యజ్ఞం - శింగరాజు శ్రీనివాసరావు

Yagnam

విభావతికి ఘనసన్మానం జరుగబోతున్నది నేడు. వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ లను చేరదీసి ఆమె నడిపిన సంస్థకు ప్రభుత్వం "అత్యుత్తమ సామాజిక సంస్థ" అవార్డును బహుకరించబోతున్నది. లాభాపేక్ష లేకుండా సాగుతున్న సంస్థ అది. అందులో పనిచేసే వారందరూ ఆ సంస్థలో భాగస్వాములే. అంతేకాక వారి సంస్థ నుంచి వచ్చే లాభాలతో ఒక అనాథ బాలికల ఆశ్రమ పాఠశాలను కూడ నడుపుతున్నారు. వీరందరికీ నాయకురాలు, సంస్థ వ్యవస్థాపకురాలు విభావతి. మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం రోజున విభావతిని సత్కరించబోతున్నారు. ఆ ప్రాంగణమంతా ప్రేక్షకులతో నిండిపోయింది. మహిళా సంక్షేమ శాఖా మంత్రి అనిత గారి రాకతో సభ ప్రారంభమయింది. విభావతి సామాజిక స్పృహను, ట్రాన్స్ జెండర్ లకు స్వయం ప్రతిపత్తి కలిగించడం కోసం ఆమె చేసిన కృషిని మంత్రితో సహా, వేదిక మీదనున్న పెద్దలందరూ కొనియాడారు. విభావతిని సన్మానించిన తరువాత, ఆమె విజయగాథను ఆమె నోటివెంట వినాలని మంత్రిగారు మాట్లాడమనడంతో విభావతి మైకు అందుకుంది. "వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన ప్రేక్షక సమూహానికి నా వందనములు. ఇది నా ఒక్కదాని విజయం కాదు. మా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిదీ ఈ విజయం. జీవితంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను చేరదీసి ఆదరించి ఈ రోజు ఇంతదాన్ని కావడానికి కారణమైనది ఒక ట్రాన్స్ జెండర్. వయసు ప్రభావంలో పడి, కామాన్ని ప్రేమనుకుని, పెద్దవాళ్ళను ఎదిరించి, నేను నమ్మిన వ్యక్తితో కలసి ఇల్లు వదలి వచ్చేశాను. అందరిలాగే నేనూ మోసపోయానని తెలిసేసరికి నేను గర్భవతినయ్యాను. ఒకరాత్రి లేచి చూసేసరికి నన్ను తీసుకొచ్చిన వ్యక్తి పత్తాలేకుండా వెళ్ళిపోయాడు. తప్పు జరిగిపోయింది క్షమించమని అడగాలని రైలు ఎక్కి మా ఇంటికి బయలుదేరాను. కానీ ఆత్మాభిమానం చంపుకుని పుట్టింటి గడప తొక్కాలని అనిపించలేదు. నన్ను తీసుకొచ్చిన వాడు ఇచ్చిన వాళ్ళ ఇంటి నెంబరుకు ఫోను చేశాను. అది రాంగ్ నెంబరని తెలిసింది. ఆత్మహత్య తప్ప వేరేదారి కనిపించలేదు. చదువుకున్నదాన్ని ఇంత తెలివితక్కువగా ఆలోచిస్తున్నానేమిటి అనుకున్నాను. కానీ ఏ తోడూ లేకుండా ఒంటరి ఆడది ఈ లోకంలో బ్రతకడం ఎలా? ఆ ప్రశ్నే నన్ను వేధించసాగింది. ఎంత ఆలోచించినా మగ మృగాలు సంచరించే ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకలేననిపించింది. పాపమైనా, నేరమైనా చావే శరణ్యమనుకుని రైలునుంచి దూకాలనుకుని గేటు దగ్గరికి వెళ్ళిన నన్ను, ఆ బోగిలోని వారిని దీవించవచ్చిన మాతంగులు అడ్డుకున్నారు. 'నువ్వు చావటం నీ ఇష్టం. కానీ నీ కడుపులో బిడ్డను చంపే హక్కు నీకు లేదని' నన్ను వారించారు. 'ఎవరి ఆదరణకు నోచుకోక, ఎవరితోటి ఆప్యాయతలను పంచుకోలేక, అందరిచేత అసహ్యించుకోబడే మేమే మొండికిబడి బ్రతుకుతున్నాము. మరి నువ్వెందుకు చావాలి' అని నిలదీశారు. నా కథ మొత్తం చెప్పాను. నీకు మేమున్నామని భరోసా ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. నా జీవిత పయనంలో కొత్త అధ్యాయం మొదలైంది. దూరంగా చూసేవారికి వీరిదొక వ్యర్థజీవితమనిపిస్తుంది. కానీ దగ్గరగా చూసిన నాకు మంచితనం ఇక్కడే మొదలయిందా అనిపించింది. భగవంతుడు చేసిన పొరపాటును సమాజం వేలెత్తి చూపిస్తున్నదే గానీ, వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదనిపించింది. వారి ఆదరణలో నేను పురుడు పోసుకుని ఒక ఆడపిల్లకు జన్మనిచ్చాను. నా మనసులోని ఆలోచనలకు శ్రీకారం చుట్టాను. చదువుకునే రోజులలో నేను నేర్చుకున్న టైలరింగును వెలికితీశాను. మొదటగా పదిమంది నాకు ఆశ్రయమిచ్చిన వారిని, వారి స్నేహితులను కలిపి ఒక సమూహంగా చేసి స్వయం సహాయక బృందంగా ఏర్పాటుచేసి బ్యాంకు లోను తీసుకున్నాము. ఆ డబ్బుకు, వాళ్ళ దగ్గర డబ్బును జతచేసి నాలుగు కుట్టుమిషన్లు కొన్నాము. వాళ్ళకు పని నేర్పుతూ నేను పని ప్రారంభించాను. చుట్టుపక్కల ఆడవాళ్ళు మా ఉత్సాహాన్ని చూసి, మాకు పని ఇచ్చి ప్రోత్సహించారు. అప్పటిదాక రైల్వేస్టేషన్లలో, బస్టాండులలో తిరిగే ట్రాన్స్ జెండర్స్ అంతా మాకు సహాయకారులుగా మారారు. వాళ్ళలో కొందరు తమకు తెలిసిన రెడిమేడ్ షాపుల వారిని కలిసి, రెడిమేడ్ గార్మెంట్స్ కుట్టిస్తాము. మీ షాపులో అమ్మి పెట్టమని అడిగారు. అంతకు ముందు వరకు అదోరకంగా ప్రవర్తించే వారంతా, ఎంతో సౌమ్యంగా, పద్ధతిగా అడిగేసరికి కాదనలేక పోయారు. అలా మొదలైన మా సంస్థ ఈ రోజు ఇంత పేరు తెచ్చుకున్నదంటే కారణం, మనము నిర్లక్ష్యం చేసి చిన్నచూపు చూసిన ఆ తోబుట్టువులే. ఈ ప్రయత్నంలో సాహసం నాదైతే, సహాయం వారిది, సహకారం బ్యాంకు వారిది. నమ్మి కష్టపడితే మనిషి సాధించలేని విజయం లేదని వారు నిరూపించారు. వారి ప్రోద్బలంతోనే అనాథ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రారంభించాము. అందులో బాలికలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడ ఉంటారు. వారు, మనము వేరు కాదనే నా అభిప్రాయం. అనాటమీలో మార్పు ఉండవచ్చు కానీ, మానసికంగా అందరమూ ఒకటే. ఈ ప్రయాణం ఇంతటితో ఆగదు. ప్రతి నగరంలోను ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేస్తాము. టైలరింగే కాదు, హోటళ్ళు, స్వీటు స్టాళ్ళు, ఇలా ఎవరికి ఏది ఇష్టమో దాన్ని వాళ్ళు ఎంపికచేసుకుంటారు. ఇది ఒక యజ్ఞంలా జరగాలి. మన సమాజంలో మనతో సమానంగా వారూ గౌరవం పొందాలి. అందుకోసమే నా ఈ ప్రయత్నం. ఇది సాహసం కాదు, కర్తవ్యం అనుకుంటాను. ఈ విజయం నాది కాదు, మా అందరిదీ. ప్రభుత్వం కూడ ఇందుకు ఇతోధిక సాయం అందిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని ముగించింది విభావతి. ప్రేక్షకుల కరతాళధ్వనులతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అక్కడ ఉన్న ట్రాన్స్ జెండరుల హృదయాలలో మంగళవాద్యాలు మ్రోగాయి. విభావతికి అందరూ తమ మనసులోనే ధన్యవాదములు తెలుపుకున్నారు. ***** అయిపోయింది*******

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి