1
త్రేతాయుగంలో పురూరవుని వంశంలో గాధి అనేవాడు రాజ్యాధిపతి అయ్యాడు. ఆ గాదిరాజు కూతురు సత్యవతి. ఋచికుడు అనే బ్రాహ్మణ యువకుడు, వేదవిద్యా పారంగతుడు సత్యవతిని తనకు ఇచ్చి వివాహము చేయమని కోరాడు. తల కూతురికి అతను తగినవాడు కాదని తలచిన గాధిరాజు, తెల్లని దేహాలు, నల్లని చెవులు ఉన్న వేయి గుఱ్ఱాలను తెచ్చి ఇస్తేనే తన కూతురుతో వివాహం చేస్తానని చెప్పాడు. ఋచికుడు మహా పండితుడు, భక్తుడు. అతడు వరుణుని ప్రార్థించి అటువంటి గుఱ్ఱాలను సంపాదించి ఇచ్చాడు. గాదిరాజు తన కూతురు సత్యవతిని అతనికి ఇచ్చి పెళ్ళి చేసాడు.
గాదిరాజుకు కుమారులు లేరు. ఋచికుడి భార్యా, అత్తా ఇద్దరూ పుత్రులు పుట్టాలని ఆయనను యజ్ఞం చేయమని కోరారు. ఋచికుడు దానికి సమ్మతించాడు. బ్రహ్మ జ్ఞానియైన పుత్రుడు కలగాలని, బ్రహ్మ మంత్రాలతో యజ్ఞం చేసి ఆ యజ్ఞప్రసాదాన్ని భార్య కోసం; రాజ్యపాలన చేయగల క్షాత్ర లక్షణాలున్న బాలుడు పుట్టాలని క్షత్రియ మంత్రాలతో యజ్ఞం చేసి ఆ యజ్ఞప్రసాదాన్ని అత్తగారి కోసం ఉంచి స్నానానికి వెళ్లాడు. కాని తల్లీ కూతుళ్ళు వాళ్ళ హవిస్సులు మార్చుకొన్నారు. హవిస్సుల తారుమార్లను సంగతి తెలిసుకున్న ఋషికుడు భార్యతో ‘నీకు క్రూరుడైన కుమారుడు కలుగుతాడు. మీ అమ్మకు బ్రహ్మజ్ఞాని అయిన పుత్రుడు ఉదయిస్తాడు’ అని చెప్పాడు. సత్యవతి తప్పు క్షమించమని భర్తను ప్రాధేయపడింది. అప్పుడు శాంతించిన ఋషికుడు ‘నీ కొడుకు సాధువూ, మనుమడు క్రూరుడూ అవుతారు’ అని అనుగ్రహించాడు. ఆ కారణంగా సత్యవతికి జమదగ్ని ముని పుట్టాడు. జమదగ్ని ముని,రేణువు కుమార్తె రేణుకాదేవిని పరిణయమాడాడు. జమదగ్ని రేణుక దంపతులకు ఐదుగురు కుమారులు కలిగారు. వారికి పురుషోత్తముని అంశవల్ల పరశురాముడు ఐదవ కుమారుడిగా జన్మించాడు. గాధి మహారాజుకుఅగ్నివంటి తేజస్సుగల విశ్వామిత్రుడు జన్మించాడు. అతడు క్షాత్ర ధర్మాన్ని వదలిపెట్టి బ్రహ్మర్షియై వంద మంది కుమారులను కన్నాడు.
2
హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు నారాయణాంశతో జన్మించిన పరాక్రమవంతుడైన రాజు. దత్తాత్రేయునిఆరాధించి ఆయన కృపవలన వేయి చేతులూ, సిద్ధులూ, యశస్సూ, అఖండ ఇంద్రియ పటుత్వమూ, శత్రు విజయమూ పొందాడు. అతడు అన్ని లోకాలూ విజృంభించి తిరుగుతూ ఎదురులేని వీరుడిగా భూమండలం మీద వెలుగొందాడు.
ఒకనాడు ఆ రాజు గర్వంతో పట్టణం వదలి భార్యతో కలిసి రేవానదికి వెళ్ళి జలక్రీడలు ఆడుతూ తన పొడవైన చేతులతో ఆ నదీజలాలను ఆపాడు. అప్పుడా నీళ్ళు ముందుకు పొంగి జైత్రయాత్రలోఅటు వచ్చిన రావణాసురుని వైపు ప్రవహించాయి. అతను దానిని సహించలేక పోయాడు. అతడు రోషంతో పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జునినితో కయ్యానికి దిగాడు. కార్తవీర్యార్జునుడు తన భుజబలంతో రావణుని జుట్టుపట్టుకొని మోకాళ్ళతో పొడిచి భటులచేత కట్టించి చెరసాల్లో పెట్టించాడు.తరువాత కార్తవీర్యుడు తన రాజధాని మహిష్మతీపురానికి వచ్చి రావణుడితో ‘లోకంలో నేనే వీరుణ్ణి అని విర్రవీగవద్దు. ఈ సారికి తప్పుకాచాను పో’ అని అవమానపరిచి వదలిపెట్టాడు.
మరొక రోజు కార్తవీర్యుడు వేటకోసం అడవికి వెళ్ళాడు. బాగా తిరిగి అలసిపోయి, విపరీతమైన ఆకలితో జమదగ్ని ముని ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించాడు. జమదగ్ని రాజుని ప్రీతితో ఆదరించాడు. ఆ రాజుకి అతడి పరివారానికి తన కామధేనువుని తెప్పించి భోజనం పెట్టించాడు. ఆకలి తీరిన కార్తవీర్యునికి కామధేనువుపై కోరిక కలిగింది. ‘ఇలాంటి కామధేనువు రాజునైన నాలాంటి వాడి వద్ద ఉండాలిఅంతే కాని ఇలాంటి ముని దగ్గర ఎందుకు’ అని అనుకున్నాడు. ఆ గోవును పట్టి తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు. భటులు కామధేనువును, దూడను పట్టుకొని పట్టణానికి తీసుకొని వెళ్లారు.
3
కొద్ది సేపటికి ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు జరిగినదంతా తండ్రి చెప్పగా విన్నాడు. కోపంతో రగిలిపోయాడు. మా ఇంట్లో భోజనంచేసి మా తండ్రి కాదన్నా మా ఆవుని అపహరించుకుపోయిన ఆ రాజుకి నా సంగతి తెలియదు అని అనుకున్నాడు. కవచాన్ని, గండ్ర గొడ్డలిని, అమ్ములపొదిని, విల్లునూధరించి కయ్యానికి సిద్ధమై భూతలం దద్దరిల్లేటట్లు మహిష్మతీ నగరంజేరి కార్తవీర్యార్జునుడి వెంటపడ్డాడు. ఆయుధాలు ధరించి జింకచర్మంలోనున్న పరశురాముడిని చూసిన కార్తవీర్యుడు ఆగ్రహంతో ‘ఈ వెఱ్ఱి బ్రాహ్మణ బాలుడు సాత్త్వికుడై పడి ఉండక, పరాక్రమవంతుడనైన నాలాటి రాజుతో తనంత తానుగా కయ్యానికి కాలి దువ్వుతూ నా వెంట పడతాడా’ అని అనుకున్నాడు. వెంటనే సైనికులను పిలిచి ఆ బాలుడిని నేల కూల్చమని చెప్పాడు. సైన్యాధిపతి సైనికులతో వెళ్ళి పరశురాముణ్ణి గదలూ, కత్తులూ లాంటి ఎన్నో ఆయుధాలతో నొప్పించారు.
పరశురాముడు కన్నుల్లో నిప్పులు రాలుస్తూ రెట్టింపు కోపంతో విజృంభించి గండ్రగొడ్డలి విసురుతూ, అరటి మానులను తెగవేసేతోటమాలిలాగ ఆ భటుల తలలను, అవయవాలనూ నరికాడు. గుర్రాలను, ఏనుగులను, రథాలను కూల్చాడు. ఆ యుద్ధభూమి నెత్తుటితోనూ, మాంసఖండాలతోనూ నిండి పోయింది.అప్పుడు కార్తవీర్యుడు ‘ఈ బాలుడు ఒక్కడే ఇంత సైన్యాన్ని నేల కూల్చాడు. ఇక ఆలస్యం చేయడం పనికిరాదు. వెంటనే నా భుజబలంతో వీడిని నాశనం చేస్తాను’ అని అనుకొన్నాడు.
ఉత్సాహంగా తన ఐదు వందల చేతుల్లో ధనస్సును పట్టుకొని మిగిలిన ఐదు వందల చేతులతో విల్లు త్రాళ్ళను బాణాలను సంధించాడు. ‘ఓ బ్రాహ్మణుడా, నిన్నూ నీ గొడ్డలిని నేల కూలుస్తాను’ అంటూ గర్జించి పరశురామునిపై ఎడతెరిపి లేకుండా బాణాలను సంధించాడు. లోకంలోకి విలుకాండ్రలో మేటి ఐన పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి , బాణాన్ని సంధించి కార్తవీర్యుని ధనస్సలన్నింటినీ ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసాడు.గండ్రగొడ్డలితో అతని చేతులు నరికాడు. తరువాత కొండశిఖరంలా మిగిలిన అతని తలను శత్రుసంహారకుడైన ఆ భార్గవరాముడు ఖండించాడు. తండ్రి నేలకూలగానే కార్తవీర్యుని కుమారులు పదివేలమంది పరశురాముడిని ఎదిరించలేక తలకో దిక్కుగా పారిపోయారు. పిమ్మట జమదగ్ని కుమారుడు పరశురాముడు దూడతో సహా కామధేనువును తండ్రి ఆశ్రమానికి తీసుకొని వెళ్లాడు.
ఇలా కామధేనువు తిరిగి తీసుకువచ్చిన భార్గవరాముడు తన పరాక్రమాన్ని తండ్రికి, సోదరులకు వివరంగా చెప్పాడు. అపుడు జమదగ్ని “నాయనా, రాజు అంటే పెక్కు దేవతల స్వరూపం. అటువంటి రాజుని పట్టుబట్టి అలా చంపడం తప్పు. క్షమ మన బ్రాహ్మణ ధర్మం. క్షమ ఉంటేనే విద్య అబ్బుతుంది.కరుణామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు. ఈ పాపం పోవడానికి పుణ్యతీర్థాలను సేవించు” అని ఆదేశించాడు. తండ్రి ఆనతి తీసుకొని పరశురాముడు ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు.
4
ఒకరోజు జమదగ్ని భార్య అయిన రేణుక నీళ్ళు తేవడానికి గంగానదికి వెళ్లింది. అప్పుడామె నది మధ్యలో అప్సర స్త్రీలతో కలిసి జలక్రీడలాడే చిత్రరథుణ్ణి చూస్తూ ఉండిపోయింది. కాస్సేపటికి తేరుకొని ‘వచ్చి చాలా సేపయింది. హోమానికి వేళ అయింది’ అనుకుంటూ భయపడుతూ నీటి కడవ నెత్తికెత్తుకొని వచ్చి భర్తకు నమస్కరించి బెదురుతూ నిలబడింది.
అపుడు భార్య ఆలస్యానికి కారణాన్ని దివ్యదృష్టితో గ్రహించిన జమదగ్ని ‘మదించిన దీనినిచావబాదండి’ అన్నాడు. వాళ్ళు దుఃఖిస్తూ నిశ్చలంగా ఉండిపోయారు. జమదగ్ని కొడుకులు నలుగురూ తన ఆజ్ఞ పాటించలేదనే కోపంతో తల్లిని, అన్నలను చంపమని అప్పుడే వచ్చిన పరశురాముణ్ణి ఆదేశించాడు. అతడు తండ్రి కాళ్ళకు మ్రొక్కి వెనుకాడక తల్లిని, అన్నలను నరికాడు.‘తాను చెప్పిన మేరకు తల్లినీ, అన్నలను చంపకపోతే తండ్రిశపిస్తాడు, తన ఆజ్ఞ పాటిస్తే అతడు తప్పక వాళ్ళను తిరిగి బ్రతికిస్తాడు’ అని మనస్సులో తలచాడు.జమదగ్ని ప్రసన్నుడై పరశురాముణ్ణి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. వెంటనే భార్గవుడు చచ్చి పడిఉన్న తల్లి, అన్నల ప్రాణాలను ప్రసాదించమని కోరుకొన్నాడు. ముని వారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించాడు. దానితో వారు ఎప్పటిలాగా లేచి నిలబడ్డారు.
5
పరశురాముడికి బయపడి పారిపోయిన కార్తవీర్యార్జునుడి కొడుకులు తన తండ్రిని చంపినవానిపై పగతీర్చుకోవడానికి తగిన సమయంకోసం ఎదురు చూస్తున్నారు. ఒకరోజు పరశురాముడు అన్నలతో కలిసి అడవికి వెళ్లాడు. అప్పుడు వాళ్ళు వచ్చి సమాధిలోనున్న జమదగ్నిని కదలకుండా పట్టుకున్నారు. రేణుక అడ్డంగా వచ్చి ఎంత మొత్తుకుంటున్నా వినకుండా జమదగ్ని తల నరికి వెళ్ళిపోయారు. రేణుక భర్త శవంపై పడి విలపిస్తూ, తన కుమారుడు పరశురాముడిని తలచుకుంటూ ఇరవై ఒక్కమార్లు గుండెలు బాదుకుంది.
తల్లి మొర విని జమదగ్ని కుమారులు వచ్చి తండ్రి మరణానికి దుఃఖించ సాగేరు. అలా దుఃఖిస్తున్న అన్నలను చూచి పరశురాముడు “ఓ అన్నలారా, ఎందుకు దుఃఖిస్తారు? తండ్రి కళేబరాన్ని జాగ్రత్తగా చూడండి. నేను పగ తీర్చుకొని వస్తాను” అని చెప్పి గండ్రగొడ్డలి ధరించి ధైర్యంగా రాజధాని మహిస్మతీ నగరానికి వెళ్లాడు. అక్కడ కార్తవీర్యుని కొడుకులను అందరినీ పట్టి మట్టుపెట్టాడు. ఆ పరశురాముడి యుద్ధంలో రక్తపుధారల నదులు వరదలా పారేటట్లు శత్రుసేనల తలలను నరికి పోగులు పెట్టాడు. అంతటితో కోపం తీరక భూమి మీద క్షత్రియుడనేవాడు ఉండకూడదని ఇరవై ఒక్కమార్లు గాలించి రాజులను చంపాడు.
పరశురాముడు శమంతపంచకంలో రాజుల రక్తాలతో తొమ్మిది మడుగులు చేసి, తండ్రి తలను తెచ్చి శరీరంతో చేర్చి యాగం చేసాడు. యజ్ఞకార్యాన్ని నిర్వర్తించిన వారికీ, సదస్యులకూ ఒక్కొక్కరికి ఒక్కొక్క దిక్కు చొప్పున దానం చేసాడు. స్వయంగా పరమాత్మ అయినా, పరశురాముడు తన గురించి తానే చేసాడు. వంశోద్ధారకుడైన పరశురాముడి యజ్ఞం ఫలితంగా,జమదగ్ని సంకల్ప శరీరాన్ని పొంది సప్తర్షి మండలంలో ఏడవ ఋషిగా వెలుగొందాడు. యజ్ఞం పూర్తయాక పరశురాముడు సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి పాపాలను పోగొట్టుకొని, మబ్బు విడిచిన సూర్యుడిలా ప్రకాశించాడు.
గంధర్వులూ, సిద్ధులూ, తన పవిత్ర చరిత్రను గానం చేస్తుండగా ఆ పరశురాముడు ఐహిక బంధాలను త్రెంచుకొని శాంతచిత్తుడై మహేంద్రగిరి మీద ఈనాటికీ తపోనిమగ్నుడై ఉన్నాడు. వచ్చే మన్వంతరంలో పరశురాముడు సప్తర్షులలో ఒకడుగా ప్రకాశిస్తాడు.
***