉంటుందా?” కూపీ లాగింది.

“అది ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్.”.

“ఓ ఫ్లాటా!” పెదవి విరిచింది. “ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరిద్దరు అన్నదమ్ములకి పంచుకోవడానికి బాగుండేది”.

“అదేంటి అనూ అలా అంటావు? ఇది మా పేరెంట్స్ కష్టార్జితం. అయినా నేను సంపాదించి కొనుక్కోలేనా.?”

“ సరేగాని నువ్వు రెండేళ్ల నించి ఆస్ట్రేలియా లో ఉంటున్నావు కదా .. ఇంతవరకు ఎవ్వర్నీ ప్రేమించలేదా?” అనుమానంగా అడిగింది.

“తల్లీ!? నేను వెళ్లింది చదువుకోవడానికి. ప్రేమ పాఠాలు వల్లె వేయడానికి కాదు. మనకిక్కడ అందమైన అమ్మాయిలకి కొదవైతే కదా ? ఫారెనర్ ని ప్రేమించాల్సిన అగత్యం ఏంటి?” చిలిపిగా నవ్వాడు వంశీ

“వాళ్ళు చాలా తెల్లగా, అత్యాధునికంగా ఉంటారు దానికి తోడు డేటింగులూ అవీ మామూలే కదా. నువ్వేమైనా టెంప్ట్ అయ్యావేమో... నని” దీర్ఘం తీసింది.

“అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఆస్ట్రేలియా లో ఫ్లాట్ ఏమైనా కొన్నావా?”ఆరా తీసింది.

“ఇంకా స్టూడెంట్ నే కదా!పి.ఆర్ రావాలి. వస్తే పేరెంట్స్ కూడా వచ్చేస్తారు మన దగ్గరికి. వారిది ప్రేమవివాహం కావడంతో ఎటునించీ సపోర్ట్ లేక మా కోసం ఎన్ని అవస్థలు పడ్డారో?. స్వయం కృషితో పెద్ద స్థాయికి ఎదిగారు.. ఆ స్ట్రేలియా లో చదువుకోవాలని ఉందనగానే మారు మాటలేకుండా పంపించారు. తమ్ముడిని కూడా వాడికి నచ్చినట్టు చదివిస్తున్నారు. వాళ్ళని సంతోషపెట్టాల్సిన బాధ్యత నాదికూడా.” అన్నాడు.

అదేంపట్టనట్టు “ నువ్వు ఫారెన్ లో రెండేళ్లబట్టి ఉంటున్నావ్ .. అక్కడ ఎవరి జీవితం వారిదని , పేరెంట్స్ తో కల్సిఉండరని విన్నాను.”అంది అతిశయం గా ఎగసిపడుతు న్న అలల్ని చూస్తూ. వంశీ కి అర్ధమైంది ఆమె ఆంతర్యమేంటో? “చెప్పా కదా అనూ! అక్కడ వ్యక్తి ముఖ్యం. మనలా పెళ్ళికి,కుటుంబ వ్యవస్థ కి , సమాజానికి ప్రాధాన్యత ఇవ్వరు.”

“నాకు విదేశీయుల్లో చాలా నచ్చిన అంశం అదే. ఎవరికి వారు స్వతంత్రంగా పెద్దవాళ్ళ పెత్తనం లేకుండా హాయిగా ఉంటారు. అవసరమైనప్పుడు.. అదే మనకి పిల్లలు పుట్టినప్పుడు హెల్ప్ చేయాడానికి వస్తే అభ్యంతరం లేదు. కానీ పూర్తిగా మన దగ్గరే అంటే .... “ నీళ్ళు నమిలింది “అయినా మీ పేరెంట్స్ ఆస్తిపరులు. అంతగా చేసుకోలేని పరిస్తితి వస్తే కాస్ట్లీ ఓల్డెజ్ హోమ్స్ ఉండనే ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతివాళ్ళకి ప్రైవసీ చాలా అవసరం వంశీ...”

“మరి మీ పేరంట్స్ సంగతో?”...

“మా బావగారికి తల్లిదండ్రులు లేరుగా . వాళ్ళ దగ్గరే ఉండిపోతారేమో! మనకేమీ బర్డెన్ కార్లే.” నవ్వింది.

“అన్నట్టు శుక్రవారం నా బర్త్ డే. ఏం గిఫ్ట్ ఇస్తావో చూస్తా. కార్లో రావాలి సుమా. ఎన్నాళ్లబట్టో ఆడి ఎక్కాలని ఆశ.” అందమైన ముఖం పై నల్లని ముంగురులు... చంద్రుడిపై చీకటి తెరలు పరుచుకుంటున్నట్టు.

**** **** ****

మర్నాడు మధ్యాహ్నం అనూహ్య ఇంటికి వెళ్ళేసరికి అందంగా అలంకరించుకొని ఎదురుచూస్తోంది.

“నీకో విషయం చెప్పాలి అనూ!” అన్నాడు గొంతు సవరించుకొని.

“ఏంటి? కార్లో రాలేదా కొంపతీసి? లేకపోతే కార్డ్ మర్చిపోయావా? అదేం కుదరదు... నాకు నచ్చిన డ్రస్సులతో పాటు బర్త్ డే కి మర్చిపోలేని గిఫ్ట్ కొనాల్సిందే”అంది పెంకి గా.

“అబ్బా వినవేం. నాకు పి.ఆర్ రాలేదు. ఇందాకే మెయిల్ వచ్చింది. ఈ సంవత్సరం చదువు అయిపోగానే ఇండియా తిరిగి వచ్చేయాల్సిందేనట..”... అనూహ్య ముఖం లో రంగులు మారిపోయాయి.

“పోన్లే,. నా అర్హతలకి ఎలాగైనా మంచి జాబ్ వస్తుందిక్కడ. మన పేరెంట్స్ కి అందుబాటులో ఉండొచ్చు హాయిగా.”

ఆమె తల్లి విసురుగా వచ్చి “ అదేంటి బాబూ! ఫారెన్ సంబంధమని ఆశపడి ఖాయం చేస్కున్నాం. చుట్టాలందరికి గొప్పగా చెప్పుకున్నాం అల్లుడు ఆస్ట్రేలియా అని. ఇప్పుడు ఎలా తలెత్తుకోగలం? మీ తల్లిదండ్రులది ప్రేమ వివాహమయినప్పటికి మీ నాన్నగారి వైపు వాళ్ళమని ఒప్పుకున్నాం. మా పిల్ల అందమైంది, బాగా చదువుకున్నది. నువ్వు కాకపోతే మరొకరు కళ్ళకద్దుకు చేసుకుంటారు. కావాలంటే అప్పు చేసైనా ఎంతోకొంత ముట్టచెప్తాం. ఏదో ప్రయత్నం చెయ్యి బాబు అక్కడే ఉండేలా” చెప్పుకు పోతోందావిడ.

“అమ్మా! ఇంక మాటలు అనవసరం.. అతనికి మొదటి నించి ఫారెన్ లో సెటిల్ అవడం ఇష్టం లేదు.ఎంతసేపూ పేరెంట్స్, దేశం, సంస్కృతి అంటూ పాత చింతకాయ కబుర్లే. చూడు మిస్టర్ వంశీ! నువ్వు ఆస్ట్రేలియా లో సెటిల్ అయితేనే మన పెళ్ళి” ఇంక నువ్వు వెళ్లవచ్చు అన్నట్టు చెప్పేసింది అనూహ్య.

**** **** ****

జరిగిందంతా తల్లికి వివరించాడు వంశీ. “అదేంటో నాన్నా. మాది ప్రేమ పెళ్లి కావడంతో అల్లుడిగా నాన్నగారికి ఏ ముచ్చట్లూ జరగ లేదని నీకు మంచి సంబంధం చేయాలని ఆశపడ్డాను..” బాధ పడింది మృదుల.

“అమ్మా పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో అమ్మాయి అందంగా ఉందా, జాతకాలు నప్పాయా,,కుటుంబం మంచిదేనా…. ఇవే ముఖ్యం గా చూస్తారు. కానీ అమ్మాయికైనా, అబ్బాయికైనా మనస్తత్వం, యాటిట్యూడ్... అంత కంటే ముఖ్యం కదమ్మా. మనిషి ఎంత అందంగా ఉన్నా సరైన మాటతీరు లేకుండా అహంకరిస్తూ, కుటుంబ విలువలని తోసిరాజంటూ ఆస్తులనే లెక్కవేసుకునే స్వార్ధపరురాలు నాకొద్దమ్మా.

నువ్వు ఇంజనీరింగ్ చదివి ఫారెన్ లో ఎమ్.ఎస్ చేయడానికి మంచి స్కోర్ వచ్చినా నాన్నగారి కోసం నీ కెరీర్ నే వదులుకొని బ్యాంక్ జాబ్ లో జేరావు. పెద్దనాన్న,ఇద్దరు బాబాయిలు ఉన్నా నాన్నమ్మ, తాతయ్య చివరిదాకా మనతోనే ఉన్నారు. వేరే కులమైనా నువ్వే వాళ్ళని బాగా ఆదరించావని మన ఊళ్ళో అంతా చెప్తారిప్పటికి.

ఇంకా నిశ్చితార్ధం కూడా అవలేదు...! నా మీద హక్కున్నట్టు మాట్లాడ్డం, ఎవర్నయినా ప్రేమించావాఅని అనుమానించడం, గిఫ్ట్ లు కక్కుర్తిగా అడగడం, ఆస్తుల గురించి ఆరాలడగడం, పేరెంట్స్ ని వృద్ధాశ్రమానికి తరలించడానికి పథకాలు వేయడం! పి.ఆర్. రాలేదన్న ఒక్క అబద్ధం నా జీవితాన్నే మేలి మలుపు తిప్పింది. అలాటి అతివ వద్దేవద్దు. నాకు అందం,ఆస్తిపాస్తుల కంటే మానవ సంబంధాలకి, కుటుంబ వ్యవస్థకి గౌరవమిచ్చే సంస్కారవంతురాలే కావాలమ్మా.” నిక్కచ్చిగా చెప్పేశాడు వంశీధర్.

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి