సుమంగళి - మద్దూరి నరసింహమూర్తి

Sumangali

భారతీయ (సాధారణ) వనిత ఎప్పుడూ భగవంతుడిని మనసారా కోరుకొనేది ఒక్కటే – “తాళి కట్టిన భర్త చేతిలో తన జీవితం ముగిసిపోవాలని”. ఇది జగమెరిగిన విషయం.

అందుకేనేమో, తనని ఎవరేనా "దీర్ఘ సుమంగళీ భవ" అని ఆశీర్వదించాలని ఆకాంక్షతో ఉంటుంది.

ఈ లోకంలో భార్యకి భర్త, భర్తకి భార్య మాత్రమే కొసవరకూ తోడుగా ఉండేవారు అన్నది నిర్వివాదాంశం.

భర్త మీద ఆధారపడిన భార్యకి -- ముందుగా భర్త చనిపోతే :

పిల్లలు లేకపోయినా, ఉన్నది ఆడపిల్ల(లు) మాత్రమే ఐతే, ఆమె తదుపరి జీవనం సమస్యకే పెద్ద సమస్య. అధవా కొడుకు (లు) ఉన్నా -- భర్త చనిపోతే ఆ కొడుకు(లు) తనని ఎలా చూస్తారో అన్న భయం. భర్త పోయి కొడుకుల పంచన చేరిన తరువాత, ఒక రకంగా -- ఎంత కొడుకైనా -- ఆ ఇంట్లో జీతం భత్యం ఇవ్వక్కరలేని పనిమనిషి జీవితమే అన్నది ఆమె మదిలో మెదులుతూ -- అలా ఉండలేక, ఉండకుండా ఎక్కడికి వెళ్లలేక, మధన పడుతూ ఉండాలి అని ఊహిస్తుంది. ఆ ఊహే ఆమెకి భయానకంగా ఉంటుంది. అంతేకాక, భర్తపోయి కొడుకు పంచన చేరిన తరువాత ఆ ఇంట్లో స్వతంత్రం కరవై ఏది ముట్టుకోవచ్చో ఏది కూడదో, ఎక్కడ కూర్చోవచ్చో ఎక్కడ కూడదో, ఎక్కడ పడుకోవచ్చో ఎక్కడ కూడదో, ఎప్పుడు తినాలో, ఏది తినాలో. ఏది తినకూడదో అని ఒకరకమైన భయం, బెరుకు. వీధిలోకి, కనీసం దేవాలయానికేనా, ఒంటరిగా వెళ్లవచ్చా, చెప్పి వెళ్లాలా, చెప్పకుండా వెళ్లకూడదా, అసలు వెళ్ళేకూడదా, అథవా వెళితే, ఎంత సేపట్లో తిరిగి వచ్చేయాలి, ఎంత సేపైనా ఉండవచ్చా అన్న ఆలోచన. ఏదేనా పనిమీదవెళ్లే కొడుకుకైనా కోడలకైనా -- అనుకోకుండానైనా ఎదురు పడితే, ఏమనుకుంటారో అని ఆలోచించాలి. వీధిలో ఉన్నవారికి అనుకోకుండా నైనా ఎదురు పడితే, ఆ సంగతి మరి వేరే చెప్పక్కరలేదు. ఇంట్లో ఏదేనా కార్యక్రమము - అందునా శుభ కార్యక్రమము - జరిగితే ఆ మధ్యలోకి వెళ్లవచ్చా అన్న వెనకడుగు. ఇలా ఆలోచిస్తే అనుక్షణం తనకు అంటూ ఒక ఆలోచన కానీ, నిర్ణయం కానీ లేక అవతలి వారేమనుకుంటారనే ఆలోచించాలి. ఒక రకంగా పగలంతా వంటింటికి, పొద్దుపోతే ఏ మూలో ఓ బొంతమీదకి పరిమితమైపోవాలేమో. ఆ పడుకున్నదేనా, తనకి తోచినంతసేపు పడుకోకూడదేమో అన్న చింత. ఇంత నికృష్టమైన జీవనం ఇంకా ఎన్నాళ్ళో అన్న వెగటు, నిస్సహాయత. ఒకరికంటే ఎక్కువ కొడుకులుండి, వారి సుళువుకై తనని వాటాలు వేసుకొంటే, అది ఇంకా నరకం. ఒక కొడుకు దగ్గర వాటా సమయం అయిపోగానే, మరో కొడుకు దగ్గరకి చేరిపోవాలి. లేదంటే తనకి, ఆ పంచుకుంటున్న కొడుకులకి, తానొక పెద్ద సమస్యగా మారిపోతుంది.

అదే, భర్త నీడలో గడిపినన్నాళ్ళూ

తన రాజుకు తానే రాణి. దేనికైనా తన ఇష్టం. లేదా, తనకి అత్యంత ఇష్టమైన భర్త ఇష్టం. ఎవరికీ సంజాయిషీ చెప్పుకోక్కరలేదు. ఎలా అయినా ఉండవచ్చు. ఏమేనా చేయవచ్చు. తనవాడైన భర్తకి తప్పితే వేరెవరికి సమాధానం చెప్పక్కరలేదు. ఒకరి దయా ధర్మం మీద ఆధారపడక్కరలేదు. తన రాజు తనకి పెట్టి తాను తినాలనుకుంటాడు. తాను కూడా తన రాజు తిన్న తరువాత మిగిలితే తినాలనుకుంటుంది. ఉన్నదాంట్లోనే ఇద్దరూ పంచుకొని తింటారు. లేని నాడు, పస్తులున్నా ఫరవాలేదనిపిస్తుంది. అంతకంటే స్వర్గం ఇంకెక్కడ ఉంటుంది అన్న మనో నిబ్బరం, మనఃశాంతి.

రోజులు నెలలై, నెలలు సంవత్సరాలై -- తుది వరకు భర్త చేయి పట్టుకొని జీవనం సాగించి - చివరకి ఆ భర్త చేతిలో తన జీవనం ముగిసిపొతే చాలని కోరుకోవడం -- చాలా సబబైన కోరిక. తీరవలసిన కోరిక.

భర్త వేపునుంచి ఆలోచిస్తే :

నిజానికి నిష్టూరంలా అనిపిస్తున్నా, భర్త కూడా, తన చేతిలోనే భార్య జీవనం గడచిపోచాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకలా కోరుకోవాలి ?

వివాహం తరవాత, భార్య అత్తవారింటికి భర్తతో వచ్చినపుడు మనసా వాచా ఆయనని మాత్రమే నమ్ముకొని వస్తుందితప్ప -- ఆయన తరఫు వారిని నమ్ముకొని కాదు. వివేకం ఉన్నవారెవరైనా ఇది సత్యమని అంగీకరించవలసిందే. ఆ భర్త “జీవితాంతం తనకు తోడుగా ఉంటానని” పెద్దలందరి ముందర అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, కొన్నాళ్ల జీవనం తదుపరి తనను వదలి పై లోకాలకి వెళ్లి పోతానంటే ఎలాగ? అది పెద్దలందరి ముందర అగ్ని సాక్షిగా భార్యకి ఇచ్చిన మాట తప్పడం కాదా? భర్త పోయిన తరువాత భార్య జీవనానికి ఎవరు బాధ్యులు? తప్పని ఆమె దుఃఖానికి, తప్పించుకోలేని ఆమె దుఃఖమయ జీవనానికి - కారకులు, కారణం ఎవరు? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అని సరిపెట్టుకోవాలంటే ఎలాగ?

కానీ, ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించక మానదు.

పెళ్ళిలో పెద్దలందరి ముందర అగ్ని సాక్షిగా ప్రమాణం ఇద్దరూ చేస్తారు కదా - మరి భర్త ఒక్కడే ఆ ప్రమాణం నిలబెట్టుకోవడానికి కారణభూతుడనడం ఎంతవరకు సమంజసం.

ఆ ప్రశ్నకి జవాబుగా -- ఒక్క విషయం గ్రహించాలి. భర్తతో భార్య వచ్చింది కానీ భార్యతో భర్త వెళ్ళలేదు కదా.

అందుకై, ఆ ప్రమాణం నిలబెట్టుకోవడంలో భర్తదే బాధ్యత అనడంలో, ఏమాత్రం అసంబద్ధత కానీ అన్యాయం కానీ లేదు.

భార్య లేకపోతె భర్త జీవనం

పిల్లలు ఆదరించకపోయినా, ఇంట్లో ఉండడానికి సహకరించకపోయినా, కనీసావసరాలకి ఒకరికంద చేయి పెట్టక్కరలేకుండా ‘సత్రం భోజనం మఠం నిద్ర’ అన్నట్లు శేష జీవితాన్ని గడిపేయగలడు.

భర్త లేకపోతె భార్య జీవనం

భార్యకి అలా గడవదు, ఈ లోకం అలా ఉండనివ్వదు.

అందుకే, అన్నివిధాలా ఆలోచిస్తే, భర్త చేతిలో భార్య వెళ్లిపోవడమే ఉత్తమం. అందరూ ఆమోదించవలసిన పచ్చి నిజం.

అయితే, ఇక్కడ పెద్ద సమస్యచావు పుట్టుకలు మన చేతిలో లేవు కదా. మనం కోరుకుంటే సరిపోతుందా?

మరి పరిష్కారం ?

మునుపటి రోజుల్లో -- వధూవరులకి పదేళ్లు, లేకపోతే ఆ దగ్గరదగ్గరగా, వయోబేధం ఉన్నా ఏవో కొన్ని కొన్ని కారణాలవలన పెళ్లిళ్లు చేసేసేవారు. రోజులు గడచినకొద్దీ పెళ్లిళ్లలో ఆ వయోబేధం తగ్గడం జరిగింది.

‘కలౌ షష్టి’ అని ఆర్యోక్తి కాబట్టి, ఆ వయోబేధం ఒకటి లేదా రెండు ఏళ్లకంటే ఎక్కువ ఉండకుండా చూసుకుంటే -- భర్త జీవించి ఉన్నప్పుడే భార్య పరమపదించడానికి, అవకాశం లేకపోలేదు.

ఈ విషయం సమర్ధించడానికి కొందరు -- భర్త కంటే భార్య ఎక్కువ వయసున్నదైతే సమస్యే లేదుకదా -- అని ఆలోచించకపోరు. కానీ, అలా చేస్తే – వరహీనం, శాస్త్ర విరుద్ధం.

ముఖ్యంగా గమనించవలసిన విషయం.

ఎవరేనా చనిపోయేటప్పుడు బాధ్యతలనించి విముక్తి అవాలని కోరుకుంటారు. కోరుకోవాలి కూడా. అలాంటప్పుడు, భార్య కంటే భర్త ముందుగా చనిపోతే, తనమీద ఉన్న భార్య బాధ్యత నుంచి ఎలా విముక్తి అవుతాడు. ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే పోతాడు తప్ప, సుఖంగా చనిపోలేడు. భర్త కంటే ముందుగా పోయే భార్యకి ఆ సమస్య అంతగా బాధించదు - పైగా తన కోరిక తీరి భర్త చేతిలో సుమంగళిగా పోతున్నందుకు సంతోషంగా భగవంతునిలో ఐక్యమైపోతుంది. ఆమెతో పాటూ భర్త కూడా భార్య ఎడల తన బాధ్యత తీర్చుకున్నందుకు సంతృప్తి పడతాడు.

కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే -- మీరు పురుషుడైనా, స్త్రీ అయినా, నాతో తప్పక ఏకీభవిస్తారు.

*****

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి