భాగవత కథలు – 15 చంద్ర వంశం - కందుల నాగేశ్వరరావు

Chandra vamsham

భాగవత కథలు – 15

చంద్ర వంశం

తార - చంద్రుడు

ఆత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. అత్రి మహర్షికి అనసూయ యందు బ్రహ్మ శివ కేశవాంశలతో చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మాంశతో జన్మించాడు. చిన్నతనంలోన చంద్రుడు దీక్షతో బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకు, ఓషదులకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తరువాత చంద్రుడు రాజసూయయాగం చేసి, దక్ష పుత్రికలను ఇరువది ఏడు మందిని పరిణయమాడాడు.

ఆ వయస్సులతోనే చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసంవిద్యాభ్యాసానికి వెళ్లాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రునిరాజధాని అమరావతికి యజ్ఞం చేయించడానికి వెళ్లాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవ్వింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మరిచిపోయి తార విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి బయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు.

ఎవ్వరు చెప్పినా చంద్రుడు తారను వదిలి పెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శతృత్వం మొదలైంది.రాక్షసుల గురువైనశుక్రాచార్యునకు, దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువలన శుక్రాచార్యులు రాక్షసవీరులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తార విషయంగా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. రెండు పక్షాలలో చాలా మంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకొన్నాడు.

బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుని మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు. “ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వేశ్యలాగ అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం దించుకో అన్నాడు”. అయినా తార వినకుండా చక్కటి బంగారు రంగుగల అందమైన బాలుణ్ణి ప్రసవించింది.ఆ శిశువు దివ్య తేజోవిలాసుడై మోహనాకారంతో ఉన్నాడు.

ఆ బాలుడిని చూసిన తరువాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువు తీర్చడానికి వచ్చిన దేవతలూ మునులూ ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు. తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది. అపుడు బ్రహ్మ ఆ బాలుడికి “బుధుడు” అని నామకరణంచేసి చంద్రుడికి అప్పగించాడు.

ఇళాకన్య – బుధుడు

కుమారుని తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి హద్దులు లేవు. ఆ బాలుడిని తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుడుని చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సుచేసి అధిక తేజోమూర్తియై గ్రహమండలంలో చోటు సంపాదించుకున్నాడు.

సూర్యుభగవానునికి విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ ద్వారా వైవస్వతుడు జన్మించాడు. ఆయన ఏడవ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వత మనువుకి తొమ్మండుగురు కొడుకులు. వారు వివిధ భూమండలాలకుపరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరల భాగ్యవంతుడైన ఇంకొక పుత్రసంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య రోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్లు చేయమని కోరి, వ్రతాన్ని ఆచరించింది. హోత యజ్ఞకుండాన్ని సమీపించి ‘కూతురు కలుగుగాక’ అని చెప్పి హవిస్సును సమర్పించాడు. హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు .

కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురుఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వసిష్టుడి వద్దకు వెళ్లి అడిగాడు. వసిష్టుడు దివ్వ్యదృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. “రాజా, హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు. నేను పరిష్కారం ఆలోచిస్తాను” అన్నాడు. పూజ్యుడైన వసిష్టుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి మునికోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ‘ఇళ’ మగవాడిగా మారి ‘సుద్యుమ్నుడు’ అనే పేరుతో పెరుగుతూ ఉంది.

ఆ సుద్యుమ్నుడు రాజ్యంచేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూరజంతువులనువేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరుపర్వతం దగ్గరున్న “కుమార వనం” చేరాడు. ఆ కుమార వనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు, రాజు వెంట వచ్చినవారూ అందరూ స్త్రీలుగా మారిపోయారు.

పూర్వం శివుని దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుని ఒడిలో ఉన్న పార్వతీ దేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివ దర్శనానికి సరియైన సమయం కాదని తలచి బదరీవనానికి వెళ్ళిపోయారు. తరువాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం “ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక” అని పలికాడు. ఆ కారణంగానే సుద్యుమ్నుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు.

ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్నుడు తాను స్త్రీ విలాసాలు కనపరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవ వశాత్తు చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమాన్ని చేరి అక్కడ విహరించే సాగేడు.రాజకుమార్తెచంద్రునికొడుకునిచూసింది. బుధుడుకూడాఆమెనుచూసాడు. ఆమె తన అందంతో, శృంగార చేష్టలతో బుధుని ఆకర్షించి, వలచి, వలపించి పరిణయమాడింది.ఆ బుధ ఇళా దంపతులకు ‘పురూరవుడు’ జన్మించాడు.

ఊర్వశి- పురూరవుడు

పురూరవుడు అందచందాలలో మన్మథుడికి, జయంతుడికి సాటియైనవాడు. ధైర్యవంతుడు, దానశీలి. సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశిఒక అప్సర కన్య. ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుని ద్వారా పురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ళ తరువాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావలసి వచ్చింది.పురూరవుడు ఉధ్యానవనంలో విహరిస్తూ ఒకచోట సేదతీర్చుకుంటున్నాడు. ఆ సమయంలోఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి పురూరవుని చూసింది.అతని అందానికి ముగ్దురాలై తనను తాను మైమరచిఅలా చూస్తూ ఉండిపోయింది.

అప్పుడు ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో “సుందరీ, ఎవరు నీవు? దేవ కన్యలా ఉన్నావు. ఇక్కడికి ఎలా వచ్చావు” అని అడిగాడు.“ రాజా, నా పేరు ఊర్వశి. నేను ఒక దేవ కాంతను. ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుని ద్వారా నీ అందచందాలు, పరాక్రమం గురించి విన్నాను.” అని సమాధానం ఇచ్చింది. పురూరవుడు కూడా అప్సర కాంత అందానికి, ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు. తన మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు పురూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందించింది. “రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించడం నాకు కూడా ఇష్టమే. కానినేను రెండు గొర్రె పిల్లలను నా బిడ్డలులా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి.వాటికి ఎటువంటి ఆపదా రాకుండా రక్షించాలి.నువ్వు దిశ మొలతో నాకు ఎప్పుడూ కనపడకూడదు. నా ఆహారం నెయ్యి. దానికి ఎప్పుడూ కొరత రాకూడదు. వీటిలో ఏది జరగకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను” అంది. రాజు ఆ నియమాలకు అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు.ఊర్వశీ పురూరవులిద్దరూ ఒక్కటై శృంగారజగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు.

కొన్నాళ్ళ తరువాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడుఆమె ఎక్కడుందో వెదికి పట్టుకు రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడి రాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలనుపట్టుకున్నారు.అవి భయంతో గట్టిగా అరవడం మొదలెట్టింది. ఆ అరుపులకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెను రక్షించడం కోసం పురూరవుడిని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కాని అలసి వళ్ళు మరచి మత్తునిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు.

“రాజా నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రె పిల్లలను దొంగలు ఎత్తుకు పోతుంటే లేవకుండా మొద్దనిద్ర పోతున్నావు. కళ్ళుమూసుకొని నిద్రపోతో నా కౌగిలి వదలడం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాధను అయ్యాను” అంటూ నోటికి వచ్చినట్టు తిట్టసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు, హటాత్తుగా లేచిన పురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తి పట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకు వచ్చాడు. అప్పుడు ఊర్వశి దిశమొలతో ఉన్న పురూరవుని చూసి.“నువ్వు నా నిబంధనలు పాటించకుండా దిశమొలతో కనపడ్డావు. తక్షణం నిన్ను వదలి వెళ్తున్నాను” అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది.

ఊర్వశి కనిపించకపోవడంతో పురూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగడం మొదలెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతీ నదీ తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూసాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగలించుకొని ‘నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళిపోయావని’అంటూ విలపించ సాగేడు.అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పురూరవుణ్ణి సంతోష పెట్టింది. మరునాడు ఉదయం నిద్రలేచాక రాజుతో “నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి. రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం తరువాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు. వారు నిన్ను కరుణిస్తారు.” అని నచ్చజెప్పి వెళ్ళిపోయింది. రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు.పురూరవుడు గంధర్వులను మనస్పూర్తిగా ప్రార్థించాడు.

సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు పురూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు. ప్రతిఫలంగా వారు ఒక అగ్ని కుండికను ఇచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞం ఫలంగా ఊర్వశితో బాటు తన కుమారుడు లభిస్తారని దీవించారు.

పురూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించేడు. దాని ఫలితంగా ఊర్వశిని, తన కుమారుని పొందాడు. ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ, ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక అయిదుగురు కుమారులను పొందారు. పురూరవుని కుమారులు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావశుడు, శతాయువు, చిరాయువుద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది.

-శుభం-

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి