టి. వి. సీరియల్స్ ప్రభావం - Lanka Sita

TV serials prabhavam

సుమిత్ర తొందరగా వంట ముగించి చేతులు కొంగుని తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూలబడింది. అప్పుడే పదకొండయిపోయింది వెధవది ఎంత తొందరగా లేచి పని తెముల్చుకుందామన్నారోజూ సీరియల్ వేళ్టికి పరుగున పరుగున రావడమే. ఎక్కడ మిస్ అయిపోతుందో అని టెన్షన్ . అసలే మంచి రసపట్టులో వుంది. దాందుంప తెగ ఆత్త ముండ కోడలిని కాల్చుకు తింటోంది. కూచుంటే తప్పు నిల్చుంటే తప్పు. మహా ఆవిడే అత్తగారయినట్లు. ఇవాళ ఏమవుతుందో ? అనుకుంటూ సోఫాలో కూర్చుంది. ఇంతలో వెనక నుంచి సాహితి “ అమ్మా! అన్నం పెట్టవే” అంది. “ అబ్బా! ఉండేవే కాసేపాగు” అని సీరియల్ ధోరణిలో పడిపోయింది. వెధవ ఎడవర్ టైజ్మెంట్స్ ఎంత సేపటికి పూర్తవవు . దీనికే ఓ పది నిముషాలు పట్టేస్తుంది. ఇంక సీరియల్ మొదలు పెట్టి ఇంకా పది నిముషాలు అవకుండానే మళ్ళీ ఎడవర్ టైజ్మెంట్. మళ్ళీ “ అమ్మా! అన్నం పెట్టవే” అంటూ వెనకనించి విని చెప్పానా కాసేపు ఆగమని ఎందుకు అలా అరుస్తావు?” అని కసురుకుంది. ఎడవర్ టైజ్మెంట్స్ పూర్తీ అయి సీరియల్ మొదలయింది. మంచి ఇంటరెస్టింగ్ సీన్ నడుస్తోంది. సాహితి మళ్ళీ గట్టిగా “అమ్మా!అన్నం పెడతావా లేదా?” అని అరిచింది. దీనిదుంపతెగా చెవికోసిన మేకలాగా అరుస్తుంది. 'ఏం కాసేపు ఆగలేవా? ఎప్పుడు అన్నం మొహం ఎరగని దానిలాగా ముష్టి దానిలాగా అన్నమో అని అరుస్తావు. కాసేపు ఆగితే ప్రాణం పోదులే. వుండు ఈ సీరియల్ అయ్యాక పెడతాను” అని విసుక్కుని తన ధోరణిలో పడిపోయింది. సాహితి అలాగే నేలమీద కూర్చునే నిద్ర పోయింది. సీరియల్ కధ కాస్త ఎడవర్ టైజ్మెంట్ట్స్ మూడువంతులు అయి చివరికి యాభయి నిమిషాల తరువాత లేచింది. సీరియల్ హడావుడిలో గ్యాస్ మీద పెట్టిన చారు మాట మర్చిపోయిది. అది కాస్తా మరిగి అడుగంటింది.

పిచ్చిముండ! నిద్రపోయింది. లేపి అన్నం పెట్టాలి అనుకుని మళ్ళీ చారుకి నీళ్లు పెట్టి చింత పండు, ఉప్పు, పసుపు వేసింది. ఇంతలో స్నేహితురాలి ఫోను. “సుమిత్రా! చూసావా రాధ అత్తగారు ఏం చేసిందో?” అంటూ సీరియల్ విశేషాలు తిరగ తోడింది. జరిగిపోయిన ఎపిసోడ్లు , ఈనాటి ఎపిసోడు ముచ్చటించేసరికి సంభాషణ ఇంకో అర్ధగంట సేపు సాగింది. అప్పటికే ఒంటిగంట అయింది. పిల్లని లేపి అన్నం పెట్టాలి. అది స్కూల్ కి వెళ్ళాలి అనుకుంది. పిల్లని లేపుతూ వొంటి మీద చెయ్యి వేసేసరికి వొళ్ళు కాలిపోతోంది. అయ్యో దీనికి జ్వరము వచ్చింది. అయ్యో రామా ఇప్పుడు ఏ డాక్టరు దగ్గిరికి వెళ్ళాలి అనుకుంటూ భర్తకి ఫోను చేసింది. డాక్టరు సూర్యనారాయణ దగ్గిరికి తీసుకు వెళ్ళు అని సమాధానము చెప్పాడు. ఇప్పుడెలాగా వెళ్లి రావాలంటే కనీసం ఒక గంటయినా పడుతుంది. ఈలోపున రెండుగంటల సీరియల్

మొదలయిపోతుంది. ముందు దీనికి ఏమయినా పెట్టాలి. నేను కూడా అన్నము తినాలి. ఇవన్నీ అయెప్పటికి ఓ అర్ధగంట పడుతుంది. ఈపూటకి కాస్త క్రోసిన్ సిరప్ ఉందిగా అది వేస్తాను. సాయంత్రం ఆయన వచ్చాక ఆయనే తీసుకు వెడతారు అని క్రోసిన్ సిరప్ వేసి పాలు తాగించి పాడుకోబెట్టేసింది. తనుకూడా భోజనము చేసి మళ్ళీ సోఫాలో సీరియల్ చూడటానికి కూర్చుంది. ఆ సీరియల్ అయ్యాక చూస్తే పిల్ల వొళ్ళు కాలిపోతోంది. అప్పుడు గాభరా పడి పిల్లని డాక్టర్ దగ్గిరికి తీసుకుని వెడుతూ, భర్త కి ఫోన్ చేసి డాక్టరు దగ్గిరకి రమ్మని చెప్పింది. డాక్టర్ పిల్లని చూస్తూనే “అమ్మా! ఇంత ఆలస్యం ఎందుకు చేశారు ? మలేరియా జ్వరము అని తేల్చి చెప్పాడు. యేవో మందులు వ్రాసి ఇచ్చి పంపాడు. ఆమందులు వాడినా ఏమీ తగ్గలేదు. మూడు రోజుల్లో జ్వర తీవ్రత ఎక్కువయింది. ఏం చేయాలో పాలుపోలేదు. పిల్లని వొళ్ళో పెట్టుకునే రెండు రోజులు సీరియల్స్ చూసింది. ఇంక మూడవరోజు భర్త కూడా సెలవు పెట్టి పిల్లని మళ్ళీ డాక్టరు దగ్గిరకి తీసుకు వెళ్లారు. డాక్టరు చూస్తూనే మలేరియా ముదిరిపోయింది హాస్పిటల్లో చేర్పించండి అన్నాడు. గుండె గుభేల్ల్మంది ఇద్దరికీ. కానీ పిల్ల ఆరోగ్యము ముఖ్యం. మారు మాట్లాడకుండా పిల్లని హాస్పిటల్ లో చేర్పించారు. హాస్పిటల్లో ఉందన్న మాటేగాని ధ్యాసంతా సీరియల్ ఏమయిందో అనే ఆలోచన ఒక వైపు, పిల్ల వొళ్ళు తెలియకుండా పడి వుందే అని బాధ ఒక వైపు మధన పడసాగింది . పిల్ల జ్వరం తగ్గలేదు. నీరసించి పోయింది. ఏం తాగిన వాంతులయిపోతున్నాయి. డాక్టరుగారు కొంచెం ఖంగారుగా చెబుతున్నారు. పిల్ల బతుకుతుందా అనే ఆలోచన కూడా వస్తోంది. ఎట్టకేలకు ఎనిమిది రోజుల తరువాత పిల్ల కళ్ళు తెరిచింది. ఈ ఎనిమిది రోజులలలో సుమిత్ర మొక్కని దేముళ్ళు లేరు. మనసులో తెగ పశ్చాత్తాప పడిపోతోంది. పాపిష్టిదాన్ని వెధవ సీరియల్స్ గొడవలో పడి పిల్ల అన్నం పెట్టమంటే కసురుకున్నాను. దేముడా నా పిల్లని రక్షించు కావాలంటే నాకు శిక్ష పెట్టు గాని పసి దాన్ని రక్షించు అని అనేక దేముళ్ళకి మొక్కుకుంది.

డాక్టరు గారి చేతి చలవో, మందుల ప్రభావమో, దేముడు నా ప్రార్ధన విన్నాడో ఏమో పిల్ల ఆరోగ్యం కొంచెం కుదుట బడింది. ఆ పట్టున పదిహేను రోజులు పాటు హాస్పిటల్లో వుండటము చేత టి.వి. సీరియల్స్ గొడవ మరుగున పడిపోయింది. అప్పుడు సుమిత్ర తనకు తానుగా ప్రమాణం చేసుకుంది. నా పిల్ల బతికి బయటపడింది. నా సీరియల్ పిచ్చి మూలంగా పిల్లని పోగొట్టుకునేదాన్ని అని తెగ బాధ పడిపోయింది. ఇకమీదట నేను టి. వి. జోలికి పోను, వెధవ సీరియళ్ళు చూడను అని నిర్ణయించుకుంది.

పిల్లని ఇంటికి తీసుకు వచ్చాక “ఎమండీ! మనము టి. వి. అమ్మేద్దామండి” అంది. భర్త ఒక్క మారుగా ఆశ్చర్యపోయాడు. “ఏమైంది దీనికి మతి చలిస్తోందా?” అనుకున్నాడు. “ ఏం? టి. వి. ఎందుకు అమ్మాలి?” అన్నాడు. “అది ఇంట్లో ఉంటే చూడాలనిపిస్తుంది. సీరియల్స్ ప్రభావము నామీద ఎంతగా ఉందొ నేను గ్రహించాను. నా అదృష్టము బాగుంది. నా పిల్ల బతికి బయట పడింది. లేకపోతే నేను జీవితాంతము ఏడ్చేదాన్ని” అoది. “నువ్వు టి.వి. చూడటము మానెయ్యి. అంతే గాని టి. వి. ఆమ్మేయడమెందుకు?” “ అదేంకాదండీ . మళ్ళీ నా మనసు మారి నేను ఆ ధ్యాసలో పడిపోతానేమో అని” . “నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అంతే గాని టి.వి. అమ్మడమెందుకు? నేను రోజు న్యూస్ మాత్రమే చూడటం లేదా? అలాగే నువ్వు కూడా అప్పుడప్పుడు చూస్తూవుండు” అన్నాడు.

సరేలెండి మీరన్నది నిజమే. మనసుని కంట్రోలులో పెట్టుకునే ప్రయత్నమే చేస్తాను. అప్పటికప్పుడే తనకు తానుగా ప్రమాణము చేసుకుంది. ఈరోజు నుంచి టి. వి. సీరియల్స్ జోలికి పోను. వీటి మూలంగా అనేక అనర్ధాలకు దారితీసే కంటే ఏదయినా మంచి వ్యాపకం మొదలు పెడతాను అనుకుంది. మీ సలహాతో నా కళ్ళు తెరిపించారు అంది కృతజ్ఞతతో.

…………………..

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి